విశ్వరూప దర్శనం! భగవద్గీత Bhagavadgita
విశ్వరూప దర్శనం! అనంతమైన ఆకృతులూ, మరియు వర్ణములతో కూడిన భగవానుడి విశ్వరూపము!
'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 1 నుండి 5 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/F3yPQAg34Q4 ]
ఈ పదకొండవ అధ్యాయంలో అర్జునుడు, శ్రీ కృష్ణుడి విశ్వ రూపమును చూడాలని ప్రార్ధిస్తున్నాడు. సమస్త విశ్వములూ తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వ రూపాన్ని, శ్రీ కృష్ణుడు అర్జునుడి దివ్య దృష్టికి చూపించాడు.
00:54 - అర్జున ఉవాచ ।
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ ।
యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ।। 1 ।।
నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది.
శ్రీ కృష్ణుడి విభూతులనూ, మరియు పరమేశ్వరుని యొక్క జ్ఞానమునూ విన్న పిదప, అర్జునుడు ఆనందముతో ఉప్పొంగిపోయాడు. అంతేగాక, తన యొక్క మోహము నశించిపోయినదని తెలుసుకున్నాడు. శ్రీ కృష్ణుడు కేవలం తన ప్రియ మిత్రుడు మాత్రమే కాదనీ, ఆయన జగత్తులోని సర్వ ఐశ్వర్యములకూ మూలమైన సర్వోత్కృష్ట పరమేశ్వరుడేననీ అంగీకరించాడు. ఇప్పుడు అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియపరచటం ద్వారా చూపిన శీ కృష్ణుడి ఆదరణను, కృతజ్ఞతా పూర్వకంగా అంగీకరించడంతో, ఈ అధ్యాయమును ప్రారంభిస్తున్నాడు.
01:51 - భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ।। 2 ।।
సర్వ ప్రాణులూ, ఉత్పత్తీ మరియు అవ్యక్తమైపోవటమనే విషయమును గురించి, విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర వంటి నేత్రములు కలవాడా. నిత్య శాశ్వతమైన నీ మాహాత్మ్యము కూడా విన్నాను.
సమస్త భౌతిక జగత్తు సృష్టికీ, మరియు లయమైపోవటానికీ మూల కారణమైన శ్రీ కృష్ణుడి అత్యున్నత స్థాయిని విశ్వసిస్తూ అర్జునుడు, శ్రీ కృష్ణుని మాహాత్మ్యమును ప్రశంసించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. అర్జునుడు ఈ శ్లోకంలో, "ఓ శ్రీ కృష్ణా, నీ యొక్క నిత్య శాశ్వతమైన మహాద్భుతమైన మహిమలను, నీ నుండి విన్నాను. నీవు అందరిలోనే ఉన్నా, నీవు వాటి యొక్క దోషములకు అతీతుడవు. నీవే సర్వోన్నత నియామకుడవు. అదే సమయంలో, నీవు అకర్తవూ, మరియు మా యొక్క కర్మలకు నీవు భాద్యుడవు కావు. నీవే మా కర్మ ఫలితములను అందించేవాడవయినా, నీవు నిష్పక్షపాతమైనవాడివీ, మరియు అందరికీ సమానుడవు. నీవే సర్వసాక్షివీ, మరియు కర్మ ఫలాలను అందించేవాడివీ. అందుకే నీవే, సర్వ ప్రాణులకూ ఆరాధ్యుడవని విశ్వసిస్తున్నాను.
03:10 - ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర ।
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ।। 3 ।।
ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది, ఓ పురుషోత్తమా.
అర్జునుడు శ్రీ కృష్ణుడి దివ్య వ్యక్తిత్వపు యదార్ధమును, ఆయన చెప్పినట్టుగానే అంగీకరిస్తున్నట్టు ప్రకటిస్తున్నాడు. అర్జునుడికి ఆయన యొక్క సాకార స్వరూపముపై, పూర్తి విశ్వాసము ఉంది. అయినా, శ్రీ కృష్ణుడి యొక్క సర్వ ఐశ్వర్యములతో కూడిన విశ్వరూపమును, చూడ గోరుతున్నాడు. తన స్వంత కళ్ళతోనే అది చూడాలని, అభిలషిస్తున్నాడు.
03:56 - మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో ।
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ।। 4 ।।
ఓ యోగేశ్వరా, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉందని నీవనుకుంటే, దయచేసి నీ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వ రూపమును నాకు చూపించుము.
అర్జునుడు సర్వేశ్వరుని యొక్క విశ్వ రూపమును చూడగోరుతున్నాడు. అందుకిప్పుడు, ఆయన యొక్క అనుమతి అడుగుతున్నాడు. "ఓ యోగేశ్వరా, నా కోరిక నీకు తెలియచేశాను. నేను దానికి అర్హుడనని నీవనుకుంటే, నీ కృపచే, నీ యొక్క విశ్వ రూపమును నాకు చూపించుము, మరియు నాకు నీ యొక్క యోగ-ఐశ్వర్యమును చూపించుము" అని అంటున్నాడు. యోగం అంటే, జీవాత్మను పరమాత్మతో ఏకం చేసే శాస్త్రము. ఈ శాస్తమును అభ్యాసం చేసే వారే, యోగులు. యోగేశ్వరుడు అంటే, "యోగులందరికీ ప్రభువు" అని కూడా అర్ధం. అందరు యోగులూ అంతిమంగా సాధించవలసినది ఆ పరమాత్మనే కాబట్టి, శ్రీ కృష్ణుడు యోగేశ్వరుడవుతాడు. గత శ్లోకాల్లో అర్జునుడు భగవంతుడిని "యోగి" అని సంభోదించాడు, అంటే, “యోగ నిష్ణాతుడా” అని. కానీ ఇప్పుడు, శ్రీ కృష్ణుడి మీద పెరిగిన గౌరవం దృష్ట్యా, దానిని "యోగేశ్వరా" అని భక్తి పూర్వకంగా పిలుస్తున్నాడు.
05:18 - శ్రీ భగవానువాచ ।
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ।। 5 ।।
శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ పార్థ, వివిధములైన ఆకృతులూ, పరిమాణములూ, మరియు వర్ణములతో ఉన్న వందల, వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము.
అర్జునుడి ప్రార్ధనలను విన్న తరువాత, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, తన యొక్క విశ్వ-రూపమును తిలకించమని అంటున్నాడు. శ్రీ కృష్ణుడు చూపించబోయే ఆ రూపము ఒకటే అయినా, దాని యందు అసంఖ్యాకమైన, విలక్షణమైన రంగులూ, వివిధ ఆకృతులతో కూడి ఉన్న అనంతమైన వ్యక్తిత్వాలూ ఉన్నాయి. అనంతమైన ఆకృతులూ, మరియు వర్ణములతో కూడి ఉన్న తన విశ్వరూపమును, ఆర్జునుడిని చూడమన్న పిదప, శ్రీ కృష్ణుడిప్పుడిక, ఆర్జునుడిని ఆ విశ్వ రూపములో ఉన్న దేవతలనూ, మరియు ఇతర అద్భుతములనూ గమనించమంటున్నాడు.
06:17 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment