సవ్యసాచి - భగవద్గీత | Savyasachi - Bhagavadgita


'సవ్యసాచి'!
రెండు చేతులతోనూ సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలవాడు!

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఈ విధంగా ప్రణమిల్లుతున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6LckBaTv098 ]



00:47 - ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోఽస్తు తే దేవవర ప్రసీద ।
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ।। 31 ।।

ఓ భయంకర రూపము కలవాడా, నీవెవరో తెలియచేయుము. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికన్నా ముందే ఉన్న నీ గురించీ, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే, నీ స్వభావము, మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను.

ఇంతకు క్రితం అర్జునుడు, విశ్వ రూపమును చూడాలని ప్రార్ధించాడు. తదుపరి, శ్రీ కృష్ణుడు దానిని చూపించినప్పుడు, అర్జునుడు భీతిల్లిపోయి, అయోమయానికి గురి అయ్యాడు. నమ్మశక్యం కాని మహాద్భుతమును చూసిన పిదప అతను భగవంతుని యొక్క యదార్ధ స్వభావమును, మరియు సంకల్పమును తెలుసుకోదలిచాడు. అందుకే ఇలా అడుగుతున్నాడు, "నీవెవరు, నీవు ఎందుకున్నావు?" అని.

01:50 - శ్రీ భగవానువాచ ।
కాలోఽస్మి లోకక్ష్యయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ।। 32 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: నేనే మహాకాలమును. సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్ననూ, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు.

అర్జునుడి ప్రశ్నకు సమాధానముగా, శ్రీ కృష్ణుడు తన ప్రవృత్తిని, సర్వ శక్తివంతమైన కాల స్వరూపముగా, విశ్వ వినాశకారిగా తెలియచేస్తున్నాడు. సమస్త ప్రకృతి ఘటనలన్నీ కాలంలో కలిసిపోతాయి. కాలమనేది, ప్రతి ఒక్క జీవ ప్రాణి యొక్క జీవితకాలాన్ని లెక్కిస్తుంది, మరియు నియంత్రిస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడి వంటి గొప్ప వారు సైతం, ఎప్పుడు అంతమై పోవాలో అదే నిర్ణయిస్తుంది. అర్జునుడు ఆ యుద్ధంలో పాలుపంచుకోకపోయినా సరే, కాలమనేది, శత్రు పక్షంలో బారులు తీరి ఉన్న వారందరినీ నశింపచేస్తుంది. ఎందుకంటే, భగవంతుడు ప్రపంచం పట్ల తన బృహత్ ప్రణాళికలో భాగంగా, అది అలాగే అవ్వాలని సంకల్పించాడు.

03:09 - తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ।। 33 ।।

కాబట్టి ఓ సవ్యసాచీ, లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించుము, మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నా చే సంహరింపబడి ఉన్నారు. నీవు కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు.

కౌరవులు నశించిపోవాలి, మరియు హస్తినాపుర సామ్రాజ్యము పాండవులచే ధర్మ బద్ధంగా పాలింపబడాలి.. అన్న సంకల్పాన్ని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి తెలియచేశాడు. శ్రీ కృష్ణ పరమాత్మ, ఇంతకు మునుపే అధర్మపరుల వినాశనాన్నీ, మరియు ధర్మాత్ముల విజయాన్నీ, యుద్ధము యొక్క పరిణామముగా నిశ్చయించాడు. లోక సంక్షేమం కోసం ఆయన వేసిన పధకాన్ని, ఏ శక్తి కూడా మార్చలేదు. ఇప్పుడు అర్జునుడు నిమిత్త మాత్రునిగా ఉండడమే తను కోరుకుంటున్నానని, శ్రీ కృష్ణుడు అతనికి చెప్తున్నాడు. భగవంతునికి తన పని యందు ఒక మానవుని సహాయం ఏమీ అవసరం లేదు. కానీ, మనుష్యులు ఆయన సంకల్పాన్ని నేరవేర్చటానికి పని చేస్తే, అది వారికి నిత్య శాశ్వత సంక్షేమం కలిగిస్తుంది. భగవంతుని ప్రీతి కొరకు పని చేసే అవకాశాలనేవి, చాలా అరుదుగా మనకు తారసపడే అనుగ్రహాలు. ఈ అవకాశాలను సద్వినియోగము చేసుకోవటం ద్వారానే, భగవంతుని విశేష కృపకు మనము పాత్రులమవ్వగలుగుతాము, మరియు, మనము  భగవత్ సేవకులుగా, మన యొక్క నిత్య శాశ్వత స్థాయిని సాధించగలుగుతాము.

తన కృపచే, విలుకాడిగా సాటిలేని ప్రతిభను పొందిన విషయాన్నిఅర్జునుడికి గుర్తు చేస్తూ, తన చేతిలో పనిముట్టుగా ఉండమని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. అందుకే ఆర్జునుడిని, 'సవ్య సాచి' అని సంబోధిస్తున్నాడు.. అంటే, నిష్ణాతుడైన విలుకాడు అని. అది ఎలా అంటే, అర్జునుడు రెండు చేతులతో కూడా సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలడు.

05:18 - ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ।। 34 ।।

ద్రోణాచార్యుడూ, భీష్ముడూ, జయద్రథుడూ, కర్ణుడూ, ఇంకా ఇతర వీర యోధులు అందరూ, నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి, వ్యాకుల పడకుండా వారిని అంతము చేయుము. కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు.

కౌరవుల పక్షమున ఉన్న చాలా మంది యోధులు, ఇప్పటివరకూ యుద్ధములో అజేయులే. జయద్రథుడికి ఒక వరము ఉంది. ఎవరైనా ఆయన తల భూమిపై పడేటట్టు చేస్తే , తక్షణం అలా చేసిన వారి తలకూడా ముక్కచెక్కలై పోతుందని.. కర్ణుడికి ఇంద్రునిచే ఇవ్వబడిన "శక్తి" అనే అస్త్రము ఉంది. దానిని ఎటువంటి వారిపై ఉపయోగించినా, అది వారిని సంహరిస్తుంది. కానీ, ఒక్కసారి మాత్రమే దానిని ఉపయోగించాలి. కాబట్టి, కర్ణుడు దానిని అర్జునుడిపై పగ తీర్చుకోవటానికి దాచుకున్నాడు. ద్రోణాచార్యుడు సమస్త అస్త్ర శస్త్రముల జ్ఞానాన్నీ, మరియు వాటిని నిర్వీర్యం చేసే ఉపాయాలనూ, భగవత్ అవతారమైన పరుశారాముని నుండి నేర్చుకున్నాడు. భీష్ముడికి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేటట్టు, ఒక వరం ఉంది. అయినా సరే, భగవంతుడు వారందరూ చనిపోవాలి అని సంకల్పిస్తే, వారిని మరేదీ కాపాడలేదు.

06:48 - సంజయ ఉవాచ।
ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ ।
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ।। 35 ।।

సంజయుడు ఇలా చెబుతున్నాడు: కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత, అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి, శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ, భయము ఆవరించి, గద్గద స్వరముతో ఇలా పలుకుతున్నాడు.

ఇక్కడ అర్జునుడిని, "కిరీటి" అని సంబోధించాడు, సంజయుడు. ఒకానొక సమయంలో, అతను ఇద్దరు రాక్షసులను సంహరించటంలో, ఇంద్రుడికి సహాయం చేశాడు. దానితో ప్రీతి చెందిన ఇంద్రుడు, ఒక అద్భుతమైన కిరీటమును ఆయన శిరస్సుపై ఉంచాడు. ఈ శ్లోకంలో, సంజయుడు అర్జునుడి శిరస్సున ఉన్న కిరీటమును సూచిస్తున్నాడు. అదే సమయంలో, కిరీటమనేది, రాజ్యాధికారమునకు కూడా గుర్తు. అందుకే సంజయుడు, వృద్ధుడైన ధృతరాష్ట్రునికి, జరగబోయే యుద్ధంలో ఆయన పుత్రులైన కౌరవులు, సింహాసనాన్ని కోల్పోతారని సూచిస్తూ, ఇలా అన్నాడు.

07:56 - ఇక మన తదుపరి వీడియోలో, అర్జునుడు శ్రీ కృష్ణుడి దివ్య రూపాన్ని చూసి, ఏ విధంగా స్తుతిస్తున్నాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home