నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది? భగవద్గీత Bhagavadgita
నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది?
'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 05 నుండి 08 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wK2c-rdTcMI ]
నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించేవి ఏంటో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..
00:49 - సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।। 5 ।।
ఓ మహా బాహువులుగల అర్జునా.. భౌతిక ప్రాకృతిక శక్తి అనేది, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణమను త్రిగుణములను కలిగి ఉంటుంది. ఈ గుణములే, నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించును.
పురుషుడు, మరియు ప్రకృతి చేతనే, సమస్త జీవ రాశులూ ఉద్భవించాయని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు ప్రకృతి జీవాత్మను ఎలా బంధించివేస్తుందో, వివరించబోతున్నాడు. ఆత్మ దివ్యమైనదే అయినా, తనను తాను శరీరమే అనుకుంటుంది కాబట్టి, అది భౌతిక ప్రకృతికి కట్టివేయబడుతుంది. భౌతిక శక్తి, సత్త్వము, రజస్సు, మరియు తమస్సనబడే మూడు గుణములను కలిగి ఉంటుంది. కాబట్టి, ప్రకృతిచే తయారుచేయబడిన శరీరమూ, మనస్సూ, మరియు బుద్ధీ, ఈ మూడింటికి కూడా త్రిగుణములు ఉంటాయి. మూడు రంగులతో చేసే ప్రింటింగ్‌ని, ఉదాహరణగా చూడండి. ఒకవేళ ఏదో ఒక రంగు కాస్త ఎక్కువగా పేపర్ మీదకు పంపబడితే, కాగితం పై బొమ్మ, ఆ రంగుతో కనబడుతుంది. అదే విధంగా, ప్రకృతి ఈ మూడు రంగుల సిరా కలిగి ఉన్నది. వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలూ, బాహ్య పరిస్థితులూ, పాత సంస్కారములూ, మరియు ఇతర అంశాలపై ఆధారపడి, వీటిలో ఏదో ఒక గుణము ఆ వ్యక్తిలో ప్రబలంగా కనిపిస్తుంది. ఏ గుణము ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందో, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వముపై, ఆ రంగు ప్రభావము, ప్రబలంగా ఉంటుంది. కాబట్టి, జీవాత్మ ఈ మూడు గుణములచే ప్రభావితమవుతుంది.
02:32 - తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।। 6 ।।
వీటిలో సత్త్వ గుణము, మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది, మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము, మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన, అది జీవాత్మను బంధించివేస్తుంది.
ప్రకాశకం అంటే, ‘ప్రకాశింపచేసేది’ అని అర్థం. అనామయం అంటే, ‘ఆరోగ్యవంతము, మరియు సంపూర్ణ క్షేమదాయకము’ అని అర్థం; సత్త్వ గుణము నిర్మలమైనది, మరియు ప్రకాశింపచేసేది. ఈ విధంగా సత్త్వ గుణమనేది, మనిషి యొక్క వ్యక్తిత్వములో సద్గుణమును పెంపొందించి, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేయును. అది వ్యక్తిని నిర్మలంగా, తృప్తితో, దానగుణముతో, కారుణ్యంతో, సహాయకారిగా, స్థిమితముగా, మరియు ప్రశాంతముగా చేస్తుంది. అది చక్కటి ఆరోగ్యమును, మరియు వ్యాధుల నుండి విముక్తినీ ఇస్తుంది. సత్త్వ గుణము ప్రశాంతతను, మరియు సుఖమును ఇస్తుంది కానీ, వీటి పట్ల మమకారాసక్తియే, ఆత్మను భౌతిక ప్రకృతికి కట్టివేస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాము. ఒక బాటసారి అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ముగ్గురు బందిపోటు దొంగలు దాడిచేశారు. మొదటి వాడు, ‘వీడిని చంపేసి, వీడి సొమ్మంతా దోచేద్దాము’ అని అన్నాడు. రెండవ వాడు, ‘వద్దు, వాడిని చంపొద్దు. కేవలం కట్టిపడేసి, వాడి దగ్గర ఉన్నవి అంతా తీసుకు వెళ్ళి పోదాం’ అని అన్నాడు. ఆ రెండవ దొంగ చెప్పిన సలహా ప్రకారం, బాటసారిని కట్టేసి, అతని సొమ్మంతా దోచుకున్నారు. వారు కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత, మూడవ దొంగ తిరిగొచ్చాడు. వాడు ఆ బాటసారి కట్లు విప్పేసి, అడవి చివర వరకూ తీసుకువెళ్లి , బయటకి దారి చూపించి, ఇలా అన్నాడు.. ‘నేను బయటకురాలేను.. కానీ, నీవు ఈ మార్గంలో వెళ్తే, అడవి బయటకు వెళ్లగలవు.’ అని చెప్పాడు. అయితే, ఈ ఉదాహరణలో మొదటి బందిపోటు, తమో-గుణము.. అది ఆత్మను, సోమరితనం, నిర్లక్ష్యము, మరియు అజ్ఞానంతో నిజంగానే, చంపటానికి ప్రయత్నిస్తుంది. రెండవ బందిపోటు, రజో-గుణము.. అది ప్రాణులలో ఆవేశ ఉద్వేగాలను జనింప చేస్తుంది, మరియు ఆత్మను అసంఖ్యాకమైన ప్రాపంచిక కోరికలతో బంధించివేస్తుంది. మూడవ బందిపోటు, సత్త్వ గుణము.. అది జీవుల దుష్టగుణములను తగ్గిస్తుంది, భౌతిక అసౌఖ్యమును తగ్గిస్తుంది, మరియు ఆత్మను సంక్షేమ మార్గంలో పెడుతుంది. అయినా, సత్త్వ గుణము కూడా భౌతిక ప్రకృతి యొక్క పరిధిలోనే ఉన్నది. మనము దాని పట్ల మమకారాసక్తితో ఉండకూడదు; పైగా, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి, దానిని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలి. ఈ మూడింటికీ అతీతముగా, శుద్ధ-సత్త్వ గుణము ఉంటుంది. ఇది అలౌకిక సత్త్వ గుణము. ఇది భౌతిక శక్తికి అతీతమైన భగవంతుని యొక్క దివ్యమైన శక్తి యొక్క గుణము. ఎప్పుడైతే ఆత్మ భగవత్ ప్రాప్తి పొందుతుందో, ఆయన యొక్క కృపచే, భగవంతుడు ఆ జీవాత్మకు శుద్ధ సత్వమును ప్రసాదిస్తాడు. దానితో ఆయొక్క ఇంద్రియమనోబుద్ధులు, దివ్యమైనవిగా అవుతాయి.
05:55 - రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ ।
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।। 7 ।।
ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు, మరియు మమకారముల వల్ల జనిస్తుంది. అలాగే, ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే, బంధించివేస్తుంది.
శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, రజో గుణము యొక్క పనితీరునూ, అది జీవాత్మను భౌతిక అస్థిత్వమునకు ఎలా కట్టివేస్తుందో, వివరిస్తున్నాడు. భౌతిక ప్రాపంచిక వ్యవహారములే, రజో గుణము యొక్క ప్రధానమైన ప్రకటితమని, పతంజలి యోగ దర్శనం, వివరిస్తుంది. ఇక్కడ శ్రీ కృష్ణ పరమాత్మ, దానియొక్క ప్రధానమైన వ్యక్తీకరణ, మమకారాసక్తీ మరియు కోరికలని చెబుతున్నాడు. రజో గుణమనేది, ఇంద్రియ భోగముల కోసం ఉన్న కామమును, మరింత పెంచుతుంది. అది శారీరిక, మరియు మానసిక వాంఛలను, ప్రజ్వలింప చేస్తుంది. అది ప్రాపంచిక విషయముల పట్ల మమకారాసక్తులను, పెంచుతుంది. రజో గుణముచే ప్రభావితమైన వ్యక్తులు, హోదా, ప్రతిష్ఠ, వృత్తిలో విజయం, కుటుంబము, మరియు ఇల్లూ వంటి ప్రాపంచికమైన వాటి పట్ల, నిమగ్నమై ఉంటారు. వీటిని ఆనంద కారకములుగా భావించి, వాటి కొరకై, నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటారు. ఈ విధంగా రజో గుణము, కోరికలను మరింతగా పెంచుతుంది. ఈ కోరికలు, రజో గుణమును మరింత పెంచుతాయి. ఇవి పరస్పరం ఇనుమడింపచేసుకుని, జీవాత్మను ప్రాపంచిక జీవితంలో కట్టి వేస్తాయి. కర్మయోగ ఆచరణచే దీనిని ఛేదించి, బయటపడవచ్చు. అంటే, మన కర్మల యొక్క ఫలములను, భగవంతునికే అర్పించటమనేదాన్ని, ప్రారంభించటం అన్నమాట. ఇది ప్రపంచం పట్ల అనాసక్తిని కలుగచేస్తుంది, మరియు రజో గుణము యొక్క తీవ్రతను, శాంతింపజేస్తుంది.
07:51 - తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।। 8 ।।
ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను, నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది.
తమో గుణము, సత్త్వ గుణమునకు విరుద్ధమైనది. దానిచే ప్రభావితమైన జనులు, నిద్ర, సోమరితనము, మత్తు, హింస, మరియు జూదముచే ఆనందమును అనుభవిస్తారు. ఏది మంచి, లేదా ఏది చెడు, అన్న విచక్షణను వారు కోల్పోతారు; తమ స్వార్థ ప్రయోజనం కోసం, అనైతికమైన పనులు చేయటానికి, వెనుకాడరు. వారి కర్తవ్యమును వారు చేయటమే, వారికి భారంగా అవుతుంది. వారు దానిని నిర్లక్ష్యం చేస్తారు. మరింత సోమరితనానికీ, నిద్రకూ అలవాటు పడిపోతారు. ఈ ప్రకారంగా తమో గుణము, జీవాత్మను అజ్ఞానపు చీకటి లోనికి మరింతగా నెట్టివేస్తుంది. జీవాత్మ తన యొక్క దివ్య అస్థిత్వమునూ, జీవిత లక్ష్యమునూ, మరియు పురోగతికై మానవ జన్మ ఇచ్చే అపూర్వ అవకాశమునూ, పూర్తిగా విస్మరిస్తుంది.
09:07 - ఇక మన తదుపరి వీడియోలో, సత్త్వ, తమో, రజో గుణముల లక్షణాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment