కామ్య కర్మలు! భగవద్గీత Bhagavadgita


కామ్య కర్మలు! ఏ కార్యములను చేయటం వలన వ్యక్తి స్వర్గాది పై లోకాలకు వెళతాడు?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Eo6LbRTPR8Q ]


ఈ అధ్యాయములో, భౌతిక ప్రపంచంలో క్లేశములకు గురయ్యే జీవాత్మ, భౌతిక అస్థిత్వములో ఉండే జగత్తు యొక్క నిజ స్వరూపము యొక్క అజ్ఞానము వలన మరింతగా, దానిలో ఎలా చిక్కుకుని పోతుందో, శ్రీ కృష్ణుని  వివరణను తెలుసుకుందాము..

00:57 - శ్రీ భగవానువాచ ।

ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: వేర్లు పైకీ, మరియు కొమ్మలు క్రిందికీ ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెబుతుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములుగా, ఆ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు, వేదములను తెలుసుకున్నట్లుగా చెబుతారు.

అశ్వత్థ అన్న పదానికి అర్థం, ఉన్నది ఉన్నట్లుగా ఒక్కరోజు కూడా ఉండనిది, అని. ఈ జగత్తు కూడా అశ్వత్థమే.. ఎందుకంటే, ఇది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ జగత్తు ప్రతినిత్యం మారుతూ ఉండటమే కాక, అది ప్రళయ వినాశనం చేయబడి, తిరిగి భగవంతునిలోనికి ఒక రోజు తీసుకొనబడుతుంది. అందుకే దానిలో ఉండేదంతా తాత్కాలికమైనదే, అశ్వత్థమే. అశ్వత్థ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది - రావి చెట్టు అని. ఆత్మకు భౌతిక జగత్తు, చాలా విశాలమైన ఒక అశ్వత్థ వృక్షము వంటిదని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. సాధారణంగా వృక్షములకు వేర్లు క్రిందికీ, మరియు కొమ్మలు పైకీ ఉంటాయి. కానీ, ఈ వృక్షమునకు, ఊర్ధ్వ మూలం, వేర్లు పైకీ ఉంటాయి. అందుకే అది భగవంతుని నుండి ఉత్పన్నమైనదిగా చెప్పుకుంటాము. ఆయన యందే స్థితమై ఉన్నది, మరియు ఆయనచేతనే పోషించబడుతున్నది. ఆ చెట్టుబోదె, శాఖలూ, క్రిందికి విస్తరించి ఉంటాయి. వాటియందే భౌతిక జగత్తులోని లోకాల సమస్త జీవరాశులూ, స్థితమై ఉన్నాయి. కర్మ కాండలూ, మరియు వాటి ఫలములు చెప్పే వేద మంత్రములు, ఈ వృక్షము యొక్క ఆకులు. ఈ భౌతిక అస్థిత్వమనే వృక్షమునకు, అవి పోషకములు. వేదమంత్రములలో చెప్పబడిన ఫలాపేక్ష గల యజ్ఞ కర్మ కాండలు చేయటం వలన, ఆత్మ స్వర్గ భోగములను అనుభవించటానికి, స్వర్గాది లోకములకు వెళుతుంది. కానీ, ఆ పుణ్యము క్షయమై పోయినప్పుడు, తిరిగి భూలోకానికి చేరుతుంది. ఈ విధంగా, ఆ చెట్టు యొక్క ఆకులు దానిని నిరంతరం, జనన-మరణ చక్రంలో ఉంచుతూ పోషిస్తాయి. ఈ జగత్తు రూపంలో ఉండే వృక్షము సనాతనమైనదని అంటారు. ఎందుకంటే, దాని ప్రవాహం నిరంతరంగా జరుగుతుంటుంది. దాని యొక్క ఆది మరియు అంత్యమూ, జీవాత్మల అనుభవంలోనికి రాదు. ఎలాగైతే నిరంతర ప్రక్రియలో, సముద్రము యొక్క నీరు ఆవిరై మేఘాలుగా మారి, మరల వానలాగా భూమిపై పడి, అంతిమంగా తిరిగి సముద్రం చేరుతుందో, ఈ జనన-మరణ చక్రము కూడా నిరంతరం సాగుతూనే ఉంటుంది.

03:38 - అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా

గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।

అధశ్చమూలాన్యనుసంతతాని

కర్మానుబంధీని మనుష్యలోకే ।। 2 ।।

త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకీ క్రిందికీ విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్ళాడుతూ ఉంటాయి. క్రింది భాగాన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.

భౌతిక జగత్తును అశ్వత్థ వృక్షముతో పోల్చుతున్నాడు భగవంతుడు. చెట్టు యొక్క ప్రధాన మొండెము, ఆత్మ తన కర్మలు చేసేటటువంటి మానవ స్వరూపము. వృక్షము యొక్క శాఖలు క్రిందికీ, మరియు పైకి కూడా విస్తరించి ఉంటాయి. ఒకవేళ ఆత్మ పాపిష్టి పనులు చేస్తే, అది జంతువులలో, లేదా నరకలోకాలలో పుడుతుంది. ఇవి క్రిందికి ఉండే శాఖలు. ఒకవేళ ఆత్మ పుణ్య కార్యములు చేస్తే, అది స్వర్గ లోకాలలో గంధర్వుడిలాగా, దేవతల లాగా, లేదా మరేదైనా జీవిలా పుడుతుంది. ఇవి పైకి ఉన్న శాఖలు. ఒక వృక్షము నీటితో పోషింపబడినట్లుగా, ఈ భౌతిక ఆస్థిత్వపు జగత్తు, ప్రకృతి త్రిగుణములచే పోషించబడుతుంది. ఈ త్రిగుణములు, ఇంద్రియ వస్తువిషయములను సృష్టిస్తాయి. అవి వృక్షమునకు చిగుర్లవంటివి. చిగుర్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే, అవి అంకురించి, మరింతగా విస్తరిస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము మీది చిగుళ్లు మొలకెత్తి, భౌతిక వాంఛలను కలుగ చేస్తాయి. అవి చెట్టు ఊడల వంటివి. రావి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అవి శాఖలనుండి ఊడలను నేల వద్దకు పంపిస్తాయి. దీనితో, ఊడలు ద్వితీయ స్థాయి బోదెలుగా మారతాయి; అలా ఆ రావి చెట్టు విస్తరించి, చాలా విశాలంగా పెరుగుతుంది. అశ్వత్థ వృక్షము యొక్క ఉపమానంలో, భౌతిక జగత్తులో ఇంద్రియ వస్తువిషయములు, చెట్టుకు ఉన్న చిగుళ్లు. అవి అంకురించి, వ్యక్తిలో ఇంద్రియ భోగముల పట్ల కోరికలను జనింపచేస్తాయి. ఈ కోరికలు ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. అవి ఈ చెట్టు పెరుగుతూనే ఉండటానికి, పోషకములను ఇస్తుంటాయి. భౌతిక భోగముల పట్ల కోరికలచే ప్రేరేపించబడి, జీవ ప్రాణి కర్మలను చేస్తుంది. కానీ, ఇంద్రియ వాంఛలు ఎన్నటికీ తీరవు; పైగా, వాటిని సంతృప్తి పరచాలని చూసే కొద్దీ, అవి మరింతగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి, కోరికలను తీర్చుకోవటానికి చేసే కర్మలు, వాటిని మరింత పెంచుకోవటానికి మాత్రమే దోహద పడతాయి.

06:19 - న రూపమస్యేహ తథోపలభ్యతే

నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।

అశ్వత్థమేనం సువిరూఢమూలమ్

అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ।। 3 ।।

06:31 - తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ।। 4 ।।

ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము, ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలూ, చివర, లేదా సనాతన అస్థిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లుగల అశ్వత్థ వృక్షమును, అనాసక్తి అనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. అదియే, ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత, మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.

సంసారములో, అంటే ఎడతెగని జనన-మరణ చక్రములో మునిగి ఉన్న బద్ధులైన జీవాత్మలు, ఈ యొక్క అశ్వత్థ వృక్షము యొక్క స్వభావమును తెలుసుకోలేకున్నారు. వారికి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు చాలా ఆకర్షణీయముగా అనిపిస్తాయి. వారు ఇంద్రియ వస్తు విషయముల పట్ల ఆకర్షితమవుతారు, వాటి పట్ల కోరికలను పెంచుకుంటారు. ఈ కోరికలను తీర్చుకోవటానికి, వారు ఎంతో శ్రమిస్తుంటారు. కానీ, వీరి శ్రమ అంతా, ఆ వృక్షము మరింతగా పెరగటానికి దోహదపడుతుందని తెలుసుకోరు. ఎప్పుడైతే కోరికలు తీరుతాయో, అవి మరింత ఉధృతంగా, అత్యాశ రూపంలో తిరిగి వస్తాయి. కోరికలను అడ్డుకున్నప్పుడు, అవి క్రోధమునకు దారితీస్తాయి. అది బుద్ధిని మరింత భ్రమకు గురి చేసి, మరింత అజ్ఞానము లోకి నెట్టి వేస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము యొక్క నిగూఢ మర్మమును, కొద్ది మందే అర్థం చేసుకుంటారని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ వృక్షము యొక్క మొదలు, లేదా దాని అసలు స్వభావము తెలుసుకోకుండా, జీవుడు వ్యర్ధమైన పనులు చేయటం, లేదా ప్రయాసలు పడటం చేస్తుంటాడు. తన యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవటం కోసం, మానవుడు ఒక్కోసారి పాపపు పనులు చేస్తూ, నిమ్నస్థాయి జీవులలోకీ, అధోలోకాలలోనికీ ప్రవేశిస్తాడు. ఒక్కోసారి భౌతిక భోగములు అనుభవించాలనే కోరిక, వ్యక్తిని ఆ చెట్టు యొక్క ఆకుల పట్ల ఆకర్షితం చేస్తుంది. అవే, వేదములలో చెప్పబడిన కామ్య కర్మ కాండలు. ఈ కార్యములను చేయటం వలన, వ్యక్తి స్వర్గాది పై లోకములకు వెళతాడు. కానీ, పుణ్యము క్షయమయిపోయిన తరువాత, తిరిగి భూలోకానికి చేరుతాడు.

08:59 - నిర్మానమోహా జితసంగదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।

ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః

గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ।। 5 ।।

దురభిమానము, మరియు మోహము లేకుండా ఉన్నవారూ, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారూ, సతతమూ, ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారూ, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారూ, సుఖదుఃఖములనెడి ద్వందములకు అతీతులై ఉన్నవారూ, ఇటువంటి ముక్తజీవులు, నా పరమపదమును చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఆ వృక్షము యొక్క మూలాధారమైన భగవంతునకు, ఎలా శరణాగతి చేయాలో వివరిస్తున్నాడు. ప్రప్రధమంగా, అజ్ఞానము వల్ల జనించిన అహంకారమునూ, మరియు గర్వమునూ విడిచిపెట్టాలని అంటున్నాడు. భ్రాంతికి లోనైన జీవాత్మ, ప్రస్తుతం ఇలా అనుకుంటుంది.. ‘నాకున్న దానికంతా నేనే యజమానిని, భవిష్యత్తులో మరింత సంపాదించుకుంటాను. ఇదంతా నా భోగవిలాసానికీ, మరియు సంతోషానికే ఉన్నది.’ అనే భ్రమలో ఉంటుంది. మనము అజ్ఞానము వలన జనించిన ఈ అహంకారముచే మోహితులమై ఉన్నంత వరకూ, మనమే ప్రకృతిని అనుభవించేదని అనుకుంటాము. ఇటువంటి పరిస్థితిలో, మనము ఆ భగవంతుడిని పక్కకుపెట్టి, ఆయన సంకల్పానికి శరణాగతి చేయటానికి వాంఛించము. మనమే వీటన్నిటినీ అనుభవించేదన్న దృక్పథం, జ్ఞాన సహకారంతో నిర్మూలించబడాలి. ఈ భౌతిక శక్తి భగవంతునికి చెందినది కాబట్టి, ఆయన సేవ కోసమే ఉన్నదని గ్రహించాలి. ఆత్మ కూడా భగవంతుని యొక్క సేవకుడే కాబట్టి, ప్రస్తుతమున్న భోగించే దృక్పథాన్ని, సేవా దృక్పథముగా మార్చాలి. దీని కోసం మనము మనస్సుని భగవంతుని నుండి దూరంగా, ప్రాపంచికత్వం వైపు మరల్చే భౌతిక బంధాలను నిర్మూలించుకోవాలి. బదులుగా, ఆత్మ అనేది భగవంతుని యొక్క సనాతన నిత్య దాసుడే అని అర్థం చేసుకుని, మనస్సును నిస్వార్ధ సేవా దృక్పథంలో, భగవంతుని యందే అనుసంధానం చేయాలి.

11:05 - ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక శక్తిచే కట్టివేయబడి, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ఏ విధంగా ప్రయాస పడుతుంటామో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgkxaOc1LBkdNKgupyDYRmy98045V70C_wxa

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home