వంటింటి వాస్తు - Kitchen Vasthu - వంట గదిలోని వస్తువులను ఈ విధంగా పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది!
వంట గదిలోని వస్తువులను ఈ విధంగా పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది!
ఏ ఇంటి వాస్తు సరిగ్గా ఉంటుందో, ఆ ఇంట్లోని వారికి ఏ కొరతా ఉండదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందులోనూ, ఇంటి మొత్తానికీ ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్నీ కలిగించే వంటింటి విషయంలో, ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, వంటగదిలో ఉండే వస్తువుల విషయంలో, వాస్తును తప్పనిసరిగా పాటించాలని శాస్త్ర వచనం. తెలిసీ తెలియక వంట గదిలోని వస్తువులు తప్పుగా పెడితే, ఆ ఇంట్లోని వారు ఎన్నో ఇక్కట్లకు గురికాక తప్పదు. అందువల్ల, వంట గదిలోని వస్తువులు ఏ విధంగా అమర్చుకోవాలనే విషయాన్ని, స్పష్టంగా తెలుసుకుని, అందరూ లాభం పొందండి.
ఇంట్లోని వారికి ఆరోగ్య ప్రదాయినీ, మొదటి చికిత్సాలయంగా, వంట గదిని పేర్కొంటారు. అందువల్ల, ఆ వంట గదిలోని వస్తువులు ఎంత వాస్తు రీత్యా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఆ ప్రకారంగా, నేడు ప్రతి ఇంటిలోనూ కనిపించే వస్తువులలో, ఫ్రీడ్జ్ కూడా ఒకటి. ఈ ఫ్రీడ్జ్ లను ఆగ్నేయంలో ఉన్న వంటగదిలో, ఉత్తర వాయువ్యం దిక్కున పెట్టుకోవడం శుభదాయకం.
ఇక మంచి నీళ్ళను ఇచ్చే ఫిల్టర్ ని, వంటి గది ఈశాన్యం దిక్కున గోడకి తగిలిస్తే మంచిది. ఎందుకంటే, ఈశాన్యం జల స్థానం అంటారు. అందుకే, ఆ ప్రదేశంలో ఫిల్టర్ పెట్టాలని, శాస్త్ర వచనం. ఇక వంట గదిలో ముఖ్యంగా ఉండే వస్తువు, పొయ్యి. ఇది ఖచ్చితంగా తూర్పు వైపు ఉన్న ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి. అంటే, మనిషి పొయ్యి ముందు నుంచుని ఉన్నప్పుడు, అతడు తూర్పు వైపు చూస్తూ వంట చేసే విధంగా, ఉండాలి. అంతేకాదు, ఇలా పొయ్యిని తూర్పు వైపు పెట్టినప్పుడు, దాన్ని పూర్తిగా గోడకి ఆనించకుండా, కాస్త ఎదుటికి జరిపి పెట్టాలి.
అలాగే, వంటగదిలో ఎక్కువగా ఉండేవి, వివిధ సామాన్లు. ఇవన్నీ కూడా పడమరవైపున అలమరాలను అమర్చుకుని, వాటిలో పెట్టుకోవాలి. ఇక మిక్సీ, గ్రైండర్ వంటి బరువైన వస్తువులను, పడమర, లేదా దక్షిణం వైపు ఉంచాలి. ఇక సాధ్యమైనంత వరకు, వంటగదిలో దేవుడి గది కానీ, దేవుడి బల్ల కానీ లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఇళ్ళలో స్థలం లేకపోవడం వల్లనో, సరైన అవగాహన లేకపోవడం వల్లనో, వంట గదిలో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
సర్వేజనాః సుఖినోభవంతు!
Comments
Post a Comment