శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా? Worshiping Shiva Linga at home
శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా?
శివుడు అభిషేక ప్రియుడనే నానుడి యుగయుగాలుగా, భక్తుల మనస్సులలో నాటుకుపోయి ఉంది. క్షీర సాగర మధనంలో, లోక సంకటమైన కాలకూట విషం ముందుగా ఉద్భవించగా, ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని, గరళకంఠుడనే పేరును స్థిరపరుచుకున్నాడా పరమేశ్వరుడు. అలా తాను మింగిన విషం వలన కలిగే తాపం నుంచి రక్షించుకోవడానికే, ఆ స్వామి హిమగీరులపై నివశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అదే కారణాన ఆయన అభిషేక ప్రియుడిగా కూడా పేరుగాంచాడు. అలా అభిషేకం చేయడం ద్వారా శివయ్య త్వరగా ప్రసన్నం చెంది, కోరిన కోర్కెలు తిరుస్తాడాని, శాస్త్ర వచనం. అందుకే అనాదిగా మానవులనుంచి, దేవతల వరకు, ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోడానికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అందులోనూ శివ రాత్రి నాడు స్వామికి చేసే అభిషేకం వల్ల మరింత పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే, శివరాత్రి నాడు తమ ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేసుకోవాలనుకునే వారిలో చాలా మందికి, అసలు ఆ స్వామికి ఏవిధమైన లింగం పెట్టుకుని అభిషేకం చేయాలి? అసలు ఇంట్లో శివ లింగానికి అభిషేకం చేసుకోవచ్చా, లేదా? అనే సందేహాలు కలుగుతుంటాయి.
ఈ సృష్టిలో ఉన్న అతి శక్తివంతమైన ప్రతిమలలో, శివలింగాలు చాలా ముఖ్యం. సాక్ష్యత్తు ఆది దేవుడైన పరమేశ్వరుడే లింగాకారంలో భక్తులను రక్షిస్తున్నాడని వేదాలు చెబుతున్నాయి. అటువంటి శివ లింగాన్ని ప్రతిష్టంచాలన్నా, పూజించాలన్నా, ఎన్నో విధి విధానాల గురించి వేదాలలో చెప్పబడ్డాయి. వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా పాటించకపోయినా శివగణాలు అస్సలు సహించవనీ, దాంతో తీవ్రమైన దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుందనీ పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే, శివలింగాలను ఆలయాలలో తప్ప, ఇళ్ళలో పెట్టుకోకూడదని ఆర్యోక్తి.
అయితే, ఆ శివయ్యపై అమితమైన భక్తి ఉన్నవారు మాత్రం, ఇళ్ళలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తూ, ఆ పరమేశ్వర లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలూ, అభిషేకాలూ చేస్తూ ఉంటారు. కానీ, అలా చేసేటప్పుడు కూడా, కొన్ని నియమాలను పాటిస్తారు. అవేమిటంటే, ముఖ్యంగా ఇళ్ళలో పెట్టుకునే శివలింగం, మన బొటనివేలు పరిమాణం కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. ఆ సైజులో లింగాన్ని తెచ్చుకున్నా, అది స్వచ్ఛమైన స్పటికతో చేసిన శివలింగాన్ని మాత్రమే తెచ్చుకోవాలి. కేవలం శివరాత్రి నాడు మాత్రమే కాకుండా, ఆ లింగం ఇంట్లో ఉన్నన్ని రోజులూ, శుచిగా శివయ్యకు పూజా పునస్కారాలూ, అభిషేకాలూ, ఖచ్చితంగా చేయాలి. ఆ ఇంట్లో ఉండే ఆడవారికి నెలసరి వస్తే, ఆ ఐదు రోజులూ ఎవరినీ ముట్టుకోకుండా ఓ పక్కనే ఉండాలనీ, అలా చేయకపోతే, ఇల్లంతా మైలు అయ్యే అవకాశం ఉందనీ, దాని వల్ల శివ లింగ నియమాలకు భగం వాటిల్లుతుందనీ పెద్దలు చెబుతున్నారు. అందుకే ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని అభిషేకం చేయాలనుకునేవారు, ఈ నియమాలన్నీ తప్పక పాటించాలి.
అయితే, కేవలం శివ రాత్రి నాడు మాత్రమే, ఇంట్లో శివాభిషేకం చేసుకోవాలనుకునేవారి కోసం, మరో ఉపాయాన్ని కూడా వేద పండితులు చెబుతారు. అదేమిటంటే, పుట్టమన్ను తెచ్చి, స్వచ్ఛమైన ఆవు నేతితో ఓ లింగాన్ని తయారు చేసి, బిల్వ పత్రాలూ, గరికనూ క్రింద పరచి, దానిపై పుట్ట మన్నుతో చేసిన లింగాన్ని ప్రతిష్టించి, ఆ రోజంతగా నిష్టగా శివయ్యకు పూజలూ, అభిషేకాలూ చేయాలి. శివ రాత్రి మర్నాడు ఆ లింగానికి ఉద్వాసన పలికి, దగ్గరలో పారే నదిలో ఆ లింగాన్ని కలపాలని, పండితులు చెబుతున్నారు.
ఓం నమః శివాయ!
Comments
Post a Comment