సప్తబుుషులు ఆకలిబాధతో ‘శవాన్ని తినడానికి సిద్ధపడ్డారా’?


సప్తబుుషులు ఆకలిబాధతో ‘శవాన్ని తినడానికి సిద్ధపడ్డారా’?

ధర్మరాజుతో భీష్ముడు చెప్పిన ‘సప్త బుుషులు - వృషాదర్భి మహారాజు కథ’! భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలను ధర్మరాజుకు తెలియజేశాడు. రాజ్యాన్ని ఎలా పాలించాలి? ప్రజలను ఎలా చూసుకోవాలి? రాజనీతి, రాజపాలనకు సంబంధించీ, సమాజ జీవనానికి సంబంధించీ, అనేక ఉదాహరణలతో క్షుణ్ణంగా వివరించాడు, భీష్మ పితామహుడు. గాంగేయుడు తెలియజేసిన అనేక ధర్మ సూక్ష్మాల సంగ్రహణం నుండి, ఈ రోజుటి మన వీడియోలో, దానానికి సంబంధించి ధర్మరాజు అడిగిన ప్రశ్న, దానికి భీష్ముడు తెలియజేసిన సప్త బుుషులు - వృషాదర్భి మహారాజు కథను తెలుసుకుందాము. మరి ఆ కథేంటో, అందులో భీష్ముడు తెలియజేసిన నీతేంటో తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియోను చివరిదాకా చూడండి. మొత్తం వీడియో చూడకుండానే దయచేసి ఎవరూ కామెంట్ చేయవద్దని మనవి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XqWXGXTEZ8g ]


ధర్మరాజు భీష్ముడితో, "పితామహా! ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేసే వాడూ, ఎవరి వద్దా ఉచితంగా ఏమీ తీసుకొననివాడూ, వీరి గుణములు ఎలాంటివి?" అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, "ధర్మనందనా! ఈ సందర్భంలో నీకు, సప్తఋషులకూ, వృషాదర్భి అనే వానికీ జరిగిన సంవాదాన్ని వివరిస్తాను. కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠుడనే వారు సప్తఋషులు. వశిష్ఠుడి భార్య అరుంధతి. ఆమె ఎప్పుడూ భర్తను వెన్నంటి ఉంటుంది. వారందరికీ గండ అనే వనిత పరిచర్యలు చేస్తూ ఉండేది. ఆమె భర్త పేరు, పశుసఖుడు. అతడు కూడా వారికి పరిచర్యలు చేస్తూ ఉండేవాడు. ఆ పది మందీ తపస్సు చేయడంలో ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకసారి, భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ప్రజలు వారి ప్రాణాలను రక్షించుకోవడం కూడా దుర్లభం అయింది. ఆ సమయంలో కశ్యపుడు మొదలైన ఋషులు ఆహారం కొరకు వెతుకుతున్నారు.

ఆ సమయంలో శిబిచక్రవర్తి కొడుకు యాజ్యుడు రాజయ్యాడు. అతడు తనకుమారుడు నీలుడనే వాడిని, యజ్ఞ దక్షిణగా ఋత్విక్కులకు ఇచ్చాడు. ఆ నీలుడు కాలం తీరి చనిపోయాడు. వారి పరిచారకులు మొత్తం పదిమందీ, తమ ఆకలి తీర్చుకోవడానికి, ఆ శవం చుట్టూ చేరారు. ఆ సమయంలో వృషాదర్భి అనే మహారాజు, వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆ రాజు విరివిగా దానధర్మాలు చేసే వాడు. శవాన్ని తినడానికి సన్నద్ధమౌతున్న మునులను చూసి ఆగి, "అయ్యా! మీరందరూ ఆకలితో ఉన్నారు. అందుకే శవాన్ని తినడానికి సిద్ధపడ్డారు. నా వెంట రండి, మీకు కావలసిన ఆహారము సమకూరుస్తాను. అంతే కాదు, మీకు ధనము, ధాన్యము, బండ్లు, గోవులు, గ్రామములు బహుమతిగా ఇస్తాను" అని అన్నాడు. అది విని సప్తఋషులు, "మహారాజా! మేము ఎవరి వద్దా ఏదీ పుచ్చుకొనము. రాజుల వద్ద చేయిచాచి తీసుకున్నది, మాకు విషతుల్యము. నీకు మా గురించి తెలియదు కనుక ఇలా మాట్లాడుతున్నావు" అని అన్నారు.

మునుల మాటకు రాజు మనస్సులో బాధ పడుతూ రాజధానికి వెళ్ళాడు. రాజు కొన్ని కృత్రిమ ఫలాలను తయారు చేయించి, వాటిలో బంగారం పెట్టి, వాటిని తన మంత్రులకు ఇచ్చి, మునులకు ఇమ్మని పంపాడు. మంత్రులు వాటిని తీసుకుని మునుల వద్దకు వెళ్ళి, వాటిని అందించారు. వారు వాటిని తీసుకుని, అవి బరువుగా ఉండడం గమనించి, వాటిని సున్నితంగా తిరస్కరించారు. మంత్రులు తిరిగి వెళ్ళి, ఆ విషయం రాజుతో చెప్పారు. అదివిన్న వృషాదర్భికి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఒక యజ్ఞము చేసి, యజ్ఞము నుండి కృత్తి అనే రాక్షసిని ఆవాహన చేశాడు. హోమంలో నుండి కృత్తి అనే రాక్షసి పుట్టి, ఆయన ఎదుట నిలబడి, "రాజా! నాతో వచ్చిన పని ఏమిటి" అని అడిగింది. వృషాదర్భి, "నీవు వెళ్ళి కశ్యపుడు, మొదలైన ఋషులను ముక్కలు ముక్కలుగా నరికివెయ్యి" అని ఆజ్ఞాపించాడు. కృత్తి వెంటనే సప్తఋషుల వద్దకు వెళ్ళింది.

ఆ సమయంలో మునులు అడవిలో ఫలాల కొరకూ, కాయల కొరకూ అన్వేషిస్తున్నారు. అదే సమయంలో శునస్సఖుడనే సన్యాసి వారి వద్దకు వచ్చి నమస్కరించాడు. అతడు కూడా వారితో కలసి, ఆహారం కొరకు అన్వేషించసాగాడు. వారికి ఏమీ దొరక లేదు. చివరకు తామర తూళ్ళయినా తినాలనుకుని, కొలను వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృత్తి, వారికి అడ్డంగా నిలబడింది. మునులు ఆమెతో, "నీవెవరు? నీకు ఇక్కడ ఏమి పని? అడ్డు తొలగు" అని వారు కొలనులో దిగ బోయారు. వెంటనే కృత్తి, "నేను ఎవరినయితే ఏమి.. ఈ కొలనుకు కావలి ఉన్నాను. మీరు దీనిలో దిగడానికి వీలు లేదు" అని పలికింది. అందుకు మునులు, "మాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ దొరక లేదు. ఈ కొలనులో దిగి, ఇక్కడున్న తామరతూళ్ళు తిని ఆకలి తీర్చుకోవాలని అనుకున్నాము" అని అన్నారు. కృత్తి అప్పుడు, ‘మీరు మీ పేర్లు చెప్పి, కొలనులో దిగండి’ అని అన్నది. దాంతో సప్త ఋషులకు విషయం అర్ధం అయింది. ఆమె ఒక రాక్షసి అనీ, తమను సంహరించడానికి వచ్చిందనీ తెలుసుకున్నారు. అడిగింది కనుక తమ పేర్లను నిర్వచనంతో సహా, ఎవరికీ అర్ధం కాకుండా చెప్పారు. వారు చెప్పిన పేర్లను అర్ధం చేసుకోలేక, కృత్తి దిక్కులు చూడసాగింది. ఇంతలో శునస్సఖుడు తన పేరు చక్కగా అర్ధం అయ్యేలా చెప్పినా, కృత్తికి అది అర్ధం కాలేదు.

కృత్తి శునస్సఖుడితో "నీ పేరు అర్ధం లేకుండా చెప్పావు. సరిగా చెప్పు" అని గద్దించింది. వెంటనే శునస్సఖుడు, "నా పేరు సరిగా చెప్పినా అర్ధం చేసుకోలేక పోయావు. ఆ తప్పు నీది కదా! నీకు ఎలా చెప్పినా అర్ధం కాదు. ఇదిగో, ఈ మంత్రదండం నీకు తగిన బుద్ధి చెప్తుంది" అని తన మంత్రదండముతో, కృత్తి తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు కృత్తి నేలమీద పడి, భస్మం అయ్యింది. తరువాత మునులు కొలనులో దిగి తామరతూళ్ళను తీసుకుని, వాటిని నీటిలో శుభ్రం చేసి, కొలను పక్కన పెట్టారు. సంధ్యావందనం చేసుకోవడానికి కొలనులో దిగి సంధ్యావందనం చేసి, కొలను బయటకు వచ్చి చూసే సరికి, తామరతూళ్ళు కనిపించలేదు. వారికి అనుమానం వచ్చి, శునస్సఖుడిని మధ్యవర్తిగా పెట్టుకుని శపధం చేశారు.

ముందుగా అత్రిమహర్షిలేచి, "నేను కనుక తామర తూళ్ళు దొంగిలించి ఉంటే, ఆవును తన్నడం వలనా, సూర్యుడికి అభిముఖంగా మలమూత్ర విసర్జన చేయడం వలనా, వేదములు చదువకూడని రోజులలో వేదాధ్యయనం చేయడం వలనా కలుగు పాపములు నాకు కలుగు కాక" అని శపధం చేశాడు. తరువాత వశిష్ఠుడు లేచి, "ఈ తామరతూళ్ళు దొంగిలించిన వాడు వేదాధ్యయనం మానిన పాపం, సన్యాసిగా ఉండి, కామకలాపం చేసిన పాపం, కుక్కను వెంట పెట్టుకుని తిరిగిన పాపములబడి పోతాడు" అని పలికాడు. తరువాత కశ్యపుడు లేచి, "అవసరం లేకున్నా మాంసం తినడం, న్యాయసభలో ఒకరి పక్షం వహించడం, దుష్టులకు దానం చెయ్యడం, కట్టుకున్న భార్యతో పట్టపగలు చేరడం, విద్యా వంతులైన బ్రాహ్మణులను లోభబుద్ధితో ఏడిపించడం, సరకు అంతా ఒకేసారి కొని, తరువాత లాభముకు అమ్మడం వంటి పాపములు, ఈ తామరతూళ్ళు దొంగిలించిన వాడికి కలుగు కాక" అని పలికాడు. తరువాత భరద్వాజుడు లేచి, "ఈ తామరతూళ్ళు దొంగిలించడం అనేది, జ్ఞాతులపట్లా, గోవులపట్లా, స్త్రీలపట్లా ధర్మం విడిచి ప్రవర్తించిన దానితో సమానం. యజ్ఞకుండంలో వేయవలసిన హవిస్సును, కంపలలో మండుతున్న అగ్నిలో వేయడం, గురువును కించపరుస్తూ విద్యను అభ్యసించడం వంటిది" అని పలికాడు. తరువాత జమదగ్ని లేచి, "ఈ తామరతూళ్ళ దొంగతనం చేసిన వారు, రజస్వల అయిన భార్యతో చేరడం, తాగే నీటిలో మలమూత్రములు విసర్జించడం, ఎప్పుడూ పగా, ప్రతీకారంతో రగిలి పోవడం, భార్యసంపాదన మీద జీవించడంతో సరి సమానం. ఇతరులను అతిధులుగా ఆదరించడానికి బదులు, తమలోతామే ఒకరిని ఒకరు ఆదరించడంతో, అనవసరంగా పగను పెంచుకోవడం, పాడి ఆవును కొట్టడం వంటి పాపము చేసిన దానికి ఏ పాపం వస్తుందో, ఈ తామరతూళ్ళు దొంగిలించిన వాడికి వస్తుంది" అని పలికాడు. గౌతముడు లేచి, "వేదము చదువుకుని కూడా వేదాధ్యయనం చేయకపోవడం, రోజూ అగ్ని ఆరాధన చేయక పోవడం, మద్యం విక్రయించడం, వర్ణసంకరం చేసి, శూద్ర స్త్రీని పెళ్ళి చేసుకోవడం మొదలైన పాపములు, ఈ తామరతూళ్ళు దొంగిలించిన వాడికి సంక్రమిస్తుంది" అని గౌతముడు చెప్పాడు. తరువాత విశ్వామిత్రుడు లేచి, "అర్హత గలవారిని వదిలి, అర్హత లేని వారిని పనిలో పెట్టుకోవడం, అధర్మవర్తనుడూ, కపటి అయిన రాజును సేవించడం వంటి పాపములు, ఈ తామరతూళ్ళు దొంగిలించిన వానికి సంక్రమిస్తుంది" అని అన్నాడు.

ఇదంతా విని అరుంధతి నవ్వి, "ఎప్పుడూ అత్తగారిని ఆక్షేపించడం, తిట్టడం, భర్తపట్ల అనుచితంగా ప్రవర్తించడం, వండుకున్నది ఎవరికీ పెట్టకుండా తానే తినడం వంటి పాపములు, తామరతూళ్ళు దొంగిలించిన వారికి తగులుతాయి" అని అన్నది. ఇంతలో సేవకురాలు గండ, "వండినవంట ముందు తానే తినడం, పని చేయడములో సోమరిగా, కుటిలముగా ఉండడం, అబద్ధాలు చెప్పడం, కన్నకూతురిని ధనము కొరకు అమ్ముకోవడం, మంచివారికి కీడు చెయ్యడం వంటి పాపములు, ఈ తామరతూళ్ళు దొంగిలించిన వానికి సంక్రమిస్తాయి. అదీగాక, ఈ తామరతూళ్ళు దొంగిలించిన వాడు, జీవితం అంతా ఒకరికి దాస్యం చేస్తుంటాడు" అని పలికింది. ఇక చివరగా ఆమె భర్త పశుసఖుడు, "ఈ తామరతూళ్ళు దొంగిలించిన వాడికి సంతానం కలుగదు. గర్భదరిద్రుడౌతాడు" అని అన్నాడు. 

ఇదంతా విన్న శునస్సఖుడు, "ఈ తామరతూళ్ళు దొంగకు ఇవ్వడం, వేదవేదాంగములు చదివిన బ్రాహ్మణోత్తముడికి తన పుత్రికను దానం ఇవ్వడం వంటిది" అని అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్య పోయారు. అదేమిటి? నువ్వు ధర్మవచనాలు పలుకుతున్నావు? అంటే తామరతూళ్ళు దొంగిలించినది నువ్వే అన్న మాట. ఆకలితో అల్లాడి పోతున్నాము. దయచేసి ఆ తామరతూళ్ళు మాకు ఇవ్వు. అని అడిగారు మునులు. అప్పుడు శునస్సఖుడు, "అయ్యా! నిజం చెప్తున్నాను. ఈ తామరతూళ్ళు కనిపించకపోతే, మీరు ఏమి అనుకుంటారో అని తెలుసుకోవడానికి, తామరతూళ్ళను దాచి పెట్టాను. ఇవిగో, వీటిని తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి" అని తాను దాచిన తామరతూళ్ళను తెచ్చి ఇచ్చి, "మహానుభావులారా! మీ మీద కోపించి వృషాదర్భి, మిమ్మల్ని చంపడానికి హోమం చేసి, హోమగుండం నుండి కృత్తి అనే రాక్షసిని సృష్టించి, మీ మీదకు పంపాడు. అది తెలిసిన నేను, ఆ రాక్షసిని చంపాను. ఇక ఎందుకు దాపరికం, నేను దేవేంద్రుడను. మీరంతా లోభత్వం వదలడం వలన, మీకు పుణ్యలోకాలు సిద్ధించాయి. రండి, పుణ్యలోకాలకు పోదాము" అని దేవేంద్రుడు సప్తఋషులనూ, అరుంధతినీ, పుణ్య లోకాలకు తీసుకుపోయాడు.

ఈ సంవాదాన్ని చెప్పిన తరువాత భీష్ముడు, "ధర్మనందనా! ఇదంతా వారు, ఇతరులిచ్చినది పుచ్చుకొనక పోవడం, లోభం విడిచిపెట్టడం వంటి సద్గుణాల వలన జరిగింది. కనుక నీవు కూడా, లోభమును విడిచి పెట్టు. ఒకరి సొత్తును ఆశించకు" అని ధర్మబోధ చేశాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home