సర్వోన్నత జ్ఞానం! భగవద్గీత Bhagavadgita
సర్వోన్నత జ్ఞానం!
ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరించినవారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారా?
'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (16 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 16 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WrzxKc8Ch5A ]
నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడి గురించిన వివరణ, ఇలా ఉండబోతోంది..
00:47 - ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ।। 16 ।।
సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి.. క్షరములు అంటే, నశించేవి, మరియు అక్షరములు అంటే, నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే, మోక్షము పొందిన జీవులు.
భౌతిక జగత్తులో, మాయ అనేది జీవాత్మను ఈ భౌతిక శరీరమునకు కట్టివేస్తుంది. ఆత్మ అనేది, నిత్యసనాతనమైనది అయినా కూడా, అది పదేపదే శరీరము యొక్క జననము, మరియు మరణములను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే, శ్రీ కృష్ణుడు భౌతిక జగత్తులో బద్ధ జీవులను, క్షరములని అంటున్నాడు. అతిచిన్న పురుగుల నుండి, ఉన్నతమైన దేవతల వరకూ, ఈ కోవకు చెందినవారే. వీటికన్నా వేరుగా, భగవంతుని ధామములో, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులు కలరు. ఈ జీవులకు మరణంలేని శరీరములు ఉంటాయి; వాటి యందు వారు మరణమును అనుభవించరు; అందుకే వారు అక్షరములని పేర్కొనబడ్డారు.
01:53 - ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ।। 17 ।।
ఇవే కాక, నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడున్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులనూ పోషిస్తూ ఉంటాడు.
జగత్తు, మరియు జీవాత్మల గురించి చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడిక ఆ రెండు లోకాలకూ, మరియు క్షర, అక్షర ప్రాణులకూ అతీతమైన భగవంతుని గురించి చెబుతున్నాడు. శాస్త్రాలలో ఆయనే పరమాత్మగా చెప్పబడ్డాడు. జీవాత్మ అత్యల్పమైనది, మరియు అది వసించి ఉన్న శరీరము యందు మాత్రమే, వ్యాపించి ఉంటుంది. కానీ, పరమాత్మ సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాడు. వాటి కర్మలను నోట్ చేసుకుంటాడు, వాటి ఖాతా ఉంచుకుంటాడు, మరియు వాటి ఫలములను సరియైన సమయంలో ఇస్తూ ఉంటాడు. ఆత్మ జన్మ జన్మలలో ఏ శరీరము తీసుకుంటే, ఆ శరీరములోనికి తాను కూడా ప్రవేశిస్తాడు. ఒకవేళ ఆత్మకు ఒకానొక జన్మలో కుక్క శరీరము ఇవ్వబడితే, పరమాత్మ కూడా దానిలోకి ప్రవేశిస్తాడు, మరియు పూర్వ జన్మల కర్మఫలములను అందిస్తాడు. ఈ విధముగా, కుక్కల అదృష్టంలో కూడా, ఎంతో తేడా ఉంటుంది. కొన్ని వీధి కుక్కలుగా దుర్భరమైన జీవితం గడుపుతుంటాయి, మరికొన్ని పెంపుడు కుక్కలుగా, ఐశ్వర్యంలో విలాసంగా జీవిస్తుంటాయి. ఇంత తేడా వాటి వాటి కర్మరాశి ఫలితంగా సంభవిస్తుంది. ఆ కర్మఫలములను, ఆ పరమాత్మయే అందిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములలో స్థితుడై ఉండే ఆ పరమాత్మ, తన సాకార రూపములో ఉంటాడు.
03:37 - యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ।। 18 ।।
నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్ధముకంటే, మరియు నాశరహితమైన జీవాత్మ కంటే కూడా అతీతమైనవాడను. కాబట్టి, వేదములలో, మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.
ప్రకృతిలో ఉన్న మహాద్భుతమైనవన్నీ, తన యొక్క విభూతుల ప్రకటితములే అని, గతంలో శ్రీ కృష్ణుడు వివరించాడు. కానీ, ఆ కనిపించే జగత్తును సృష్టించడానికి తానే స్వయముగా శ్రమకు లోనవ్వడు. ఆయన యొక్క అలౌకిక వ్యక్తిత్వము, భౌతిక ప్రకృతికీ, మరియు దివ్య ఆత్మలకు కూడా అతీతమైనది. ఇక్కడ తన దివ్య వ్యక్తిత్వమును పురుషోత్తమ అని అంటున్నాడు. ‘శ్రీ కృష్ణుడే సర్వోన్నత భగవానుడు. ఆయన మీదే ధ్యానం చేయుము, ఆయన భక్తినే ఆస్వాదించుము, మరియు ఆయనను ఆరాధించుము.’ ‘శ్రీ కృష్ణుడు సర్వోత్కృష్ట పురుషుడ’ని, వేదములు పేర్కొన్నాయి. మరయితే విష్ణుమూర్తి, శ్రీ రామ చంద్రుడు, శంకరుడు - వీరి స్థాయి ఏమిటన్న సందేహం రావచ్చు. వారందరూ ఆ సర్వోన్నతుని స్వరూపములే, మరియు వారందరూ, ఒకరికొకరు అబేధములే. వారందరూ భగవంతుని, అంటే సర్వోత్కృష్ట దివ్య పురుషుని ప్రకటితములే.
05:00 - యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ।। 19 ।।
ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానమున్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.
మనం భగవంతుడిని మూడు రకాలుగా తెలుసుకోవచ్చు: ‘సర్వోన్నత తత్త్వము ఒక్కటే.. అది జగత్తులో బ్రహ్మము, పరమాత్మ, మరియు భగవానుడనే మూడు విధములుగా వ్యక్తమవుతుంది.’ ఇవి మూడు వేర్వేరు అస్థిత్వములు కావు. ఒకే సర్వోన్నత తత్త్వము యొక్క మూడు స్వరూపాలు. ఉదాహరణకి, నీరు, మంచు, నీటి ఆవిరి, మూడూ విభిన్న పదార్ధములుగా అగుపిస్తాయి. కానీ, అవి ఒకే పదార్ధము యొక్క మూడు విభిన్న రూపాలు. అదే విధంగా బ్రహ్మము అంటే, భగవంతుని యొక్క నిరాకార, సర్వ వ్యాప్త అస్థిత్వము. జ్ఞాన యోగమును అనుసరించే వారు, భగవంతుని యొక్క బ్రహ్మమనే అస్థిత్వాన్ని ఆరాధిస్తారు. పరమాత్మ అంటే, సమస్త ప్రాణుల హృదయములో స్థితమై ఉన్న, ఆ సర్వోన్నత తత్త్వము యొక్క అస్థిత్వము. అష్టాంగ యోగ మార్గము, దేవుని యొక్క పరమాత్మ రూపమును దర్శింపచేస్తుంది. భగవానుడంటే, పరమేశ్వరుని యొక్క సాకర రూపము. ఆ రూపంలో ఆయన ఎన్నో మధురమైన లీలలను చేస్తాడు. భక్తి మార్గము, మనకు ఈశ్వరుడిని భగవానుని రూపంలో, భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది. తనను భక్తి ద్వారా భగవానునిగా, సర్వోన్నత దివ్య పురుషోత్తమునిగా తెలుసుకున్నవారు, యదార్థముగా ఆయన పట్ల పూర్తి జ్ఞానముతో ఉన్నట్టు. ‘బ్రహ్మము అస్థిత్వంలో, ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తులు గుప్తముగా ఉంటాయి. ఆయన కేవలం నిత్య జ్ఞానమును, మరియు ఆనందమును ప్రదర్శిస్తాడు.’ ‘పరమాత్మ అస్థిత్వంలో, ఈశ్వరుడు తన రూపమునూ, నామమునూ, మరియు గుణమునూ చూపిస్తాడు. కానీ, లీలలను ప్రదర్శించడు, పరివారమును కలిగి ఉండడు.’
‘తన సర్వ శక్తులనూ ప్రకటితం చేస్తూ, మరియు, భక్తులతో ఎన్నెన్నో మధురమైన లీలలను చేస్తూ ఉండే ఈశ్వరుని అస్థిత్వమే, భగవానుడు.’ఈ శ్లోకాలు, బ్రహ్మము మరియు పరమాత్మ అస్థిత్వములలో, ఈశ్వరుడు తన సర్వ శక్తులనూ ప్రకటించడని, స్పష్టంగా చెబుతున్నాయి. ఈశ్వరుడు భగవానుడి రూపములో సంపూర్ణముగా ఉంటాడు. దానిలో తన యొక్క నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారమూ, అన్నింటినీ ప్రకటిస్తాడు.
07:36 - ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మాయానఘ ।
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ।। 20 ।।
ఓ పాపరహితుడా, అర్జునా.. అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును, నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి, జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినదంతా నెరవేర్చినవాడవుతాడు.
ఈ అధ్యాయంలోని ఇరవై శ్లోకాలలో, భగవంతుడు వేద శాస్త్రాల సారాన్ని తెలియచేశాడు. ఈ జగత్తు యొక్క స్వభావాన్నీ, భౌతికపదార్ధము మరియు ఆత్మ మధ్య భేదాన్నీ, మరియు చివరగా పరమ సత్యము యొక్క సర్వోన్నత జ్ఞానమునూ, ఆ దివ్య మంగళ పురుషోత్తమునిగా తెలియచేశాడు. ఎవరైతే ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరిస్తారో, వారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారని, ఇప్పుడు భగవంతుడు హామీ ఇస్తున్నాడు. అటువంటి జీవాత్మ, సమస్త కార్యముల, కర్తవ్యముల లక్ష్యమయిన భగవత్ ప్రాప్తిని సాధిస్తుందని వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణ భగవానుడు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, పురుషోత్తమ ప్రాప్తి యోగోనామ పంచదశోధ్యాయ:
శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని, 20 శ్లోకాలూ సంపూర్ణం.
09:02 - ఇక మన తదుపరి వీడియోలో, పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment