భూత కోలా అంటే ఏమిటి? Bhoota Kola or Buta Kola of Kantara
భూత కోలా అంటే ఏమిటి? అందులో ఎటువంటి శక్తులను పూజిస్తారో తెలుసా?
ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగిపోతున్న పేరు 'భూత కోలా'. మొన్నీ మధ్య రిలీజ్ అయిన 'కాంతార' అనే కన్నడ సినిమాలో ఈ భూత కోలా గురించి ఎంతో విశేషంగా చెప్పారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో, ఇప్పుడు దేశమంతా 'భూత కోలా' అంటే ఏమిటి? 'పంజర్లీ' అంటే ఏమిటి? 'గుళిగ' అనే దేవత ఎవరు? భూతం అంటే అదో దుష్ట శక్తి కదా, అటువంటి దుష్ట శక్తిని కొలవడం ఏమిటి? ఈ వింత సంస్కృతి గురించి ఇన్నాళ్ళూ మనకు ఎందుకు తెలియలేదు? ఈ సంస్కృతిని ఎవరు? ఎక్కడ ఎక్కువగా పాటిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ సంస్కృతి మనుగడలో ఉంది? వంటి ప్రశ్నలపై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందువల్ల, ఈ భూత కోలా గురించి వివరంగా తెలుసుకోవాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి.
ఈ ప్రపంచంలో మరెక్కడా చూడని ఎన్నో ఆచార వ్యవహారాలకు ఆలవాలం, మన భారత దేశం. ఎందుకంటే, ఈ భూమిపై మొట్ట మొదటిసారి నాగరికత సాధించిన ఏకైక దేశం మన దేశమే అవ్వడంతో, ఈ అఖండ భారతావనిలో ఎక్కడికి వెళ్ళినా, కొన్ని యుగాల నాటి ఆచార వ్యవహారాలూ, నాటి తాలుకు గుర్తులూ, ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటే, ఈ భూత కోలా. సాధారణంగా మనలో చాలా మందికి, 'భూత' మరియూ 'భూతం'కీ మధ్య వ్యత్యాసం ఏంటి? అనే సందేహం ఉంటుంది. సంస్కృతంలోనూ, మన పురాతన భాషలలోనూ, భూత అంటే కాలం అనీ, ప్రకృతి శక్తులనీ అర్ధాలు వస్తాయి. ముఖ్యంగా మనుషులతో పాటు, సకల జీవరశూలనూ రక్షించే ప్రకృతి శక్తులను, భూత గణాలని అంటూ ఉంటారు. దాని వల్ల, భూత ప్రకృతి అయితే, భూతం దాని వికృతి పదం అని, భాషా వేత్తలు చెబుతున్నారు. ఆ పరంగా, భూత గణాలు జీవరాశిని రక్షించే శక్తులైతే, భూతం అనేది, దుష్ట శక్తికి ఉండే పేరుగా మారినట్లు, నిపుణులు చెబుతున్నమాట.
ఇప్పుడు కన్నడ సినిమా 'కాంతారా'లో చూపించిన భూత కోలా, ప్రకృతి శక్తుల ఆరాధనగా పెద్దలు చెబుతున్నారు. భూత అంటే ప్రకృతి శక్తి.. కోలా అంటే తుళు భాషలో, నృత్యం అనే అర్ధం వస్తుంది. ఈ భూత కోలా అనే నృత్యాన్ని, నేటికీ దక్షిణ కన్నడ కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా చూడవచ్చు. మరీ ముఖ్యంగా, తుళు ప్రజలు ఎక్కువగా ఉండే మంగుళూరు, ఉడిపి, కుందాపుర వంటి కన్నడ కోస్తా ప్రాంతాలూ, కేరళలోని మలబార్ ప్రాంతంలో, భూత కోలా నృత్యాలను ప్రతి సంవత్సరం, వివిధ సందర్భాలలో అక్కడి ప్రజలు ఎంతో నిష్ఠగా ఆడటం, వారు ప్రకృతి దేవతలకు వివిధ పూజలు చేయడం వంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు.
ఈ ఆచారం మొదలై ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలియదు కానీ, చాలా మంది చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం, సామాన్య శకానికి 3000 సంవత్సరాల పూర్వం నుంచీ ఉందనీ, మరికొంత మంది చరిత్రకారుల ప్రకారం, కొన్ని యుగాల క్రితం, అంటే వేద కాలం కంటే ముందే, తుళు ప్రజలు ఆదిమ జాతులుగా ఉన్న సమయంలో, తొలిసారి వ్యవసాయం మొదలు పెట్టిన సమయంలోనే, ఈ ఆచారానికి నాంది పలికారనీ తెలుస్తోంది. నాడు తాము పండించే పంటలనూ, తమ జీవనానికి ఆధార భూతమైన ఆడవులనూ, దొంగల నుంచీ, దుష్ట శక్తుల నుంచీ కాపాడమని భూత గణాలను పూజించడం మొదలు పెట్టి, ఆ సందర్భంలో భూత కోలా ఆడటం మొదలు పెట్టారని, తుళునాడులో వినపడుతున్న స్థానిక కథలూ, అక్కడ దొరికిన కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తున్నట్లు, చరిత్ర కారులు చెబుతున్నారు.
ఈ భూత కోలాలో, తుళు ప్రజలు వివిధ రకాల ప్రకృతి శక్తులను కొలుస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేర్లూ, నేడు దేశం మొత్తం మారు మ్రోగుతున్న పేర్లూ రెండు. అవే పంజర్లీ, గుళిగ అనే రెండు శక్తులు. ముందుగా పంజర్లీ అనే ప్రకృతి దేవుడి విషయంలో, ఎన్నో కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నా, అక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మే గాధ, పార్వతీ దేవీకి నచ్చిన, శివుడు శపించిన ఒక మగ అడవి పంది గాధ. పూర్వం కన్నడ కోస్తా అటవీ ప్రాంతంలో, సుబ్రహ్మణ్యస్వామిని కొలిచే ఒక ఆడ, ఒక మగ పందులు ఉండేవి. వాటికి కొన్నాళ్ళకు పిల్లలు పుట్టగా, వాటిలో ఒక పంది చాలా ముద్దుగా అనిపించి, పార్వతీ దేవి కైలాసానికి తీసుకెళ్ళి పెంచుకునేది. ఆ పందికి యుక్త వయస్సు వచ్చేసరికి, కోర దంతాలు బాగా పెరగటం, అందువల్ల దాని దంతాల దగ్గర ఎక్కువ దురద పెట్టడంతో, ఆ దురదను తీర్చుకోడానికి మట్టిని బాగా పెకలించేది.
ఈ క్రమంలో, శివయ్యకు ఎంతో ఇష్టమైన ఉద్యాన వనంలో ఉన్న మొక్కలను కూడా నాశనం చేయడంతో, స్వామికి కోపం వచ్చి, ఆ అడవి పందిని వధించాడు. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న వరాహం చనిపోవడంతో, పార్వతీ దేవి చింతించి, ఆ వరాహాన్ని తిరిగి బ్రతికించమని, శివుడిని కోరింది. సతి కోరికను మన్నించిన శివుడు, ఆ అడవి పందికి తిరిగి ప్రాణం పోసి, దానికి కొన్ని దైవిక శక్తులు ఇచ్చి, భూమిపై ఉండే ప్రజలను రక్షించమని, కన్నడ కోస్తా ప్రాంతానికి పంపించాడు. అప్పటి నుంచీ తుళు ప్రజలు, ఆ అడవి పందిని పంజర్లీ అనే పేరుతో కొలుస్తూ, భక్తి శ్రద్ధలతో, భూతకోలా ద్వారా పూజించడం జరుగుతోంది.
ఇక గుళిగ అనే మరో ఉగ్ర దేవతను కూడా తుళు ప్రజలు కొలుస్తూ ఉంటారు. ఈ గుళిగ దేవత ఆవిర్భావం కూడా ఎంతో వింతగానే ఉంటుంది. స్థానికంగా వినిపిస్తున్న గాధల ప్రకారం, ఒకనాడు పార్వతీ దేవికి, విశ్వాంతరాళాలలో ఒక వింత రాయి దొరికింది. ముచ్చటపడి ఆ రాయిని కైలాసానికి తీసుకువెళ్ళగా, శివయ్య అది కైలాసంలో ఉండదగ్గ రాయి కాదని, భూమిపైకి విసిరివేశాడు. అలా శివుడు విసిరేసిన రాయి ఒక పాము కడుపులో ప్రవేశించి, ఒక రూపం సంతరించుకుని, నెలలు నిండిన తర్వాత తన తల్లితో, 'నేను ఎలా బయటకి రావాలి?' అని అడిగాడు. దానికి ఆ తల్లి పాము, అందరూ ఎలా పుడతారో నువ్వు కూడా అలాగే బయటకి వస్తావు, అని చెప్పింది.
కానీ, ఆవేశం ఆగని గుళిగ దేవుడు, పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేశాడు. రావడం రావడం, తనకు విపరీతమైన ఆకలి వేయడంతో, తనకు కనపడిన ప్రతి వస్తువునూ తినడం ఆరంభించాడు. అంతేకాదు, ఆ ప్రాంతంలో విష్ణు మూర్తికి ఎంతో ప్రీతికరమైన ఒక చేరువులోని నీటిని మొత్తం త్రాగేసి, అందులో ఉన్న మొత్తం చేపలను తినేసినా అతని ఆకలి తీరలేదు. దాంతో విష్ణు మూర్తి ప్రత్యక్షమయ్యి, ఆ గుళిగ దేవుడి ఆకలి బాధను మటుమాయం చేసి, తనతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్లాడు. అక్కడ విష్ణు మూర్తి దగ్గర ధర్మ రక్షణకు సంభందించిన సూత్రాలనూ, కొన్ని శక్తులనూ అవపోశన పట్టగా, భూమిని రక్షించమని విష్ణు మూర్తి తిరిగి గుళిగ దేవుడిని భూమిపైకి పంపివేశాడు. అలా వచ్చిన గుళిగ దేవుడు, క్షేత్రపాలకుడిగా ఆలయాలను రక్షిస్తూ, ప్రజల కష్టాలను తిరుస్తూ ఉన్నాడని, తుళు ప్రజలు బలంగా నమ్ముతారు.
అంతేకాదు, ఈ గుళిగ దేవుడికి కోపం ఎక్కువనీ, అతనికి మొక్కులు చెల్లించకపోయినా, అతన్ని అవమానించినా, అతని విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా, అలా చేసిన వారు ఎన్నో కష్ట నష్టాలు పడటంతో పాటు, వారు చేసిన పాపం ఘోరమైనదైతే, వెంటనే వారు రక్తం కక్కుకుని చనిపోతారని, తుళు ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, అక్కడ ఎన్నో సంఘటనలు కూడా జరిగినట్లు, తుళు ప్రజలు చెబుతారు. అందువల్ల, నేటికీ దక్షిణ కన్నడ కోస్తా, మరియూ కేరళ మలబార్ ప్రాంతాలలో భూత కోలా నిర్వహించినప్పుడు, పంజర్లీ దేవుడినీ, గుళిగ దేవుడినీ ఎంతో శ్రద్దగా, ఒకేసారి పూజించడం చూస్తూ ఉంటాము.
భూత కోలా జాతర, పూజలలో, ప్రజలంతా పాల్గొన్నా, ఆ భూత కోలా ఆడేవారు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. కేవలం తరతరాలుగా కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఈ భూతకోలా ఆడతారనీ, నేటికీ ఆయా కుంటుంబాలు మాత్రమే, భూత కోలా నాట్యం చేస్తున్నారనీ, స్థానికులు చెబుతారు. ఇలా నాట్యం చేసేవారు, ఎంతో భక్తి శ్రద్దలూ, మడి ఆచారాలు పాటిస్తూ, వారి మేకప్ వారే వేసుకుని, ఆయా దేవుళ్ళ ముందుకు వచ్చి నాట్యం చేస్తారు. ఈ క్రమంలో, వారిపైకి ఆయా దేవుళ్ళు ఆవహించి, ప్రజలకు ఉండే వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ఎన్నో కుటుంబ, రాజకీయ తగాదాలను తీర్చడం వంటివి కూడా చేస్తారు. ఇప్పటికీ తుళు నాడు లోని ప్రజలు ఎక్కువగా, భూత కోలా నాట్యం చేసే వారి దగ్గరే తమ సమస్యలను పరిష్కరించుకుంటారని, నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, తుళు ప్రజలు కేవలం పంజర్లీ, గుళిగ దేవతలనే కాకుండా, ఇంకా ఎంతో మంది ప్రకృతి దేవీ దేవతలను 'భూత కోలా'లో కొలుస్తారు. తుళు ప్రజల నమ్మకం ప్రకారం, ఆయా దేవుళ్ళలో కొన్ని ప్రకృతి శక్తులు ఉంటే, మరికొన్ని, శివయ్యను జీవితాంతం పూజించిన సాధువులూ, ఋషులూ చనిపోయిన తర్వాత శక్తులుగా మారిన వారు కూడా ఉన్నట్లు, నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ శక్తులన్నీ, పరమేశ్వరుడి దగ్గర ఉన్న ప్రమధ గణాలలోని వారని తుళు ప్రజలు ఎంతో బలంగా నమ్ముతారు. అందుకే తరాలు మారినా, యుగాలు గడచినా, అక్కడి ప్రజలు నేటికీ, ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ, భూత కోలా ఆడుతున్నారు.
సర్వేజనాః సుఖినోభవంతు!
What is Bhoota Kola? All about the controversy over the ritual depicted in the Kannada movie 'Kantara' in Telugu..
Comments
Post a Comment