మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur
సంతాన భాగ్యాన్ని ప్రసాదించే 4 వేల సంవత్సరాల నాటి హేమాచల నృసింహ ఆలయ రహస్యాలు!
ఆర్త జన బాంధవుడిగా, భక్త కోటి రక్షకుడిగా, శంఖచక్రధారిని సమస్త జనులూ, భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ధర్మ రక్షణా, దుష్ట శిక్షణ కొరకు, ఆ శ్రీ మహా విష్ణువు వివిధ అవతారాలెత్తినట్లు, మన పురాణాలు చెబుతున్నాయి. ఆయనెత్తిన అవతారాలలో, నరసింహ స్వామి అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువల్ల, ఆ స్వామిని యుగయుగాలుగా, సామాన్యుల నుంచి రారాజుల వరకూ, ఎన్నో ఆలయాలను నిర్మించి, భక్తితో కొలుస్తున్నారు. అటువంటి ఒక పురాతన నరసింహ స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు, ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 4000 సంవత్సరాల మునుపు కట్టిన ఆ ఆలయంలోని స్వామి వారి విగ్రహాన్ని చూసిన వారు, నోట మాట రాక, సంభ్రమాశ్చార్యాలలో మునిగిపోతే, శాస్త్రవేత్తలు మాత్రం, ఈ వింత ఎలా జరుగుతోందనే విషయం అంతుబట్టక, తలలు పట్టుకుంటున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న ఆ నరసింహ స్వామి వారి విగ్రహంలో దాగిన రహస్యమేంటి? ఆ ఆలయం ఎక్కడుంది? దాని వెనుకనున్న అసలు చరిత్ర ఏమిటి? అనే విషయాలను, ఈ రోజు తెలుసుకుందాము..
ఈ ఆశ్చర్యకర క్షేత్రం, వరంగల్ జిల్లాలోని మంగపేట తాలూకాలో గల, మల్లూరు అనే గ్రామానికి, 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ స్వామిని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు. చుట్టూ పచ్చని ప్రకృతి రమణీయత మధ్యా, ఎన్నో ఔషధ గుణాలు గల మొక్కల మధ్యా, శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. ఈ క్షేత్రాన్ని సుమారు, 4797 సంవత్సరాల క్రితం, శాతవాహన శకం నాటి దిలీపకర్ణి మహారాజు నిర్మించినట్లు, చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయంలో ఉన్న స్వామి విగ్రహం, మానవ శరీరంలా మెత్తగా ఉండడమే కాకుండా, ఛాతీ మీద రోమాలు కూడా ఉంటాయి. 9 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న స్వామి వారి మూలవిరాట్టుపై, ఎక్కడ ముట్టుకున్నా మెత్తగా ఉండడమే కాకుండా, వ్రేలితో నొక్కగానే సొట్ట కూడా పడి, అక్కడి నుండి వేలు తీయగానే, మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇటువంటి వింతైన విగ్రహం, ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి.
అయితే, స్వామి వారి విగ్రహం, అచ్చం మానవ శరీరంలా ఎలా ఏర్పడింది? అనే విషయం, ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాదు, స్వామి వారి విగ్రహంలో మరో విశేషం, ఆయన పొట్ట నుండి కారే ద్రవం అని చెప్పాలి. ఈ ద్రవం కారడం వెనుక ఒక గాధ కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహన శక ప్రభువు దీలీపకర్ణికి, ఒకనాడు కలలో, తాను ఫలానా ప్రదేశంలో ఉన్న గుహ అంతర్భాగంలో, స్వయంభువుగా వెలసి ఉన్నానని సెలవిచ్చాడట ఆ స్వామి. దాంతో ఆ రాజు, మర్నాడుదయమే ఆ ప్రాంతానికి వెళ్ళి, 76 వేల మంది సైన్యంతో, ఆ ప్రాంతమంతా త్రవ్విస్తుండగా, అనుకోకుండా ఒక గునపం, స్వామి నాభిలోకి గుచ్చుకుందట. అప్పటి నుండి, ఆ గాయం నుండి ద్రవం కారుతోంది. ఈ ద్రవాన్ని సేవిస్తే, సంతాన భాగ్యం కలుగుతుందని, భక్తులు బాగా విశ్వసిస్తారు. నేడు ఆ ద్రవం కారే ప్రదేశాన్ని, పసుపూ, చందనాలతో మూసి ఉంచుతున్నారు. కానీ, ప్రతీ శనీ, ఆదీ, సోమవారాలలో, ఆ చందనపు లేపనాన్ని తొలగించి, అక్కడి నుండి కారే ద్రవాన్ని పట్టి, భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
అంతేకాదు, ఈ నరసింహ స్వామి వారి పాదాల నుంచి, నిత్యం నీళ్లు కారుతూ, ఆలయానికి వందడుగుల దూరంలోని చింతామణి, అనే చిన్న జలపాతంగా మారుతుంది. ఈ నీరు కొద్ది కొద్దిగా, కొన్ని రోజుల పాటు త్రాగితే, అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ, ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు. స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు, చింతామణి జలపాతాన్ని సమీపించే లోపు, అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల, ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. పూర్వం తెలుగు నేలను కాకతీయ వంశస్థులు పాలించే కాలంలో, ఆ ఆలయానికి కొంత దూరంలో, రాణీ రుద్రమదేవి, శత్రువులతో యుద్ధం చేసిందట. ఆ సమయంలో ఆమెకు అనారోగ్యం చేయడంతో, వైద్యులు ఆలయ సమీపంలో చికిత్స చేయడమే కాకుండా, ఆ జలపాతంలోని జలం యొక్క విశిష్ఠత తెలిసి, రోజూ ఆ నీటిని ఆమెకు పట్టించడంతో, ఆమె అనారోగ్యం నుంచి బయటపడి, పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది.
ఆ తరువాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి, ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. నేటికీ ఆ జలపాతాన్ని చింతామణి జలపాతంగానే పిలుస్తున్నారు. ఇన్ని విశిష్ఠతలు గల హేమాచల నృసింహ క్షేత్రం, ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఆ ఆలయ ప్రాంగణంలోనే, అత్యంత పురాతన లక్ష్మీదేవీ, గోదా దేవీల ఆలయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, స్వామి ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో, శిఖాంజనేయ స్వామివారి చిన్న మందిరం కూడా ఉంది. ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఎప్పుడు వెలసింది? అన్న విషయం, నేటికీ తెలియదు. కానీ, ఈ శిఖాంజనేయ స్వామి వారే, శ్రీ హేమాచల నృసింహ క్షేత్రానికి, క్షేత్రపాలకుడని భక్తుల నమ్మిక. ఇవి, మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణాలో ఉన్న, ఆశ్చర్యకరమైన శ్రీ హేమాచల నృసింహ క్షేత్ర విశేషాలూ, అక్కడున్న మానవశరీరం వంటి విగ్రహ విశిష్ఠతలు..
ఓం నమో భగవతే వాసుదేవాయ!
Comments
Post a Comment