విభీషణుడి కుమారుడు ‘నీలుడి కథ’! Purushottama Kshetra / Neeladri


దేవలోకంపై యుద్ధానికి వెళ్ళిన అసురుడు నీలాచలేశ్వరుడిగా వెలిశాడా?

చింతామణి, కామధేనువు, కల్ప వక్షం అనేవి, దేవతా వస్తువులు. కానీ, అటువంటి అద్భుత వస్తువులను అసురుడైన నీలుడు సంపాదించుకున్నాడు. విభీషణుడి కుమారుడైన నీలుడు, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి వరం సంపాదించి, ఇంద్రుడిపై యుద్ధం చేశాడు. దేవతలపై యుద్ధం చేయడానికి వెళుతున్న నీలుడిని, రామభక్తుడైన విభీషణుడు ఎందుకు అడ్డుకోలేదు? అసురుడైన నీలుడికి గురువైన శుక్రాచార్యుడిచ్చిన సలహా ఏంటి? దేవతా స్త్రీలలోని అత్యంత సుందరీమణి అయిన వన సుందరిని, నీలుడు ఎలా పొందాడు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/pGLkcLVZvBA ]


రావణ వధ తర్వాత, లంకాపూరికి విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తుండేవాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతడు గుణమూ, బలమూ, విద్యలలో మేటి. ఒక సారి నీలుడు, తండ్రి విభీషణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ఇలా అన్నాడు. "తండ్రీ! మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారికేమీ లోటు లేదు. మనకు ధన సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రాజ్య మైన లంకలో, చింతామణీ, కామధేనువూ, కల్ప వృక్షం లేని లోటు బాగా కన్పిస్తోంది నాకు. మీరు శ్రీ రాముని పద సన్నిధిని చేరి, లంక సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా, వీటిపై మీకు ద్రుష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేక పోయారు? నాకు అనుమతినిస్తే, వాటిని సాధించి తీసుకు వచ్చి, మన లంకలో ఉంచుతాను" అన్నాడు వినయంగా. కొడుకు నీలుని మాటలను విన్న విభీషణుడు, "కుమారా! నేను శ్రీ రామ చంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను. ఆ రామప్రభువు దివ్యానుగ్రహం వల్ల, అన్ని సుఖాలూ, ఆనందాలూ, భోగభాగ్యాలతోపాటు, బ్రహ్మానంద రసానుభూతిని అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయుష్షూ, సామ్రాజ్యమూ, నాకు శ్రీ రామ కృప వల్ల లభించాయి. శ్రీ రాముడే నా చింతామణి, కామ ధేనువు, కల్ప వృక్షం. అంత కంటే వేరేమీ నాకు అక్కర లేదు. రాముని కరుణ వల్ల, ఇంద్రాది అష్ట దిక్పాలకులు నా వశంలోనే వున్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడింటి అవసరం లేక పోయింది. అవి లంకలో లేవనే చింత వదిలెయ్యి. శ్రీ రామ పద భక్తితో ధన్యుడవయ్యే ప్రయత్నం చెయ్యి" అని అనునయంగా చెప్పాడు.

తండ్రి మాటలు, నీలుడికి రుచించలేదు. కీర్తి కాంక్షతో తహతహ లాడిపోయాడు. మళ్ళీ తండ్రితో వాటి అవసరాన్ని తెలియ జేశాడు. చివరికి విభీషణుడు మెత్తబడి, "నీ కోరికను కాదన లేకపోతున్నాను. వాటిని సాధించి, ఇక్కడికి తీసుకొనిరావటానికి గురువు అనుమతి చాలా ముఖ్యం. ముందుగా మన కుల గురువు శుక్రాచార్యుల వారికి శుశ్రూష చేసి, అనుగ్రహం సంపాదించి, అప్పుడు, ఆయన  అనుమతితో  ప్రయత్నం చెయ్యి" అని సలహా ఇచ్చి, ఆశీర్వదించి, నీలుడిని పంపాడు. తండ్రి అనుమతితో సగం కార్యం తీరిందని సంతోషించిన నీలుడు, గురువు శుక్రాచార్యుల వారిని చేరి, పూజించి, నమస్కరించి, చేతులు జోడించి, ”గురు దేవా! మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో, మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను. నాకు చింతామణి, కల్ప వృక్షం, కామ ధేనువులను సాధించి, లంకలో వాటిని ఉంచాలన్న కోరిక కలిగింది. దీనికి మీ అనుగ్రహం కావాలి. ప్రసాదించండి." అని వేడుకొన్నాడు. నీలుని భక్తీ తత్పరత, వినయం, ఆచార్యులకు నచ్చి, "కుమారా! ఈ రోజు మృగశిరా నక్షత్రం. ఈ నక్షత్ర కాలం, కొత్త మంత్రోపదేశానికి మంచిది. దాన్ని జపిస్తే, నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది. శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధతో జపించి, నీ కోర్కెను సాధించుకో" అని చెప్పి, వెంటనే "పంచముఖ ఆంజనేయ మంత్రం" ఉపదేశించాడు.

జగన్నాధ క్షేత్రం చేరి, దీక్షతో, ఆ మంత్రాన్ని త్రికరణ  శుద్ధిగా జపించమని చెప్పాడు, శుక్రాచార్య గురువరేణ్యుడు. పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. పంచముఖ ఆంజ నేయుడు, సర్వ సిద్ధి ప్రదాత. తూర్పుముఖం, కోటి సూర్యుల కాంతితో, భీకరమైన  కోరలతో, భ్రుకుటి ముడిచి కనిపిస్తాడు. దక్షిణ ముఖం, నార సింహ ముఖం. మహాద్భుతంగా, మృత్యువును తెచ్చే ఉగ్రరూపంగా, తేజోవంతంగా వుంటుంది. భయనాశనం చేస్తుంది. పశ్చిమ ముఖం గరుడుని ముఖం. దీనికి వక్రతుండం వుంటుంది. సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది. సర్వ భూతాలనూ అదుపులో ఉంచుతుంది. ఉత్తర ముఖం, సూకర ముఖం. ఈ వరాహ ముఖం, నల్లని కాంతితో వుంటుంది. భేతాళ ప్రయోగాలనూ, జ్వరం మొదలైన రోగాలనూ నాశనం చేస్తుంది. పై ముఖం, హయ ముఖం. ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఇలాంటి మహామహిమాన్వితమైన అయిదు ముఖాలకు చెందిన బీజాక్షరాలతో, భక్తిగా మంత్రాలను జపిస్తే, కోరిన కోరిక తీరుతుంది. అలా గురువు అనుమతితో నీలుడు బయల్దేరి, "నీలాచల  క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రాన్ని" చేరాడు. అక్కడ ఒక మహా పర్వతం, దానికింద పెద్ద అడవి వున్నాయి. ఆ పర్వతం మీదకు చేరి, అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలంలో ప్రవేశించి, దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు.

ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా, కోటి సూర్య ప్రభలతో, ముప్పది మూడు కోట్ల అద్భుత గణంతో, సంజీవ రాయుడైన ఆంజనేయ స్వామి, నీలుడికి దర్శనమిచ్చాడు. శంఖధ్వని వంటి ధ్వనితో నీలుణ్ణి పిలిచాడు. వెంటనే మేల్కొన్న నీలుడు, ఆయన పాదాలపై సభక్తికంగా వాలి పోయాడు. కళ్ళ వెంట ఆనంద  భాష్పాలు ధారా పాతంగా కారసాగాయి. నీలుణ్ణి భుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తితో స్తోత్రం చేశాడు. దీనినే "నీల కృత ఆంజనేయ స్తోత్రం" అని అంటారు. ఇది చాలా మహిమాన్వితమైన స్తోత్రం. దానికి విపరీతంగా సంతోషించి హనుమ, "నీలా! నీ తపస్సు, ధ్యానాలకు మెచ్చాను. నీ మనోభీష్టం నాకు తెలుసు. త్వరలో ఇంద్రుని జయిస్తావు. చింతామణి తదితరాలనూ పొందుతావు. దేవతా స్త్రీలలో అత్యంత సుందరీమణి అయిన వన సుందరి అనే స్త్రీ నీకు భార్యగా లభిస్తుంది. నువ్వు కోరక పోయినా, బ్రహ్మ దేవుడే నీకావరాలను అనుగ్రహిస్తాడు. లోకంలో ఎవరైనా సరే.. నీ లాగా నా మంత్రాన్ని జపించి, నా వ్రతాన్ని చేస్తే, వారందరి కోరికలూ నేను తక్షణమే తీరుస్తాను. నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు. ఆయనా, నేనూ శ్రీరాముని బంటులము. నా దక్షిణ భాగంలో నీకు సుస్థిరమైన స్తానం కల్పిస్తున్నాను. నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం, ఇక నుంచి "పురుషోత్తమ క్షేత్రం"గా పిలువబడుతుంది. నీ కోరికలు న్యాయ బద్ధమైనవే. త్వరలోనే అవి తీరగలవు" అని వర దానం చేసి, పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు.

హనుమ దర్శనంతో తృప్తి చెంది, ఆయన వరాలను అందుకొన్న నీలుడు, అక్కడి నుంచి బయలుదేరి, మళ్ళీ గురువు  శుక్రాచార్యుల సన్నిధికి  చేరాడు. ఆయన సంతోషించి, నీలుణ్ణి ఆశీర్వదించి, తండ్రి విభీషణునికి వివరాలన్నీ తెలియ జేయవలసినదిగా చెప్పి పంపించాడు. లంకలో తండ్రి విభీషణుడిని చేరి, జరిగిన విధానం అంతా పూస గుచ్చినట్లు తండ్రికి విన్నవించాడు. కుమారుని అద్భుత తపో వృత్తాంతం, వర గ్రహణం విన్న విభీషణుడు పరమానందం పొంది, నీలుణ్ణి ఆశీర్వదించాడు. కొంత కాలం తర్వాత నీలుడు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు. తనలో తాను ఇలా వితర్కించుకొన్నాడు.. "రాజు పని వున్నా లేకపోయినా, రాజ్యానికి నష్టం లేకుండా, శత్రువులను భయపెట్టాలి. శత్రు మర్దనుడనే బిరుదు పొందాలి. ఇలా చేయకపొతే, శత్రువులకు తేలికైపోతాడు. మా జాతికి శత్రువు, స్వర్గ లోకాధిపతి ఇంద్రుడే. అతని వద్ద నుండి చింతామణి, కల్ప వృక్షం, కామ ధేనువునూ, నేను గ్రహించటం రాజ ధర్మం. నెమ్మదిగా, నయంతో సాధించటానికి ప్రయత్నిస్తాను. ఇవ్వక పొతే, యుద్ధం చేసయినా, వాటిని దక్కించుకుంటాను. ఒక దూతను రాయబారిగా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది. అతని వల్ల సమాచారం తెలుసుకుని, అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలోచిస్తాను" అని దీర్ఘాలోచన చేశాడు. అందుకు సమర్ధుడైన దూతను పిలిచాడు. అతనితో తన మనసులోని మాటను తెలియజేశాడు. "నా రాయబారిగా ఇంద్రలోకం వెళ్లి, నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు. ఇంద్రుడు రాక్షసులకు విరోధి అనీ, మనకు కావలసిన చింతామణి, తదితరాలనూ మర్యాదగా అప్పగించి, సంతోషం కలుగజేయమని చెప్పు. లేకపొతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని తెలియజేయి" అని వివరంగా చెప్పి దూతను పంపాడు.

దూత నీలుడి మాటలను మననం చేసుకుంటూ, స్వర్గ లోకం చేరాడు. అక్కడ దేవ సభలో మహేంద్రుడి ఎదుటికి చేరాడు. ఇంద్రుడు, భార్య అయిన శచీదేవితో కూడి, సింహాసనం పై అధివసించి వున్నాడు. దేవగురు బృహస్పతి, దేవ లోక మహర్షులందరూ, ఉచితాసనాలపై ఉపవిష్టులైనారు. అప్సరసలు నృత్యాలు చేస్తుంటే, గంధర్వులు కమ్మగా గానం చేస్తున్నారు. రాక్షస రాజ కుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి, మహేంద్రుడికి నమస్కరించాడు. ఆయనా మర్యాద పూర్వకంగా కుశల ప్రశ్నలు వేస్తూ, స్వాగతించాడు. దూత నీలుడు చెప్పమన్న మాటలను, "సురాధిపా దేవేంద్రా! నేను లంకా రాజ్య పరి పాలకుడు విభీషణ మహా రాజు గారి సేవకుడిని. ఆయన కుమారుడు, యువరాజు నీలుని దూతను. శ్రీ మంతుడూ, సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడూ, ధర్మాత్ముడూ, భగవద్ భక్తుడూ అయిన నీల మహారాజు, మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించారు. సావధానంగా విని, ప్రత్యుత్తరం ఇవ్వవలసినదిగా కోరుతున్నాను" అని చెప్పి, నీలుడు చెప్పి పంపిన విషయాలనన్నిటినీ ఏకరువు పెట్టాడు.

అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకంతో, "నీలుడు అంతటి వాడు అయ్యాడా? మా వజ్రాయుధం సంగతి మరిచాడా? మహా బల సంపన్నులైన పాకాసుర, జమ్బాసురాది రాక్షసుల కన్నా పోటు గాడా? అతని పరాక్రమం ఏమిటో చూద్దాం. అతను అడిగినవేవీ ఇవ్వమని చెప్పు" అని చెప్పి, ఆ దూత శిఖను కత్తిరింప జేసి, బయటికి వెడల గొట్టాడు ఇంద్రుడు. ఇంతలో సభలో అశుభ శకునాలు కనిపించాయి, వినిపించాయి. ఏదో ప్రమాదం జరుగబోతోందనే సూచన గమనించాడు ఇంద్రుడు. సభను చాలించి, అంతఃపురం చేరాడు.

ఇంద్ర సభలో జరిగిన పరాభవాన్ని మూట గట్టుకుని, దూత నీలుని చేరి, విషయం అంతా వివరించి చెప్పాడు. నీలుడు దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు. తండ్రి విభీషణునితో మంత్రాలోచన చేశాడు. సైన్యాన్ని సమకూర్చుకుని, స్వర్గాన్ని ముట్టడించటానికి సన్నద్ధుడై బయల్దేరాడు. కొద్ది కాలంలోనే స్వర్గం చేరి, దేవ సైన్యంతో యుద్ధం ప్రకటించాడు. ఇంద్రుడు కూడా సమయా సమయాలు తెలియకుండా, అహంకార బల గర్వితుడై, మద మత్సరాలతో ఊగిపోతూ, పోరుకు తలపడ్డాడు. భయంకర యుద్ధం సాగింది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపై ప్రయోగించాడు. నీలుడు దాన్ని ఛేదించి, నిర్వీర్యం చేశాడు. పరాభవంతో రగిలిన దేవేంద్రుడు, నీలుడితో ద్వంద్వ యద్ధానికి దిగాడు. ఇంద్ర నీలులిద్దరూ, బాహా బాహీ యుద్ధం చేశారు. కుప్పించి తన్నుకొన్నారు, కాళ్ళతో కొట్టు కొంటున్నారు. క్రమంగా ఇంద్ర బలం క్షీణించి, రాక్షసుడు అయిన నీలుని బలం పెరిగింది. ఇంద్రుడు దెబ్బ తిని, నేల మీద కూలి పోయాడు. నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి, ఇంద్రుని వక్షస్థలం మీద చేరి, పదునైన ఖడ్గాన్ని గుండెలు చీల్చటానికి పైకి ఎత్తాడు. ఆ ఘోరం చూడలేక, అందరూ భయ కంపితులైనారు.

అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, నీలుని ఆపాడు. ఇద్దరికీ సంధి చేయటానికి తాను వచ్చానని, బ్రహ్మ వారిద్దరికీ చెప్పాడు. నీలుడు ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు. ఇంద్రుడు, నీలుడు, ఇద్దరూ బ్రహ్మ దేవునికి నమస్కరించి, భక్తీతో కీర్తించారు. నీలుడు చేసిన బ్రహ్మ స్తవానికి, నాలుగు ముఖాల బ్రహ్మ సంతోషించాడు. దేవేంద్రునితో బ్రహ్మ, "పాక శాసనా! నీకు బుద్ధి ఇంకా రాలేదా? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాధిపత్యం, విభీషణుడి రాజాధికారం అంతా, శ్రీ రాముడి దయ చేతనే ననే సంగతి మరచి పోయావా? నీలుడు కోరిన కోరికలు, అతి సాధారణమైనవే. వాటిని మన్నించి, అతనికి వాటిని ఇచ్చి వేస్తే మంచిది" అని చెప్పాడు. బ్రహ్మ ఇంద్రునికి హితోపదేశం చేస్తూ, నీలుడు హనుమ భక్తుడు. హనుమద్దాసులకు అప జయం వుండదు. చింతామణి, కల్ప వృక్షం, కామ ధేనువు లను, నీలునికి సమర్పించు. అతనిని క్షమాపణ కోరి, సుఖంగా వుండు" అని బోధించాడు. బ్రహ్మ వాక్కులకు సిగ్గు పడి, నీలుణ్ణి క్షమాపణ కోరి, చింతామణీ, కల్ప వృక్షం, కామ ధేనువు లను ఒసగి, సభక్తికంగా నిలబడ్డాడు.

అప్పుడు బ్రహ్మ నీలుని చూసి, "శ్రీ మంతా నీలా! నువ్వు మాకు ఇష్టుడవైన భక్తుడవు. నా సంతోషం కోసం, నీకు  ఒక వరం ఇవ్వా లను కొంటున్నాను. స్వీకరించు. నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి "నీలా చలం" అని, నీ పేర పిలువ బడుతుంది. దీనినే, "పురుషోత్తమ క్షేత్రం" అని పిలుస్తారు. నీకు "వనసుందరి" అనే దేవతా స్త్రీని ఇస్తున్నాను. ఆమెను వివాహం చేసుకుని, సర్వ సుఖాలనూ అనుభవించు. కాలాంతరంలో నువ్వే ఇక్కడ "నీలాచలేశ్వరుడ"నే పేరు మీద ఈ నీలాచలంలో వెలసి, భక్తుల కోర్కెలను తీరుస్తావు." అని చెప్పి, వన సుందరిని ఇచ్చి, యుద్ధంలో చని పోయిన వారందరినీ బ్రతికించి, బ్రహ్మ లోకం చేరాడు బ్రహ్మ. ఇంద్ర, నీలాదులు, పరమ సంతోషం పొందారు. ఇద్దరి మధ్యా వైరం ఎంత త్వరగా ప్రారంభం అయిందో, అంత  త్వరగా సమసి పోవటం, ఉభయులకూ ఆనంద దాయకం  అయింది.

కాలం ఎంతటి వారినైనా కలుపు తుంది, విడదీస్తుంది. కాల మహిమను ముందుగా ఎవరూ తెలుసుకోలేరు. ఈ గాధలను పరాశర మహర్షి, మైత్రేయునికి వివరించినట్లుగా పురాణవిదితం..

ధర్మో రక్షతి రక్షితః!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home