సకల వేదాంగ విదుడైన ‘బ్రాహ్మణుడికి సమానం’ ఎవరు? Who is equivalent to a brahmin?


సకల వేదాంగ విదుడైన ‘బ్రాహ్మణుడికి సమానం’ ఎవరు?
అశ్వినులకు దేవతా స్థానం కల్పించిన ‘చ్యవనుడి వృత్తాంతం’!

బ్రహ్మ మానస పుత్రుడూ, సప్తర్షులలో ఒకడైన భృగు మహర్షీ, కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన పులోమాదేవి సంతానం, చ్యవనుడు. దివ్య తేజో సంపన్నుడైన చ్యవనుడు, ఆయుర్వేద ప్రవీణుడు. మన ఇతిహాసాలలో సుస్థిర స్థానం దక్కించుకున్న గొప్ప మహర్షి. చ్యవనుడు వృద్ధాప్యంలో, నవ యవ్వనవతి అయిన రాకుమార్తెను ఎందుకు వివాహం చేసుకున్నాడు? దేవతా వైద్యులైన అశ్వినులకు సోమపాన అర్హత కలిగించి, వారిని ఎందుకు దేవతలుగా చేశాడు? అశ్వినీ దేవతలు, చ్యవనుడి భార్యకు పెట్టిన పరీక్షలో ఆమె నెగ్గిందా - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yCZKmQP1wxQ ]


చ్యవనుడు ఆయుర్వేద ప్రవీణుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప మహర్షి కూడా. అందుకు నిదర్శనం, ఆయన కఠోర తపస్సు. ఆయన చేసిన దీర్ఘకాల తపస్సు కారణంగా, ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు ఏర్పడి, అది పూర్తి తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య వన విహారానికి వచ్చిన సమయంలో, చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని చూసింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో, ఆ పుట్టను త్రవ్వించింది. దాంతో, కఠోర తపస్సులో ఉన్న చ్యవనుడు కోపించి, సుకన్యనూ, ఆమె పరివారాన్నీ బంధించాడు. ఈ విషయం తెలుసుకుని, శర్యాతి మహారాజు చ్యవనుని వద్దకు వచ్చి, తన కుమార్తె తెలియక చేసిన తప్పును క్షమించమని వేడుకున్నాడు. రాకుమారి సుకన్యను తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని, చ్యవనుడు బదులిచ్చాడు. అందుకు శర్యాతి మహారాజు అంగీకరించి, సుకన్యను చ్యవనునికిచ్చి వివాహం చేశాడు. సుకన్య చ్యవనుడి భార్యగా, పర్ణాశ్రమ ధర్మాలను తూ.చా తప్పకుండా నిర్వహించేది.

ఒకరోజు అశ్వినులు, చ్యవనుడి ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి, "అమ్మా! నీవెవరు?" అని అడిగగా, అందుకు సుకన్య, "అయ్యా! నేను శర్యాతి మహారాజు కుమార్తెను. చ్యవనుని భార్యను" అని సమాధానమిచ్చింది. దాంతో వారు ఆశ్చర్యపోయి, "నీ వంటి అందెగత్తెకు, చ్యవనుని లాంటి వృద్ధుడు భర్తా? ఇకనైనా తగిన వరుని కోరుకో. మేము వాడిని తీసుకు వస్తాము" అని సుకన్యతో చెప్పారు. అందుకు సుకన్య ఆగ్రహించి, "నాకు నా భర్త మీద ప్రేమ ఉంది. ఆయనతోనే నా జీవితం. నేను ఆయనను విడిచి, మరొకరిని కోరుకోలేను" అని బదులిచ్చింది. తరువాత ఆమె ఈ విషయాన్ని చ్యవనునికి చెప్పింది. అప్పుడు చ్యవనుడు సుకన్యతో, "వారు చెప్పినట్లు చేయవచ్చు కదా?" అని అన్నాడు. అందుకు సుకన్య "మీ భార్యనైన నన్ను వేరొక వరుని కోరుకోమనడం, ధర్మం కాదు. నా జీవనం మీతోనే" అని సమాధానమిచ్చింది. అది విన్న చ్యవనుడూ, అశ్వినీ దేవతలూ, సుకన్య పాతివ్రత్యానికి సంతోషించారు. నీకు యవ్వనవంతుడైన పతిని ప్రసాదిస్తాము.. అంటూ, చ్యవనుడితో సహా, అక్కడున్న కొలనులో ప్రవేశించారు. అయితే, ఆమెను పరీక్షించదలచి, కొలను నుండి ముగ్గురూ నవయవ్వనులుగా, ఒకే మాదిరి తేజస్సుతో బయటకు వచ్చి, మాలో నీకు ఎవరు కావాలో కోరుకో’మని, ఆమెకు చెప్పారు. సుకన్య వారిని చూసి ఆశ్చర్యపోయి, తన నిష్కళంక పతి భక్తితో తన భర్త చ్యవనుడిని గుర్తించి, ఆయనను వరించింది. దాంతో చ్యవనుడు, "మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా, శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో, దేవేంద్రుడు చూస్తుండగా, మీచే సోమరసం తాగిస్తాను." అంటూ అశ్వినులకు వరమిచ్చాడు. దాంతో వారు కూడా సంతోషంతో తిరిగి వెళ్ళారు.

తన అల్లుడు నవయవ్వనవంతుడయ్యాడని తెలుసుకున్న శర్యాతి మహారాజు, వారిని చూడటానికి వెళ్లాడు. అప్పుడు చ్యవనుడు శర్యాతితో, "రాజా! నేను మీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను" అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. అది చూసిన ఇంద్రుడు చ్యవనునితో, "వారు దేవ వైద్యులే కానీ దేవతలు కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు" అంటూ వ్యతిరేకించాడు. కానీ చ్యవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక, అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దాంతో ఇంద్రుడు ఆగ్రహించి, చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. అయితే, దధీచి మహర్షి ఎముకలతో చేయబడిన ఆ వ్రజాయుధాన్ని, చ్యవనుడు తన తపోశక్తితో నిలువరించాడు. ఎందుకంటే, దధీచి మహర్షి స్వయానా చ్యవనుడి పుత్రుడు. ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిన వెంటనే ఆగ్రహించిన చ్యవనుడు, ఆ హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు వెళ్ళడంతో, ఇంద్రుడు భీతిచెందాడు. దాంతో ఇంద్రుడు చ్యవనుడితో, "మహర్షీ! మీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను. నన్ను క్షమించండి. నేటి నుండి, అశ్వినులు సోమరసానికి అర్హులు" అంటూ అంగీకరించాడు. దాంతో శాంతించిన చ్యవనుడు, తను సృష్టించిన రాక్షసుడిని కాముకులైన స్త్రీలలోనూ, మద్యంలోనూ, పాచికలలోనూ, మృగములలోనూ ప్రవేశించమని, ఆదేశించాడు.

చ్యవనుడు కఠోర తపస్సు చేయడంలో నిష్ణాతుడు. ఒకనాడు చ్యవనుడు గంగా యమునా సంగమస్థానంలో, నీటిలో మునిగి సమాధి స్థితిలో ఉన్నాడు. అప్పుడతడిని చేపలు చుట్టుముట్టి, అతడిని తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శకు ఆనందిస్తూ, చ్యవనుడు 12 సంవత్సరాలు గడిపాడు. ఒక రోజు చేపలు పట్టే జాలరులు ఆ ప్రాంతంలో చేపల కొరకు వేసిన వలలో, చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుకున్నాడు. అతడిని చూసి భయపడిన జాలరులు, "మునీంద్రా, మీరు నీటిలో ఉన్న విషయము మాకు తెలియదు. కనుక మా తప్పు కాచి, మమ్ము రక్షించండి" అని వేడుకున్నారు. అందుకు చ్యవనుడు, "ఇందులో మీ తప్పు ఏమీ లేదు. నేను నీటి అడుగున ఈ చేపలతో సహజీవనము చేస్తున్నాను. కనుక వీటితో నేనూ మరణించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నన్ను కూడా వీటితో పాటు వెలకు అమ్మండి" అని అన్నాడు. ఆ మాటలకు జాలరులు మరింత భయపడి, ఆ దేశమునేలే రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి, జరిగినది వివరించారు. నహుషుడు పురోహితులతో వచ్చి, చ్యవనుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘మహానుభావా! ఈ జాలరులు చేసిన తప్పుకు తగిన పరిష్కారం తెలియచేయండి’ అని అడిగాడు. అందుకు చ్యవనుడు, "ఈ జాలరులు వారి వృత్తి ధర్మంగా చేపలు పడుతున్నారు. కనుక అది వారి తప్పు కాదు. వీరు చాలా కష్టించి, చేపలనూ, నన్నూ పట్టారు కనుక, వారి కష్టానికి తగిన ప్రతి ఫలము ఇచ్చి పంపండి" అని అన్నాడు.

నహుషుడు ముని కోపించనందుకు సంతోషించి, మంత్రులను పిలిచి, ఆ జాలరులకు వేయి మాడలు ఇచ్చి పంపమన్నాడు. ఆ మాటలకు చ్యవనుడు, ‘నా ఖరీదు వేయి మాడలా?’ అని అన్నాడు. అప్పుడు నహుషుడు, ‘అలాగైతే లక్ష మాడలు ఇవ్వండి’ అని అన్నాడు. ‘నా విలువ లక్షమాడలా’ అని అడిగాడు చ్యవనుడు. నహుషుడు కోటి మాడలు ఇచ్చి పంపండని అన్నాడు. చ్యవనుడు మళ్ళీ నా ఖరీదు కోటిమాడలా? అని అడిగాడు. ఇక నహుషుడు పంతానికి పోయి, తన అర్ధరాజ్యం ఇస్తానని అన్నాడు. దానికి చ్యవనుడు, "అలా కాదులే మహారాజా! మరొక మాట చెప్పు" అని అన్నాడు. దాంతో నహుషుడు, తన పూర్తి రాజ్యమును ఇస్తానన్నాడు. దానికి కూడా చ్యవనుడు అంగీకరించక, "మహారాజా! మంత్రులతో ఆలోచించి, తగిన వెల నిర్ణయించు" అని అన్నాడు. దాంతో నహుషుడు విసుగు చెంది మంత్రులతో, ‘ఉన్న రాజ్యం అంతా ఇస్తానన్నాను కదా! ఇంతకంటే నావద్ద ఇవ్వడానికి ఏముంది?" అని దుఃఖించాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన అవిజాతుడనే ముని జరుగుతున్న విషయము విని, "మహారాజా! చింతించకండి. ఇప్పుడే మునికి తగిన వెల నిర్ణయిస్తాను" అని అన్నాడు. "మునీంద్రా! అదేదో చెప్పి పుణ్యం కట్టుకుని, నన్ను రక్షించండి" అని మునిని వేడుకున్నాడు. అప్పుడు అవిజాతుడు, "మహారాజా! బ్రహ్మదేవుడు రెండు జాతులుగా పుట్టించినా, గోవు, బ్రాహ్మణుడు, ఒక జాతికి చెందిన వారే. గోవు క్షీరము వలన, పాలు, పెరుగు, నెయ్యి వంటి యాగసంభారాలు సమకూరుతాయి. ఆ యాగము చేయదగిన వాడు, బ్రాహ్మణుడు. కనుక వీరిరువురూ సమానులే. సకల వేదాంగ విదుడైన బ్రాహ్మణుడికి విలువ నిర్ణయించడం, ఈశ్వరుడికి కూడా శక్యము కాదు. సకలదేవతా స్వరూపమైన గోవు కూడా అంతేగనుక, బ్రాహ్మణుడికి సమానంగా గోవును దానంగా ఇచ్చి, చ్యవనుడిని విడిపించండి" అని సలహా ఇచ్చాడు.

ఆ మాటలకు సంతోషించిన నహుషుడు చ్యవనుడితో, "మహానుభావా! నన్ను కరుణించండి. మీకు వెల నిర్ణయించగల శక్తి నాకు ఉన్నదా! కనుక తమకు బదులుగా గోవును దానమిస్తాను" అని అన్నాడు. చ్యవనుడు నవ్వి, "నీ నిర్ణయానికి సంతోషించాను. నహుష మహారాజా! గోవు అంటే అగ్ని, గోవు అంటే అమృతము.. యజ్ఞములో గోవు, అత్యంత పవిత్రమైన స్థానాన్ని అలంకరిస్తుంది. స్వర్గలోక సమానము, దేవతలకు కూడా పూజనీయము. కనుక, నాకు బదులుగా గోవును ఇవ్వండి" అని అన్నాడు. వెంటనే నహుషుడు గోవును తెప్పించి, జాలరులకు ఇచ్చాడు. జాలరులు గోవును చ్యవనుడికి సమర్పించారు. చ్యవనుడు ఆ జాలరులకూ, చేపలకూ, స్వర్గ ప్రాప్తిని పొందేలా, వరం ప్రసాదించాడు. ఆ తరువాత చ్యవనుడు నహుషుడికి, సతతమూ ధర్మపరత్వమూ, ఇంద్రుడితో సరి సమానమైన సంపదలనూ ప్రసాదించాడు. అలా చ్యవనుడు ఎన్నో సంఘటనలలో, తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

అయితే, చ్యవనుడు గోవు విషయంలో చెప్పిన మాట పూర్తిగా యధార్థం. మరి గోవులకు అంత ప్రాశస్త్యం ఎలా వచ్చింది? వాటి అవిర్భావం ఎలా జరిగింది? గోవులలో కపిల గోవు ఎందుకు మరింత ప్రత్యేకతను కలిగి ఉంది - అనేటటువంటి విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము.

ధర్మో రక్షతి రక్షితః

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home