బంగారు సంకెళ్ళు! భగవద్గీత Bhagavadgita
బంగారు సంకెళ్ళు!
జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, దుఃఖముల నుండి విముక్తి ఎలా పొందవచ్చు?
'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (19 – 23 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 19 నుండి 23 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VXwMTe9zIYs ]
ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయో, భగవానుడిలా వివరిస్తున్నాడు..
00:49 - నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగఛ్చతి ।। 19 ।।
అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప, వేరే ఇతరములు లేవని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుని, నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.
ఈ మూడు గుణముల యొక్క సంక్లిష్టమైన పనితీరును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, వాటి బంధనము నుండి ముక్తిపొందటానికి సరళమైన ఉపాయమును చెబుతున్నాడు. జగత్తు లోని సమస్త జీవ భూతములూ, ఈ మూడు గుణముల బంధనములో ఉన్నాయి. కాబట్టి, ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో, ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. కానీ, సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు. కాబట్టి, ఆయనను త్రి-గుణాతీతుడని అంటారు. అదే విధంగా, భగవంతుని యొక్క అన్ని గుణములూ, ఆయన నామములూ, రూపములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారమూ, ఇవన్నీ త్రి-గుణాతీతములే. ఒకవేళ మన మనస్సును త్రి-గుణముల యొక్క పరిధిలోనే ఉన్న ఏ ఒక్క వ్యక్తి, లేదా వస్తువు పట్ల అనుసంధానం చేసినా, ఆ సంబంధిత గుణ-ప్రభావం, మన మనోబుద్ధులపై పెరుగుతుంది. కానీ, మన మనస్సును దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రములోనే ఉంచితే, అది త్రిగుణములకు అతీతముగా, దివ్యమైనదిగా అవుతుంది. ఈ సూత్రమును అర్థం చేసుకున్నవారు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యుల పట్ల తమ సంబంధాన్ని తగ్గించుకుంటూ, భక్తి ద్వారా, భగవంతుడు, మరియు గురువు పట్ల సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఇది వారికి త్రిగుణములకు అతీతముగా అవ్వటానికి సహాయకారిగా, మరియు భగవంతుని యొక్క దివ్య స్వభావాన్ని పొందటానికి సహాయకారిగా ఉంటుంది.
02:38 - గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తోఽమృతమశ్నుతే ।। 20 ।।
శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి, జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.
మనం ఒకవేళ పాడైపోయిన ఆహారాన్ని తీసుకుంటే, మనకు అనారోగ్యం కలుగుతుంది. అదే విధంగా, మనం ఈ త్రిగుణములచే ప్రభావితం అయితే, మనం వాటి యొక్క పరిణామాలను అనుభవించాలి.. అంటే, పదేపదే ఈ భౌతిక జగత్తులో పుట్టటం, వ్యాధి, వృద్ధాప్యం, మరియు మరణం వంటివి. ఈ నాలుగే, భౌతిక జగత్తులో ప్రధానమైన క్లేశములు. వీటిని చూసిన తరువాతే, బుద్ధుడు ఈ ప్రపంచం దుఃఖములకు నిలయమని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈ క్లేశములకు పరిష్కారం వెదికాడు. వేదములు ఎన్నెన్నో నియమములనూ, సామాజిక విధులనూ, పూజాది కర్మ కాండలనూ, మరియు నిబంధనలనూ, మానవులకు విధించాయి. ఈ చెప్పబడిన విధులూ, మరియు నియమనిబంధనలన్నింటినీ కలిపి, కర్మ ధర్మాలంటారు, లేదా, వర్ణాశ్రమ ధర్మములంటారు, లేదా, శారీరక ధర్మములంటారు. అవి మనలను తమో గుణము నుండి రజో గుణమునకూ, దానినుండి సత్త్వ గుణమునకూ, ఉన్నతమైనవిగా చేస్తాయి. కానీ, సత్త్వ గుణమును చేరుటయే సరిపోదు; అది కూడా ఒకలాంటి బంధనమే. సత్త్వ గుణమును బంగారు సంకెళ్ళతో కట్టివేయబడటంతో పోల్చవచ్చు. మన లక్ష్యము ఈ భౌతిక జగత్తు అనే జైలు నుండి బయట పడడం. మనము ఈ త్రి-గుణములకు అతీతముగా అయినప్పుడు, జీవాత్మలను ఇక మాయ బంధించదు. ఈ విధంగా, జీవాత్మ జనన మరణ చక్రము నుండి విముక్తి నొంది, అమరత్వం పొందుతుంది. నిజానికి, ఆత్మ అనేది ఎల్లప్పుడూ నిత్యమే. కానీ, అది తనకు తాను ఈ భౌతిక శరీరమే అనుకోవటం వలన, అది జన్మ-మృత్యువు అనే మిథ్యా దుఃఖమును అనుభవింప చేస్తుంది. ఈ మిథ్యానుభవము, తన యొక్క సనాతన అస్థిత్వ స్వభావానికి వ్యతిరేకమైనది; జీవాత్మ దీనినుండి విముక్తికై ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి, భౌతిక ప్రాపంచిక మిథ్య సహజంగానే, మన అంతర్గత అస్థిత్వానికి ఇబ్బందికరమే.
04:59 - అర్జున ఉవాచ ।
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।
అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ ప్రభూ, ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
అర్జునుడు శ్రీ కృష్ణుడి నుండి, త్రి-గుణములకు అతీతులవటం గురించి విని ఉన్నాడు. అందుకే ఇప్పుడు, ఈ త్రి-గుణముల విషయమై, మూడు ప్రశ్నలను అడుగుతున్నాడు. త్రిగుణాతీతుల లక్షణములు ఎలా ఉంటాయి? త్రిగుణాతీతుల ప్రవర్తన ఎలా ఉంటుంది? త్రిగుణములకు అతీతంగా ఎలా అవుతాము? అని తన సంశయాన్ని శ్రీ కృష్ణుడి ముందుంచాడు.
05:48 - శ్రీ భగవానువాచ ।
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ।
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ।। 22 ।।
05:59 - ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవం యోఽవతిష్ఠతి నేంగతే ।। 23 ।।
శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - సత్త్వ గుణ జనితమైన ప్రకాశమునుగానీ, రజో గుణ జనితమైన కార్యకలాపములనుగానీ, లేదా తమో గుణ జనితమైన మోహభ్రాంతినిగానీ, - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని, వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు.
అర్జునుడి ప్రశ్నలకు శ్రీ కృష్ణుడు సమాధానమిస్తున్నాడు. ప్రపంచంలో ఈ త్రి-గుణములు ప్రవర్తిల్లటం చూసినప్పుడు, వాటి ప్రభావం మనుష్యులలో, వస్తువులలో, మరియు వాటి చుట్టూ ఉండే పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు, వారు చలింపరు. జ్ఞానోదయమైన వారు అజ్ఞానమును చూసినప్పుడు దానిని ద్వేషింపరు, లేదా దానిలో చిక్కుకోరు. ప్రాపంచిక మనస్తత్వం కలవారు, ఈ ప్రపంచ స్థితిగతులపై మరీ ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. వారి యొక్క సమయాన్ని, మరియు శక్తిని, ప్రపంచంలోని పరిస్థితులపై తలపోస్తూ గడుపుతారు. జ్ఞానోదయమైన మహాత్ములు కూడా, మానవ సంక్షేమం కోసమే పని చేస్తుంటారు. కానీ, వారు అలా ఎందుకు చేస్తారంటే, అది వారి సహజ స్వభావం కాబట్టి. అదే సమయంలో, ఈ జగత్తు అంతా భగవంతుని నియంత్రణలో ఉన్నదని కూడా, వారికి తెలుసు. కేవలం తమ శక్త్యానుసారం పని చేయాలి, మరియు మిగతాది ఆ భగవంతునికే విడిచిపెట్టాలని, వారికి తెలుసు. ఈ భగవంతుని యొక్క జగత్తు లోనికి వచ్చిన తరువాత, మన యొక్క ప్రధానమైన కర్తవ్యం, మన అంతఃకరణ శుద్ధి కోసం పరిశ్రమించటమే. ఆ తదుపరి, శుద్ధమైన, పవిత్రమైన అంతఃకరణతో, మనం సహజంగానే, ప్రపంచ పరిస్థితులు మనలను తీవ్రంగా ప్రభావితం చేయనీయకుండా, ప్రపంచంలో సత్కార్యములూ, సంక్షేమ కార్యక్రమాలూ చేస్తాము. జ్ఞానోదయమయిన మహాత్ములూ, త్రి-గుణములు చేసే పనులకు తాము అతీతులమని తెలుసుకున్నవారూ, ప్రకృతి యొక్క త్రిగుణములు జగత్తులో వాటివాటి సహజ స్వభావ పనులు చేస్తుంటే, హర్షమునకు కానీ, లేదా శోకమునకు కానీ గురికారు. నిజానికి వారి మనసులోనే ఈ గుణములను గమనించినా, వారు కలత చెందరు. ఈ మనస్సు భౌతిక శక్తిచే తయారుచేయబడినది. అందుకే దానికి ప్రకృతి సహజమైన మాయా త్రి-గుణములు ఉంటాయి. కాబట్టి, మనస్సు సహజంగానే ఈ గుణములచే, మరియు వాటివాటి అనుగుణముగా వచ్చే తలంపులచే ప్రభావితం అవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, శారీరక దృక్పథంలో, మనము మన మనస్సుని మనకంటే వేరుగా చూడము. అలౌకికమైన స్థితిలో ఉండే మహాత్ములు, గుణముల ప్రభావం వలన తమ మనస్సులో పుట్టే అన్ని చెడు తలంపుల నుండీ, తమను తాము దూరం చేసుకునే కళను బాగా అభ్యసించిన వారే.
09:06 - ఇక మన తదుపరి వీడియోలో, త్రిగుణములకు అతీతులైనవారు ఎవరో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment