స్వరోచి జన్మ రహస్యం! వరూధిని ప్రవరుడిని పొందగలిగిందా? The Origin of Swarochi Manu - Markandeya Purana


స్వరోచి జన్మ రహస్యం! వరూధిని ప్రవరుడిని పొందగలిగిందా?

అప్సరసలలో ఒకరైన వరూధిని వృత్తాంతంలో, ఆమె కోరికనూ, ఆమెనూ త్యజించిన ప్రవరుడనే బ్రాహ్మణుడి గురించీ, ఉత్సుకతను కలిగించే వారిద్దరి సమాగమానికి సంబంధించిన ఘటనలనూ, మన గత వీడియోలో తెలుసుకున్నాము.. చూడనివారికోసం ఆ లింక్ ను, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. తదుపరి భాగమైన ఈ రోజుటి మన వీడియోలో, వరూధిని ప్రవరుడిని మళ్లీ కలుసుకోగలిగిందా? ప్రవరుడి గురించి తెలిసి, వరూధినిని ప్రేమించిన గంధర్వుడు ఏం చేశాడు? వరూధిని మోసపోవడానికి గల కారణమేంటి - వంటి ఆసక్తిని కలిగించే విషయాలను తెలుసుకుందాము..


[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ytYeyP4Jmr0 ]

ప్రవరుడు తన ఇంటికి చేరి, యధావిధిగా తన నిత్యకృత్యాలు చేసుకోసాగాడు. అక్కడ హిమాలయాలలో వరూధిని, ప్రతిరోజూ ప్రవరుణ్ణి తలుచుకుంటూ, దినమొక యుగంగా భావిస్తూ, ఎప్పటికైనా అతడు తన దరికి చేరకపోతాడా! అని ఎదురుచూస్తూ, భారంగా కాలం గడపసాగింది. తనలో తాను, "అయ్యో, నేనెంత పాపాత్మురాలను. వలచిన వరుణ్ణి పొందలేకపోయాను. ఆ బ్రాహ్మణుడితో సంగమించని ఈ శరీరం నాకెందుకు? ఇప్పటిదాకా ఈ పర్వతం మీద అందంగా కనిపించిన దృశ్యాలన్నీ, నేడు నాకు ఆనందాన్ని ఏమాత్రం కలిగించడం లేదు. హతవిధీ!" అని విలపిస్తూ సంచరిస్తోంది.

వరూధినిని, పూర్వం 'కల' అనే గంధర్వుడు ప్రేమించాడు. అయితే, ఆమె అతడిని తిరస్కరించింది. ఆ గంధర్వుడు అటువైపుగా వచ్చి, వరూధిని పడుతున్న అవస్థను గమనించాడు. ఆమె మనోగతాన్ని తెలుసుకున్నాడు. వెంటనే అతడికి ఒక దుష్ట ఆలోచన తట్టింది. వరూధిని అంతకు ముందు తాను ఎంత వేడుకున్నా, తనను తిరస్కరించింది. ఆమెను పొందడానికి అదే సరైన సమయమని భావించి, వెంటనే ప్రవరుడి రూపాన్ని ధరించాడు. ఏమీ ఎరుగనివాడిలా, వరూధిని సంచరిస్తున్న ప్రదేశానికి దగ్గరాలో, తానూ సంచరించసాగాడు. వరూధిని తన సమీపంలో ఉన్న మాయా ప్రవరుణ్ణి చూసి, నిజం తెలియని ఆమె అతడి దగ్గరకు వెళ్ళి, "స్వామీ, నా మీద దయచూపండి. మీరు లేకపోతే నేను జీవించలేను కాబట్టి, నన్ను చేపట్టండి. నన్ను వదిలివెళితే, మీకు పాపం చుట్టుకుంటుంది. ఈ దివ్యమైన హిమాలయ గుహలలో, నాతో సంగమించి, ఆనందాన్ని కలిగించండి" అని పరిపరివిధాలుగా ప్రార్థించింది.

వరూధిని ప్రార్థన విన్న మాయాప్రవరుడు, "దేవీ! నీ ప్రార్థన వింటుంటే, నా మనస్సు కరిగిపోతోంది. ధర్మవిరుద్ధమైనప్పటికీ, నీ మాట మన్నించాలనిపిస్తోంది. అయితే, నేను చెప్పినట్టు వింటేనే, నీతో నేను సంగమిస్తాను. అలా చేయకపోతే, మన సంగమం జరగదు" అని అన్నాడు. "స్వామీ! మీరేం చెబితే అది చేస్తాను. దయచేసి నన్ను అనుగ్రహించండి" అని అన్నది వరూధిని. “దేవీ, నీతో నేను సంగమించేటప్పుడు, నీవు కళ్లు తెరవకూడదు. అలా అయితేనే, నేను సంగమిస్తాను. ఇదే నియమం” అని అన్నాడు. అందుకు నిస్సంకోచంగా అంగీకరించింది వరూధిని. ఇక ఆనాటి నుంచి, మాయాప్రవరుడూ వరూధినీ, ఆ హిమాలయ వనాలలో సంచరిస్తూ, ఆనందంగా కాలం గడపసాగారు. వరూధిని మాత్రం, ప్రవరుడికిచ్చిన మాట ప్రకారం, సంభోగ సమయంలో కళ్లు మూసుకుని, మహా తేజోవంతుడైన ప్రవరుడి రూపాన్నే మనస్సులో ధ్యానించేది. అలా జరుగుతుండగా కొంతకాలానికి, మాయా ప్రవరుడైన ‘కల’ ద్వారా, వరూధిని గర్భం దాల్చింది. మాయా ప్రవరుడు, తను ఇంటికి వెళ్లే సమయమైందనీ, వచ్చి చాలా కాలమైంది గనుక, తన వారంతా తనకోసం ఎదురు చూస్తుంటారనీ వరూధినికి నచ్చచెప్పి, ఆమె అనుమతితో తిరిగి వెళ్ళిపోయాడు.

నవమాసాలూ నిండిన తరువాత వరూధిని, దివ్య తేజస్సుతో, సూర్యుడితో సమానమైన కాంతితో వెలిగిపోతున్న ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడు ‘స్వరోచి’ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అతడు దినదిన ప్రవర్ధమానుడై, క్రమానుసారంగా, నాలుగు వేదాలనూ, సకల శాస్త్రాలనూ అభ్యసించి, ధనుర్విద్యా పారంగతుడై, యౌవనదశకు చేరుకున్నాడు. మహా వీరుడైన స్వరోచి ఒకనాడు, మంధర పర్వతం మీద విహరిస్తున్నాడు. అక్కడ అతడికి, భయంతో సంచరిస్తున్న ఒక కన్య కనిపించింది. ఆ కన్య స్వరోచిని చూసి, రక్షించమని వేడుకుంది. భయంతో వున్న ఆ కన్యను సముదాయించి, 'దేవీ, ఎవరు నీవు? భయపడకు" అని ధైర్యం చెప్పాడు. అప్పటికి కొంత తేరుకున్న ఆ కన్య, నెమ్మదిగా మాటలు పెగల్చుకుని, జరిగిన సంగతి చెప్పడం ప్రారంభించింది.

"స్వామీ, నేను ఇందీవరుడనే విద్యాధరుడి కుమార్తెను. నా పేరు మనోరమ. నాకు విభావరి, కళావతి అనే ఇద్దరు చెలికత్తెలున్నారు. నేను ఒకరోజు నా చెలికత్తెలతో కలసి, కైలాసపర్వత సమీపంలో వున్న ఒక చెరువు దగ్గరికి వెళ్లాను. అక్కడ ఒకముని తపస్సు చేస్తూ నాకు కనిపించాడు. ఆయన ఎంతో సన్నగా, వికారంగా కనబడేసరికి, నేను ఆయనను చూసి, గట్టిగా నవ్వాను. అది గ్రహించిన ఆ తపస్వి కోపంతో, 'ఓసీ, దుష్టురాలా! నన్ను చూసి పరిహసించిన నీవు, ఒక రాక్షసుడి చేతిలో పరాభవాన్ని పొందుదువు గాక!' అని శపించాడు. ప్రభూ, నన్ను ముని శపించడం విన్న నా చెలికత్తెలిద్దరూ, కోపం ఆపుకోలేక, ఆ మునిని పరుష వాక్యాలతో దూషించారు. అప్పుడా ముని వారిని కూడా ఘోరంగా, ఒక దానిని కుష్ఠు వ్యాధిగ్రస్తురాలివి కమ్మనీ, ఇంకో చెలిని క్షయ వ్యాధి పీడితురాలివి కమ్మనీ శపించాడు. ఓ మహారాజా, ముని శాపంతో నా చెలులిద్దరికీ వ్యాధులు సంక్రమించాయి.

నన్ను ఒక రాక్షసుడు తరుముకొస్తున్నాడు. అతడిని తప్పించుకుని, మూడురోజులుగా నేను పరుగెడుతూనే ఉన్నాను. అదిగో, ఆ చివర నిలుచుని గర్జిస్తున్నాడే, అతడే ఆ రాక్షసుడు. ప్రభూ, ఈ దివ్యాస్త్రాన్ని గ్రహించండి. ఈ అస్త్రాన్ని పూర్వం, పరమేశ్వరుడు స్వాయంభువ మనువుకు ఇచ్చాడు. ఆయన ఈ అస్త్రాన్ని వశిష్ఠమహార్షికి ఇవ్వగా, వశిష్ఠులవారు దానిని మా తాతగారైన చిత్రాంగదుల వారికి సమర్పించారు. ఆయన మా తండ్రిగారికి ఇవ్వగా, మా తండ్రి నాకు అప్పగించారు. ఇది ఎంతో శక్తివంతమైనది. దీనిని గ్రహించి, నన్ను వెంటాడుతున్న ఆ రాక్షసుడి మీద ప్రయోగించి, అతడిని సంహరించండి" అని కోరింది.

స్వరోచి ఆమె దగ్గర నుంచి విధివిధానంగా, ఆ దివ్యాస్త్రాన్ని గ్రహించాడు. అంతలో ఆ రాక్షసుడు అరుస్తూ వచ్చి, ఒక్కసారిగా ఆ కన్యను పట్టుకున్నాడు. "ప్రభూ, కాపాడండి" అని ఆమె గట్టిగా విలపించింది. వెంటనే స్వరోచి, తను పొందిన దివ్యాస్త్రాన్ని, ఆ రాక్షసుడి మీదకు ఎక్కుపెట్టాడు. అది చూసిన రాక్షసుడు వెంటనే, ఆ కన్యను విడిచిపెట్టి, స్వరోచితో, “ప్రభూ, నన్ను క్షమించండి. మీ అస్త్రాన్ని ఉపసంహరించండి. దయచేసి నా వృత్తాంతాన్ని వినండి. పూర్వం బ్రహ్మమిత్రుడనే మహాముని, అధర్వణవేదంలో ఎంతో గొప్ప పాండిత్యాన్ని పొంది, అందులో భాగమైన ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా అభ్యసించాడు. నా పేరు ఇందీవరాక్షుడు. నేను ఈ కన్యకు తండ్రిని. ఒకనాడు నేను బ్రహ్మమిత్రుడి దగ్గరకు వెళ్ళి, నాకు ఆయుర్వేదాన్ని బోధించమని కోరాను. అలా నేను ఎంతో వినయంగా ఎన్నిసార్లడిగినా, ఆయన ఆ విద్యను నాకు బోధించలేదు. ఒకనాడా ముని ఆయుర్వేదాన్ని తన శిష్యులకు బోధిస్తున్న సమయంలో, రహస్యంగా నేనా విద్యను విని, నేర్చుకున్నాను.

నాకు ఇష్టమైన విద్యను సంపూర్ణంగా నేర్చుకున్న తరువాత, ఆయన దగ్గరకు వెళ్ళి, ఆనందంతో గట్టిగా నవ్వసాగాను. ఆ ముని నా విషయాన్నంతా గ్రహించి, కోపంతో నన్నిలా శపించాడు. "ఓరీ దుర్మతీ, రాక్షసుడిలా నీవు, మాయోపాయంతో, రహస్యంగా విద్యను నా నుంచి అపహరించావు. పైగా, నన్ను చులకన చేస్తూ పరిహసించావు. కనుక నీవు ఏడు రోజులలో భయంకరమైన రాక్షసుడివౌతావు" అని శపించాడు. అప్పుడు నేను ఆయన పాదాల మీద పడి, క్షమించమని ప్రార్థించాను. దానికి ఆయన, ‘నా శాపానికి తిరుగులేదు. అయితే, నీవు రాక్షస రూపం ధరించిన రెండు వారాలలోనే, తిరిగి నీ యధారూపాన్ని పొందుతావు. రాక్షస రూపంలో వున్నప్పుడు, నీవు జ్ఞానాన్ని కోల్పోయి, నీ కుమార్తెనే భక్షించాలని ప్రయత్నిస్తావు. ఆ సమయంలో ఒక మహావీరుడి ద్వారా, దివ్యాస్త్రం ఎక్కుపెట్టబడి, తక్షణమే నీవు నీ పూర్వస్మృతిని పొంది, తిరిగి నీ శరీరాన్ని ధరిస్తావు.’ అని శాపవిమోచనాన్ని అనుగ్రహించాడు. ప్రభూ, ఇదీనా కథ..” అని రాక్షసుడు స్వరోచికి తన గతాన్ని వివరించాడు..

ఇందీవరాక్షుడు స్వరోచికిచ్చిన వరం ఏమిటి? ఆయుర్వేద విద్యా, సమస్త ప్రాణుల స్వరాలను వినే విద్యా, పద్మినీ విద్యలను ఎలా పొందగలిగాడు? స్వరోచిని మనోరమ ఏ షరతు మీద వివాహం చేసుకుంది? జింక వలన స్వరోచికి కలిగిన జ్ఞానోదయం ఏంటి - వంటి ఆసక్తికర విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home