పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారు? 6 ఇంద్రియములు! భగవద్గీత Bhagavadgita


6 ఇంద్రియములు!
పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారు?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qiura3E5uwY ]


భౌతిక శక్తిచే కట్టివేయబడి, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ఏ విధంగా ప్రయాస పడుతుంటామో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:51 - న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।।

సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, ఇవేవీ నా పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.

ఇక్కడ శ్రీ కృష్ణుడు, దివ్య లోక స్వభావాన్ని సంక్షిప్తముగా వివరిస్తున్నాడు. దానిని ప్రకాశింపచేయటానికి, సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్ని అవసరం లేదు. ఎందుకంటే, అది సహజంగానే స్వయం ప్రకాశితము. భౌతిక జగత్తు అనేది, భౌతిక శక్తి, మాయ ద్వారా తయారుచేయబడినది. కానీ, దివ్య లోకము, ఆధ్యాత్మిక శక్తీ, యోగ మాయచే తయారు చేయబడినది. అది భౌతిక జగత్తు యొక్క ద్వందములు, మరియు దోషములకు అతీతమైనది, సంపూర్ణ దోషరహితమైన ప్రదేశము. అది సత్-చిత్-ఆనందము, అంటే, అమరత్వము, జ్ఞానము, మరియు ఆనందముతో పూర్ణముగా నిండి ఉంటుంది. దివ్య లోకము, పరవ్యోమమనే ఆధ్యాత్మిక ఆకాశమును కలిగి ఉంటుంది. దానిలో దైవీ ఐశ్వర్యములూ, అద్భుతములతో నిండిన ఎన్నెన్నో ధామములుంటాయి. సమస్త నిత్య సనాతన భగవత్ స్వరూపములైన, కృష్ణుడూ, రాముడూ, నారాయణుడి వంటి వారు, వారి వారి ధామములను ఆ ఆధ్యాత్మిక ఆకాశములో కలిగి ఉంటారు. అక్కడ వారు నిత్య శాశ్వతముగా, తమ భక్తులతో నివసిస్తూ, తమ దివ్య లీలలలో వారితో గడుపుతూ ఉంటారు.

02:25 - మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ।। 7 ।।

భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు, నా యొక్క సనాతనమైన అంశలు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం, ఆయన ధామమునకు చేరిన జీవులు ఇక మళ్ళీ తిరిగి రారని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, భౌతిక జగత్తు లోనే ఇంకా ఉండిపోయిన జీవుల గురించి చెబుతున్నాడు. భగవంతుడికి ఉన్న వివిధ అంశలు, రెండు రకాలుగా ఉంటాయి..

స్వాంశలు: వీరు భగవంతుని అవతారములైన రాముడు, నృసింహ, వరాహ మొదలైనవారు. వారు శ్రీ కృష్ణునికి అబేధములు. అందుకే వారిని స్వాంశలు అంటాము. అంటే, ఏకీకృతమైన అంశలని అర్థం.

విభిన్నాంశలు: వీరు భగవంతునికి భిన్నములైన అంశలు. వారు నేరుగా భగవంతుని అంశలు కాదు. అయినా, వారు ఆయన యొక్క జీవ శక్తి యొక్క అంశలే. ఈ కోవలోకే, జగత్తులో ఉన్న ఆత్మలన్నీ వస్తాయి. ఇంతేకాక, విభిన్నాంశ ఆత్మలు మూడు రకాలు:

నిత్య సిద్ధులు: వీరు ఎప్పుడూ విముక్తులైన వారే కాబట్టి, భగవంతుని యొక్క దివ్య ధామములో, ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటూ, సనాతన కాలం నుండి ఉన్నవారు.

సాధన సిద్ధులు: ఈ జీవాత్మలు మనలాగే, ఒకప్పుడు భౌతిక జగత్తులో ఉండే వారే. కానీ, వారు తమ సాధనా అభ్యాసం ద్వారా, ఆ భగవంతుడిని చేరుకున్నారు. ఇక ఇప్పుడు వారు, దివ్య భగవత్ ధామములోనే శాశ్వతంగా ఉంటూ, భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటూ ఉంటారు.

నిత్య బద్ధులు: వీరు సనాతన కాలం నుండీ భౌతిక జగత్తులోనే ఉండిపోయినవారు. వీరు ఐదు ఇంద్రియములూ, మరియు మనస్సుచే కట్టివేయబడినారు. కాబట్టి, వారు ప్రయాస పడుతున్నారు. ఈ యొక్క విభిన్నాంశలైన నిత్యబద్ధ అంశల గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం, వారు మనస్సూ, ఇంద్రియములను తృప్తిపరచటానికి ప్రయాసపడుతూ, ఆ క్రమంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.

4:39 - శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ।। 8 ।।

ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సూ మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.

ఆత్మ ఒక శరీరము నుండి ఇంకొక శరీరములోకి వెళ్లే ప్రక్రియను గురించి, ఇక్కడ వివరించబడినది. వీచేగాలి, పుష్పముల సువాసనను ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకెళ్లటం, ఇక్కడ ఉదాహరణగా చెప్పబడినది. అదే విధముగా, మరణ సమయంలో ఆత్మ దేహమును విడిచి వెళ్ళేటప్పుడు, అది స్థూల శరీరమును విడిచి పెడుతుంది. కానీ, తనతో పాటుగా సూక్ష్మ, మరియు కారణ శరీరములను తీసుకుని వెళుతుంది; వీటిలోనే మనస్సూ, ఇంద్రియములూ ఉంటాయి. ఆత్మకు ప్రతి జన్మలో ఒక కొత్త శరీరము వచ్చినా, మనస్సు మాత్రం, పూర్వ జన్మల నుండీ అదే వస్తుంటుంది. పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా, కలలు ఎందుకు చూడగలుగుతారో, దీని వలన మనకు తెలుస్తుంది. మామూలుగా అయితే, మనం మెలకువగా ఉన్న సమయంలో చూసిన దృశ్యాలూ, ఆలోచించిన తలపుల వికారములే, నిద్రలో ఒకలా మళ్ళీ అగుపిస్తాయి. కలలో ఆ వ్యక్తి మానవ శరీరంతోనే ఎగురుతూ, తనకు తానే అగుపించవచ్చు. ఇది ఎందుకంటే, అతను మెలకువగా ఉన్నప్పటి ఆలోచనలూ, చూసిన దృశ్యాలూ, ఒకలా వికారంచెంది, మరల స్వప్న స్థితిలో అగుపిస్తాయి. కానీ, పుట్టుగ్రుడ్డి వాడు, ఎప్పుడూ ఎలాంటి రూపములూ, ఆకారములూ చూసి ఉండడు. అయినా ఆ వ్యక్తి కూడా స్వప్నములు చూస్తాడు. ఎందుకంటే, మెలకువగా ఉన్నప్పటి అనుభూతులు, అనంతమైన పూర్వ జన్మల నుండీ మనస్సులలో ముద్రించబడి ఉంటాయి. ఆత్మ వెళ్లిపోయేటప్పుడు, తనతో పాటు మనస్సూ, ఇంద్రియములనూ తీసుకువెళుతుంది.

06:34 - శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ।। 9 ।।

మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములైన చెవులూ, కన్నులూ, చర్మమూ, నాలుక, మరియు ముక్కూ, వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.

ఆత్మ దివ్యమైనది కావున, అది సూటిగా రుచి చూడటం, స్పర్శించటం, అనుభవించటం, వాసనచూడటం, లేదా వినటం చేయలేదు. మరి అది ఎలా ఈ అనుభూతులను ఆస్వాదించవచ్చు? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, దానికి ఇంద్రియములూ, మనస్సూ సహాయం చేస్తాయి. ఇంద్రియములూ, మనస్సూ, నిజానికి జడమైనవి. కానీ, అవి ఆత్మ శక్తిచే చైతన్యవంతమయ్యి, ప్రాణం ఉన్నట్లుగా అవుతాయి. కాబట్టి, అవి వస్తువులూ, పరిస్థితులూ, ఆలోచనలూ, మరియు వ్యక్తుల ద్వారా సుఖదుఃఖాలను అనుభవిస్తాయి. అహంకారముచే ఆత్మ తన మనసేంద్రియములతో అనుసంధానమై, పరోక్షంగా ఆ యొక్క సుఖాలను అనుభవిస్తుంటుంది.

07:39 - ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ ।
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః ।। 10 ।।

అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ, దేహములోనే ఉన్నప్పుడు కానీ, లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ, జ్ఞాన నేత్రములు కలవారు, దానిని దర్శించగలరు.

ఆత్మ దేహములోనే స్థితమై ఉండి, తన మనస్సూ, ఇంద్రియముల యొక్క అనుభూతులను ఆస్వాదిస్తూ ఉన్నా, దానిని అందరూ గుర్తించలేరు. దీనికి గల కారణం ఏమిటంటే, ఆత్మ అనేది ప్రాకృతికమైనది కాదు. అందుకే అది భౌతిక ఇంద్రియములచే చూడబడలేదు, లేదా స్పర్శించబడలేదు. శాస్త్రజ్ఞులు దానిని తమ ప్రయోగశాలలో, తమ ఉపకరణాలతోనూ గుర్తించలేరు. కాబట్టి వారు తప్పుగా, ఈ శరీరమే మనము అని అంటారు. కానీ, ఆధ్యాత్మిక మార్గం లో పయనించిన వారు, ఆత్మయే ఈ అన్ని శరీర భాగములనూ జీవింపచేస్తుందని, తమ జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటారు. అది వెళ్ళిపోయిన తరువాత, భౌతిక శరీరము యొక్క అన్ని భాగములూ, గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటివన్నీ అక్కడే ఉన్నా, వాటిలో చైతన్యం ఉండదు. చైతన్యమనేది, ఆత్మ యొక్క లక్షణము. ఆత్మ ఉన్నంత వరకే, శరీరములో చైతన్యము ఉంటుంది; ఆత్మ వెళ్ళిపోయినప్పుడు, అదికూడా ఉండదు. జ్ఞాన నేత్రములు కలవారే, దీనిని చూడగలరు. అజ్ఞానులు, తమ స్వంత దివ్య అస్థిత్వము తెలియక, ఈ భౌతిక కాయమే తామని అనుకుంటారు.

09:14 - ఇక మన తదుపరి వీడియోలో, దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను ఎటువంటి వారు తెలుసుకోగలుగుతారో, చూద్దాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home