గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka


గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు!
శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం?

ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి, గోపాలుడిగా, వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అన్ని లోకాలలో కెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణమేంటి? అసలు మహాభారతంలో, గోవు విశిష్ఠత గురించి ఏం వివరించబడి ఉంది - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iT2XRwhIgLQ ]


పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె కొరకు పరితపించసాగాడు. అది చూసిన బ్రహ్మ, "మార్తోభవ" అంటే, నీ పరితాపము ఉపశమించుగాక, అని దీవించాడు. అతడికి మార్తాండుడని పేరు పెట్టి, సురభిని ఇచ్చి వివాహము జరిపించి, "మీ ఇరువురికీ పుట్టిన సంతానం, యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి" అని చెప్పాడు. అలా వారిరువురికీ, గోవులు సంతానంగా జన్మించాయి. సురభీ మార్తాండులకు, పదకొండు మంది సంతానం ఉద్భవించారు. వారే, బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు, అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత, గో సమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడూ.. మలద్వారము, మూత్రములో వాయుదేవుడూ.. మూపురంలో శివుడూ.. పాదాలలో దేవతలూ.. కడుపులో అగ్నిదేవుడూ.. పాల పొదుగులో సరస్వతీ.. పేడలో లక్ష్మీదేవీ.. పంచితంలో కీర్తీ.. రక్తంలో చంద్రుడూ కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవతా, పాలలో బ్రహ్మదేవుడూ, వెంట్రుకలలో అనుష్ఠానములూ, తోకలో యమధర్మరాజూ, కన్నులలో సూర్యుడూ, చర్మములో తపస్సూ, తేజమూ అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో, సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకూ ఆలవాలమైన గోవు మాహాత్మ్యమును, ఎన్ని విధాలుగా వర్ణించినా పరిపూర్ణము కాదు. వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది.

ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతోంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి, అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరచి, ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి, ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి, తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, "మహేశా! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా, అమృత సమానమే కదా! అది ఎంగిలి ఎలా ఔతుంది! గోవు పాలు అమృతమైతే, వాటి నురగ కూడా అమృతమే కదా! దీనికి ఆగ్రహిస్తే ఎలా! వాటిని కరుణించు" అని వేడుకుని, ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి, ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని, ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే, బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు, "బ్రహ్మదేవా! ఈ గోవులన్నీ నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి, ఇవి అతి శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి" అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు.

సాధారణంగా కపిల గోవులకు చెవులూ, ముక్కు, కళ్ళు, కొమ్ములూ, కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక, ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే, ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. ఆవులు దేవతలతో సమానంగా నేటికీ పూజింపబడుతూ ఉన్నాయి. గోలోకమునకు సంబంధించి, ఒక కథ ఉంది. త్రిశిఖరము, అనే కొండ ప్రాంతంలో, భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని, తపస్సు చేసుకునేవారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడనే బ్రాహ్మణుడు, గోశర్కర అనే తీగను, సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి, ఆ గోవులకు తామర తంపరగా, సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి, మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే, వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు అనే పేరు వచ్చింది. ఆ ఆవులకు కామరూప విద్యకూడా ఉంది. ఒక రోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీల రూపము ధరించి, సమీప కొలనులో జలకాలాడుతున్నాయి.

వాటిని చూసి  అక్కడే స్నానం చేస్తున్న కొన్ని గోవులు, "మీరు ఎవరు? మీకు ఈ మనుషుల రూపములు ఎలా వచ్చాయి? అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు, "మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకూ, పితృకార్యములకూ, అతిథి సత్కారములకూ, బ్రాహ్మణులకూ ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము. బ్రాహ్మణుల పొలములో పని చేయడానికి, మా పిల్లలను పంపుతాము. మేము చేసే మంచి పనుల వలన, మాకు గోలోక ప్రాప్తి కలిగింది." అని పలికాయి. మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తరుణోపాయము చూపమని, కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి. అప్పుడు ఆ గోవులు, "రంతిదేవుడు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మీరు అక్కడకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞములో బలి ఇస్తాడు. మీకు గోలోకప్రాప్తి కలుగుతుంది" అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి, సిద్ధం అయ్యాయి. కానీ, అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. "మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి?" అని అన్నది. వాటిలోని కొన్ని ఆవులు, "సుమిత్రుడు మనము వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. కనుక మనం అతడిని చంపుదాము. అప్పుడు అతడు కూడా గోలోకముకు వస్తాడు" అని అన్నాయి. కానీ, అవి సుమిత్రుడిని చంపలేక పోయాయి. అయితే, కాంతల రూపంలో ఉన్న కపిలగోవులు మాత్రం, "మేము సుమిత్రుడిని చంపుతాము. దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు?" అని అడిగాయి. అప్పుడు మిగిలిన ఆవులు కపిలగోవులతో, "ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో, ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి" అని వరం ఇచ్చాయి.

వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి "అయ్యా! ఇప్పటి వరకు మీరు గోపూజ చేశారు. మేము ఎంతో సంతోషించాము. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి" అని అడిగాయి. అందుకు సుమిత్రుడు, "నాకు ఇప్పటి వలె, ఎప్పటికీ ఆవుల యందు భక్తిశ్రద్ధలుండేలా అనుగ్రహించండి" అని కోరుకున్నాడు. ఆ ఆవులు "అలాగే అనుగ్రహిస్తాము. మేము గోలోకము వెడుతున్నాము. మీరు కూడా మాతో రండి" అని అన్నాయి. సుమిత్రుడు "నేను నా గోవులను విడిచి ఎక్కడకూ రాను" అని అన్నాడు. అప్పుడు మారు వేషములో ఉన్న గోవులు, అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి, క్రింద పడవేశాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం క్రింద పడింది. ఆత్మ మాత్రం, గోలోకం చేరింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి, అతడికి జరిగినది చెప్పి, నీకు మేలే జరిగింది కానీ, నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం, ముఖం నల్లగా మాడి పోతుంది" అని శాపం పెట్టాయి.

తరువాత సుమిత్రుడి ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళి, "అయ్యా మీరు మమ్ము యజ్ఞములో బలి ఇచ్చి, మాకు గోలోక ప్రాప్తిని కలుగజేయండి" అని వేడుకున్నాయి. అప్పుడు రంతిదేవుడు, "అది ఎలా చేయగలను.. అది పాపము కదా! ఆ పనిచేసి నేనెలా పాపము మూట కట్టుకుంటాను? నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి?" అని అన్నాడు. "అయ్యా, ఇది మా నిర్ణయం కాదు. దేవతల నిర్ణయం మీరు ఆచరించాలి. మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే, గోలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది." అని అన్నాయి. అందుకు రంతిదేవుడు, "అయితే, నాది ఒక నిబంధన. మీలో ఏ ఒక్క గోవైనా మోహ పరవశంతో బలికి అంగీకరించకపోయినా, నేను యజ్ఞం ఆపివేస్తాను" అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు, "గోవులను వరుసగా బలి ఇచ్చి, హోమం పూర్తిచేశాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో, "అయ్యో, ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు. నేను చచ్చిపోతే, నీ గతి ఏమిటి?" అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని, యజ్ఞమును ఆపివేశాడు.

అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకము వెళ్ళాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. అలా మిగిలిన గోవుల సంతంతి, భూలోకంలోనే ఉండిపోయింది. పవిత్రమైన హోమంలో బలిదానమై, గోలోకం చేరుకున్న గోవులకు, బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు. వాటి లోకమైన గోలోకాన్ని, అన్ని లోకముల కంటే పైన ఉండేలా వరం ఇచ్చాడు, బ్రహ్మ. మొట్ట మొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే, గోలోకం. ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు. దేవతలకూ, సిద్ధులకూ, సాధువులకూ గోవు తల్లి వంటిది. బ్రహ్మ పదమును కోరుకునేవాడు, గోవును మనసుతో కానీ, కర్మలతో కానీ, వాక్కుతో కానీ బాధించకూడదు. ఇది బ్రహ్మ వాక్కు. వేదము కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది. ఏ గోవును పూజించి, దేవతలు మానవుల కంటే గొప్ప వాళ్ళయ్యారో, అటువంటి గోవుల కంటే పవిత్రమైనది, ఈ లోకములో ఏముంది! యజ్ఞ యాగములలో గోవులకు ఉన్న పవిత్రత, మరి వేటికీ లేదు. ఉపనిషత్తులన్నీ గో స్వరూపాలే అని, బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞము వంటిది. మానవులు ఎక్కువగా, కపిల గోవులను పూజిస్తారు. వాటిని దానంగా ఇస్తారు. అలా చేయడం వలన, వారి పాపాలన్నీ తొలగి పోతాయి".

వీటి యొక్క విశిష్ఠత, మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో, సుస్పష్టంగా వివరించాడు, వ్యాస భగవానుడు.

వందే గోమాతరం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home