శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు? Why Did Lord Rama Kill Shambuka?
శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు?
డా. బి.ఆర్. అంబేద్కర్ ‘శంభూక వధ’ గురించి ఏమని వివరించారు?
లోకాభిరాముడిగా, అవతార పురుషుడైన శ్రీ రామచంద్రమూర్తి, మచ్చలేని చందమామగా, మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాడు. అయితే, ఆ అయోధ్య రాముడి జీవితంలో తీసుకున్న రెండు నిర్ణయాలను, కొంతమంది వ్యతిరేకిస్తారు. అటువంటి వాటిలో ఒకటి, గర్భవతియైన సీతామాతను అడవులలో వదిలివేయడం, రెండవది, తపస్సు చేసుకుంటున్న శూద్రుడైన శంభూకుడిని వధించడం. అయితే, మనం ఈ రోజు శంభూకుడిని రాముడు ఎందుకు వధించాడు? అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా, తపస్వి అయిన శంభూకుడిని సంహరించాల్సి వచ్చిందా? శంభూక వధ గురించి, ఉత్తరకాండ లో, 74, 75, 76 వ సర్గలలో ఏం ఉంది - అనే విషయాలతో పాటు, శంభూక వధ, త్రేతా యుగంలోని యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైంది? ఈ కలియుగంలోని యుగధర్మము గురించి కూడా, అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తంగా పరిశీలిద్దాము. వీడియొను పూర్తిగా చూడకుండా, తొందపడి కామెంట్ చేయవద్దని ప్రార్ధిస్తున్నాను.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jrfF6ofOlfY ]
ఆనాటి యుగ ధర్మం ప్రకారం, ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే, ఆ రాజ్యంలో అకాల మరణాలు ఉండవు. ఒకవేళ సంభవిస్తే, ఆ రాజ్యంలో ఎక్కడో అధర్మం జరిగిందని అర్ధం. శ్రీ రాముడు తన రాజ్యాన్ని ధర్మ యుక్తంగా పరిపాలిస్తున్న సమయంలో, ఒక వృద్ధ బ్రాహ్మణుడు దుఃఖిస్తూ, అకాల మృత్యువుకు లోనైన తన కుమారుడి కళేబరం తీసుకు వచ్చి, రామునికి చూపించాడు. ‘ఓ శ్రీరామ.. నేనే పాపం చేశానో, నా కుమారుడు ఇలా అకాల మృత్యువుకు లోనైనాడు. నా పాపంతో పాటు, ఈ రాజ్యానికి రాజువైన, నీ దోషము కూడా కారణము కావచ్చును. ఎందుకంటే, ఇతర రాజ్యాలలో ఎటువంటి అకాల మరణాలూ లేవు. నీ ఈ రాజ్యంలో, నీ దృష్టికి రాకుండా ఎక్కడో అధర్మం జరిగి ఉండవచ్చు. కాబట్టి, నీవు ఆ అధర్మాన్ని నిర్మూలిస్తే, ఇది కేవలం అకాల మృత్యువు కనుక, నా పుత్రుడు తిరిగి బ్రతుకుతాడు. నీవు ఈ పని చేయకపోతే, నేనూ నా భార్య, ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాము’ అని ఆ వృద్ధుడు, శ్రీ రాముని ఎదుట విలపించాడు.
ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన నారద మహర్షి, ఆ బాలుడి అకాల మృత్యువునకు కారణం ఏమిటో వివరించాడు.. “కృత యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సులను ఆచరించడానికి యోగ్యులు. వారికి మాత్రమే ఉపదేశముండును. ఇతర మూడు వర్ణముల వారికీ, ఆ అర్హత ఉండదు. త్రేతాయుగములో బ్రాహ్మణులతో పాటు, క్షత్రియులు కూడా తపశ్చర్యలకు యోగ్యులే అవడంతో, వారి ఇరు వర్ణముల వారూ, సమానులుగా ఉంటారు. ఈ యుగములో, ఇతర వర్ణముల వారికి తపస్సు చేయుటకు అనుమతీ, ఉపదేశం ఉండదు. ద్వాపర యుగములో, బ్రాహ్మణ, క్షత్రియులతో పాటు, వైశ్యులు కూడా తాపసులు కావచ్చును.. ఉత్తరకాండ, 74వ సర్గ, 27వ శ్లోకము నందు, ఈ విధంగా వివరించబడి ఉంది.
భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే |
అధర్మః పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మనః ||
అనగా, ద్వాపర యుగము, అంతకు ముందు యుగములలో, యుగధర్మాలను అనుసరించి, శూద్ర వర్ణం వారికి తపస్సు చేయుటకు అనుమతి లేకున్నది. కానీ, కలియుగములో, శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి, అందరూ సమానులుగా ఉందురు. కాబట్టి, యుగ ధర్మమును ఆచరించి, నీ రాజ్యమంతటా సంచరించి, ఎవరైనా అధర్మమును ఆచరిస్తూ ఉంటే, వారిని ఒక రాజుగా సంహరించి, ధర్మమును నిలబెట్టుము. తద్వారా, అకాల మృత్యువు బారిన పడిన బాలుడు, పునర్జీవితుడు కాగలడు.” అని నారద మహర్షి పలికాడు.
అది విన్న రాముడు, తన రాజ్యమంతటా తిరుగుతూ, శంభూకుని వద్దకు చేరుకున్నాడు. అక్కడ శంభూకుడు అధోముఖుడై, తన కాళ్ళను త్రాడుతో చెట్టుకు కట్టుకుని, తల్లక్రిందులుగా వ్రేలాడుతూ, క్రింద అగ్నిని జ్వలింపచేసి, కఠోర తపస్సునాచరిస్తుండగా, రాముడు చూశాడు. శంభూకుడితో రాముడు, “ఓ వ్రత నిష్ఠాగరిష్ఠుడా. నీవు ఎంత ధన్యుడవు! తపోవృద్ధుడా, నీ జన్మ ఎట్టిది? నీ శక్తి సామర్ధ్యములు దృఢమైనవి. కావున, కుతూహలముతో ఈ విధంగా అడుగుతున్నాను. నేను దశరధ కుమారుడైన శ్రీ రాముడిని. నీవు ఈ ఘోర తపస్సు ఏం ఆశించి, ఎందుకు చేస్తున్నావు? నీకు కావలసిన వరమేమిటి? స్వర్గ భోగములు కావలెనా, లేక వాటికి మించినవా తెలుపుము” అని అడిగాడు. దానికి శంభూకుడు, “శ్రీరామా.. నేను శూద్రుడను. నా పేరు శంభూకుడు. ఈ శరీరముతోనే, దివ్యత్వమును పొందగోరుచున్నాను. నేను దేవలోకమును జయింపదలచి, ఇట్టి ఉగ్రతపస్సుకు పూనుకున్నాను. నా పలుకులు నిజము” అని తెలుపగా, అది విన్న శ్రీరాముడు, అధర్మమమని తలచి, అతడి తలను ఖండించి, వధించాడు. ఆ క్షణమునే, అకాల మృత్యువు బారిన పడిన బ్రాహ్మణుడి కుమారుడు, తిరిగి జీవితుడయ్యాడు. అయితే, ఇక్కడ మనం శంభూకుడి వధలో, కొన్ని ముఖ్య విషయాలను గ్రహించవలసి ఉంది.
శంభూక వధ అన్యాయంగా జరిగింది, అతడు శూద్రుడు కాబట్టి, రాముడు చంపాడు.. అని కొంతమంది హేతువాదులు వాదిస్తుంటారు. రాముడు చేసింది ఆ యుగంలోని ధర్మము. ఆ యుగములో, వారు అటువంటి ఉగ్రతపస్సు చేయడం వలన, ధర్మానికి హాని కలుగుతుంది. ఇక్కడ శూద్రుడైన శంభూకుడు, ఆ యుగ ధర్మానికి విరుద్ధముగా తపస్సు చేయడం వలన వధ జరిగినది కానీ, కేవలం శూద్రుడు కావడం చేత కాదు. రామ రాజ్యంలో, ధర్మబద్ధంగా ఉన్న శూద్ర వర్ణం వారందరూ, ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారనేందుకు, రామాయణములో అనేక శ్లోకాలు ఉన్నాయి. శ్రీ రాముడు శంభూకుడుని వధించినది, కేవలం ఒక వర్ణం వారి కోసమే కాదు, లేక ఒక వర్ణం పైన కోపంతోనూ కాదు. తన రాజ్యంలో అన్నీ వర్ణాల వారూ, అకాల మృత్యువు బారిన పడకుండా చూసేందుకే, ఆ పని చేయవలసి వచ్చింది.
ఏ జీవీ, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం వీలు కాదు. అది ప్రకృతి నియమం. ఈ జన్మలో చేసిన తపస్సూ, యజ్ఞం, లేక ఏ ఇతర సత్కార్యం వల్లనైనా వచ్చిన పుణ్యంతో, మరణానంతరం మాత్రమే, స్వర్గానికి వెళ్లగలరు. ఈ ప్రకృతి నియతిని భంగం చేస్తూ, శంభూకుడు తపస్సు చేయడం, లోక వ్యవస్థకు హానికరం. అందుకే, అకాల మరణం వంటి ఉత్పాతాలు ఏర్పడ్డాయి. అయితే, అంత కఠోర తపస్సు చేసిన శంభూకుడు, రాముని చేతిలో హతమారి, స్వర్గస్థుడయ్యాడు. ఆ విధంగా చూసుకున్నా కూడా, శ్రీ రామ చంద్ర మూర్తి చేతిలో మరణం, శంభూకుడికి స్వర్గ ప్రాప్తిని చేకూర్చింది. అయితే, కొంతమంది వాదనల ప్రకారం, శూద్రుడు తపస్సు చేయడం వలన, రాముడు సంహరించాడని చెప్పుకోవచ్చు. కానీ, అంతకు పూర్వం బ్రాహ్మణుడైన రావణాసురుడిని, అతని దుర్గుణాల చేత సంహరించాడనే విషయం, మేధావుల మదిలో తోచకపోవడం, శోచనీయం. కాబట్టి, శంభూక వధ, శూద్రుడిని వధించడంగా కాకుండా, అధర్మపరుడిని వధించడం అనీ, అధర్మ పరులైతే, ఒకసారి బ్రాహ్మణుడు, ఒకసారి శూద్రుడు, మరో సందర్భంలో క్షత్రియులనూ వధించడం జరిగిందని తెలుసుకోవాలి. దాని వలన, పదకొండు వేల సంవత్సరాల రామరాజ్యంలో, అన్ని వర్ణాల వారూ ఆనందముగా, సుఖ సంతోషాలతో జీవించారనేది, ప్రామాణికమైన సత్యం.
అయితే, ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యుగ యుగానికీ, మనుష్యుల శక్తి క్షీణిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్ని యుగములలో, అన్ని వర్ణాల వారూ, తమ తమ స్వకర్మలను ఆచరించే వారు. వారిలో హెచ్చుతగ్గులు లేవు. కృత యుగములో మనుష్యులకు ఎక్కువ శక్తి ఉండడం చేత, బ్రాహ్మణుల తపస్సు, మొత్తం సమాజానికి సరిపోయింది. త్రేతా యుగములో మనుష్యుల శక్తి కొంత క్షీణించి, క్షత్రియులు కూడా తపశ్చర్య చేయవలసి వచ్చినది. ద్వాపరయుగములో, ఇంకొంత శక్తి క్షీణిస్తుంది కాబట్టి, వైశ్యులు కూడా తపశ్చర్య చేయవలసి వచ్చినది. కలియుగము వచ్చేసరికి, మనుష్యుల శక్తి మరింత క్షీణించడం చేత, అందరూ ధర్మము ద్వారా లోకములను కాపాడటం కొరకు, తమకు చేతనైన తపశ్చర్య చేయవలసి ఉన్నది. దీని అర్ధము, ఆ ముందు యుగాలలో మిగతా వారికి, ఆ అర్హత లేదని కాదు. అవసరము లేదని. ఆ మాటకొస్తే, కృతయుగంలో అందరూ బ్రాహ్మణులే అని, శాస్త్రాలు చెపుతున్నాయి. ఆనాటి వ్యవస్థ, వివిధ కర్మలు, పనులను బట్టి నడిచే వ్యవస్థలేకానీ, అనేక ఉద్యోగములు ఉండే వ్యవస్థ కాదు. అలాంటప్పుడు, వివిధ పనులకు ఆయా వర్ణములలోని వారు మాత్రమే, ఆయా పనులూ, లేదా కర్మలు చేయడమనే నియమం లేకపోతే, ఆనాటి వ్యవస్థలలో జన జీవనము, అచిర కాలములలోనే స్తంభించి పోయి ఉండేది.
కాబట్టి, ఆ విద్యుక్త ధర్మాన్ని బట్టి, ఆచరణ నిర్ణయింపబడి ఉంది. దానిపైనే సృష్టీ, మానవ మనుగడా ఆధారపడి ఉన్నది. అదే లేకుంటే, ఈ నాడు వాటి గురించి మాట్లాడుకోవడానికీ, చదవడానికి కూడా, మనం ఈ విధంగా నాగరికత కలిగి ఉండే వాళ్ళం కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన సనాతన ధర్మం, సంస్కృతీ మనది. ఈ మధ్య కాలంలో, అనేక మంది దళితులను, అగ్ర వర్ణాల వారు అణగద్రొక్కుతున్నారు, వారిని హీనంగా చూస్తున్నారు, వారికి సమాజంలో తగిన స్థానం ఇవ్వడం లేదనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. ఆ విష పూరిత మాటలనే ఆయుధంగా చేసుకుని, కొంతమంది మత మార్పిడులకు తెరతీస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి వారు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఆచరిస్తున్న రాజ్యాంగాన్ని రాసిన డా. బి.ఆర్ అంబెద్కర్, రాముడి భక్తుడు. ఆయన రాసిన రాజ్యంగ పుస్తకంలోని మొదటి పేజిలో, సీతారాముల ఫోటోను కూడా మనం చూడవచ్చు. అయితే, ఈ శంభూక వధ అంశంపై, అంబెద్కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. Dr. Ambedkars Speeches and Writings, అనే పుస్తకం, Vol-1, page 61లో ఈ విధంగా ఉంది.
‘శిక్షాస్మృతి లేకుండా, చాతుర్వర్ణ్య ఆదర్శం సాకారం కాదని, రామాయణంలోని శంభూకుడిని చంపిన కథ ద్వారా నిరూపించబడింది. కొంతమంది రాముడిని నిందించినట్లనిపిస్తుంది. ఎందుకంటే, కారణం లేకుండా శంభూకుడిని చంపాడని. కానీ, శంభూకుడిని చంపినందుకు, రాముడిని నిందించడమంటే, పరిస్థితిని మొత్తం తప్పుగా అర్థం చేసుకోవడమే. రామ రాజ్యమనేది, చాతుర్వర్ణ్యం మీద ఆధారపడిన రాజ్యం. రాజుగా, రాముడు చాతుర్వర్ణాన్ని నిర్వహించడానికే కట్టుబడి ఉన్నాడు. తన వర్గాన్ని అతిక్రమించి, బ్రాహ్మణుడిగా ఉండాలనుకునే శూద్రుడైన శంభూకుడిని చంపడం, ఆయన కర్తవ్యం. రాముడు శంభూకుడిని చంపడానికి కారణం ఇదే.’
ఆ యుగంలో, రాముడు ఒక రాజుగా చేసినది సరైనదని, అంబెద్కర్ కూడా తన మనోభావాన్ని వెల్లడించారు.
శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష!
Link: https://www.youtube.com/post/UgkxHis0fiJ8OdspI41jZOwUXfDruobjvmJI
Comments
Post a Comment