మూలహేతువు! భగవద్గీత Bhagavadgita
మూలహేతువు! వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి చేర్చేదేమిటి?
'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (38 – 42 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 38 నుండి 42 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/fOgRdtl3lig ]
శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..
00:43 - దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ।। 38 ।।
న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో, నేను ధర్మబద్ధమైన శిక్షనూ, జయాభిలాష గలవారిలో సత్ప్రవర్తననూ, రహస్యములలో నేను మౌనమునూ, జ్ఞానులలో జ్ఞానమును నేనే.
మానవ స్వభావం ఎలాంటిదంటే, జనులలో మంచి నడవడిక కోసం, కేవలం ధర్మోపదేశం మాత్రమే సరిపోదు. సరియైన సమయంలో, న్యాయబద్ధంగా ఇవ్వబడిన దండన, మంచి నడవడిక, శిక్షణకూ మరియు పాపిష్ఠి ప్రవర్తన యొక్క సంస్కరణకూ సహకరించే ముఖ్యమైన ఉపకరణము. దీని లక్ష్యాల్లో ఒకటేమిటంటే, సమాజంలో చెడు పనులను చేయటం వైపు మొగ్గు చూపే వారిని నిరోధించుట. ఒక్క నిముషమైనా ఇవ్వబడిన సరియైన దండన, లేదా ఒక్క నిమిషం అయినా ఇవ్వబడిన పారితోషికం, జనుల ప్రవర్తనను ఎలా సంస్కరిస్తుందో, ఆధునిక మేనేజ్మేంట్ సిద్ధాంతం మనకు వివరిస్తున్నది. విజయం కోసం ఉండే కోరిక విశ్వవ్యాప్తమయినది. కానీ, నిశ్చలమైన సత్ప్రవర్తనగలవారు, దాని కోసం నీతీ నిజాయితీలను పణంగా పెట్టరు. ధర్మబద్ధమైన మార్గంలో సాధించిన విజయం, భగవంతుని శక్తికి నిదర్శనం. రహస్యము అంటే, ఒక ప్రయోజనం కోసం, సాధారణంగా అందరు జనులకూ తెలియకుండా ఉంచబడిన విషయం. "రహస్యం, ఒక్క మనిషికే తెలిస్తే అది రహస్యం. ఇద్దరికి తెలిసిన రహస్యం, ఇక అది రహస్యం కాదు. అలాగే, ముగ్గురికి తెలిసిన రహస్యం అంటే, మిగతా ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పబడిన వార్త లాంటిది." ఈ విధంగా, అత్యంత రహస్యం ఏమిటంటే, అది మౌనములో దాగి ఉన్నదే. ఆధ్యాత్మిక జ్ఞానము పరిణితి చెందిన కొద్దీ, ఆత్మ, లేదా భగవత్ ప్రాప్తి ద్వారా, వ్యక్తికి నిజమైన జ్ఞానం వస్తుంది. ఇది ప్రసాదించబడిన వ్యక్తి – అన్ని సంఘటనలనూ, మనుష్యులనూ, మరియు వస్తువులనూ, భగవత్ సంబంధముగా చూస్తాడు. ఇటువంటి జ్ఞానము, వ్యక్తిని పవిత్రం చేస్తుంది. పరిపూర్ణుడినీ, సంతుష్టుడినీ చేసి, వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి చేరుస్తుంది. అది జీవితానికి చక్కటి దిశానిర్దేశం చూపిస్తుంది. సుఖదుఃఖాలనూ, ఒడిదుడుకులనూ తట్టుకునే శక్తినిస్తుంది. అంతిమ లక్ష్యమును సాధించేవరకూ, పట్టుదలతో ఉండే సంకల్ప బలాన్నిస్తుంది. జ్ఞానులలో ప్రకటితమయ్యే జ్ఞానము తానే అని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
03:13 - యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున ।
న తదస్తి వినా యత్ స్యాన్మయా భూతం చరాచరమ్ ।। 39 ।।
సర్వ భూతముల సృష్టికీ, మూల ఉత్పాదక బీజమును నేనే అర్జునా.. చరాచర ప్రాణి ఏదీ కూడా, నేను లేకుండా ఉండలేదు.
సమస్త సృష్టికీ నిమిత్త కారణమూ, మరియు ఉపాదాన కారణమూ, రెండూ కూడా శ్రీ కృష్ణుడే. నిమిత్త కారణము అంటే, జగత్తును సృష్టించి వ్యక్తపరచటానికి కావలసిన పని చేసే సృష్టికర్త, ఆయనే. ఉపాదాన కారణము అంటే, సృష్టికి కావలసిన పదార్ధము వచ్చేది, ఆయన నుండే అని. శ్రీ కృష్ణుడు తనను తాను, "సనాతన బీజమున"ని ప్రకటించాడు. మరల ఇక్కడ తానే, "ఉత్పాదక బీజమున"ని కూడా పేర్కొంటున్నాడు. తానే సమస్తమునకూ మూలహేతువు, మరియు ఆయన శక్తి లేకుండా, దేనికీ అస్థిత్వము ఉండదని, ఆయన వక్కాణిస్తున్నాడు. ప్రాణులు నాలుగు రకాలుగా జన్మిస్తాయి. అండజములు అంటే, గుడ్లనుండి జన్మించేవి. అవి పక్షులు, పాములు మరియు బల్లుల వంటివి; జరాయుజములు అంటే, తల్లిగర్భము నుండి జన్మించేవి; మనుష్యులు, ఆవులు, కుక్కలు మరియు పిల్లుల వంటివి; స్వేదజములు అంటే, స్వేదము నుండి పుట్టేవి; పేల వంటివి. ఉద్బిజములు అంటే, భూమి నుండి జనించేవి. చెట్లు, తీగలు, గడ్డి, మరియు మొక్కజొన్న వంటివి. ఇవికాక వేరే జీవ రూపాలు కూడా ఉన్నాయి. దయ్యాలూ, భూతాలూ, ప్రేతాత్మల వంటివి. శ్రీ కృష్ణుడే వీటన్నిటికీ మూల ఉత్పత్తి స్థానము.
04:49 - నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ।
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ।। 40 ।।
నా దివ్య విభూతులకు అంతము లేదు. ఓ పరంతపా.. నేను ఇప్పటివరకూ చెప్పినది, నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే.
సర్వమూ ఈశ్వర విభూతి అయితే, అప్పుడసలు ఈ విషయాలు చెప్పే అవసరం ఏమిటి? అన్న సందేహం రావచ్చు.. దీనికి సమాధానం ఏమిటంటే, అర్జునుడు శ్రీ కృష్ణుడిని, ఆయనను ఎలా స్మరించుకోవాలని అడిగి ఉన్నాడు. అనంతరం ఈ వైభవములు వివరించటం జరిగింది. మనస్సనేది సహజంగానే, అపురూపమైనవాటి వైపు ఆకర్షితమవుతుంది. అందుకే భగవంతుడు, తన వైభవములో ఉన్న ప్రత్యేకతలను తెలియపరిచాడు. ఎప్పుడైనా మనం, ఏదేని అత్యద్భుతమైన విశేషము ఎక్కడైనా ప్రకటితమవ్వటం చూసినప్పుడు, దానిని భగవంతుని తేజస్సుగా గమనిస్తే, మనస్సు సహజంగానే, ఈశ్వరుని వద్దకు వెళ్తుంది. కానీ, స్థూల దృక్పథంలో గమనిస్తే, చిన్నదైనా, పెద్దదైనా, ప్రతి వస్తువులో కూడా భగవంతుని వైభవము ఉన్నది కాబట్టి, మన భక్తిని పెంచుకోవటానికి, ఈ జగత్తు మొత్తం అసంఖ్యాకమైన దృష్టాంతములను మనకు అందిస్తూ ఉన్నదని మనం భావించాలి. శ్రీ కృష్ణుడు చెప్పేది ఎలా అర్థంచేసుకోవచ్చంటే, "ఎక్కడైనా నీవు అద్భుతమైనది ఏదైనా గమనిస్తే, నన్ను గుర్తుచేసుకో" అని.
06:17 - యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా ।
తత్ తత్ దేవావగచ్ఛ త్వం మమ తేజోఽశసంభవమ్ ।। 41 ।।
నీవు ఏదైనా అందమైన దానిని కానీ, అద్భుతమైన దానిని కానీ, లేదా శక్తివంతమైన దానిని కానీ చూస్తే, అది నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము.
స్పీకర్లో ప్రవహించే కరెంట్, దానిలో నుండి శబ్దమును జనింపచేస్తుంది. కానీ, అది ఎలా పనిచేస్తుందో, దాని వెనుక ఉన్న సూత్రం తెలియనివారు, ధ్వని ఆ స్పీకర్ నుండే వస్తోందని అపోహ పడవచ్చు. అదే విధంగా, మనం ఎప్పుడైనా అత్యద్భుతమైన వైభవాన్ని ఎక్కడైనా గమనిస్తే, మనలను ఆశ్చర్యచకితులను చేస్తే, పారవశ్యమునకు గురి చేస్తే, అమితానందమును కలుగ చేస్తే, అది భగవంతుని వైభవము యొక్క తళుకుగా అర్థంచేసుకోవాలి. అందము, యశస్సు, శక్తి, జ్ఞానము మరియు ఐశ్వర్యము, అనంత పరిమాణంలోగలవాడు, భగవంతుడు. సర్వ ప్రాణులకు, సమస్త పదార్థములకు, వాటి వాటి శోభను చేకూర్చిపెట్టేది, ఆయన శక్తిసామర్ధ్యములే. ఈ విధంగా, సర్వ-ఐశ్వర్యమునకు మూలఉత్పత్తి స్థానం అయిన భగవంతుడినే, మనం మన ఆరాధనా విషయంగా చేసుకోవాలి.
07:30 - అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ।
విష్టభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ ।। 42 ।।
ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు. కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశతోనే, సమస్త జగత్తు యందూ వ్యాపించీ, మరియు దానిని పోషిస్తూ / నిర్వహిస్తూ ఉన్నాను.
ఆ ప్రశ్నకు ఇంతకు క్రితమే సమాధానం చెప్పేశానన్న అర్థాన్ని, శ్రీ కృష్ణుడి మాటలు సూచిస్తున్నాయి. ఇప్పుడు తనే స్వంతముగా, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. తన యొక్క ఎన్నో అద్భుతమైన విభూతులను తెలియచేసిన పిదప, ఆయన చెప్పిన దాన్నంతా కలిపినా, తన యొక్క వైభవముల విస్తారాన్ని గణించలేమని అంటున్నాడు. ఎందుకంటే, అనంతకోటి బ్రహ్మాండముల సృష్టిని, తన యొక్క చిన్న అంశ యందే కలిగి ఉన్నాడు, శ్రీ కృష్ణుడు. తన యొక్క చిన్న అంశను ఇక్కడే ఎందుకు ఉదహరిస్తున్నాడు? కారణం ఏమిటంటే, అనంతమైన బ్రహ్మాండములు కలిగి ఉన్న మొత్తం భౌతిక సృష్టి, భగవంతుని సమస్త సృష్టిలో, కేవలం 1/4వ వంతు మాత్రమే. మిగిలిన 3/4వ వంతు, దివ్య ఆధ్యాత్మికమైన సృష్టి. "భౌతిక శక్తిచే తయారుచేయబడిన ఈ యొక్క తాత్కాలికమైన జగత్తు, పరమేశ్వరుని యొక్క ఒక్క భాగము మాత్రమే. మిగతా మూడు భాగాలూ, జనన-మరణములకు అతీతమైన ఆయన యొక్క దివ్య ధామములు." ఆసక్తికరంగా, శ్రీ కృష్ణుడు అర్జునుడి ముందే, ఈ లోకం యందే ఉన్నాడు. అయినా, సమస్త భౌతిక జగత్తూ, తన ఒక అంశలోనే ఉన్నదని అంటున్నాడు. అనంతమైన భౌతిక బ్రహ్మాండములను కలిగి ఉన్న సమస్త సృష్టీ, తన యొక్క ఒక్క అంశ యందే కలిగి ఉన్నట్టు, శ్రీ కృష్ణుడు అర్జునుడుకి ప్రకటిస్తున్నాడు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గాతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, విభూతియోగో నామ దశమోధ్యాయః
శ్రీ మద్భగవద్గీతలోని భక్తిషట్కం, పదవ అధ్యాయం, విభూతి యోగం లోని 42 శ్లోకాలూ సంపూర్ణం..
09:34 - ఇక మన తదుపరి వీడియోలో, పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగంలో, శ్రీ కృష్ణుడు విశదపరచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment