ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? Shocking facts about Bibi Nanchari
ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా?
శ్రీరంగంలో నిత్యం పూజలందుకుంటున్న ముస్లిం యువతి ఎవరు?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి భార్యలుగా పద్మావతి.. అలిమేలు మంగలతో పాటు, తిరుమలలో తుళుక్క నాచియార్ పేరుతో పూజలందుకుంటున్న ఒక ముస్లిం యువతి గురించి, చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఆమె ఎవరు? ముస్లిం యువతి వేంకటేశ్వరుని భార్య ఎలా అయ్యింది? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L-zdTXdLyVs ]
తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి, రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించబడిన స్వామివారి ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే, ఎంత ధనం సమకూరుతుందో కదా! అని అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి, రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని, తిరిగి తన రాజ్యానికి బయలుదేరాడు. దిల్లీకి చేరుకున్న తరువాత, తాను దోచుకున్న సొత్తును, తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్యా శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు సురతాని, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది.
ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం... అలా తనకు తెలయకుండానే, ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ, దాని మీదే సురతాని మనస్సు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం, వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహాన్ని కోల్పోయిన భక్తులూ, అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి, ఆ మాలిక్ కాఫిర్‌నే వేడుకునేందుకు, దిల్లీకి ప్రయాణమయ్యారు. అయితే, కొన్ని ప్రామాణికాలను బట్టి, సాక్షాత్తూ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వహించారని, చెబుతారు.
అలా వారందరూ రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ, తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులను చూసి, మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిచ్చాడు. అయితే, అన్ని రోజుల రంగనాథుని సాన్నిహిత్యంతో, విగ్రహాన్ని తన భర్తగా భావిస్తూ, అతని మీద మనస్సు పడిన సురతాని గురించి విన్న అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో, ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూసేసరికి, తన కలల ప్రతిరూపం కనుమరుగైంది. ఎవరు ఎంత ఒదార్చినా, సురతాని మనస్సు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని, తన కుటుంబానికి కరాఖండిగా చెప్పేసింది. విగ్రహాన్ని వెతుక్కుంటూ, తాను కూడా శ్రీరంగానికి పయనమైంది.
అలా శ్రీరంగం చేరుకున్న సురతాని, ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా, ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. మరికొన్ని గాథల ప్రకారం, ఆ విగ్రహం రంగనాథునిది కాదు, మెల్కోటేలో ఉన్న చెళువ నారాయణస్వామిది, అని చెబుతారు. అక్కడి ఆలయంలో కూడా, బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు, భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని, నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు, ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకే, తిరుమలలో బీబీ నాంచారి ప్రతిమ, తుళుక్క నాచ్చియార్ అనే విగ్రహరూపంలో కొలువై ఉండి, కొన్ని శతాబ్దాల నుండీ పూజలందుకోవడం గమనార్హం. ఏది ఏమైనా, ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం, ఎలాంటి వివాదమూ లేదు. ఎందుకంటే, తుళుక్కు నాచియార్ అంటే, తమిళంలో, తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం, వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడు.
ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకున్నదన్న విషయాన్ని తెలుసుకుని, వెనుతిరిగాడని చెబుతారు. బీబీ నాంచారి కథ మీద భిన్న వాదనలు ఉన్నాయి. పలువురు ఆధ్యాత్మిక వేత్తలూ, చరిత్రకారులూ, ఒక్కొక్కరూ ఒక్కో కథనూ, ఒక్కో విషయాన్నీ చెబుతుంటారు. భారతదేశంలో ముస్లిం దండయాత్రలు జరుగుతున్నప్పుడు, తిరుమలను వారి దాడుల నుంచి కాపాడడానికే, బీబీ నాంచారి పాత్రను సృష్టించారని కొంతమంది చెబుతుంటే, బీబీ నాంచారి ముస్లిం కాదనీ, దూదేకుల కుటుంబానికి చెందిన మహిళ అనీ, కొందరి వాదన. అలాగే, బీబీ నాంచారి, ఘజనీ మహమ్మద్ కుమార్తె అని, మరో కథ ప్రచారంలో ఉంది. బీబీ నాంచారమ్మను దేవతగా కొలిచేవారిలో, పలువురు ముస్లిములు ఉన్నారనీ, వారు ప్రతి సంవత్సరం ఆ దేవతను దర్శించుకోవడానికి, తిరుమలకు వస్తుంటారనీ, కొందరు చెబుతున్నారు. శ్రీరంగంలో ప్రస్తుతం కొలువైయున్న బీబీ నాంచారి విగ్రహాన్ని, సాక్షాత్తూ శ్రీరామానుజాచార్యులే ప్రతిష్టించారని, కొందరి భావన. ఇలా ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా, తిరుమలేశుని దర్శించుకునే వారు, ఆయన అర్థాంగిగా బీబీ నాంచారిని కూడా పూజిస్తున్నారు. ఆమె మీద పలువురు ప్రబంధ కావ్యాలు కూడా రాశారు. పలు గ్రంథాలలో కూడా, బీబీ నాంచారమ్మ ప్రస్తావన ఉంది.
తిరుమలలో జరిగే స్వర్ణ పుష్పార్చన సేవలో ఉపయోగించే బంగారు తామర పూలు, షేక్ మస్తాన్ అనే వేంకటేశ్వర భక్తుడు సమర్పించినవే. ఇక కొంతమంది ముస్లిం భక్తులు, వేంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావిస్తూ, ఉగాది నాడు కడపలోని తిరుమలేశుడి ఆలయంలో, ప్రత్యేక పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లిస్తారు. ఆరోజు హిందువులు చేసే ఉగాది పచ్చడిని, ముస్లింలు ప్రసాదంగా సేవిస్తారు. ఇలా బీబీ నాంచారమ్మను తమ ఆడపడుచుగా, వేంకటేశ్వర స్వామిని అల్లుడిగా పూజించే సాంప్రదాయాన్ని, ముస్లింలు ఎన్నో ఏళ్ళుగా పాటిస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి భార్యగా, ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న బీబీ నాచియార్ గురించి, మీకు గనుక ఏదైనా అదనపు సమాచారం తెలిసినట్లయితే, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఓం నమో వేఙ్కటేశాయ!
Comments
Post a Comment