త్రిగుణములు! భగవద్గీత Bhagavadgita Chapter 13


త్రిగుణములు! అసంఖ్యాకమైన జన్మల కర్మరాశి, ఆత్మకు ఏ జన్మను కలుగచేస్తుంది?

'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..


[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/5QM0ofLK-6I ]

శరీరములోని అన్ని మార్పులూ, మరియు ప్రకృతి త్రిగుణములూ ఎలా సంభవిస్తున్నాయో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు..

00:50 - ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ।। 19 ।।

ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమునూ, జ్ఞానము యొక్క అర్థమునూ, మరియు జ్ఞాన విషయమునూ, నేను తెలియచేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యధార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.

కర్మకాండ, జ్ఞానోపాసన, అష్టాంగమూ మొదలైనవి అభ్యాసం చేసే వారు, వారంతట వారికే అంతా అర్థమయిపోయిందనుకున్నా, భక్తి రహితంగా ఉంటే, భగవద్ గీత యొక్క యధార్థమైన భావమును అర్థం చేసుకోలేరు. భక్తి అనేది, భగవత్ జ్ఞానం దిశగా వెళ్లే ప్రతి ఒక్క మార్గములో, తప్పని సరిగా ఉండవలసినదే. భక్తి అనేది, మనకు భగవంతుని గురించి తెలుసుకోవటానికి సహకరించేది మాత్రమే కాదు, అది భక్తుడిని భగవంతునిలా కూడా చేస్తుంది. కాబట్టి, భక్తులు ఆయన స్వభావాన్ని పొందుతారు. భగవంతుని వంటి వ్యక్తిత్వము ఇంకేదీ లేదు; భక్తి మార్గానికి సమానమైన మార్గము లేదు; గురువుకు సమానమైన మనిషి లేడు; అలాగే, భగవద్గీతకు సాటి వచ్చే శాస్త్రగ్రంథము కూడా ఇంకొకటి లేదు.

02:10 - ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి ।
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ।। 20 ।।

ప్రకృతి అంటే, భౌతిక ప్రకృతి, మరియు పురుషుడు అంటే, ఆత్మలు, రెండూ కూడా అనాదియైనవి.. అనగా, సనాతనమైనవి. శరీరములోని అన్ని మార్పులూ, మరియు ప్రకృతి త్రిగుణములు కూడా, భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.

భౌతిక ప్రకృతినే మాయ అని అంటారు. అది భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, ఆయన ఉన్నప్పటి నుండీ, అది కూడా ఉంది. ఇంకోలా చెప్పాలంటే, అది సనాతనమైనది. ఆత్మ కూడా భగవంతుని శక్తి స్వరూపమే. ఆత్మ అనేది, భగవంతుని యొక్క జీవశక్తి అంశయే. ఆత్మ దివ్యమైనది, మరియు పరివర్తనం చెందనిది. అది వేర్వేరు జన్మలలో, మరియు ఒకే జన్మలోని వివిధ దశలలో, మార్పు చెందకుండా ఉంటుంది. శరీరం ఒక జన్మలో ఆరు దశలుగా మార్పుకు లోనవుతుంది : అస్తి అంటే గర్భాశయములో ఉండుట, జాయతే అంటే పుట్టుక, వర్ధతే అంటే పెరుగుదల, విపరిణమతే అంటే పునరుత్పత్తి, అపక్షీయతే అంటే కృశించిపోవుట, వినశ్యతి అంటే మరణము. శరీరంలో ఈ మార్పులను భౌతిక శక్తి కలుగచేస్తుంది. దానినే, ప్రకృతి, లేదా మాయ అని అంటారు. అది సత్త్వము, రజస్సు, తమస్సు అనబడే ప్రకృతి త్రి-గుణములను, మరియు వాటియొక్క అసంఖ్యాకమైన మేళనములను కూడా సృష్టిస్తుంది.

03:43 - కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ।। 21 ।।

సృష్టి యందు కార్యమునకూ, కారణమునకూ భౌతిక శక్తియే హేతువనీ, సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడనీ చెప్పబడినది.

బ్రహ్మ దేవుని నిర్దేశం అనుసరించి, భౌతిక శక్తి, ఈ సృష్టిలో ఎన్నెన్నో విభిన్నమైన జీవన మూలపదార్థములనూ, మరియు జీవ రాశులనూ సృష్టిస్తుంది. బ్రహ్మ దేవుడు బృహత్ పథకాన్ని రచిస్తాడు. దానిని భౌతిక శక్తి అమలుపరుస్తుంది. భౌతిక జగత్తులో, 84 లక్షల జీవరాశులున్నట్లు, వేదములు పేర్కొంటున్నాయి. ఈ శారీరక స్వరూపాలన్నీ, భౌతిక శక్తి యొక్క రూపాంతరాలే. కాబట్టి, ప్రకృతియే జగత్తులోని కారణము, మరియు కార్యములకు మూలహేతువు. ఆత్మకు ఈ శరీర రూపమనే క్షేత్రము, దాని యొక్క పూర్వ జన్మల కర్మ ఫలముగా లభిస్తుంది, మరియు అది తనను తానే, ఈ శరీరము, మనస్సు, మరియు బుద్ధి అనుకుంటుంది. అందుకే, అది శారీరక సుఖముల కోసం ప్రయత్నిస్తుంది. ఇంద్రియములు, ఇంద్రియవస్తు విషయములతో సంపర్కము చెందినప్పుడు, మనస్సు ఒక ఆనందకర అనుభూతిని పొందుతుంది. ఆత్మ మనస్సుతో అనుసంధానమై ఉన్నకారణంగా, ఆత్మ పరోక్షంగా ఈ సుఖాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా, ఆత్మ అనేది, ఇంద్రియమనోబుద్ధుల ద్వారా, సుఖదుఃఖములను అనుభవిస్తుంది. దీనిని ఒక కలతో పోల్చవచ్చు. ఈ జగత్తు భగవంతునిచే నిర్వహించి, పోషించబడుతున్నది. అది ఒక భ్రాంతిని కలుగచేస్తుంది. అది అసత్యమైనా, ఆత్మని యాతనకు గురి చేస్తుంది. ఇది ఎలాగంటే, స్వప్నంలో వ్యక్తి తల తెగిపోతే, ఆ యాతన, ఆ వ్యక్తి నిద్రలేచి, కలలు కనటం ఆపేంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. శరీరముతోనే అనుసంధానం చేసుకున్న ఈ యొక్క ప్రస్తుత స్వప్న స్థితిలో కూడా, ఆత్మ తన యొక్క పూర్వ, మరియు ప్రస్తుత కర్మల పరంగా, సుఖదుఃఖములను అనుభవిస్తూనే ఉంటుంది. ఫలితంగా, రెండు రకాల అనుభూతులకు కూడా, అదే కారణమని చెప్పబడుతుంది.

05:56 - పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ।
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ।। 22 ।।

ఎప్పుడైతే ప్రకృతిలో స్థితమై ఉన్న పురుషుడు త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ, మరియు నీచ జన్మలకు కారణమగును.

శ్రీ కృష్ణుడు, ఆత్మయే సుఖ దుఃఖానుభూతులకు బాధ్యుడని చెప్పి ఉన్నాడు. ఈ శరీరమే తాననుకుని, ఆత్మ శారీరక సుఖాల దిశగా, దానిని ఉత్తేజపరుస్తుంది. శరీరము మాయచే తయారుచేయబడినది కావున, అది త్రిగుణాత్మకమైన, సత్వము, రజస్సు, మరియు తమస్సులచే ఉన్న భౌతిక ప్రకృతినే అనుభవించాలని చూస్తుంది. అహంకారము వలన, ఆత్మ తానే కర్తను, మరియు శరీరమును అనుభవించేవాడనని అనుకుంటుంది. శరీరము, మనస్సు, మరియు బుద్ధి, అన్ని పనులనూ చేస్తుంటాయి. కానీ, వాటన్నిటికీ జీవాత్మయే బాధ్యుడు. ఇది ఎలాగంటే, ఒక బస్సుకు ప్రమాదం జరిగితే, దాని యొక్క చక్రాలు, మరియు స్టీరింగ్ లపై నింద ఉండదు. ఆ బస్సు యొక్క డ్రైవర్, దానికి బాధ్యత వహించాలి. అదే విధంగా, ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి, ఆత్మచే ప్రేరేపితమై, దాని ఆధీనంలో ఉంటాయి. అందుకే, శరీరముచే చేయబడిన అన్ని పనుల కర్మలనూ కూడబెట్టుకునేది, ఆత్మయే. అసంఖ్యాకమైన జన్మలలో ప్రోగుచేయబడిన ఈ యొక్క కర్మరాశి, ఆత్మకి ఉన్నతమైన, లేదా నీచ గర్భములలో పదే పదే జన్మను కలుగచేస్తుంది.

07:32 - ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ।। 23 ।।

దేహముయందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు, మరియు పరమాత్మ అని చెప్పబడతాడు.

దేహములోని జీవాత్మ యొక్క స్థితిని, ఇంతకు మునుపు శ్రీ కృష్ణుడు వివరించాడు. ఇక ఈ శ్లోకంలో, శరీరములోనే స్థితమై ఉన్న పరమాత్మ యొక్క స్థాయిని గురించి, చెబుతున్నాడు. ఒక జీవాత్మకు తన దేహమును గురించి మాత్రమే తెలుసు. అదే సమయంలో, పరమాత్మకు, అనంతములైన సమస్త శరీరములగురించీ తెలుసు. అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ, తన సాకార రూపములో, విష్ణుమూర్తిగా వ్యక్తమవుతాడు. విష్ణుమూర్తి రూపములో ఉన్న ఆ పరమేశ్వరుడే, సమస్త జగత్తుకూ స్థితికారకుడు. ఆయన బ్రహ్మాండముపైన, తన సాకార రూపములో, క్షీర సాగరములో నివసిస్తాడు. ఆయనే సర్వ భూతముల హృదయములలో, పరమాత్మ స్వరూపంలో వ్యాప్తి నొంది ఉంటాడు. లోపలే కూర్చుని, వారు చేసే పనులను గమనిస్తూ, కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలములను సరియైన సమయంలో అందచేస్తాడు. ప్రతి జన్మలో కూడా, జీవాత్మతో పాటే, దాని వెంటే, అది ఏ శరీరంలోనికి వెళితే, దానిలోకి వెళ్లి ఉంటాడు. ఒక పాము శరీరంలో నైనా, ఒక పంది శరీరమైనా, లేదా ఒక పురుగు శరీరమైనా, తాను వసించడానికి వెనుకాడడు. జీవాత్మకి స్వేఛ్చాచిత్తము ఇవ్వబడినది. అంటే, భగవంతుని వైపుగా, లేదా భగవంతునికి దూరంగా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది. ఆ యొక్క స్వేచ్ఛా చిత్తమును దుర్వినియోగం చేయటం వలన, జీవాత్మ బంధనములో ఉండిపోతుంది. దాని యొక్క సరియైన ఉపయోగమును నేర్చుకోవటం ద్వారా, అది నిత్య శాశ్వత భగవత్ సేవను పొందవచ్చు, అనంతమైన ఆనందమును అనుభవించవచ్చు.

09:32 - య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ।
సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ।। 24 ।।

పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి, మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యధార్థమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా, వారు విముక్తి చేయబడతారు.

అజ్ఞానము వలననే ఆత్మ, ప్రస్తుత సంకట స్థితిలోకి వచ్చింది. భగవంతుని యొక్క అణు అంశగా, తన యొక్క దివ్య అస్థిత్వమును మరచిపోయి, అది భౌతిక దృక్పథంలోనికి పడిపోయింది. కాబట్టి, ప్రస్తుత స్థాయి నుండి తిరిగి తనను తాను పునరుజ్జీవింపజేసుకోవటానికి, జ్ఞానము ప్రధానము. సృష్టిలో మూడు ప్రధానమైన తత్వములు ఉన్నాయి. నిత్యమూ మారుతూ ఉండే భౌతిక ప్రకృతి, మార్పులేని ఆత్మలు, ఈ రెంటికీ అధిపతి అయిన భగవంతుడు. ఈ అస్థిత్వముల అజ్ఞానమే, ఆత్మ యొక్క బంధనమునకు కారణము. వాటి గురించిన జ్ఞానము, మాయ యొక్క బంధనములను త్రుంచివేయుటకు దోహదపడుతుంది. జ్ఞానము అంటే, కేవలం పుస్తక జ్ఞానం కాదు. స్వయముగా అనుభవములోనికి వచ్చిన విజ్ఞానము. జ్ఞానమనేది, ఎప్పుడు స్వీయ అనుభవ విజ్ఞానముగా మారుతుందంటే, మొదట ఈ మూడు తత్వములపై, పుస్తక, సైద్ధాంతిక జ్ఞానమును గురువు ద్వారా, మరియు శాస్త్ర పఠనం ద్వారా తెలుసుకోవాలి. తద్విధముగా, ఆధ్యాత్మిక సాధనచేయాలి. 

11:03 - ఇక మన తదుపరి వీడియోలో, కొన్ని ఆధ్యాత్మిక సాధనల గురించి, శ్రీ కృష్ణుడి వివరణ ద్వారా తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!



Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home