స్వారోచిష మన్వంతరం! హంస నేర్పిన జ్ఞానబోధ! Swarochisha Manu

 

స్వారోచిష మన్వంతరం! హంస నేర్పిన జ్ఞానబోధ!

వరూధుని కుమారుడైన స్వరోచి, ఆయుర్వేద విద్యా, సమస్త ప్రాణుల స్వరాలను వినే విద్యా, పద్మినీ విద్యలను ఎలా పొందగలిగాడు? స్వరోచిని మనోరమ వివాహం చేసుకోవడానికి పెట్టిన షరతు ఏంటి? ముగ్గురు భార్యలున్న స్వరోచి, వనదేవతను పెళ్ళి చేసుకోవడానికి గల కారణమేంటి? స్వరోచి మోక్షాన్ని పొందడానికి హంస ఏవిధంగా సహయపడింది - వంటి ఆసక్తిని కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

వరూధుని కుమరుడైన స్వరోచి జననం, స్వరోచి, మనోరమల సమాగమం, ఇందీవరాక్షుడి శాప విమోచనానికి సంబంధించిన వీడియోల లింక్స్ ను, చూడనివారికోసం పొందుపరిచాను.

1. వరూధిని – ప్రవరాఖ్యుడు!: https://youtu.be/YH-TpjvybSA


2. స్వరోచి జన్మ రహస్యం!: https://youtu.be/ytYeyP4Jmr0


3. స్వారోచిష మన్వంతరం!: https://youtu.be/qA48HPtKTuo


తనను రాక్షస రూపం నుంచి విముక్తుడిని చేసినందుకు, ఇందీవరాక్షుడు తన కుమార్తె మనోరమను, స్వరోచికి సమర్పించాడు. దాంతో మనోరమ తన తండ్రితో, "తండ్రీ, నాకుకూడా నన్ను రక్షించిన ఈ మహా వీరుడంటే ఇష్టమే. నేను ఇతన్ని మనసార స్వీకరిస్తాను. అయితే, ఇది సందర్భం కాదు. నా ప్రియ చెలులు ఇద్దరూ కుష్ఠు, క్షయ వ్యాధులతో బాధపడుతుంటే, నేను ఆనందంగా వివాహం చేసుకోవడం భావ్యం కాదు" అని వినయంగా పలికింది. మనోరమ మాటలు విన్న స్వరోచి ఆమెతో, "దేవీ, నీవేమీ బాధపడవద్దు. నీ తండ్రి ప్రసాదించిన ఆయుర్వేద విద్య ద్వారా, నీ చెలులిద్దరినీ రోగవిముక్తులను చేస్తాను" అని అనగానే, మనోరమ ఎంతో ఆనందించింది. వెంటనే వివాహానికి సమ్మతించింది. ఇందీవరాక్షుడు వైభవంగా, మంధరాచలం మీద తన కుమార్తెను స్వరోచికి ఇచ్చి వివాహం జరిపించి, తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత స్వరోచి, మనోరమలిద్దరూ, చెలికత్తెలు నివసిస్తున్న ఉద్యానవనానికి బయలుదేరారు.

స్వరోచి తన ఆయుర్వేద విద్య ద్వారా, వాళ్ళిద్దరి వ్యాధులనూ పోగొట్టాడు. వెంటనే ఆ చెలులిద్దరికీ, దివ్య శరీరాలు ప్రాప్తించాయి. దివ్య సౌందర్యంతో వారిద్దరూ ప్రకాశించసాగారు. రోగ విముక్తి పొందిన చెలికత్తెలలో మొదటి చెలికత్తె స్వరోచితో, "ప్రభూ, నాపేరు విభావరి. మీరు నా రూపాన్ని నాకు తిరిగి ప్రసాదించారు. అందుకు ప్రతిఫలంగా, నా ఆత్మను మీకు సమర్పిస్తున్నాను. అలాగే, అన్ని ప్రాణుల స్వరాలను గ్రహించగలిగే విద్యను కూడా మీకు ఇస్తున్నాను. గ్రహించండి" అని పలికింది. వెంటనే రెండవ కన్య స్వరోచితో, "ప్రభూ, నా పేరు కళావతి. పారుడు అనే బ్రహ్మర్షి, నా తండ్రి. పూర్వం నన్ను ఒక రాక్షసుడు కామించి, నన్ను తనకిచ్చి వివాహం చేయమని నా తండ్రిని కోరాడు. ఆయన నిరాకరించగా, ఆ రాక్షసుడు నా తండ్రిని వధించాడు. దానితో నేను ఆత్మ త్యాగం చేసుకోబోయాను. అప్పుడు సతీదేవి ప్రత్యక్షమై, ‘అమ్మా నీకు త్వరలోనే స్వరోచి అనే మహావీరుడు భర్తగా లభిస్తాడు. నీ ప్రాణాలను తీసుకోకు. అని చెప్పి, ఇదిగో, సకల నిధులనూ ప్రసాదించే ‘పద్మిని’ అనే విద్యను నీకు ప్రసాదిస్తున్నాను. స్వీకరించు. అని నాకు ఆ విద్యను ప్రసాదించి, అంతర్థానమైంది. ఆమె అసత్యం చెప్పదు కనుక, తమరు స్వరోచి మహారాజే అయివుంటారు. తమరు దయచేసి నన్ను వివాహం చేసుకోండి. ఈ శరీరం, నేను పొందిన పద్మినీ విద్య, మీకే సమర్పిస్తున్నాను." అని పలికింది.

ఆ విధంగా విభావరి, కళావతి మాటలు విన్న స్వరోచి, తన మొదటి భార్య ఆమోదంతో, వారిద్దరినీ వివాహం చేసుకున్నాడు. తరువాత స్వరోచి ముగ్గురు భార్యలతో కలసి, హిమాలయ వనాలలో ఆనందంగా సంచరించసాగాడు. అలా ఆరువందల సంవత్సరాలు గడచిపోయాయి. స్వరోచి నిరంతరం తన భార్యలతో సుఖభోగాలు అనుభవిస్తున్నప్పటికీ, ధర్మపరమైన కార్యక్రమాలను విడువకుండా ఆచరించేవాడు. కొంతకాలానికి స్వరోచికి ముగ్గురు పుత్రులు కలిగారు. మనోరమ ద్వారా విజయుడు, విభావరి ద్వారా మేరునందనుడు, కళావతి ద్వారా, ప్రభావుడనే వాడిని పొందాడు.

తరువాత తన భార్య కళావతి ద్వారా సంపాదించిన పద్మినీ విద్యతో, మూడు మహాపట్టణాలను నిర్మించాడు. తూర్పు దిక్కున కామరూప పర్వతం మీద నిర్మించిన పట్టణాన్ని విజయుడికీ, ఉత్తర దిశలో ఎత్తైన ప్రాకారాలతో నిర్మించిన పట్టణాన్ని, మేరునందనుడికీ, దక్షిణదిశలో నిర్మించిన తాళము అనే మహా నగరాన్ని, ప్రభావుడికీ ఇచ్చాడు. ఆ విధంగా స్వరోచి తన ముగ్గురు కుమారులకూ మూడు నగరాలను ఇచ్చి, తాను యథాప్రకారంగా భార్యలతో కలిసి, అందమైన వనాలలో విహరించడం ప్రారంభించాడు. ఒకనాడు అడవిలో సంచరిస్తున్న స్వరోచికి, ఒక అడవి పంది కనిపించింది. దానికి విల్లునెక్కుపెట్టగా, అదే సమయంలో అక్కడకు వచ్చిన ఒక లేడి, "ఓ రాజా ఆగు, నీవు ఆ బాణాన్ని నా మీద సంధించి, నా దు:ఖాన్ని తొలగించు" అని వేడుకుంది. అందుకు స్వరోచి, "నీవు ఎటువంటి రోగంతోనూ ఉన్నట్లు కనిపించడం లేదు. మరి ఎందుకు మరణించాలనుకుంటున్నావు" అని అడుగగా దానికా లేడి, "స్వామీ, నేను మిమ్మల్ని వరించాలనుకుంటున్నాను. మీరే నా భర్త కావాలి. మీరు నన్ను అనుగ్రహిస్తారో లేదో అన్న భయంతో, మరణమే నాకు శరణమని భావించాను" అని అన్నది.

ఆ లేడి మాటలకు ఆశ్చర్యపోయిన స్వరోచి, "నీవు లేడివీ, నేను మనిషిని. నీకు నాకు వివాహం ఎలా కుదురుతుంది? అసలు నీవెవరు? నన్ను ఎందుకు వివాహమాడాలనుకుంటున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ లేడి, అందమైన యువతిగా మారి, "స్వామీ, నేను ఈ వనానికి అధిదేవతను. దేవతల కోరిక మేరకు, నేను మీ దగ్గరకు వచ్చాను. మనిద్దరి ద్వారా, ఓ మహాపురుషుడు జన్మించబోతున్నాడని, దేవతల వాక్కు. కనుక మీరు నన్ను స్వీకరించండి" అని వేడుకుంది. ఆమె మాటను మన్నించిన స్వరోచి, ఆ వన దేవతను వివాహం చేసుకుని, కొంత కాలానికి సర్వ శుభలక్షణ సంపన్నుడు, మహా తేజస్వి అయిన కుమారుడిని పొందాడు. దివ్య తేజస్సుతో, అద్భుతంగా ప్రకాశిస్తున్న తన కుమారుడికి, ద్యుతిమానుడనే పేరుపెట్టాడు. క్రమంగా క్షత్రియోచితమైన విద్యలన్నింటినీ నేర్చుకుని, ద్యుతిమానుడు మహావీరుడయ్యాడు. అతడు స్వరోచి కుమారుడు కాబట్టి, స్వారోచిషుగా ప్రసిద్ధిచెందాడు.

అలా స్వరోచి సంతోషంగా రోజులు వెళ్లదీస్తుండగా, ఒకనాడు వనంలో విహరిస్తున్న సమయంలో, ఒక హంసను చూశాడు. ఆ హంస తన భార్యతో, "నీవు నీ మనస్సును స్థిరం చేసుకో. వృద్ధాప్యంలో ఉన్న మనం, మోహాన్ని వదిలి, మోక్షమార్గాన్ని వెదకాలి" అని అన్నది. అందుకు ఆడ హంస, "స్వామీ, ప్రజలంతా దానధర్మాలు చేసేది, స్వర్గ సుఖాల కోసమే కదా! మరి అలాంటి భోగాలను నీవెందుకు ఇష్టపడడం లేదు" అని ప్రశ్నించింది. అందుకు ఆ హంస, "ఓ భార్యామణి, ఎవరి మనస్సు భోగాల మీద ఆసక్తి లేకుండా ఉంటుందో, వారి బుద్ధి, పరమాత్మ మీద లగ్నమవుతుంది. పుత్రులూ, మిత్రులూ, భార్యలూ, ఇలా వీరందరి మీదా ఆసక్తి ఉన్న మనుషులు, చెరువులోని బురదలో కూరుకుపోయిన ఏనుగులాగా, దు:ఖాన్ని పొందుతారు. నేను జ్ఞానం కలిగిన వాణ్ణి. భోగాల మీద నాకిప్పుడు ఎలాంటి ఆసక్తీలేదు" అని అన్నది మగహంస.

వారి మాటలతో వైరాగ్యం పొందిన స్వరోచి, అన్ని భోగాల మీదా ఆసక్తిని వదలి, అడవిలో కఠోరమైన తపస్సు చేసి, అన్ని పాపాల నుండీ విముక్తుడయ్యాడు. స్వరోచి ముక్తి పొందగానే, దేవతలు అతడి కుమారుడైన స్వారోచిషుడిని, రెండవ మనువుగా చేశారు. నాటి నుంచి, ఆ మన్వంతరం, స్వారోచిష మన్వంతరంగా ప్రసిద్ధి చెందింది. స్వారోచిష మన్వంతరంలో దేవగణాలన్నీ, పారావతులూ, యతుషితులనే పేర్లతో ఉంటారు. ఇంద్రుడు విపశ్చితుడు అనే పేరుతో, సప్తర్షులు - ఊర్జస్తంభ, ప్రాణ, దత్త, అలి, బుుషభ, నిశ్చర, అర్వవీర అనే పేర్లతో ఉంటారు. స్వారోచిషుడి మన్వంతరం ఉన్నంత కాలం, అతడి వంశంలో జన్మించిన రాజులంతా, భూమండలాన్ని పాలించారు. ఈ మన్వంతరం గురించీ, మనువు జననం గురించిన విశేషాలను విన్న వారు, సకల పాపాల నుండీ విముక్తులవుతారని, మార్కండేయ పురాణంలో పేర్కోనబడింది.

శుభం భూయాత్!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home