నవ 'బ్రహ్మల' ఆలయాలు - Alampur Navabrahma Temples
భగవంతుడు ఈ సృష్టిని రూపొందించిన క్రమంలో, రూపొందించిన తర్వాతా జరిగిన పరిణామాల గురించి, మన పురాణాలూ ఇతిహాసాలూ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. అటువంటి వాటిలో అతి ముఖ్యమైనవి, ఆది దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించిన సంఘటనలని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సృష్టిని నిర్మిండానికీ, దానిని నడిపించాడానికీ మూలం, ఆ త్రిమూర్తులే అనీ, అందుకే వారు ఆది దేవుళ్లుగా కీర్తింపబడుతున్నారనీ, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఆ ముగ్గురిలో శివ కేశవులకు మన భూమిపై ఎన్నో ఆలయాలు ఉండగా, బ్రహ్మకు మాత్రం విగ్రహ పూజ, ఆలయాలూ ఉండవు. అందుకు కారణం, ఒకనాడు బ్రహ్మ దేవుడు చేసిన ఒక తప్పిదం వల్ల, శివుడు ఇచ్చిన శాపం అని మనలో చాలా మందికి తెలుసు.
కానీ, మన తెలుగు రాష్ట్రంలో మాత్రం, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా బ్రహ్మ దేవుడి పేరుమీద, తొమ్మిది ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు, ఏ శివుడైతే బ్రహ్మకు విగ్రహారాధన ఉండకూడదని శాపమిచ్చాడో, అదే శివుడు, బ్రహ్మ పేరు మీద తొమ్మిది ఆలయాలు వెలియడానికి కారణమయ్యాడని, మన పురాణ ఇతిహాసాలూ, శాస్త్రాలూ చెబుతున్నాయి. ఈ మాటలు వినగానే, మన తెలుగు రాష్ట్రంలో ఆ నవ బ్రహ్మల ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఏకంగా ఒకే చోట, తొమ్మిది బ్రహ్మ ఆలయాలు ఎందుకు వెలిసాయి? ఆ ఆలయాల వెనకున్న అసలు చరిత్ర ఏమిటి? వాటిని ఏ పేర్లతో పిలుస్తున్నారు? ఇప్పుడు ఆ ఆలయాలు ఎలా ఉన్నాయి - వంటి ఎన్నో ప్రశ్నలు, మనలో చాలా మందికి కలుగుతాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి.
బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలూ, వాటికి నిత్యం ఆగమ సంప్రదాయ రీతిలో పూజలూ.. వంటి మాటలు వినడానికి చాలా వింతగా ఉన్నా, ఇది పచ్చి నిజం. ఈ పుణ్య క్షేత్రం, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఉన్న అలంపూరంలో ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా, అలంపూరం జోగులాంబా దేవిని, యుగ యుగాలుగా పూజిస్తున్న విషయం మనకు తెలిసిందే. అదే పుణ్య క్షేత్రంలో, ఎంతో శక్తి వంతమైన ఈ నవ బ్రహ్మ క్షేత్రాలు కూడా ఉండటంతో, మన పురాణ ఇతిహాసాలలో, అలంపూరానికి ఎంతో విశిష్టమైన స్థానం ఏర్పడింది.
అయితే, ఇక్కడున్న మరో వింత ఏమిటంటే, అలంపూరంలో ఉన్న నవ బ్రహ్మల ఆలయాలలో, బ్రహ్మ దేవుడి విగ్రహాలు ఉండవు. అందుకు బదులుగా, ఆ ఆలయాలలో బ్రహ్మ దేవుడి పేరు మీద, శివుడే కొలువై ఉన్నాడు. బ్రహ్మ దేవుడి పేరుమీద శివుడే స్వయంభువుగా వెలియడం, అది కూడా శక్తి పీఠమైన జోగులాంబ క్షేత్రం దగ్గరే ఈ నవ బ్రహ్మ ఆలయాలు కూడా ఉండటంతో, అలంపురానికి ఎంతో విశిష్టత చేకురుందని, ఆద్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కారణాల వల్లనే, అలంపురాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారనీ, తమ జీవిత కాలంలో కాశీకి వెళ్లలేని వారు, కనీసం అలంపురానికైనా వెళ్తే, కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందనీ, స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది.
ఈ క్షేత్రంలో శివుడు, బ్రహ్మ దేవుడి పేరు మీద వెలియడం వెనుక ఒక గాధ ఉందని, స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం దక్షిణ అలంపురం క్షేత్రానికి సమీపంలో, బ్రహ్మత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై, బ్రహ్మదేవునికి తొమ్మిది రూపాలలో దర్శనభాగ్యం కలిగించి, బ్రహ్మ దేవుడికి బ్రహ్మ తత్వం గురించి వివరించి చెప్పాడు. దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు, తనకు బ్రహ్మ తత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే, ఆ తొమ్మిది రూపాలలో, శివుడిని తన పేరుమీద నవ బ్రహ్మేశ్వర స్వామిగా వెలియమని కోరగా, అందుకు ఒప్పుకున్న శివుడు, నవ బ్రహ్మలుగా, తొమ్మిది రూపాలలో వెలియడం జరిగింది. అందుకే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శిస్తే, మనకున్న ఈతిబాధలు తొలగిపోయి, ఎంతో ప్రశాంతత వస్తుందని, శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాదు, బ్రహ్మ దేవుడి కోరిక మేరకు, అలంపురం జోగులాంబా మాత ఆలయానికి దగ్గర్లోనే శివయ్య వెలసినా, చాలా ఏళ్ల వరకూ వాటిని ఎవరూ గుర్తించక, ఆలయ నిర్మాణం జరగలేదు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత, సిద్ధుడనే మహా తపస్వి, అక్కడ నవ బ్రహ్మలకు ఆలయాలు నిర్మించినట్లు, స్థల పురాణం చెబుతోంది. దాని ప్రకారం, పూర్వం కాశీ క్షేత్రంలో ఒక మహిళ, చిన్న వయసులోనే వితంతువుగా మారింది. అయితే, ఆమెకు సంతానం కావాలన్న కోరికతో శివుడు గురించి తపస్సు చేయగా, శివుడు ప్రసన్నమై, ఆమె కోరిక మేరకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు. ఆ బిడ్డడే, సిద్ధుడనే నామధేయంతో ఎదిగాడు. అయితే, అతడు పెద్దవాడయ్యే క్రమంలో, తండ్రి గురించి తెలుసుకోవాలనీ, తండ్రి లేకుండా ఎలా జన్మించావని తోటి పిల్లలు హేళన చేయడంతో, తన తల్లిని గట్టిగా అడగగా ఆమె, అతడి తండ్రి శివుడేననీ, ఆ విశ్వేశ్వరుడి వరప్రభావంతోనే అతడు పుట్టాడనీ చెప్పింది.
అది విన్న సిద్ధుడు, ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. సిద్ధుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, అతడు కారణ జన్ముడనీ, దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు తొమ్మిది రూపాలలో వెలసిన తనకు, బ్రహ్మ పేరుతో తొమ్మిది ఆలయాలు నిర్మించే పుణ్య కార్యం చేయమని చెప్పి, చెట్లమూలికల రసంతో బంగారం చేసే వరం ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడనే పేరు తెచ్చుకుని, తన శిష్యులతో కాశీ క్షేత్రం నుండి దక్షిణ కాశీ అయిన అలంపురానికి వచ్చి, ఆలయాల నిర్మాణం చేశాడు.
ఇది జరిగిన కొన్ని వేల ఏళ్ల తర్వాత, సిద్ధుడు కట్టించిన ఆ ఆలయాలు శిధిలావస్థకు చేరుకోగా, దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు, నవ బ్రహ్మల ఆలయాలను ఇంకా పెద్దగా, ఎంతో వైభవంగా నిర్మించారు. ఇప్పటికీ ఆ పురాతన నిర్మాణాలు, ఎంతటి వారినైనా మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఆ తమ్మిది ఆలయాల వివరాలూ ఇప్పుడు తెలుసుకుందాము..
తుంగభద్రా నది యొక్క ఎడమ ఒడ్డున, 'నవబ్రహ్మల ఆలయాలు' ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.
వాటిలో మొదటిది, తారక బ్రహ్మ ఆలయం -
ఈ ఆలయం, పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహమూ లేదు!..
రెండవది, స్వర్గ బ్రహ్మ ఆలయం -
అక్కడ ఉన్న దేవలయాలన్నీటిలో, ఇది మిక్కిలి సుందరమైనదిగా చెప్పబడుతుంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునకగా, చరిత్రకారులు చెబుతారు.
మూడవది, పద్మ బ్రహ్మ ఆలయం -
ఇది కూడా పాక్షికంగా శిథిలమైవుంది. ఇందులో శివయ్య ఎంతో అద్భుతమైన స్పటిక శివలింగంగా కొలువై ఉన్నాడు.
నాలుగవది, విశ్వ బ్రహ్మ ఆలయం -
ఈ ఆలయాన్ని చూడటానికి, రెండు కళ్ళూ చాలవని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ, రామాయణ, మహాభారత దృశ్యాలను, శిల్పాలపై మహాకావ్యాలుగా, అత్యంత అద్భుతంగా చెక్కారు.
ఐదవది, బాల బ్రహ్మేశ్వరాలయం -
అలంపురంలోని నవబ్రహ్మల ఆలయాలలోకెల్లా, బాల బ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది, పెద్దది. ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గుడిలో సప్తరుషుల విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం, వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది. ఈ బిలంలో, మరోక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా, చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతి పై నగ్నంగా రెండు మోకాళ్లనూ దవడలకు తగులునట్లుగా పెట్టుకుని కుర్చున్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడవచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు.
ఆరవది, గరుడ బ్రహ్మ ఆలయం -
ఈ ఆలయ గోపురములు శిథిలమై పోయాయి. అయినా, ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి.
ఏడవ ఆలయం, అర్క బ్రహ్మ ఆలయం -
ఈ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం లాగానే నిర్మించబడింది.
ఎనిమిదవ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం -
ఇక్కడ ముఖమంటపం, ప్రవేశమంటపం, దాని వెనుక గర్భాలయాలు ఉన్నాయి. అక్కడి స్తంభాలపై ఉన్న విగ్రహాలు, అచ్చం అజంతా ఎల్లోరా శిల్పాలలా ఉంటాయి.
ఇక ఆఖరిదీ, తొమ్మిదవదీ, వర బ్రహ్మ ఆలయం -
ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ వేదికకు నాలుగు వైపులా రాతిస్తంభాలున్నాయి. ఈ ఆయాలంలో శివయ్యతో పాటు, తాండవ నృత్యం చేసే శివుని విగ్రహం, ప్రణయగోష్ఠిలో ఉన్న గంధర్వ దంపతుల బొమ్మలూ చూడవలసినవి.
ఓం నమః శివాయ!
Comments
Post a Comment