ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! భగవద్గీత Bhagavadgita
జీవాత్మ - దేహము! ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి!
'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (01 – 04 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 01 నుండి 04 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VswiutHKUvg ]
ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది.
00:50 - శ్రీ భగవానువాచ ।
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ।
యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ।। 1 ।।
శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యనూ, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమునూ నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ, అత్యున్నత పరిపూర్ణతను సాధించారు.
గతంలో శ్రీ కృష్ణుడు, ఆత్మ మరియు భౌతిక పదార్ధ మేళనముతోనే, సమస్త జీవ భూతములూ తయారైనాయని చెప్పి ఉన్నాడు. భౌతిక ప్రకృతియే ఆత్మ కొరకు క్షేత్రమును సృష్టిస్తుందని కూడా, వివరించి ఉన్నాడు. ఇది తనకు తానే స్వతంత్రముగా జరిగిపోదు. ప్రాణుల దేహములోనే స్థితమై ఉన్న పరమేశ్వరుడైన భగవంతుని దిశానిర్దేశం ప్రకారమే జరుగుతుందని కూడా చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల గురించి విస్తారముగా వివరించబోతున్నాడు. ఈ జ్ఞానమును తెలుసుకుని, అంతఃకరణలో ఆచరణాత్మక విజ్ఞానముగా స్థిరపరుచుకున్న పిదప, మనము అత్యున్నత పరిపూర్ణతకు ఎదగవచ్చని చెబుతున్నాడు.
02:04 - ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ।
సర్గేఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ।। 2 ।।
ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు, నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు, లేదా ప్రళయ సమయంలో నాశనం కారు.
తను అనుగ్రహించబోయే ఈ జ్ఞానమును అర్థం చేసుకున్నవారు, పదేపదే ఒక తల్లి గర్భములో ఉండవలసిన అవసరం ఉండదని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు. వారు ప్రళయ కాలంలో భగవంతుని ఉదరములో, అచేతనావస్థలో ఉండిపోవల్సిన అవసరం కానీ, లేదా, తదుపరి సృష్టి క్రమంలో మళ్లీ పుట్టటం కానీ, జరుగదు. ఈ ప్రకృతి త్రిగుణములే, యదార్థముగా బంధనమునకు కారణము. వాటి యొక్క జ్ఞానమే, ఈ కర్మబంధనము నుండి విముక్తి మార్గాన్ని ప్రకాశింపజేస్తూ, సుగమం చేస్తుంది. శ్రీ కృష్ణుడు తన శిష్యుడిని, ఏకాగ్రతతో వినేట్టు చేయటం కోసం, తను ఉపదేశం చేయబోయే దాని యొక్క ఫలమును పదేపదే పేర్కొనటం చేస్తుంటాడు. ఎప్పుడైతే జీవాత్మ భౌతిక శక్తి నుండి విడుదల చేయబడుతుందో, అది భగవంతుని యొక్క దివ్య యోగమాయా శక్తి యొక్క ఆధీనంలోకి వస్తుంది. ఆ దివ్య యోగమాయా శక్తి, జీవాత్మకు భగవంతుని యొక్క దివ్య జ్ఞానమునూ, ప్రేమనూ, మరియు ఆనందమునూ అందిస్తుంది. తద్వారా ఆ జీవాత్మ, భగవంతుని లాగా అయిపోతుంది. అది ఇక దైవీ గుణములను పొంది ఉంటుంది.
03:35 - మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ ।
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ।। 3 ।।
03:45 - సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ।। 4 ।।
ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ఆ విధంగా సమస్త జీవభూతములూ జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకూ, ఈ భౌతిక ప్రకృతియే గర్భము, మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
భౌతిక జగత్తు, సృష్టి-స్థితి-లయము అనే చక్రమును అనుసరిస్తుంది. లయకాలములో, ఈశ్వరునికి విముఖమై ఉన్న ఆత్మలు, శ్రీమహా విష్ణు శరీరములో అచేతనావస్థలో పడి ఉంటాయి. భౌతిక శక్తి, ప్రకృతి కూడా, భగవంతుని మహోదరములో, అవ్యక్తముగా నిలిచి ఉంటుంది. భగవంతుడు సృష్టి చక్రమును ప్రారంభించటానికి సంకల్పించినప్పుడు, ఆయన ప్రకృతి వైపు దృష్టి సారిస్తాడు. దానితో అది విచ్చుకోవటం ప్రారంభమవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, మహత్తు, అహంకారము, పంచ-తన్మాత్రలు, మరియు పంచ-మహాభూతములూ సృష్టించబడతాయి. అంతేకాక, ద్వితీయ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సహకారంతో, భౌతిక శక్తి విభిన్నములైన జీవ స్వరూపములను సృష్టిస్తుంది. భగవంతుడు, ఆత్మలను వాటి పూర్వ కర్మల అనుగుణంగా, వాటిని సముచితమైన శరీరాలలో ప్రవేశపెడుతాడు. ఈ విధంగా, ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు, రేతస్సు వంటివి. ప్రకృతితల్లి గర్భములో, ఆయన ఆత్మలను ప్రవేశపెట్టడం ద్వారా, అనేకానేక జీవరాశులు పుడుతున్నాయి. మహర్షి వేద వ్యాసుడు కూడా, శ్రీమద్ భాగవతంలో ఇదే విధముగా వివరించి ఉన్నాడు. ‘భౌతిక ప్రకృతి గర్భములో, పరమేశ్వరుడు జీవాత్మలను ప్రవేశపెడతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క జీవాత్మకూ, వాటి వాటి కర్మరాశి అనుగుణంగా, ప్రకృతి వాటికి తగిన దేహములను తయారుచేస్తుంది.’ భగవంతుడు అన్ని ఆత్మలనూ, ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశపెట్టడు. కేవలం ఈశ్వర విముఖమైన వాటినే తెస్తాడు.
05:55 - ఇక మన తదుపరి వీడియోలో, నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించేవి ఏంటో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment