అష్ట సాత్విక భావములు! భగవద్గీత Bhagavadgita


అష్ట సాత్విక భావములు!
హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు భక్తులలో కనిపించే లక్షణాలేంటి?

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (10 – 14 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 10 నుండి 14 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

అర్జునుడి, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని, సంజయుడు ఇలా వివరిస్తున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/aUdwm4wMXo4 ]


00:46 - అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ ।
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ।। 10 ।।

00:56 - దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ ।
సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం ।। 11 ।।

ఆ యొక్క విశ్వ రూపములో, అర్జునుడు అనంతమైన ముఖములూ, మరియు కనులనూ దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములనూ, మరియు అనేక రకాల దివ్య ఆయుధములనూ కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది, మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన, అనంతమైన ఈశ్వరునిగా, సర్వత్రా తన ముఖముతో, తనను తాను వ్యక్తపరుచుకున్నాడు.

శ్రీ కృష్ణుడి యొక్క దివ్య మంగళ విశ్వరూపమును, సంజయుడు, 'అనేక' మరియు 'అనంత' అన్న పదాలతో విశదీకరిస్తున్నాడు. సమస్త సృష్టీ, భగవంతుని విశ్వరూప శరీరమే. అందుకే అది అసంఖ్యాకమైన ముఖములూ, కళ్ళూ, నోర్లూ, ఆకృతులూ, వర్ణములూ మరియు రూపములనూ కలిగి ఉంటుంది. మనుష్య బుద్ధికి, పరిమితమైన కాలము, ప్రదేశము, మరియు రూపములకు లోబడి ఉన్న వాటినే, అవగతం చేసుకోగలిగే సామర్ధ్యం ఉన్నది. భగవంతుని విశ్వ రూపము - అసాధారణమైన అద్భుతములూ, వింతలూ, మరియు ఆశ్చర్యములను - అన్ని దిక్కులా ప్రకటించింది. అది కాల-ప్రదేశ పరిమితులను అధిగమించినదిగా, అలౌకికమైనదిగా ఉన్నది. అందుకే దానిని మహాద్భుతము అనటం, సమంజసమే.

02:21 - దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా ।
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ।। 12 ।।

ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు.

సంజయుడు ఇప్పుడు ఆ విశ్వ రూపము యొక్క తేజస్సును వివరిస్తున్నాడు. ఆ కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రకాశము ఎంతటిదో అవగాహన ఇవ్వటానికి, దానిని వెయ్యి సూర్యులు ఒక్కసారే మధ్యాహ్న ఆకాశంలో వెలిగితే వచ్చే కాంతితో పోల్చుతున్నాడు. నిజానికి భగవంతుని తేజస్సు అనంతమైనది; దానిని సూర్యుని వెలుగు యొక్క ప్రమాణంతో కొలవటం, సాధ్యం కాదు. ఈ వెయ్యి సూర్యుల ఉపమానము అనేది, ఆ విశ్వ రూప తేజస్సుకు మరేదీ సాటిలేదన్న సంజయుని అభిప్రాయమును సూచిస్తున్నది.

03:12 - తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా ।
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా ।। 13 ।।

అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు, అర్జునుడు దర్శించాడు.

ఆ విశ్వ రూపములోని మహాద్భుతమైన ఆశ్చర్యములను వివరించిన పిదప, సంజయుడు ఈ జగత్తు అంతటినీ అది తన యందే కలిగి ఉన్నదని పేర్కొంటున్నాడు. ఇంకా ఆశ్చర్యముగా, అర్జునుడు జగత్తు యొక్క సమస్త అస్థిత్వమునూ, శ్రీ కృష్ణుడి శరీర భాగములోనే చూశాడు. అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి యొక్క నక్షత్ర మండలములూ, మరియు గ్రహ-సమూహాలనూ, ఆ పరమేశ్వరుని చిన్న అంశగా దర్శించాడు.

తన చిన్ననాటి లీలలలో, శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపమును తల్లి యశోదకు కూడా చూపించాడు. ఆ సర్వేశ్వరుడు తన దివ్య వైభవములను మరుగున దాచి, భక్తుల ఆనందం కోసం, ఒక చిన్నపిల్లవానిలా నటించాడు. శ్రీ కృష్ణుడు తన పుత్రుడే అనుకుంటూ, ఎన్ని సార్లు వద్దని చెప్పినా మన్ను తింటున్నాడని, ఒకసారి యశోదా మాత, బాలుడిని గట్టిగా మందలించింది. నోట్లో పరీక్షించటానికి, బాల కృష్ణుడిని నోరు తెరవమని అడిగింది. కానీ, ఆ తల్లికి సంభ్రమాశ్చర్యంగా, శ్రీ కృష్ణుడు నోరు తెరిచినప్పుడు, ఆయన తన యోగమాయా శక్తిచే, దానిలో విశ్వరూపమును చూపించాడు. యశోదమ్మ తన చిన్ని బాలకుని నోటిలో అనంతమైన బ్రహ్మాండములూ, అద్భుతములూ చూసి, పూర్తిగా భ్రమకు లోనయ్యింది. ఆ యొక్క మహాశ్చర్యాన్ని తట్టుకోలేక, ఆమె మూర్చిల్లబోయింది. శ్రీ కృష్ణుడు ఆ తల్లిని ముట్టుకుని, మరలా మామూలు మనిషిని చేశాడు. యశోదామాతకి చూపించిన అదే విశ్వ రూపమును, భగవంతుడు, తన మిత్రుడైన అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు.

05:00 - తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ।
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ।। 14 ।।

అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి, తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడిని ఈ విధంగా స్తుతించాడు.

ఇప్పుడిక ఈ శ్లోకంలో సంజయుడు, విశ్వరూపమును దర్శించిన అర్జునుడి ప్రతిస్పందనను తెలియజేస్తున్నాడు. ఆ యొక్క మహాద్భుతమును చూసిన అర్జునుడు, విస్మయమునకూ, మరియు గాఢమైన పూజ్యభావమునకూ లోనయ్యాడు. దానితో అతని హృదయములో భక్తి భావనలు పెల్లుబికి, ఆనందముతో ఉప్పొంగిపోయాడు. భక్తి భావముతో కలిగిన మహానందము, ఒక్కోసారి భౌతిక లక్షణములతో వ్యక్తమవుతూ ఉంటుంది. భక్తి శాస్త్రములు ఇటువంటి ఎనిమిది లక్షణాలను వివరిస్తాయి. వాటినే, "అష్ట సాత్విక భావములు" అంటారు. ఇవి ఒక్కోసారి, వారి హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు, భక్తులలో మనకు కనిపిస్తాయి.

అవి, స్థంభించి పోవటమూ, చెమటలు పట్టటమూ, గగుర్పాటూ, గొంతు బొంగురు పోవటమూ, వణుకూ, పేలగా మారటమూ, కన్నీరు కారటమూ, మూర్ఛ పోవటము. ఈ శారీరక లక్షణముల ద్వారా, ఒక్కోసారి హృదయములోని గాఢమైన ప్రేమ, కొన్నిసార్లు బయటకు వ్యక్తమవుతుంది. తన రోమములు నిక్క బోడుచుకున్నప్పుడు, అర్జునుడు అనుభూతి చెందినది ఇదే.

06:25 - ఇక మన తదుపరి వీడియోలో, పూజ్య భావముతో చేతులు జోడించి వంగి, అర్జునుడు చేసిన స్తుతి గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home