పునర్జన్మలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? భగవద్గీత Bhagavadgita


కర్మ సిద్ధాంతం! జీవాత్మల భవితవ్యం లేక పునర్జన్మలు వేటి మీద ఆధారపడి ఉంటాయి?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (14 – 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 14 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/gR4mTu-pZQg ]


త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - యదా సత్త్వే పవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ।। 14 ।।

00:56 - రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ।। 15 ।।

సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను అంటే, రజస్సు, తమస్సు లేనటువంటి లోకాలను చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు, జంతువుల జీవ రాశిలో పుడతారు.

జీవాత్మల భవితవ్యం, వాటి వ్యక్తిత్వ గుణముల మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని శాసనంలో, కర్మ సిద్ధాంతం ప్రకారం, మనకు ఏది పొందటానికి అర్హత ఉన్నదో, అదే లభిస్తుంది. ఎవరైతే సద్గుణములు, జ్ఞానము, మరియు ఇతరుల పట్ల సేవా భావాన్ని పెంపొందిచుకుంటారో, వారు ధర్మాత్ములు, పండితులు, లేదా సమాజ సేవకుల కుటుంబములలో జన్మిస్తారు, లేదా, వారు ఉత్తమ లోకాలకు వెళతారు. ఎవరైతే దురాశ, ధన దాహము, మరియు ప్రాపంచిక అభ్యుదయేచ్ఛలకు లొంగిపోతారో, వారు తీవ్రమైన భౌతిక, లౌకిక వ్యవహారములు నడిపే కుటుంబములలో, తరచుగా వ్యాపార కుటుంబాలలో జన్మిస్తారు. ఎవరైతే  హింస, సోమరితనం, మరియు కర్తవ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం - వీటి పట్ల మొగ్గు చూపిస్తుంటారో, వారు తాగుబోతులూ మరియు చదువురాని వారి కుటుంబములలో జన్మిస్తారు, లేదా, వారు నిమ్నస్థాయి జీవరాశులలో, జంతువులలో జన్మిస్తారు. చాలా మంది జనులకు ఒక సందేహం ఉంటుంది. ఒకసారి మానవ రూపము వచ్చిన తరువాత, తిరిగి నీచ స్థాయి జాతులలో పడిపోవటం సంభవమేనా? అని. ఆత్మకు మానవ దేహము శాశ్వతముగా ఇచ్చివేయబడినది కాదని, ఈ శ్లోకము తెలియచేస్తున్నది. ఎవరైతే దానిని సరిగ్గా వాడుకోరో, వారు జంతువులలోకి వెళ్లిపోవాల్సిన ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా, అన్ని మార్గాలూ, అన్ని సమయాలలో తెరచే ఉంటాయి. తనకు ఉండే గుణముల తీవ్రత, మరియు తరచుదనాన్ని బట్టి, ఆత్మ - ఆధాత్మిక పురోగతిలో పైకి వెళ్ళవచ్చు, లేదా అదే స్థాయిలో ఉండిపోవచ్చు, లేదా ఇంకా తక్కువ స్థాయికి పడిపోవచ్చు.

03:09 - కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ।। 16 ।।

సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు, పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.

సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నవారు, స్వచ్ఛత, సద్గుణము, జ్ఞానము, మరియు నిస్వార్ధముతో ఉంటారు. కాబట్టి, వారి యొక్క పనులు మిగతావారితో పోల్చితే, పవిత్రమైన ఉద్దేశంతో ఉంటాయి, ఆ యొక్క ఫలితములు ఉద్ధరించేవిగా, మరియు తృప్తినిచ్చేవిగా ఉంటాయి. రజో గుణముచే ప్రభావితమయ్యేవారు, తమ మనస్సు-ఇంద్రియముల యొక్క కోరికలచే, ఉద్వేగానికి గురౌతుంటారు. వారి యొక్క పనుల వెనుక ప్రధానోద్దేశం, సొంత గొప్పలూ, మరియు తమ యొక్క, తమ వారి యొక్క ఇంద్రియ-తృప్తీ ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క పనులు ఇంద్రియ భోగానుభవము కోసం ఉంటాయి. అవి ఇంద్రియ వాంఛలను మరింత విజృభింప చేస్తాయి. తమో గుణము ప్రబలంగా ఉన్నవారికి, శాస్త్ర ఉపదేశాల పట్ల, మరియు మంచి నడవడిక పట్లా, ఏ మాత్రం గౌరవం ఉండదు. వారు పాపపు పనులు చేస్తూ, వక్రబుద్ధితో భోగవిలాసాలను అనుభవిస్తుంటారు. ఇది వారిని మరింత మోహభ్రాంతిలోనికి నెట్టివేస్తుంది.

04:37 - సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ।। 17 ।।

సత్త్వ గుణముచే జ్ఞానమూ, రజో గుణముచే లోభమూ, మరియు తమో గుణముచే నిర్లక్ష్యమూ, మరియు మోహమూ జనించును.

త్రి-గుణముల వలన సంభవించే ఫలితములలో వైవిద్యమును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, దీనికి వెనుక కారణమును చెబుతున్నాడు. సత్త్వ గుణము జ్ఞానమును పెంపొందించుతుంది. దీనివలన మంచి-చెడు మధ్య విచక్షణను తెలుస్తుంది. అది ఇద్రియ లౌల్యమును కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో, తృప్తి మరియు సంతోషమును కలుగ చేస్తుంది. సత్త్వగుణ ప్రధానంగా ఉన్నవారు, జ్ఞాన సముపార్జన, మరియు ధార్మిక ఆలోచనల వైపు మొగ్గు చూపిస్తారు. ఈ విధంగా, సత్త్వగుణము వివేకవంతమైన పనులను ప్రోత్సహిస్తుంది. రజో గుణము ఇంద్రియములను ఉద్రేకపరుస్తుంది, మరియు మనస్సుపై నియంత్రణ తప్పేటట్లు చేస్తుంది, ఎదో సాధించాలనే కోరికల వలయంలో, తిరుగుతూ ఉండేలా చేస్తుంది. ఇది జీవుడిని కోరికలతో బంధించివేసి, సుఖసంపదల కోసం తీవ్రంగా పరిశ్రమించేటట్లు చేస్తుంది. కానీ, ఇవి ఆత్మ దృక్పథంలో వ్యర్థమైనవి. తమో గుణము, జీవుడిని జడత్వం, మరియు అజ్ఞానముతో కప్పివేస్తుంది. అజ్ఞానముతో ఆవరించబడి, వ్యక్తి తప్పుడు, మరియు పాపపు పనులు చేసి, వాటి యొక్క ఫలితములను అనుభవిస్తాడు.

06:09 - ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ।। 18 ।।

సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు, ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు, మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. తమో గుణములో స్థితమై ఉండేవారు, అధోగతి పాలౌతారు.

జీవాత్మల పునర్జన్మ, వాటి వ్యక్తిత్వంలో ప్రబలంగా ఉండే గుణముల మీద ఆధారపడి ఉంటుందని, శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రస్తుత జన్మ ప్రయాణాన్ని పూర్తి చేసిన పిదప, జీవులు వారి వారి గుణములకు అనుగుణంగా ఉండే లోకాలకు చేరుకుంటాయి. ‘సత్త్వ గుణములో ఉన్నవారు, స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళతారు; రజో గుణములో ఉండేవారు, భూలోకానికి తిరిగి వస్తారు; తమో గుణములో ఉండేవారు, నరక లోకాలకు వెళతారు. అలాగే, త్రిగుణాతీతులైనవారు, నన్నే పొందుతారు.’ అని భాగవతంలో పేర్కోనబడింది.
07:10 - ఇక మన తదుపరి వీడియోలో, ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home