37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja


37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి?

సకల లోక రక్షకుడూ శిక్షకుడూ ఆ పరమేశ్వరుడొక్కడే అని, వేదాలు సుస్పష్టంగా చెబుతాయి. కంటికి కనపడని సూక్ష్మ జీవుల నుంచి, సృష్టిని నడిపించే శక్తుల వరకూ, అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే యుగ యుగాలుగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోడానికీ, ఆయన కరుణకు పాత్రులవ్వడానికీ, సమస్త ప్రాణి కోటీ ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన శివ రాత్రి పర్వదినం నాడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్త కోటి మొత్తం ఆయనను విశేషంగా పూజిస్తారు. అందులోనూ, ఈ సారి శివరాత్రి పర్వదినంతో పాటు, శనిత్రయోదశి కూడా వచ్చింది. అందుకే ఈ 2023 మహాశివరాత్రి చాలా విశేషమయినది, అరుదైనది. ఇటువంటి కలయిక, ఇంతకు మునుపు 26-2-1881, 23-2-1952, 8-3-1986 తేదీలలో, ఇప్పుడు 18-2-2023 న, తరువాత ఈ శతాబ్దిలో మళ్ళీ 34 ఏళ్లకు, అంటే 3-3-2057 న, ఆ తరువాత 37 ఏళ్ళకు అంటే, 13-2-2094 న ఏర్పడుతుంది. ఇదొక అద్భుత యోగం, మరియు అత్యంత పుణ్యకాలం. ఇది మన తరానికి రావటం మన అదృష్టం. దినదిన గండంగా జీవనం సాగిస్తున్న ఈ కాలంలో, మరో 34 ఏళ్ల నిరీక్షణ అందరికీ సాధ్యపడకపోవచ్చు. కావున, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ, ఆత్మీయులందరికీ తెలియజేయగలరు. ఎన్నో ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మహత్తర పర్వదినం నాడు ఏ విధమైన పూజలు చేయాలి? ఉపవాసం ఏ విధంగా చేయాలి? జాగరణ ఎలా చేయాలి? వంటి విషయాలు ఈ రోజు తెలుసుకుందాము.. 

సాధారణంగా ప్రతి సంవత్సరం పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాలలో మాత్రం, కొన్ని పుణ్య తిధులూ, నక్షత్రాలూ, వారాలూ కలవడం వల్ల, ఒకేరోజు రెండు పర్వదినాలు కలిసివస్తూ ఉంటాయి. అటువంటి పర్వదినాలను మహా పర్వదినాలనీ, అతి పవిత్రమైన రోజులనీ, ఆ రోజున చేసే పూజల ఫలితాలు, మరింత ప్రభావవంతంగా దక్కుతాయనీ, పండితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు, మళ్ళీ అటువంటి పర్వదినం చూడాలంటే, మూడు దశాబ్దాలపైనే ఆగాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అటువంటి మహత్తర పర్వదినమే, ఈ సంవత్సరం వస్తున్న శివరాత్రి అని, పండిత వచనం.

ఈసారి శివరాత్రితో పాటు, శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. ఇలా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సాధ్యపడుతుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల, ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ, బ్రహ్మ ముహూర్తంలోనే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, తల స్నానం చేసి, శుచిగా, దగ్గరలో ఉన్న శివాలయనికి వెళ్ళి, ముందుగా శనీశ్వరుడికి తైలాభిషేకం కానీ, నువ్వుల అభిషేకం గాని చేస్తే, శని బాధలు పోయి, అన్ని విధాలా మంచి జరుగుతుందని తెలుస్తోంది.

ఇలా చేసిన తర్వాత, గుడి వద్దనే కాళ్ళు కడుక్కుని, ఆ వెంటనే పరమేశ్వరుడిని దర్శించుకోవడమో, కుదిరితే అభిషేకం చేయించుకోవడమో చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల, ఈశ్వరుడి కరుణ, శనైశ్చరుడి కటాక్షం కలిగి.. ఆర్ధిక, ఆరోగ్య ఇబ్బందులన్నీ తొలగి, కుటుంబంతో సంతోషంగా గడుపుతారని, శాస్త్ర విదితం.

ఇక ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం చేసేటప్పుడు నీరసంగా అనిపిస్తే, కేవలం పళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. వండిన పదార్థాలేవీ తీసుకోకుడదు. ఇక అర్ధ రాత్రి 12 గంటల వరకు మెలకువుగా ఉండి, సరిగ్గా లింగోద్భవ కాలంలో, కుదిరితే ఆ ప్రమేశ్వరుడికి నీళ్ళతో అభిషేకం చేస్తే, ఎంతో మంచి జరుగుతుంది. అభిషేకం చేయడానికి కుదరని వారు, ఆ సమయంలో కనీసం, 108 సార్లు శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు. ఇక ఓపిక ఉన్నవారు రాత్రంతా జాగారం చేసి, దైవ నామ స్మరణ చేయడమో, లేక పురాణ పారాయణమో వినడమో వంటివి చేయాలి. తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, తలస్నానం చేసి, పరమేశ్వరుడికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి, ఆ ప్రసాదాన్ని తొలిగా స్వీకరిండం ద్వారా శివరాత్రి ఉపవాస దీక్ష ముగుస్తుంది. ఈ విధంగా ఈ సారి శివరాత్రి పర్వదినాన్ని చేసుకున్నవారికి, ఆర్ధిక ఇబ్బందులు తొలగి, సకల శుభాలూ కలుగుతాయి.

ఓం నమః శివాయ!

Comments

Post a Comment

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home