యధార్ధమైన జ్ఞానం! భగవద్గీత Bhagavadgita
పని చేసేటప్పుడు ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు పరిశ్రమించాలి!
'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (25 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 25 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VmldzgSwQps ]
కొన్ని ఆధ్యాత్మిక సాధనల గురించి, శ్రీ కృష్ణుడి వివరణ ఇలా సాగుతోంది..
00:48 - ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ।। 25 ।।
కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు. ఇతరులు దీనినే, జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. మరికొందరు, ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.
వైవిద్యమనేది, భగవంతుని సృష్టి అంతటా ఉన్న లక్షణము. ఒకే చెట్టుకు ఉన్న ఏ రెండు ఆకులూ, ఒక్క లాగే ఉండవు. ఏ ఇద్దరి వ్యక్తుల వ్రేలి ముద్రలు కూడా, ఒకేలా ఉండవు. అదే విధంగా, అన్ని ఆత్మలూ విభిన్నమైనవే, మరియు వాటి వాటి ప్రత్యేక జనన-మరణ చక్ర ప్రయాణంలో ఆపాదించుకున్న విలక్షణమైన స్వభావాలు వాటికి ఉంటాయి. కాబట్టి, ఆధ్యాత్మిక సాధనలో కూడా, అందరూ ఒకే రకమైన అభ్యాసమునకు ఇష్ట పడరు. భగవద్గీత, మరియు వైదిక శాస్త్రముల అద్భుతమైన గొప్పతనం ఏమిటంటే, అవి మనుష్యులలో ఉన్న ఈ అంతర్లీన వైవిధ్యాన్ని అర్థంచేసుకుని, తమ ఉపదేశాలలో వారందరికీ తగిన సూచనలను అందిస్తాయి. కొందరు సాధకులు తమ మనస్సుతో పోరాడి, దానిని నియంత్రణలోనికి తేవటంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారు. వారు తమలోనే స్థితమై ఉన్న భగవంతుడి పై ధ్యానం చేయటానికి, ఆకర్షితమౌతారు. వారి మనస్సు, వారిలోనే ఉన్న భగవంతుని ఆశ్రయం పొంది నిలకడగా ఉన్నప్పుడు, వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. మరికొందరు, తమ బుద్ధితో కసరత్తు చేయటంలో తృప్తి పొందుతారు. ఆత్మ, మరియు శరీరమూ, మనస్సూ, బుద్ధీ, అహంకారమూ వేరనే విషయము, వారిని చాలా ఉత్తేజపరుస్తుంది. ఆత్మ, భగవంతుడు, మాయ అనే ఈ మూడు అస్థిత్వాల గురించి శ్రవణము, మననము, నిధి ధ్యాసన అంటే, వినటం, చింతన చేయటము, దృఢ విశ్వాసంతో నమ్మటం. ఈ ప్రక్రియల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకోవటం, వారికి చాలా ఆనందాన్నిస్తుంది. ఇంకా కొందరు, అర్థవంతమైన కార్యములు చేయటంలో, అత్యంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. భగవంతుడు వారికి ఇచ్చిన శక్తిసామర్థ్యములను, ఆయన కొరకు పనిచేయటంలోనే ఉపయోగిస్తారు. తమ శక్తిలో చిట్ట చివరి భాగాన్ని కూడా, భగవత్ సేవకే వినియోగించినప్పుడు పొందిన తృప్తి, మరింక దేనిలోనూ పొందరు. ఈ ప్రకారంగా, అన్ని రకాల సాధకులూ, తమతమ వ్యక్తిగత సహజస్వభావాలను, ఆ పరమ పురుషుడిని ఆచరణలో తెలుసుకోవటానికి వాడతారు. జ్ఞానము, కర్మ, ప్రేమలతో కూడి ఉన్న ఏ ప్రయాస అయినా పరిపూర్ణత సాధించాలంటే, దానితో భగవత్ ప్రీతికై ఉన్న భక్తిని జత చేయాలి.
03:37 - అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే ।
తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ।। 26 ।।
ఇంకా కొందరు, ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా, ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.
సాధనా పద్ధతులు తెలియని వారు కూడా ఉంటారు. కానీ, ఏదో ఒక విధముగా, వారు ఇతరుల ద్వారా విని, ఆధ్యాత్మిక పథం వైపు ఆకర్షితమవుతారు. నిజానికి, ఆధ్యాత్మికత వైపు వచ్చిన వారు చాలా మంది, ఈ విధంగా వచ్చిన వారే. వారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల శిక్షణ లేకపోయినా, ఏదో ఒక రకంగా దాని గురించి చదివే, లేదా వినే అవకాశం వస్తుంది. దానితో వారికి భగవత్ భక్తి యందు ఆసక్తి పెరిగి, వారు ఆ మార్గంలో ముందుకెళతారు. వైదిక ఆచారంలో, మహాత్ముల వద్ద వినటం అనేది, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఉన్న ఒక శక్తి వంతమైన సాధనముగా ఉద్ఘాటించబడినది. మనం సరియైన చోటనుండి విన్నప్పుడు, విశ్వసనీయమైన, ప్రామాణిక ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అంతేకాక, ఏ మహాత్ముని నుండి వింటున్నామో, ఆ సత్పురుషునికి ఉన్న దృఢ విశ్వాసమూ, నమ్మకమూ, మనకు కూడా రావటం ప్రారంభమవుతుంది. సత్పురుషుల నుండి వినటం అనేది, మన విశ్వాసమును పెంచుకోవటానికి ఉన్న అత్యంత సరళమైన విధానము. ఇంకా చెప్పాలంటే, ఆధ్యాత్మిక కార్యముల పట్ల ఆ మహాత్మునికి ఉన్న ఉత్సాహము, మనకు కూడా అంటుకుంటుంది. సాధకుడికి, భౌతిక దృక్పథం యొక్క జడత్వాన్ని వదిలించుకునీ, మరియు సాధనా పథంలో అడ్డంకులను తొలగించుకోవటానికీ, భక్తి పట్ల ఉత్సాహము చాలా శక్తిని ఇస్తుంది. ఉత్సాహము, మరియు విశ్వాసమనేవి, భక్తి అనే భవంతి నిలిచి ఉండే పునాదులు.
05:37 - యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ ।
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ధి భరతర్షభ ।। 27 ।।
ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులూ, ఈ క్షేత్రమూ మరియు క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగము వలననే ఉన్నాయని, నీవు తెలుసుకొనుము.
ఎంత పెద్దది, లేదా ఎంత సూక్ష్మమైనదయినా సరే.. అవన్నీ, క్షేత్రజ్ఞుడు, మరియు క్షేత్రము యొక్క కలయిక వలననే జనించాయి. వైదిక శాస్త్రము ప్రకారం, ఎక్కడెక్కడైతే చైతన్యం ఉంటుందో, అక్కడ ఆత్మ ఉండవలసినదే. ఆత్మ లేకుండా, చైతన్యము ఉండదు. స్థావర జీవములైన మొక్కలు కూడా, భావోద్వేగాలు అనుభూతి చెంది, వాటికి ప్రతిస్పందిస్తాయని, ప్రయోగాల ద్వారా ఎంతో మంది నిరూపించారు. ఆహ్లాదకరమైన సంగీతం, మొక్కల పెరుగుదలను ఇనుమడింపచేస్తుందని, మేధావులు తేల్చి చెప్పారు. వేటగాడు ఒక చెట్టుపై కూర్చున్న పక్షిని కొట్టినప్పుడు, ఆ చెట్టులో జరిగే ప్రకంపనలు, పక్షి కొరకై ఆ చెట్టు విలపించటాన్ని సూచిస్తాయి. ఎప్పుడైతే ఒక ప్రేమించే తోటమాలి, తోటలోకి వస్తాడో, అప్పుడు చెట్లు చాలా సంతోషపడతాయి. చెట్టులో జరిగే ప్రకంపనలు, చెట్టుకి కూడా చైతన్యము ఉంది, అది కూడా భావోద్వేగాలకు లోనవుతుందన్న విషయాన్ని తెలియచేస్తాయి. ఈ పరిశీలనలన్నీ, సమస్త జీవస్వరూపాలూ చైతన్యమును కలిగి ఉంటాయని, శ్రీ కృష్ణుడు చెప్పిన విషయాన్ని దృఢపరుస్తున్నాయి. అవన్నీ, చైతన్యమును కలిగించే నిత్య సనాతన జీవాత్మ, మరియు భౌతిక శక్తిచే తయారుచేయబడ్డ జడ శరీరముల యొక్క కలయిక వలన ఏర్పడ్డవే.
07:19 - సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ।। 28 ।।
సమస్త ప్రాణులలో, ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడూ, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్లు.
దేహంలో కేవలం ఆత్మను చూస్తే సరిపోదు. భగవంతుడు పరమాత్మ స్వరూపంలో అన్ని దేహములలో స్థితమై ఉన్నాడని కూడా గమనించాలి. సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాడని గ్రహించాలి. జీవాత్మ తన జనన-మరణ చక్ర ప్రయాణంలో, ఒక శరీరం నుండి ఇంకొక శరీరం లోనికి వెళ్ళినప్పుడల్లా, పరమాత్మ దానితో పాటుగా వెళుతూ ఉంటాడు. సర్వ భూతములలో ఆ పరమాత్మను దర్శించటం, సాధకుని జీవితాన్ని మార్చివేస్తుంది.
08:13 - సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ ।
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ।। 29 ।।
సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే, తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.
మనస్సనేది, స్వతహాగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. భౌతిక ప్రాపంచిక శక్తిచే తయారు చేయబడినది కావున, సహజంగానే, భౌతిక సుఖాల వైపు మొగ్గు చూపుతుంది. మన మనస్సు యొక్క ఆలోచనలను అనుసరిస్తే, మనం ఇంకా ఇంకా భౌతిక ప్రాపంచికత లోతుకు దిగబడతాము. ఈ మరింత క్రిందిక్రిందికి దిగజారిపోవటాన్ని నిరోధించాలంటే, మనస్సును బుద్ధి యొక్క సహాయంతో నియంత్రించాలి. దీనికోసం, బుద్ధిని యదార్ధమైన జ్ఞానముచే శక్తివంతం చేయాలి. ఎవరైతే భగవంతుడిని పరమాత్మ స్వరూపంలో, సర్వ భూతములలో దర్శిస్తారో, వారు ఈ జ్ఞానమునకు అనుగుణంగా బ్రతుకుతారు. ఇతరులతో తమకున్న సంబంధం నుండి, వ్యక్తిగత లాభము, మరియు స్వార్థ సుఖానుభవములను పొందటానికి, ఆశింపరు. వారు చేసిన మంచి చేత, వారిపట్ల మమకారం పెంచుకోరు, లేదా వారు చేసిన కీడు వల్ల, వారిని ద్వేషింపరు. అంతేకాక, ప్రతివ్యక్తినీ, భగవంతుని అంశగా చూస్తూ, అందరి పట్లా చక్కటి ఆదరాన్నీ, సేవా భావమునూ చూపుతారు. సహజంగానే వారు, అందరిలో ఉన్న భగవంతుడిని చూసినప్పుడు, ఇతరులను దుర్భాషలాడటం, మోసం చేయటం, లేదా అవమానించటం వంటి పనులను చేయరు. అలాగే, మానవ జనిత వివక్షలైన జాతీయత, మతము, కులము, లింగ బేధము, హోదా, వర్ణము వంటి వన్నీ, అసందర్భమైనవిగా అయిపోతాయి. ఈ విధంగా వారు అందరిలో భగవంతుడిని దర్శించటం ద్వారా, తమ మనస్సులను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళి, చిట్టచివరికి సర్వోత్కృష్ట లక్ష్యమును చేరుకుంటారు.
10:15 - ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। 30 ।।
శరీరము యొక్క అన్ని కార్యములు చేసేది, భౌతిక ప్రకృతియే. దేహమునందున్న జీవాత్మ, నిజానికి ఏపనీ చేయదని అర్థంచేసుకున్న వారు, నిజముగా చూసినట్టు.
తంత్ర భాగవతం ఇలా పేర్కొంటున్నది: ‘ఈ శరీరమే నేను అనుకునే అహంకారమూ, మరియు చేసేది నేనే అన్న గర్వమూ, జీవాత్మని జనన-మరణ, సంసారచక్రములో బంధించివేస్తాయి.’ భౌతిక దృక్పథంలో, అహంకారమనేది, మనలను మనం ఈ శరీరమే అనుకునేలా చేస్తుంది. అందుకే మనం శరీర కార్యములను ఆత్మకు ఆపాదించి, ‘నేను ఇది చేస్తున్నాను... నేను అది చేస్తున్నాన’ని అనుకుంటూ ఉంటాము. కానీ, జ్ఞానోదయమయిన జీవాత్మ, భుజించేటప్పుడూ, త్రాగేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ, నడిచేటప్పుడూ మరియు మిగతా అన్ని పనులనూ చేసేటప్పుడూ, శరీరమే ఈ పనులన్నీ చేస్తున్నదని గమనిస్తుంది. అయినా, శరీరము చేసే పనులతో నాకు సంబంధం లేదని అది భావించరాదు. ఎలాగైతే ఒక దేశం, యుద్ధానికి వెళ్ళటానికి తీసుకున్న నిర్ణయానికి, ఆ దేశ అధిపతి స్వయంగా యుద్ధం చేయకపోయినా, ఆయనే బాధ్యుడో, ఆ విధంగానే జీవప్రాణులు చేసే పనులకు, అవన్నీ శరీరం, మనస్సు, బుద్ధులచే చేయబడినా, ఆత్మదే బాధ్యత. అందుకే ఆధ్యాత్మిక సాధకుడు, ఈ రెండు ప్రక్కలనూ మనస్సులో ఉంచుకోవాలి. ‘రామా, పని చేసేటప్పుడు, ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు, పరిశ్రమించుము; కానీ, మనస్సులో మాత్రం, చేసేది నీవు కాదని గుర్తుంచుకో.’ అని వశిష్ఠ మహర్షి రాముడికి ఉపదేశం చేశాడు.
12:04 - ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ అనేది, శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాకుండా ఎలా ఉండగలదో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment