నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు? 16 Sixteen (Shodasa) Chakravarthis or Emperors Story


నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు?
పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు! దుఃఖమయమైన ఈ లోకంలో మానవుడి గమ్యమేంటి?

ద్రోణాచార్యుడు నిర్మించిన బేధించనలవికాని పద్మవ్యూహంలోకి, ధైర్యంతో, శౌర్యంతో చొచ్చుకుపోయి, ఎందరో కౌరవ వీరులను సంహరించి, వీరమరణం పొందాడు అభిమన్యుడు. బాలుడైనప్పటికీ, సైన్యంలో చొచ్చుకొని పోవడానికి సమర్థుడని యుద్ధానికి పంపాననీ, అర్జునుడు వచ్చి తన కొడుకేడని అడిగితే, ఏం సమాధానం చెప్పాలో తెలియక, బాధతో కృంగిపోయాడు ధర్మరాజు. యుద్ధానికి పంపి తాను పాపం చేశాననీ, అభిమన్యుడి వెంట తాను యుద్ధంలోకి చొచ్చుకు పోలేకపోయాననీ చింతించాడు. ఇలా పలు విధాలుగా దుఃఖిస్తున్న ధర్మరాజు దగ్గరకు, వ్యాసమహర్షి వెళ్ళాడు. తాను పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన విషయం, అతడి వెనుకే తాము పోవడానికి ప్రయత్నించగా, సైంధవుడు అడ్డు తగిలిన విషయం, ఆ విధంగా అభిమన్యుడికి సహకరించే అవకాశం తప్పిపోయిన వైనం, అప్పుడు పలువురు కౌరవ వీరులు అతడిని చుట్టుముట్టి, అన్యాయంగా హతమార్చిన విషయం, వేదవ్యాసుడికి చెప్పాడు ధర్మరాజు. తనలాంటి కఠినాత్ముడు లేడంటూ, జరిగిన దారుణానికి చింతించాడు. మిక్కిలి బలవంతుడైన అభిమన్యుడు చిన్నబాలుడు కాడనీ, ఎంతోమంది రాజులను అంతం చేసిన గొప్ప వీరుడనీ, అభిమన్యుడిని వ్యాసుడు కీర్తించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవ్వరైనా, విధిని తప్పించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు నీవు వ్యధ చెందడం తగదని హితువు చెప్పాడు, వ్యాసుడు. ఆ మాటలకు ధర్మరాజు, ‘బాగా ఆలోచిస్తే మృత్యువును అవశ్యం అనుభవించి తీరవలసిందే’ అని వ్యాఖ్యానించాడు. అప్పుడు వ్యాసుడు, సృంజయుడనే రాజు పూర్వం ఏవిధంగా, నారదుడు తెలిపిన మృత్యు ప్రకరణ విధానాన్ని విని, చిత్తశాంతిని పొందాడో వివరించాడు. మరి ఆ సృంజయుడి గాధేంటి? నారదుడు వివరించిన షోడశరాజులు ఎవరు? సృంజయుడి దు:ఖాన్ని నారదుడు ఏ విధంగా తొలగించాడు - వంటి ఆసక్తిని కలిగించే విషయాలను, ఈ రోజు తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_7MSPm7UcqM ]



ఈ కథ ద్రోణపర్వంలోని అభిమన్యు వధ పర్వం అనే ఉపపర్వంలో, 55 వ అధ్యాయంలో ఉంది. పూర్వం సృంజయుడనే పేరు గల రాజు, పుత్ర సంతానం కోరి, సద్బ్రాహణులకు అనేక దానధర్మాలను చేశాడు. ఒకసారి నారద మహర్షి సృంజయుని దగ్గరకు వచ్చినప్పుడు, బ్రాహ్మణులందరూ సృంజయరాజుకు పుత్రుని ప్రసాదించ వలసిందిగా నారదుణ్ణి కోరారు. దానికి నారదుడు, ఎలాంటి కుమారుడు కావాలో కోరుకోమని, సృంజయునితో అన్నాడు. సృంజయుడు నారదునికి నమస్కరించి, "యశస్వీ, తేజస్వీ, శత్రునాశకుడూ, ఉత్తమ గుణాలు కలవాడు అయిన కొడుకు కావాలి. ఆ కుమారుని మల మూత్రాలు, ఉమ్మి, చెమట, ఇంకా అతని శరీరం నుంచి వచ్చేవన్నీ, బంగారం కావాలి అని కోరుకున్నాడు." అతడు కోరుకున్నట్లుగానే జరుగుతుందని నారదుడు వరమిచ్చాడు.

ఆ తరువాత కొద్ది రోజులకు ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు విసర్జించే మల మూత్రాలూ, ఏడ్చేటప్పుడు అతని కన్నుల నుంచి కారే కన్నీరూ, ఉమ్మీ, చెమట మొదలైనదంతా బంగారంగా మారుతూ ఉంది. అందువల్లనే ఆ బాలునికి సువర్ణష్ఠీవి అనే పేరు ఏర్పడింది. ఇలా బాలుడు విసర్జించేదంతా బంగారం కావడం చేత, సృంజయరాజు సంపద అమితంగా పెరిగిపోయింది. రాజు తన భవనాలనూ, ప్రాకారాలనూ, కోటలనూ, బ్రాహ్మణ గృహాలనూ, ఇంకా అతనికి అవసరమైన పాన్పులూ, ఆసనాలూ, వాహనాలూ, బిందెలూ, చెంబులూ, పాత్రలూ మొదలైన అన్నివస్తువులనూ బంగారంతో తయారు  చేయించాడు. రోజు రోజుకూ అతని సంపద ఇంకా పెరుగుతూ ఉంది. కొందరు దోపిడీ దొంగలు రాజు వైభవానికీ, అతని ధన సంపదకూ కన్ను కుట్టింది. అతని సంపదకు కారకుడైన సువర్ణష్ఠీవిని అపహరించాలని నిశ్చయించుకుని, రాజ భవనంలోకి ప్రవేశించి, యువరాజును బలవంతంగా ఎత్తుకెళ్ళారు.

ఒక అడవిలోకి తీసుకొనిపోయి అతణ్ణి చంపి బంగారం కోసం అతని కడుపు చీల్చేశారు ఆ దొంగలు. కానీ, అందులో వారికి బంగారం కనిపించలేదు. మూర్ఖులైన దొంగలు పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుని, ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. తన ధన సంపదకు మూలకారకుడైన తన కుమారుడు చనిపోయినందుకు, సృంజయ రాజు ఎంతగానే దు:ఖించాడు. అతని దు:ఖాన్ని విని నారదుడు వచ్చి, షోడశరాజుల చరిత్రలను వివరించాడు. "మరుత్తు అనే చక్రవర్తి, సంవర్తుడు ఉపద్రష్టగా, అనేక యజ్ఞయాగాదులు నిర్వహించినప్పటికీ, శాశ్వతమైన పదవిలో వుండలేదు. సుహోత్రుడనే మహారాజు ఎంత సక్రమ మార్గంలో జీవించినప్పటికీ, ఆశ్వమేధాది యజ్ఞాలు నిర్వర్తించినప్పటికీ, చివరకు మరణించాడు. ఎన్నో యజ్ఞాలు చేసిన అంగుడు అనే రాజు దివంగతుడయ్యాడు. ఎన్నో అశ్వమేధ యాగాలను చేసి, అమితమైన గోదానాలను చేసిన శిబి చక్రవర్తి, శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేకపోయాడు. రావణాసురుడిని బంధు సమేతంగా సంహరించిన సామర్థ్యం, ఆశ్చర్యకరమైన మాహాత్మ్యం కలిగిన దశరథ రాముడూ కాలధర్మం చెందాడు. ఆకాశగంగను భూలోకంలో ప్రవహింప చేసి, సగరులకు ఉత్తమ గతులు కలిగించి, అనేకానేక అశ్వమేధ యజ్ఞాలు చేసిన భగీరథుడు శాశ్వతంగా జీవించలేదు. ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసి, ఇంద్రుడిని మెప్పించిన దిలీపుడు సహితం మరణించాడు.

భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి, అశ్వమేధ యాగాలు చేసిన మాంధాత చక్రవర్తీ, ఈ లోకంలో శాశ్వతంగా నిలువలేదు. దేవాసుర యుద్ధంలో పాల్గొని రాక్షసులను వధించి, వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి, భూమిని సింగారించి, ఎన్నో యజ్ఞయాగాదులను చేసిన యయాతీ, ఈ లోకంలో శాశ్వతంగా వుండలేకపోయాడు. అమితమైన రాజ్యాన్ని సంపాదించి, లెక్కలేనన్ని యాగాలు చేసి, మణులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన అంబరీషుడూ బ్రతికిలేడు. ప్రసిద్ధ యాగాలు నిర్వర్తించిన శశిబిందుడూ, శాశ్వత శరీరాన్ని పొందలేదు. అగ్నిని ఆరాధించి తీవ్రమైన తపస్సు చేసి, ధార్మికుడిగా కీర్తికెక్కిన గయుడు కూడా చనిపోయాడు. రంతిదేవుడి లాంటి పుణ్యాత్ముడూ, పరలోకానికి పోక తప్పలేదు. సర్వదమనుడని కణ్వుడు పేరుపెట్టిన భరతుడూ, ఇహలోకాన్ని విడిచి వెళ్లినవాడే. గోరూపంలో వున్న భూమిని ఓషధులు పితకవలసిందిగా ఆజ్ఞాపించి, సమస్త భూమినీ బ్రాహ్మణులకు దానమిచ్చిన పృథచక్రవర్తి యశస్సు నిలిచింది కాని, శరీరం సుస్థిరంగా వుండలేదు. సమస్త భూమినీ కశ్యపుడికి ధారాదత్తం చేసిన పరశురాముడు సహితం, భూమిపై శాశ్వతంగా ఉండలేకపోయాడు.

గొప్ప గొప్ప రాజులే మరణించక తప్పలేదు. పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. అందువల్ల, కుమారుని కోసం దు:ఖించవద్ద"ని సృంజయునికి నారదుడు వివరించాడు. ఆ మాటలు విన్న సృంజయుడు, పుత్రశోకం నుండి కొంతవరకూ తేరుకున్నాడు. ఆ తరువాత సృంజయుడి కోరిక ప్రకారం, చనిపోయిన అతడి కుమారుడు సువర్ణష్ఠీవిని బతికించి తెచ్చాడు నారదుడు. ఆ తరువాత సువర్ణష్ఠీవి పెరిగి పెద్దవాడయ్యాడు. బాణవిద్య నేర్చుకుని, వివాహమాడి, సంతానవంతుడయ్యాడు. ఇదంతా తిరిగి ధర్మరాజుకు చెప్పిన వేదవ్యాసుడు, అభిమన్యుడి గురించి దుఃఖించడం వివేకం కాదనీ, ఈ లోకం అంతా దుఃఖమయమనీ, తపోదానాదులతో మానవులు దేవలోకం చేరాలనుకోవడం ప్రసిద్ధమనీ, తెలియజేశాడు. అభిమన్యుడు పుణ్యాత్ములు పొందే అరుదైన లోకాన్ని పొంది వున్నాడని తెలియచేయడానికే, తాను షోడశ రాజ చక్రవర్తుల చరిత్ర చెప్పాననీ, దానివల్ల కలిగే పరిజ్ఞానంతో, మనస్సు కుదుట పడేటట్లు చేసుకొమ్మని చెప్పి, వ్యాసుడు అంతర్థానమయ్యాడు.

సర్వేజనాః సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home