‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! Jaabaali Maharshi


‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం!
పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం ఏమిటి?

మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మునులూ, రుషులూ ఉన్నా, వారిలో జాబాలి మహర్షి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. ప్రకృతి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి, గొప్ప వ్యక్తిగా కీర్తిని గడించిన జాబాలికి, ఒక వ్యాపారస్థుడు తెలియజేసిన ధర్మ సూక్ష్మం ఏంటి? జాబాలి గోత్రానికే మూలమైన ఆయనకు, ధర్మదేవతలు ఎందుకు గుణపాఠం నేర్పారు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L4UeG2rUorU ]


ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే, జాబాలికి కూడా జ్ఞానాన్ని ఆర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని, గౌతమ మహర్షి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. అప్పుడు గౌతముడు, అతడి తల్లిదండ్రులూ, గోత్ర నామాదుల వివరాలు అడిగాడు. ఆ ప్రశ్నకు జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే, చిన్ననాటి నుంచి, అతను తన తండ్రిని ఎరుగడు. ఇక తన గోత్రమూ, తనకు తెలియదు. అందుకని, దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి, గౌతముని ప్రశ్నలకు జవాబును కోరాడు. ‘నాయనా! నీకు తండ్రి లేడు. నా పేరు జాబాల కాబట్టి, నా కుమారుడవైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉన్నదని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ, సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా, నీకు ‘సత్యకాముడు’ అన్న పేరును జోడిస్తున్నాను’ అని చెప్పి పంపింది జాబాలి తల్లి. ఆ మాటలను యథాతథంగా సత్యకామ జాబాలి, గౌతమునితో చెప్పాడు.

జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు, అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు.  జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని, గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ, జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ, అతనికి విద్యను అందించేందుకు సిద్ధపడ లేక పోయాడు, గౌతముడు. అందుకోసం జాబాలికి ఆవులూ, ఆంబోతులూ ఉన్న పశుమందను అప్పగించి, ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ, నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు. అలా గురువుగారి ఆదేశం మేరకు, సత్యకామ జాబాలి, పశువుల మందను మేపుతూ, అడవులలో తిరగసాగాడు. కానీ, అతని మేధోశక్తికి, ప్రకృతిలోని ప్రతి అణువూ, ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు, లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్నిచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ కాలం గడుపుతూ, తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు, సత్యకామ జాబాలి.

ఇలా ఉండగా ఒకరోజు, అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి, ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే, అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ, ఆ బ్రహ్మతత్వంలోని భాగమే..!’ అని చెప్పింది. ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన అగ్నిదేవుడు, ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు, అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండవ పాదం’ అని విశదీకరించాడు. ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి, వెలుతురును ప్రసాదించే రూపాలైన అగ్నీ, సూర్యుడూ, చంద్రుడూ, విద్యుల్లతలు కూడా, బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి, ఎగిరిపోయింది. ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని, ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా, బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది. అలా సత్యకామజాబాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై, సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.

సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సును, అల్లంత దూరంనుండే చూసిన గురువుగారు, జరిగినది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే, కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అని అన్నారు. కానీ, సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం, ఇసుమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి, బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ, మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు, తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా, సత్యకామ జాబాలికి అందించాడు. దివ్యజ్ఞానాన్ని పొందిన జాబాలి, తపస్సులో నిమగ్నమయ్యాడు. అలా ఉండగా, అతడి తల మీద ఒక పిచ్చుక గూడు కట్టింది. అక్కడ గుడ్లుపెట్టి పొదిగి, వాటిని పిల్లలను చేసింది. ఆ పిచ్చుక, పిల్లలతో కలిసి అక్కడ నివసించ సాగింది. ఆ విషయం తెలిసిన జాబాలి, వాటిని తరిమి వేయకుండా భరిస్తూ, "ఆహా! నా వంటి ధర్మనిష్టాగరిష్టుడు ఎవరైనా ఉంటారా!" అని తనను తాను మెచ్చుకోసాగాడు.

అప్పుడు ఆకాశవాణి, "మహాత్మా! తనను తాను మెచ్చుకునే ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటుందా? నీ కంటే ధర్మనిష్టా పరుడైన తులాధరుడు కూడా, ఇలా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఇక నీ వెంత?" అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆశ్చర్యపడిన జాబాలి, "ఆ తులాధరుడు ఎక్కడ ఉంటాడు. నేను అతడిని కలవాలి" అని అడిగాడు. అతడు వారణాశి పురంలో నివసిస్తున్నాడని, ఆకాశవాణి పలికింది. జాబాలికి తులాధరుడి మీద కలిగిన మత్సరంతో, వారణాశికి వెళ్ళాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న తులాధరుడిని చూశాడు. జనులంతా అతడిని ధర్మాత్ముడని పొగడుతున్నారు. జాబాలిని చూసిన తులాధరుడు అతడికి అతిథి సత్కారాలు చేసి, "మహానుభావా! మీ తల మీద పిచ్చుకలు తిరుగుతున్నా చలించక, హాయిగా తిరుగుతున్న మీరు, జితేంద్రియులు. గౌరవించదగిన వారు" అని అన్నాడు. అది విన్న జాబాలి, "అది సరే, నీవు చేసేది వ్యాపారం.. అందులో ధర్మము తప్పక చేయడం ఎలా సాధ్యము?" అని అడిగాడు.

అందుకు తులాధరుడు, "అయ్యా! నేను వస్తువులు కొనడంలో, అమ్మడంలో ఎలాంటి మోసములకూ పాల్పడను. కొంత లాభంతో తృప్తి పడతాను. లాభం వచ్చినప్పుడు పొంగిపోక, నష్టాలకు క్రుంగిపోక, సమ స్థితిలో ఉంటాను. నేను మట్టిబెడ్డనూ, బంగారపు ముద్దనూ, సమ దృష్టితో చూస్తాను. నేను ఎవరినీ పొగడను, తిట్టను. నన్ను నేను పొగడుకోను. ఇతరులను హింసించను. సాటి జీవులయందు, దయ కలిగి ఉంటాను. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతుంటాను. నేను భోగభాగ్యములను కానీ, కీర్తిప్రతిష్టలనుగానీ కోరను. ఎవరికైనా ఉపకారము చేసి, నేను ఇంత ఉపకారము చేశానని చెప్పుకోను. నాకు దేని మీదా మమకారముగానీ, ద్వేషముగానీ లేవు. ఈ లోకమును ఆటవస్తువులాగా చూస్తూ, బయటి ప్రపంచానికి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను" అని అన్నాడు. అందుకు జాబాలి, "తులాధరా! నీవు యజ్ఞములు, యాగములు, తపస్సు మొదలగు ధర్మముల గురించి మాట్లాడలేదు. వేదవిధులు, వీటిని సత్కర్మలంటారు కదా! మరి ఇది ఆచరించదగిన ధర్మము కాదా?" అని అడిగాడు.

"మహానుభావా! ఈ యజ్ఞములు, యాగములు, తపస్సులు, ఏవేవో కోరికలు తీరడానికి చేస్తారు. కనుక వాటి అవసరం లేదని నా అభిప్రాయం. ఈ యజ్ఞ యాగాలు, జననమరణ చక్రం నుండి మానవులను విముక్తి చేయలేవు. ఎవరైతే సత్యమునే ఒక యజ్ఞముగా పాటిస్తూ, నిత్య తృప్తుడై ఉంటాడో, అతడికి శాశ్వత ఆనందము కలుగుతుందని నా నమ్మకము" అని అన్నాడు తులాధరుడు. అందుకు జాబాలి, "తులాధరా! నీవు కర్మలు వదల కుండా చేస్తున్నావు కదా! దానికి కారణమేమిటి?" అని అడిగాడు. అందుకు తులాధరుడు ఇలా చెప్పాడు. "ఎవరు సతతమూ ధర్మమునే ఆచరిస్తారో, ఎవరు ధర్మముతో చెలిమి చేస్తారో, ఎవరు నిష్కల్మష హృదయంతో కర్మలు చేస్తుంటారో, అతడికి కర్మలు ఆచరించక పోతే కలిగే ఆనందము కలుగుతుంది. అన్ని నగరాలూ పుణ్య క్షేత్రములే.. అన్ని నదులూ పుణ్య నదులే.. నిష్కల్మష హృదయంతో ఉన్న వాడికి, అన్నీ పవిత్ర నదులే.. వృత్తిధర్మంగా పనిచేస్తున్నాను, ఫలితం భగవంతుడికి అప్పగిస్తాను, అనుకుని కర్మలు చేసే వాడికి, ఏ దోషమూ అంటదు. ఫలితం ఆశించి చేసే కర్మలకు, దోషం అంటకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసిన ధర్మము ఇది. ఇది సరైన ధర్మం ఔనోకాదో, సజ్జనులను అడిగి తెలుసుకుంటాము. నీవు ఇన్ని రోజులూ తండ్రిలా పోషిస్తున్న ఆ పిచ్చికలు, హాయిగా ఎగురుతున్నాయి. వాటిని పిలిచి, లాలించు" అని అన్నాడు.

అప్పుడు జాబాలి పిచ్చుకలను దగ్గరకు పిలిచాడు. అవి అతడి దగ్గరకు రాకుండా, అలా ఆకాశంలో ఎగురుతూ, "ఓ మునీంద్రా! మేము ధర్మదేవత దూతలము. ధర్మదేవత పంపగా, నిన్ను పరీక్షించడానికి వచ్చాము. మేము మీకు కలిగిన సందేహమును తీరుస్తాము. ఎవరి మనస్సులో ఇతరుల ఎడల ద్వేషము, మాత్సర్యము ఉంటుందో, అతడికి ఇతరులతో తగవులాడాలని కోరిక కలుగుతుంది. అందువలన, హింస చెలరేగుతుంది. కనుక మునీశ్వరులకు, తమలో తాము ద్వేషించడం, మాత్సర్యము వహించడము, కూడనివి. ‘స్పర్ధ’ ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మం నశిస్తే, మనిషి నాశనం ఔతాడు. కనుక మానవుడు స్పర్ధను వదలాలి. సత్వగుణము వలన శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ఉన్నవాడు, తాను తెలుసుకో తగిన దానిని తెలుసుకుంటాడు. ప్రతి మనిషికీ, శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞ యాగములూ నిష్ఫలములు. కనుక శ్రద్ధే, అన్నిటి కంటే ముఖ్యము. శ్రద్ధ ధనమువంటిది. అది మనసును చెడు దారిలో పోకుండా కాపాడుతుంది. శ్రద్ధ జీవాత్మ యొక్క ప్రసన్నత్వము. యాగము చేయుటకు శ్రద్ధ, శుచిత్వము, ముఖ్యము. శ్రద్ధలేని శుచిత్వము, శుచిత్వములేని శ్రద్ధ, నిష్ఫలమే. ఇదే విషయాన్ని బ్రహ్మ, దేవతలతో ఇలా చెప్పాడు. శ్రద్ధ కలిగిన వాడు ఉత్తముడు. అతడి చేతి భోజనము, అత్యంత శ్రేష్టము.

ధనము వడ్డీకి ఇచ్చి, ఆ వడ్డీతో దానధర్మలు చేసేవాడూ, వేదవేదాంగములు చదివిన లోభి అయిన వాడూ సమానమే. అందులో యాగములో దానము చేసిన వాడు, శ్రేష్టుడు. శ్రద్ధలేని వాడికి, దానము చెయ్యడానికి మనస్కరించదు. శద్ధ కలిగిన వాడి మనసులో, మత్సరం ఉండదు. అందుకని, శ్రద్ధ కలిగిన వాడు శ్రేష్టుడు" అని పిచ్చుకలు జాబాలికి చెప్పాయి. ఆ మాటలు విన్న జాబాలి తులాధరుడిని చూసి, "మహాత్మా! నాకు ఆన్నీ తెలుసనుకున్నాను. నాకు ఏమీ తెలియదని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మునుల మాటలను వినలేదు కనుక, నన్ను నేను పొగడుకోవడమనే దోషం నాకు పట్టుకుంది. నీ మాటలతో నాకు దోషము పోయింది. ఇక నేను ప్రశాంత చిత్తంతో జీవిస్తాను" అని పలికాడు జాబాలి. ఆ మాటలతో సంతోషించిన తులాధరుడు, "ఓ మహాత్మా! ఎవరికైనా స్వధర్మం కంటే మించిన ధర్మము మరొకటి లేదు" అని పలికాడు. తరువాత జాబాలి, తులాధరుడి వద్ద శెలవు తీసుకుని వెళ్ళి పోయాడు. ఆనాటి నుండి, జాబాలి ధర్మాన్ని నిష్ఠతో పాటించాడు.

ఈ సత్యకామ జాబాలి కథ, కేవలం ఛాందోగ్య ఉపనిషత్తుతోనే ముగిసిపోలేదు. సత్యాకముడు, పిప్పలాదుడనే ఋషికి చెప్పిన, మంత్రాలతో కూడిన ‘జాబాలి ఉపనిషత్తు’ కూడా, మన గ్రంథాలలో ప్రముఖమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇక రామాయణంలోనూ, జాబాలి ప్రస్తావన వస్తుంది. అయితే, జాబాలిని ఒక నాస్తికునిగా, రామాయణం ఎంచుతుంది. తనలో ఉన్న బ్రహ్మమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందన్న జాబాలి భావన వల్ల, అతడిని నాస్తికునిగా ఎంచి ఉండవచ్చు. అతనికి ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి అందించిన బ్రహ్మజ్ఞానంలోని సారం ఇదే కదా! నర్మదా నదీతీరాన జాబాలి తపస్సు చేసుకున్న ప్రాంతమే, నేడు జబల్పూరుగా మారిందని చెబుతారు. తిరుమలలోని జాబాలి తీర్థం వద్ద కూడా, ఆయన కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. జాబాలిని పురాణాలు ఒక ఋషిగా ఎంచి, ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. మొత్తానికి తన సత్యనిష్ఠతో, జ్ఞానతృష్ణతో, గోత్రమంటూ లేని జాబాలి, తనే ఒక గోత్రానికి స్థాపకుడయ్యేంతటి ఋషిగా మారాడు.

ధర్మో రక్షతి రక్షితః

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home