భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడంటే ఏమిటి? భగవద్గీత Bhagavadgita

 

అందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐

పరమ పదము! భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడంటే ఏమిటి?

'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ogh8suoqPWc ]


ఆత్మ అనేది, శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాకుండా ఎలా ఉండగలదో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు..

00:50 - యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 31 ।।

విభిన్న వైవిద్యములతో కూడిన జీవరాశులన్నీ, ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడూ, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవని అర్థం చేసుకున్నప్పుడూ, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.

సముద్రము తానే అలలుగా, నురగగా, సుడులుగా, తరంగములగా మార్చుకుంటుంది. ఎవరికైనా ఇవన్నీ వేర్వేరుగా మొదటిసారి చూపిస్తే, వారు ఇవన్నీ వేర్వేరని అనుకుంటారు. కానీ, సముద్రము గురించి తెలిసిన వ్యక్తి, ఆ విభిన్నమైన వాటన్నిటిలో, అంతర్లీనంగా ఉన్న ఏకత్వమును చూస్తాడు. అదే విధంగా, అతిచిన్న అమీబా నుండి, అత్యంత శక్తివంతులైన దేవతల వరకూ, ఎన్నెన్నో రకాల జీవ రాశులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే సత్యముపై స్థితమై ఉన్నాయి. అదే జీవాత్మ.. అది భగవంతుని అంశ.. అది భౌతిక శక్తితో తయారుచేయబడిన శరీరము యందు కూర్చుని ఉంటుంది. ఇన్ని రూపముల వైవిద్యము వచ్చినది, ఆత్మ వలన కాదు. అది భౌతిక శక్తిచే తయారుచేయబడిన విభిన్న శరీరముల వలన మాత్రమే. జన్మించే సమయంలో, సమస్త ప్రాణుల శరీరములూ, భౌతిక శక్తిచే సృష్టించబడతాయి. మరణించిన పిదప, అవన్నీ మళ్ళీ దానిలోనే కలిసిపోతాయి. విభిన్నములైన జీవరాశులన్నీ, ఒకే భౌతిక శక్తి యందు స్థితమై ఉన్నట్టు గమనించినప్పుడు, మనం ఈ భిన్నత్వం వెనుక ఉన్న ఏకత్వమును తెలుసుకోవచ్చు. అలాగే, ప్రకృతి స్వభావము భగవంతుని శక్తి కావున, ఇటువంటి జ్ఞానము మనలను, ఒకే ఆధ్యాత్మిక అస్థిత్వము జగత్తు అంతటా వ్యాప్తమై ఉన్నదని గ్రహించేటట్లు చేస్తుంది. ఇది బ్రహ్మ పరిజ్ఞానమునకు దారి తీస్తుంది.

02:42 - అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ।। 32 ।।

ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏ మాత్రం కళంకితము కాదు.

సమస్త ప్రాణుల హృదయములలో పరమాత్మగా స్థితమై ఉన్న భగవంతుడు, ఎప్పుడూ శరీరముతో అనుసంధానం కాడు, లేదా దేహము యొక్క స్థితిగతులచే ప్రభావితం కాడు. భౌతిక శరీరంలో ఉన్నంత మాత్రాన, ఆయన ఏ కోశానా భౌతిక పరంగా అవ్వడు. ఆయన కర్మ సిద్ధాంతమునకు అతీతుడు, మరియు జనన మరణ చక్రమునకు లోబడి ఉండడు. కానీ, ఇవి జీవాత్మకు అనుభవంలోకి వస్తాయి.

03:34 - యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ।
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ।। 33 ।।

ఆకాశము అన్నింటినీ తనలోనే కలిగిఉంటుంది. కానీ, సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది, శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.

తాను దేహమే అన్న అనుభూతిని కలిగించే అహంకారము వలన, ఆత్మ - నిద్రపోవటం, నడవటం, అలసట, ఉల్లాసం మొదలైన స్థితిగతులను అనుభవిస్తుంటుంది. శరీరములో జరిగే పరిణామాలు, ఆత్మను ఎందుకు ప్రభావితం చేయవు అన్న సందేహం మనకు రావచ్చు. శ్రీ కృష్ణుడు దీనిని ఆకాశము యొక్క ఉదాహరణతో, వివరిస్తున్నాడు. అది అన్నింటినీ కలిగి ఉంటుంది కానీ, దేనిచే ప్రభావితం కాదు. ఎందుకంటే, అది తనలో ఉండే స్థూలవస్తువులకన్నా సూక్ష్మమైనది. అదే విధముగా, ఆత్మ అనేది, చాలా సూక్ష్మమైన శక్తి స్వరూపము. భౌతిక శరీరముతో అనుసంధానమై ఉన్నా, అది తన దివ్యత్వమును అలాగే ఉంచుకుంటుంది.

04:48 - యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ।। 34 ।।

ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమునూ ప్రకాశింపచేయునో, అలాగే, ఒక్క ఆత్మయే, మొత్తము శరీరమును చైతన్యము చే ప్రకాశింపచేయును.

ఆత్మ, తను ఉన్న దేహమును చైతన్యముచే తేజోమయం చేసినా, అది మాత్రం, చాలా చిన్నది. ఒక వెంట్రుక యొక్క చివరిభాగాన్ని వంద భాగాలుగా విభజించి, దాని యొక్క ఒక్కొక్క ముక్కనూ ఇంకా వంద భాగాలుగా చేస్తే, మనకు ఆత్మ యొక్క పరిమాణం తెలుస్తుంది. ఈ ఆత్మలు అసంఖ్యాకమైనవి ఉన్నాయి. ఆత్మ యొక్క సూక్ష్మత్వం చెప్పటానికి, ఇదొక ఉదాహరణ. ఇటువంటి అత్యంతసూక్ష్మమైన ఆత్మ, మరి ఇంత పెద్ద శరీరమును ఎలా శక్తివంతం చేస్తుందనేదానికి, శ్రీ కృష్ణుడు దీనిని సూర్యుని ఉపమానముతో వివరిస్తున్నాడు. ఒక్క చోటనే స్థితమై ఉన్నా, సూర్యుడు తన ప్రకాశంతో, సమస్త సౌరకుటుంబమునూ ప్రకాశితం చేస్తుంటాడు.

05:54 - క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా ।
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ।। 35 ।।

జ్ఞాన-చక్షువులచే, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క బేధమును గ్రహించేవారూ, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారూ, పరమ పదమును చేరుకుంటారు.

తనదైన సహజ శైలిలో శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, క్షేత్రము, మరియు క్షేత్రజ్ఞుడి యొక్క విషయమును, ఇప్పటివరకూ చెప్పిన దాని సారాంశము చెపుతూ, ముగిస్తున్నాడు. నిజమైన జ్ఞానము అంటే, భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోనటమే. ఇటువంటి విచక్షణా పూర్వక జ్ఞానము కలిగినవారు, తమను తాము భౌతిక శరీరము అనుకోరు. తమ యొక్క ఆధ్యాత్మిక అస్థిత్వమును జీవాత్మగా, మరియు భగవంతుని యొక్క అంశ లాగా గుర్తిస్తారు. కాబట్టి, వారు ఆధ్యాత్మిక పురోగతి పథమునే కోరుకుని, భౌతిక ప్రకృతి నుండి విముక్తిని కోరుకుంటారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానోదయ మార్గంలో పయనించి, అటువంటి వివేకవంతులు, వారి యొక్క అత్యున్నత లక్ష్యమైన భగవత్ ప్రాప్తిని పొందుతారు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగోనామ త్రయోదశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 35 శ్లోకాలూ సంపూర్ణం..

07:30 - ఇక మన తదుపరి వీడియోలో, పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home