దివ్యదృష్టి! భగవద్గీత Bhagavadgita Chapter 11
దివ్యదృష్టి!
అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా భూత భవిష్యత్తులను చూడగలగటం!
'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (06 – 09 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 06 నుండి 09 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
తన విశ్వరూప దర్శనము గురించి శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/-QLqNbfl5Hs ]
00:44 - పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ।। 6 ।।
నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, పన్నెండుగురు అదితి పుత్రులనూ, ఎనిమిది మంది వసువులనూ, పదకొండు రుద్రులనూ, ఇద్దరు అశ్వినీ కుమారులనూ, అంతే కాక, నలభై తొమ్మిది మరుత్తులూ, మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము.
భగవంతుని విశ్వ రూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక, పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా అన్నీకూడి ఉన్న స్వరూపము, ఇంతకు మునుపు ఎప్పుడూ దర్శించబడలేదు. దేవతలు తన దివ్య స్వరూపములోని అతి చిన్న భాగములే అని కూడా చెప్తున్నాడు, శ్రీ కృష్ణ భగవానుడు. పన్నెండుమంది ఆదిత్యులనూ, ఎనిమిది మంది వసువులనూ, పదకొండు మంది రుద్రులనూ, ఇద్దరు అశ్వినీ కుమారులనూ, మరియు నలభై తొమ్మిది మరుత్తులనూ తన విశ్వరూపంలో చూపిస్తున్నాడు. అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు, ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట, వామన. అలాగే అష్ట వసువులనగా, దార, ధ్రువ, సోమ, ఆహ, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస. ఇక పదకొండు మంది రుద్రులు అనగా, హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృసకపి, శంభు, కాపర్ది, రైవత, మృగవ్యాధ, సర్వ, కపాలి. ఇద్దరు అశ్విని కుమారులు, కవలలైన దేవతా వైద్యులు. నలభై తొమ్మిది మరుత్తులుగా పిలువబడే వాయు దేవతలు, సత్త్వజ్యోతి, ఆదిత్య, సత్యజ్యోతి, తిర్యగ్జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మన, హరిత, రితజిత, సత్యజిత, సుశేణ, సేనాజిత, సత్యమిత్ర , అభిమిత్ర, హరిమిత్ర, కృత, సత్య, ధృవ, ధార్త, విధార్త, విధరాయ, ధ్వాంత, ధుని, ఉగ్ర, భీమ, అభియు, సాక్షిప, ఇద్రిక, అన్యద్రిక, యద్రిక, ప్రతికృత, ఋక్, సమితి, సంరంభ, ఇద్రిక్ష, పురుష, అన్యద్రిక్ష, చేతస, సమిత, సమిద్రిక్ష, ప్రతిద్రిక్ష, మారుతి, సరత, దేవ, దిశ, యజుః, అనుద్రిక, సమ, మానుష మరియు విష అనబడే వారు. వారందరూ కృష్ణ భగవానుడి రూపంలో ఇమిడి ఉన్నారు.
03:06 - ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ ।
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ।। 7 ।।
ఓ అర్జునా, ఒక్క చోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా, వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే తిలకించుము.
తన స్వరూపమును చూడమని చెప్పిన కృష్ణుడు, తన దివ్య మంగళ స్వరూప శరీరము యందే, సమస్త సృష్టినీ దర్శించమని అంటున్నాడు. అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా, అర్జునుడిని చూడమంటున్నాడు భగవానుడు. సర్వమూ ఆ విశ్వ రూపములో ఉంటుంది, భూత / భవిష్యత్ సంఘటనలు కూడా ఉంటాయి. అర్జునుడు తద్వారా, విశ్వ పరిణామ ఆవిష్కరణ ప్రణాళికలో భాగంగా, పాండవుల విజయాన్నీ, మరియు కౌరవుల పరాజయాన్ని కూడా చూడగలిగాడు.
04:00 - న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ।। 8 ।।
కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము.
పరమేశ్వరుడైన భగవానుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు, ఆయనకి రెండు రకాల స్వరూపాలు ఉంటాయి - ఒకటి ప్రాకృతిక కళ్ళతో చూడగలిగే భౌతికమైన స్వరూపము, మరొకటి దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగే దివ్య స్వరూపము. ఈ విధంగా, మనుష్యులు ఆయనను భూలోక అవతార సమయంలో తప్పకుండా దర్శిస్తారు. కానీ, ఆయన యొక్క ప్రాకృతిక రూపంలోనే దర్శిస్తారు. ఆయన యొక్క దివ్య స్వరూపము వారియొక్క ప్రాకృతిక కన్నులకు కనపడదు. ఈ కారణం వలననే, ఈ భౌతిక ప్రపంచపు జీవాత్మలు, భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు, ఆయనను గుర్తించలేరు. జనులు చూసేది కేవలం దివ్య అవతారము యొక్క భౌతిక స్వరూపము మాత్రమే. శ్రీ కృష్ణుడు అర్జునుడిని తన యొక్క విశ్వ రూపమును చూడమని అడిగాడు. కానీ, అర్జునుడికి ఏమీ కనపడలేదు. ఎందుకంటే, అతనికి ప్రాకృతిక కన్నులే ఉన్నాయి. ఈ యొక్క ప్రాకృతిక కళ్ళు, ఆ విశ్వ రూపమును దర్శించటానికి సరిపోవు, మరియు సామాన్యమైన బుద్ధికి అది అర్థం కాదు. అందుకే, అర్జునుడు విశ్వ రూపమునూ, దాని అపూర్వ వైభవమునూ దర్శించటానికి సాధ్యమయ్యేటట్టుగా, శ్రీ కృష్ణుడు, ఆయనకి దివ్య దృష్టిని ఇప్పుడు ప్రసాదిస్తానని అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించటం అనేది, ఒక భగవంతుని కృప. ఆయన కృప చేతనే, భగవంతుడు తన దివ్య చక్షువులను జీవాత్మ యొక్క ప్రాకృతిక కనులకు అందిస్తాడు. తన దివ్య మనస్సుని జీవాత్మ యొక్క ప్రాకృతిక మనస్సుకు అందజేస్తాడు. తన దివ్య బుద్ధిని, జీవాత్మ యొక్క ప్రాకృతిక బుద్ధికి ఏర్పరుస్తాడు. తదుపరి, ఈ భగవంతుని దివ్యమైన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ కలిగి ఉన్న జీవాత్మ, ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతుంది, స్మరించగలుగుతుంది, మరియు దానిని అర్థం చేసుకోగలుగుతుంది.
06:11 - సంజయ ఉవాచ ।
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ।। 9 ।।
సంజయుడు ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, మహా యోగేశ్వరుడునూ, పాపములను హరించువాడునూ అయిన భగవానుడు, ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపించాడు.
అర్జునుడు శ్రీ కృష్ణుడిని, 11వ అధ్యాయం, 4వ శ్లోకంలో, "యోగేశ్వర" అని సంబోధించాడు. ఇక ఇప్పుడు, సంజయుడు ఆయనను, "మహా-యోగేశ్వరా" అని అంటున్నాడు. యోగేశ్వరుడికి "మహా" అన్నఅతిశయోక్తి జత చేశాడు. సంజయునికి తన గురువు వేద వ్యాసునిచే, దివ్యదృష్టి వరం ఇవ్వబడింది. కాబట్టి, ఆయన కూడా భగవంతుని విశ్వ రూపమును, అర్జునుడు చూసిన విధముగానే చూశాడు.
07:04 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని గురించి, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment