సగం శరీరంతో జన్మించిన ‘అరుణుడు’ ఎవరు? Story of Aruna or Anura
సగం శరీరంతో జన్మించిన ‘అరుణుడు’ ఎవరు?
How Sanatana Dharma is Scientific and Conscientious way of living?
సూర్యుడి కిరణాలు మన భూమిని నాశనం చేయకుండా కాపాడేది, ఓజోను పొర అని మనందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో ఏళ్ళ క్రితమే మన పురాణాలలో, సుస్పష్టంగా వివరించబడిన ఒక గాథతోపాటు, సూర్యుడి ఆగ్రహ జ్వాలలకు కారణం ఏమిటి? సూర్యకిరణాలు లోకాలను దహించివేయకుండా అడ్డుపడేది ఎవరు? సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో, ఆకాశంలో కనబడే అరుణ వర్ణం ఎవరి కారణంగా ఉద్భవిస్తుందనేటటువంటి ఉత్సుకతును రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2laPV4Ws8X0 ]
ఇనుడు అంటే సూర్యుడు. ‘ఇన’ శబ్దానికి, సంచరించువాడు అని అర్థం. సూర్యుడు ఒకచోట స్థిరంగా ఉండకుండా సంచరిస్తూ ఉంటాడని, వేల ఏళ్ళ క్రిందటే చెప్పారు మన మహర్షులు. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఆ తిరగడంలో ఒక పద్ధతి ఉన్నది, నియంత్రణ ఉన్నది. ఒక గ్రహానికి మరొక గ్రహం ఢీ కొనకుండా చూసే ఏర్పాటున్నది. ఈ ఏర్పాటును చూసే శక్తి పేరు, శేషువు. ఈ విషయాన్నే స్థూలంగా, ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడని చెబుతాయి, మన పురాణాలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం మాత్రమే కాక, అనేక కోట్ల సూర్యులతో కలసి ఏర్పడిన పాలపుంత చుట్టూ తిరుగుతుంటాడు. దీనిపేరు బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని నిలబెట్టే గురుత్వాకర్షణ శక్తి పేరు, కమఠ. అదే కూర్మ శక్తి. అమృత మథనానికి తోడ్పడేందుకు, మంధర పర్వతాన్ని మోసిన ఆది కూర్మం ఇదే. ఆధునికులు పాలపుంతగా భావించే అంతరిక్షంలోని నక్షత్రమండల సముదాయాన్ని, మన పూర్వులు క్షీర సముద్రంగా వర్ణించారు. పాలపుంతలన్నీ కలిసి ఒక కేంద్రకాన్ని ఏర్పరచుకుని, దాని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రాచీనుల భాషలో దానిని, అఖిలాండ బ్రహ్మాండ కోటి అంటారు. ఈ ఏర్పాటును స్థిరపరిచే గురుత్వాకర్షణ శక్తిని, ఆది వరాహమనీ, శ్వేత వరాహమనీ అంటారు. భూమిని ప్రాణికోటికి నివాస యోగ్యంగా స్థిరపరచిన ఈ వరాహం పేరునే, మన పూజా సంకల్పాలలో ‘శ్వేత వరాహ కల్పే’ అని జ్ఞాపకం చేసుకుంటాము. సూర్యుడిది ఏక చక్ర రథం. దానికి పూన్చిన గుర్రాలు ఏడు. కిరణంలోని ఏడు రంగులే, ఏడు గుర్రాలు. అశ్వాలు వేగానికి ప్రతీక.
ఇక ఈ కథ, ఆది పర్వంలోని ఆస్తీక పర్వం అనే ఉపపర్వంలో, గరుడుని కథలో, 24 వ అధ్యాయంలో, 20 శ్లోకాలలో ఉంది. దేవదానవులు సముద్రాన్ని చిలికినపుడు, అందులోనుంచి అమృతం ఉద్భవించింది. విష్ణువు అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో, రాహువు దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని సేవించబోతూ ఉన్నప్పుడు, సూర్య చంద్రులు చూసి, విష్ణువుకు చెప్పారు. విష్ణువు తన చక్రంతో రాహువు తల నరికి వేశాడు. అయితే, అప్పటికే అమృతాన్ని నోటిలో పోసుకోవడం వల్ల, మొండెం నుంచి తల వేరయినప్పటికీ, అమృత ప్రభావంతో, తల భాగం ప్రాణంతోనే ఉండి, ఆ రాహువు సూర్య చంద్రులను పట్టుకుని బాధించడం మొదలు పెట్టాడు. తాను రాహువు తల నరికించి దేవతలకు చాలా మేలు చేసినప్పటికీ, తనను రాహువు బాధిస్తూ ఉంటే, దేవతలు తనకు సహాయంగా రాకుండా చోద్యం చూస్తున్నారని, సూర్యునికి దేవతల మీద కోపం వచ్చి, ముల్లోకాలకూ బాధ కల్పించాలనే ఉద్దేశంతో, అస్తాద్రికి చేరి అక్కడే ఉంటూ, లోకాలను తన కిరణాల చేత తపింపజేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రుషులూ, దేవతలూ కలసి బ్రహ్మ వద్దకు వెళ్లి, సూర్యుడు లోకాలను దహింపజేస్తున్న విషయాన్ని గురించి చెప్పారు.
దానికి బ్రహ్మ, "కశ్యప మహర్షి కుమారుడైన అనూరుడు చాలా విశాలమైన శరీరం కలవాడు, గొప్ప తేజస్వి. అతణ్ణి సూర్యుని ముందు రథం మీద కూర్చుండ బెట్టి సారథ్యం చేయిస్తే, భయంకరమైన సూర్యుని తేజస్సు అడ్డగింపబడుతుంద"ని సలహ ఇచ్చాడు. సూర్య శక్తిని తట్టుకోగలిగే అనూరుడి జన్మ వృత్తాంతాన్ని చూసుకున్నట్లయితే, కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు, తమకు సంతానం కావాలని భర్తను కోరారు. అప్పుడు కశ్యపుడు వారిని "ఎలాంటి పుత్రులు కావాల"ని అడుగగా, కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత మాత్రం, తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా, కద్రువకు వెయ్యి అండాలూ, వినతకు రెండు అండాలూ లభించాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది, వెయ్యి మంది నాగ కుమారులు జనించారు. అందుకు వినత ఉక్రోషపడి, తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదిమింది. దాని నుండి సగం దేహంతో జన్మించిన వాడే, అనూరుడు. అండము నుండి బయటకు రాగానే అతను తల్లిని మందలించి, తనకు అసంపూర్ణమైన దేహం కలిగినందుకు కారణమైన ఆమెను, ఎవరిని చూసి ఈర్ష్యతో ఆ దారుణానికి పూనుకున్నదో, వారికే దాసివవుతావని బాధతో శపించాడు. తరువాత వినతకు మరో అండం ద్వారా, గరుడుడు జన్మించాడు.
సూర్యుడి తాపం నుండి విముక్తి పొందడానికై బ్రహ్మ సలహా మేరకు, గరుడుడు ముల్లోకాల క్షేమాన్నీ కోరి, తన అన్న, నడుము క్రింది భాగం లేనివాడూ అయిన అనూరుడిని మోసుకుని వెళ్ళి, సూర్యుని రథం మీద కూర్చోబెట్టాడు. సారథి రథికుడికి వెన్నుపెట్టి గుర్రాలను తోలాలి. అనూరుడు అందుకు భిన్నంగా, సూర్యుడివైపు ముఖంపెట్టి కూర్చున్నాడు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావాలను తాను వడగట్టి, మంచి కిరణాలను భూమికి పంపడం మొదలుపెట్టాడు. సూర్యోదయానికి పూర్వం, ఆకాశంలో కనబడే ఎరుపు వర్ణం, అనూరుడు చేస్తుండే సాహసానికి సంబంధించినదే! దీనినే, ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను అడ్టుకుంటుందన్న దానికి ప్రతీకగా తీసుకోవచ్చు. సూర్యుడి కిరణాలను అడ్డుకుంటూ, ముల్లోకాలకూ ప్రశాంతతను కలుగజేసిన అనూరుడికి, అరుణుడు అన్నపేరు స్థిరపడింది. శూరసుత, అనూరు, అరణ్య కాశ్యపి, గరుడాగ్రజ అనేవి, అనూరునికి గల మరికొన్ని పేర్లు.
అనూరుడికి తన భార్య శ్యేని వల్ల, ఇద్దరు కుమారులు కలిగారు. వారే సంపాతి, జటాయువు. వీరి పూర్తి వృత్తాంతాలను మనం గతంలో, రామయణ గాథలో తెలుసుకున్నాము. అయితే, కొన్ని గ్రంథాల ఆధారంగా, వాలీ, సుగ్రీవులు కూడా అనూరుడి కుమారులే. ఒకసారి అనూరుడు దేవేంద్ర సభలో అప్సరసలు నృత్యం చేస్తున్నారని తెలిసి, వారిని చూడడానికి స్త్రీగా మారి ఇంద్రలోకం చేరగా, ఇంద్రుడామెను మోహించి సంగమించగా, ఓ పుత్రుడు జన్మించాడు. ఆ తరువాత తన పూర్వ రూపంలోకి మారి, సూర్యుని వద్దకు వెళ్ళాడు. ఆలస్యానికి కారణమేమిటని సూర్యుడు నిలదీయగా, జరిగిన విషయాన్ని వివరించాడు. అంతా విన్న సూర్యుడు మరొకసారి తనను స్త్రీగా మారవలిసినదిగా కోరాడు. ఆ సమయంలో సూర్యుడితో సంగమించగా, మరొక పుత్రుడు జన్మించాడు. అలా స్త్రీగా మారిన అనూరుడికి జన్మించిన ఇద్దరి పుత్రులనూ, అహల్యాదేవి సాకింది. ఆమె భర్త గౌతమునికి ఇది కోపకారణమై, వారిని కోతులుగా మారమని శపించాడు.
రుక్షరాజు సంతానం లేక విచారిస్తుండగా, ఈ కోతుల రూపంలో ఉన్న ఇద్దరినీ, ఇంద్రుడు అతనికి అప్పగించాడు. వారే, వాలీ సుగ్రీవులు. అయితే, కద్రువ సంతానంలో ఐరావతుడనే వాడు, గొప్ప సర్పరాజు. అతనికి ఇరవైవేల మంది సంతానం. వీరందరూ సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించడానికి అవసరమైన పగ్గాలుగా పనిచేయడానికి, వంతుల వారీగా, సూర్యమండలానికి వెళ్లి వస్తుంటారు. కాంతి కిరణాలు సరళరేఖలో పయనిస్తాయని మొదట్లో నమ్మిన ఆధునిక శాస్త్రజ్ఞులు, అలల రూపంలో కూడా అవి ప్రసరిస్తాయని కనుగొన్నారు. కాంతి కిరణాలు పాముల వలె మెలికలు తిరుగుతూ, అడ్డదిడ్డంగా, కట్టలుకట్టలుగా ప్రసరిస్తాయని, మన పూర్వులు పేర్కొన్నారు. కాలానికి సంబంధించిన శాస్త్రీయ విషయాలు ఎన్నో, మన వేదాలలో, పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. సంకేతాల సాయంతో శాస్త్రీయ విషయాలను చెప్పడం, మనవారికి వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించడమే, మన ఋషులకు మనం సమర్పించగల నివాళి. అత్యంత సనాతనమైన, ఎంతో విశిష్టతను సొంతం చేసుకున్న మన హైందవ ధర్మాన్ని గౌరవించడంతో పాటు, ముష్కరుల దాడులనుండి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే.
ధర్మో రక్షతి రక్షిత:
Comments
Post a Comment