ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana
ఏది శాకాహారం – ఏది మాంసాహారం?
అత్తా-కోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఆ శాపమే కారణమా?
అత్తాకోడళ్ల సమస్యలు ఇనాటి కావు. తరతరాలుగా, నిజం చెప్పాలంటే, యుగయుగాలుగా వస్తూ ఉన్నవే. అసలు అత్తాకోడళ్ల మధ్య అన్యోన్యత లోపించడానికి కారణమేంటో తెలుసా? బ్రహ్మ జ్ఞానాన్నెరిగిన కిరాతుడిచ్చిన శాపం ఏంటి? వేటను వృత్తిగా చేసుకుని జీవించే వ్యక్తి, తన కూతురిని ముని శ్రేష్ఠుడికిచ్చి వివాహం జరిపించి, ఆ విధంగా ఎందుకు శపించాడు? వరాహ పురాణంలో వివరించబడిన ధర్మవ్యాధుడనే కిరాతుడి వృత్తాంతంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aton1Ucj7gY ]
వేల సంవత్సరాల క్రితం, వేటను జీవన వృత్తిగా చేసుకుని జీవించేవాడు, వ్యాధుడనే కిరాతుడు. తన కుటుంబం కోసం, రోజుకొక అడవి పందిని చంపి, తన సేవకులనూ, బంధువులనూ, అతిథులనూ, అగ్నినీ సంతృప్తి పరచేవాడు. అతడు కిరాతుడైనప్పటికీ, ప్రతిరోజూ అగ్నిని పూజిస్తూ, నిత్య కర్మలను ఆచరిస్తూ, సత్యాన్నే పలుకుతూ, తన జీవన యాత్రను కొనసాగించాడు. ఏనాడూ అతడు సాధు జంతువులను చంపలేదు. ధర్మ మార్గాన్ని అనుసరించడం వలన వ్యాధుడికి, ధర్మవ్యాధుడనే పేరు స్థిరపడిపోయింది.
ధర్మవ్యాధుడికి, అర్జునకుడనే కుమారుడు జన్మించాడు. అతడు కూడా ఎంతో ధర్మబుద్ధికలవాడు. ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి, తపస్సు మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ధర్మవ్యాధుడికి కొంతకాలం తరువాత, అర్జునకి అనే కుమార్తె కూడా కలిగింది. ఆ కన్యకు యుక్తవయస్సురాగానే, ఆమెకు తగిన వరుడైన మతంగుడి కుమారుడు ప్రసన్నుడికిచ్చి, వివాహం జరిపించాడు. ధర్మవ్యాధుడి కూతురు అర్జునకి కూడా, తండ్రిలాగానే ధర్మపరాయణురాలు. అత్తగారింటికి వెళ్లి, అక్కడ తన అత్త మామలకు ఏ లోటూ రాకుండా, సేవలు చేసింది. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అర్జునకి అత్తగారు ఆమెతో, "ఓ కోడలా, నీవు జంతువులను వధించే బోయవాడి కూతురివి. నీవు కూడా తండ్రికి తగ్గ దానవే. నీకు తపస్సు చేయడం, భర్తను శ్రద్ధగా సేవించడం తెలియదు." అని పరుషంగా మాట్లాడింది.
అత్తగారి మందలింపు విని, అర్జునకి ఎంతో బాధపడింది. వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్ళి విలపించింది. ధర్మవ్యాధుడు ఆమెను ఊరడించి, "అమ్మా, ఎందుకు విలపిస్తున్నావు?" అని అనునయంగా అడిగాడు. "తండ్రీ, మా అత్తగారు అకారణంగా నన్ను దూషించారు. అందుకే నేనింతగా బాధపడుతున్నాను." అని అత్త తనను అన్న మాటలు యధాతథంగా చెప్పింది. అర్జునకి చెప్పిన మాటలు విన్నాక, ధర్మవ్యాధుడికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే మతంగుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ధర్మ వ్యాధుణ్ణి చూసి, మతంగుడు ఆదరంగా లోపలికి ఆహ్వానించి, కూర్చోబెట్టాడు. ఆ తరువాత కుశల ప్రశ్నలు వేసి, తను వచ్చిన కారణాన్ని అడిగాడు.
అప్పుడు ధర్మవ్యాధుడు మతంగుడితో, "మతంగా! నేను మీ ఇంట్లో ప్రాణం లేని ఆహారాన్ని భుజించాలనుకుంటున్నాను" అని అన్నాడు. మతంగుడు ధర్మవ్యాధుడితో, "అయ్యా! మా ఇంట్లో గోధుమలూ, బియ్యం, యవలు లాంటి ధాన్యాలున్నాయి. వాటిలో మీకిష్టం వచ్చిన వాటిని భుజించవచ్చు" అని అన్నాడు. అది విని ధర్మవ్యాధుడు, "మతంగా! నీవు చెప్పిన యవలూ, గోధుమలూ, బియ్యం, నేనడిగిన రూపంలోనే వున్నాయా? ఏదీ చూపించు" అని అడిగాడు. అప్పుడు మతంగుడు గోధుమలతో నిండిన చేటనీ, బియ్యంతో నిండిన మరోచేటనీ ఆయనకు చూపించాడు. వాటిని చూసిన ధర్మవ్యాధుడు, "ఇక చాలు, నేను వెళ్తాను" అని బయలుదేరాడు. ఆ మాటలకు అశ్చర్యపోయిన మతంగుడు, "స్వామీ, తమరు భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఏమిటి కారణం?" అని అడిగాడు.
అందుకు ధర్మవ్యాధుడు, "మతంగా ప్రతిరోజూ నీవు వేలకొద్దీ జీవులను చంపుతున్నావు. నీవు పాపాత్ముడవే కదా! నీ ఇంట్లో ప్రాణశక్తి లేని పదార్థమేదైనా ఉంటే, దానిని వండి, అప్పుడు నాకు భోజనం పెట్టు. ఇప్పుడు నాకు చూపించిన ధాన్యాలన్నీ, నీటి ద్వారా జన్మించనవే కదా? ఈ ధాన్యాలను నాటితే, తిరిగి మొలకలు వస్తాయి.. అంటే, ఆ గింజలలో ప్రాణం ఉన్నట్టేగా.. మరి ప్రాణం ఉన్న ఈ గింజలను వండడం ద్వారా, చంపుతున్నావా, లేదా? అది జీవహింస కాదా? నేను నా సంసారం కోసం, బంధువుల కోసం, రోజుకొక మృగాన్ని చంపి, దానిని ముందుగా పితృదేవతలకు అర్పించి, ఆ తరువాతే, నేనూ, నా కుంటుబం భుజిస్తాము. ఇక నీవు నిత్యం రకరకాల ధాన్యాల రూపంలో, ఎన్నో జీవులను చంపి, నీ వారితో కలిసి తింటున్నావు. ఇది తినరాని తిండి అని నా అభిప్రాయం.
బ్రహ్మదేవుడు మొదట చెట్టూ చేమలనూ, తీగలనూ, యజ్ఞం కోసం పుట్టించాడు. కాలక్రమంలో అవే, ప్రాణులకు ఆహారంగా మారాయి. 1. దేవ యజ్ఞం 2. భూత యజ్ఞం 3.పితృ యజ్ఞం 4. మనుష్య యజ్ఞం 5. బ్రహ్మ యజ్ఞం అని అయిదు మహాయజ్ఞాలున్నాయి. బ్రహ్మ దేవుడు వీటిని ఏర్పరచాడు. ఈ యజ్ఞాల కోసం వండిన అన్నమే, ఉత్తమమైన అన్నం అవుతుంది. అలా కాకపోతే, ఒక్కో ధాన్యంగింజా, పశుపక్ష్యాదుల లాంటిదే కనుక, అది పెట్టేవాడికీ, తినేవాడికీ మాంసాహారమే అవుతుంది. దేవత లాంటి నా కుమార్తెను నీకు కోడలిగా చేశాను. నీ భార్య నా కుమార్తెను, జంతువులను చంపేవాడి బిడ్డవు.. నీకు ఏ ఆచారాలూ, మర్యాదలూ తెలియవని నిందించింది. అందుకే నీవూ, నీ కుంటుంబం, ఎంతటి ఆచారవంతులో తెలుసుకుందామని, నీ ఇంటికి వచ్చాను.
మతంగా! నీ ఇంట్లో నాకు గొప్ప ఆచారం ఏదీ కనిపించలేదు. నేను మా ఇంటికి వెళుతున్నాను. పితృ శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధ దినం కనుక, నేను నీ ఇంట్లో భోజనం చేయను. నేనేమో ప్రాణహింస చేసేవాడినా? నీవు మాత్రం పరమ అహింసాపరుడివా? ఇదేమన్నా న్యాయంగా వుందా? ఇక నేటినుంచీ, అత్తలకు కోడళ్ళపై నమ్మకం లేకుండు గాక. అలాగే, కోడళ్ళు అత్త బ్రతికి ఉండడాన్ని ఇష్టపడకపోవుగాక." అని శపించి, ధర్మవ్యాధుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు.
కొంతకాలం తరువాత ధర్మవ్యాధుడు, తన కుంటుంబ బాధ్యతలను పెద్ద కుమారుడైన అర్జునకుడికి అప్పగించి, ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలమైన మనస్సుతో, భగవంతుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థించడం ప్రారంభించాడు. ధర్మవ్యాధుడి ప్రార్థనకు శ్రీ హరి చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు. భగవంతుడి రూపాన్ని చూసి సంతోషించిన ధర్మవ్యాధుడు, "స్వామీ, నా పుత్రులూ, పౌత్రులూ, అలాగే నా కులంలో పుట్టిన వారందరూ, నాలాగానే సత్యధర్మపరాయణులుగా ఉండేలా, వరమివ్వు. అలాగే, నాకూ, నా తరం వారికీ, ధర్మయుగాలలోనే జన్మ లభించాలి. కలియుగంలో మేము జన్మించకూడదు. నా కులం వారు ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా, జ్ఞానం ఉదయించాలి. నాకిక జీవితం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నీలో లయమవ్వాలని భావిస్తున్నాను." అని ప్రార్థించాడు. ధర్మవ్యాధుడి కోరిక విన్న శ్రీహరి, "ధర్మవ్యాధా, నీ కోరిక ఫలిస్తుంది. నీ కులానికి గొప్ప కీర్తి లభిస్తుంది. నీకు శాశ్వతంగా నాలో స్థానం లభిస్తుంది." అని ఆశీర్వదించాడు. వెంటనే ధర్మవ్యాధుడి శరీరం నుంచి, ఒక దివ్యమైన వెలుగు బయటకు వచ్చి, సనాతనుడైన ఆ శ్రీహరిలో కలసిపోయింది.
ధర్మాన్ని అనుసరించడం వలన, దైవ సాన్నిధ్యం తప్పక లభిస్తుంది. కులాలూ, వర్ణాలూ, గత యుగాలలోనూ ఉన్నాయి. రాబోయే యుగాలలోనూ ఉంటాయి. వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, మన జీవితంలో వాటిని ఎలా అన్వయిస్తున్నాము? అనేది ముఖ్యం. మతంగుడి వంటి మునిశ్రేష్ఠుడు కూడా, కిరాతుడైన ధర్మవ్యాధుడి మాటలకు తలొగ్గాడు. తనకు తెలియని బ్రహ్మ జ్ఞానాన్ని, ధర్మవ్యాధుడి ద్వారా తెలుసుకున్నాడు. మనకు తెలిసిన మిడి మిడి జ్ఞానంతో, మనుషులను దూరం పెడుతూ, ఆహంకార పూరితమైన జీవితాన్ని సాగిస్తున్నాము. పరమాత్ముడికి సకల ప్రాణులూ సమానమే. సనాతన ధర్మాన్ని మించిన ధర్మంలేదు.
ధర్మో రక్షతి రక్షితః
Comments
Post a Comment