కపోత-లుబ్దక! పరశురాముడు చెప్పిన దివ్య గాధ! Story of Fowler and Pigeon from Mahabharatam
కపోత-లుబ్దక! పరశురాముడు చెప్పిన దివ్య గాధ!
‘అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ’ - నీతి కథ!
మహాభారతంలోని శాంతిపర్వంలో, ఆపద్ధర్మానుశాసన పర్వం అనే ఉపపర్వంలో వివరించబడిన, బోయవాడు - పావురం కథను, భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. శరణాగత రక్షకుడు పాటించవలసిన ధర్మాన్ని గురించి చెప్పమని, భీష్ముడిని ధర్మరాజు కోరగా, శరణాగత రక్షణను గొప్పగా పాటించిన ఒక పావురం కథను తెలియజేశాడు, భీష్మ పితామహుడు. పూర్వం పరశురాముడు, ముచికుందరాజుకు వివరించిన ఆ కథను, అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. శరణాగత రక్షణతో పాటు, భార్యభర్తల అన్యోన్య దాంపత్యాన్ని వివరించే ఆ పావురం కథను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/JumauLZVQuw ]
ఒక అడవి సమీపంలో అతి క్రూరుడైన బోయవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు వల తీసుకుని అడవికి వెళ్ళి, పక్షులను పట్టుకుని చంపి, వాటిని అమ్మేవాడు. ఒకరోజు పక్షుల కోసం అతడు అడవికి వెళ్ళినపుడు, గాలీ వానతో కూడిన కుండపోత వర్షం కురుసింది. అడవంతా నీటితో నిండిపోయింది. బోయవాడు ఆ వర్షంలో తడిచి ముద్దై, చలికి వణుకుతూ అడవిలో తిరుగుతూ, వర్షానికి ఎటూ కదలలేక, చిన్న కొమ్మ మీద ఉన్న పావురాన్ని చూసి, దానిని తన బుట్టలో వేసుకున్నాడు. అక్కడికి దగ్గరలోని ఒక పెద్ద చెట్టును చూసి, ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుని, ఆ చెట్టుకు నమస్కరించి, "ఈ చెట్టు మీద ఉన్న దేవతలందరినీ శరణుగోరుతున్నాను", అని పలికి, చలికి వణుకుతూ, ఆకలితో బాధపడుతూ నిద్రపోయాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక పావురం ఉంది. దాని భార్య ఆ రోజు పొద్దున ఆహారం కోసం వెళ్ళి, తిరిగి రాలేదు. తన భార్య రాకపోయినందుకు, ఆ పక్షి ఆమె క్షేమాన్ని గురించి దిగులు పడుతూ, ఆమె పాతివ్రత్యాన్నీ, సత్ర్పవర్తనను గురించీ, ఇలా అన్నది.
"నా భార్య లేకపోతే నాకు ఇల్లు శూన్యం. కుమారులూ, కోడళ్ళూ, మనుమలూ, సేవకులూ, ఇంటి నిండా ఉన్నప్పటికీ, ఇల్లాలు లేకపోతే, గృహస్థుకు ఇల్లు శూన్యమే. గృహిణి లేని ఇల్లు, ఇల్లు కాదు. గృహస్థుకు గృహిణియే ఇల్లు. గృహిణి లేని ఇల్లు అడవితో సమానం. సర్వాంగ సుందరమైన నా భార్య ఈ రోజు రాకపోతే, నేను బ్రతికి ఉపయోగం లేదు. ఆమె మహా పతివ్రత. ఎల్లప్పుడూ నన్ను అనుసరించి, నా ఆనందాన్ని తన ఆనందంగా, నా దు:ఖాన్ని తన దు:ఖంగా భావిస్తూ ఉంటుంది. అలాంటి భార్యను పొందిన వాడు, ధన్యుడు. పురుషునికి భార్యయే పరమార్థం. అతడు రోగాలతో బాధపడుతున్నా, కష్టాల్లో చిక్కుకున్నా, భార్య వంటి ఔషధం మరొకటి ఉండదు. భార్యతో సమానమైన బంధువు ఉండడు. భార్యలాంటి గతి ఉండదు. లోకంలోని ధర్మ సంగ్రహంలో, భార్యతో సమానమైన సహాయకుడు ఉండడు. అలాంటి భార్య ఇంట్లో లేకపోతే, భర్త అడవులకు వెళ్ళాలి. ఎందుకంటే, భార్యలేని ఇల్లైనా, అడవైనా ఒకటే.." అని తన భార్యను తలచుకుని, దీనంగా విలపించింది.
ఆ విధంగా విలపిస్తున్న పావురం మాటలను విని బోయవాని బుట్టలో ఉన్న ఆడపావురం, తన భర్తకు తన మీద ఉన్న ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించి, తన భర్తతో ఇలా అన్నది. "నీ నివాసం దగ్గరకు వచ్చిన ఈ బోయవాడు చలితో, ఆకలితో బాధపడుతూ పడి ఉన్నాడు. అతనికి సహాయం చేసి, శరణాగత రక్షకుడివి కమ్ము. నా కోసం బాధపడవద్దు. సంతానవంతుడవైన నీవు, ఈ బోయవాని మనస్సు సంతోషించేలా, అతని కోరికలను తీర్చు."
ఆ మాటలను విన్న మగపావురం, భార్య చెప్పినట్లుగా చేయాలని నిశ్చయించుకుని, బోయవానితో.. "నీవు బాధపడవలసిన అవసరం లేదు. మా ఇంటికి వచ్చిన అతిథివి నీవు. ఇంటికి వచ్చిన శత్రువుకైనా, ఆతిథ్యమివ్వాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనిస్తుందే కానీ, ముడుచుకోదు. ఇంటికి వచ్చిన వానికి గృహస్థు తప్పని సరిగా అతిథ్యమివ్వాలి. కాబట్టి, నీకేమి కావాలో చెప్పు" అని బోయవానిని అడిగింది. దానికి బోయవాడు, చలి బాధ నుండి తనను రక్షించమని వేడుకున్నాడు. వెంటనే పావురం నేల మీది ఆకులను పోగుచేసి, తన రెక్కల శక్తినంతా ఉపయోగించి, తొందరగా ఎగిరి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళి నిప్పు తీసుకుని వచ్చి, ఎండుటాకుల మీద వేసి మంట చేసి, శరీరావయవాలను వెచ్చచేసుకోమని, బోయవానికి చెప్పింది. బోయవాడు మంటకు తన అవయవాలు కాచుకుని, చలి నుండి విముక్తుడై, తన ఆకలి తీర్చమని పావురాన్ని కోరాడు.
అతని మాటలు విన్న పక్షి, "నా దగ్గర సంపద లేదు. ఏ రోజుకారోజు దొరికిన దానితో మేము జీవిస్తాము. భోజనం కోసం కూడబెట్టినది, నా దగ్గర లేదు" అని పలికి క్షణకాలమాగి, "అయినా నీ ఆకలి తీరుస్తాను" అని బోయవానితో చెప్పి, ఎండుటాకుల మంటను పెద్దది చేసి, "ఋషుల వల్లా, దేవతల వల్లా, పితరుల వల్లా, మహాత్ముల వల్లా, అతిథి పూజనమే గొప్ప ధర్మమని నేను గతంలో విని ఉన్నాను. ఓ సౌమ్యుడా.. నేను సత్యం చెబుతున్నాను. అతిథి పూజలో నాకు తిరుగులేని బుద్ధిని అనుగ్రహించు" అని ఆ పావురం అతనితో పలికి, నవ్వుతూ అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి, అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూసి బోయవాడు ఛలించిపోయాడు. అప్పటి వరకూ తాను చేసిన క్రూర కర్మలను అనేక విధాలుగా నిందించుకుంటూ, పెద్దగా విలపించడం మొదలుపెట్టాడు.
కపోతం యొక్క త్యాగాన్ని చూసిన బోయవాడు, "గతంలో ఎన్నో క్రూరమైన కర్మలతో, ఎంతో పాపం చేశాను. నేను దుర్బుద్ధినీ, నమ్మతగినవాడనుకానూ. ఎన్నో పక్షులను పట్టుకుని, చంపి జీవిస్తున్నాను. గొప్ప మనస్సు గల ఈ పావురం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన మాంసాన్ని నాకు అర్పించి, నా క్రూరత్వానికి తగిన ప్రతీకారం చేసి, నిస్సంశయంగా ధర్మ మర్గాన్ని నాకు బోధించింది. కాబట్టి, నేను భార్యా బిడ్డలనూ, ప్రియమైన ప్రాణాలను కూడా వదలివేస్తాను. భోగాలన్నింటినీ విడనాడి, నా శరీరాన్ని రకరకాల ఉపవాసాలతో శుష్కింప జేసుకుని, పరలోకాన్ని పొందుతాను." అని పలికి, ధర్మాచరణకు నిశ్చయించుకుని, క్రూరకర్ముడైన ఆ బోయవాడు పక్షులను పట్టుకోవడానికి ఉపయోగించే తన పరికరాలను అక్కడే వదిలివేశాడు.
పంజరంలో బంధించిన ఆడ పావురాన్ని విడిచిపెట్టి, మహాప్రస్థానం వైపు పయనమవుతుండగా, బంధ విముక్తురాలైన ఆడపావురం తన భర్త మరణానికి దు:ఖిస్తూ, తన భర్త మంచితనాన్నీ, తన మీద అతనికి గల ప్రేమనూ, అతను తనకు కల్పించిన స్వర్గ సుఖాలనూ తలచుకుని, "స్త్రీకి భర్తతో సమానమైన వారెవరూ లేరు. తండ్రి, సోదరుడూ, కొడుకూ, వీరందరి కన్నా భర్త అనురాగమే గొప్పది. అలాంటి భర్త లేకుండా నేను జీవించనవసరం లేదు" అని పలికి, ఆడపావురం మండుతున్న అగ్నిలో దూకేసింది. అప్పుడు ఆ పావురాల జంటను తీసుకుని వెళ్ళడానికి స్వర్గలోకం నుండి చక్కగా అలంకరించిన విమానం వచ్చింది. దాన్ని ఎక్కి ఆ రెండు పావురాలు స్వర్గ లోకానికి వెళ్ళిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయవాడు, తాను కూడా పక్షుల లాగే ఉత్తమ లోకాలను పొందగోరి, నిరాహారుడై, ఉపవాసంతో కృశిస్తూ, అడవిలో తిరుగుతూ, కొంత కాలానికి అడవిలో చెలరేగిన దావానలాగ్నికి తన శరీరాన్ని అర్పించి పునీతుడై, ఉత్తమ లోకాలను పొందాడు.
దయ, కరుణ, పరోపకారం, త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడిని సైతం కాపాడమని, "అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ" అన్న హితబోధను చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం. ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, శరణాగత రక్షణ అనేది గొప్ప ధర్మం అని వివరించాడు. ఈ ధర్మం వల్ల, గోహత్యా పాతకం నుంచి కూడా బయటపడవచ్చు. శరణాగతుని చంపిన వానికి, నిష్కృతి లేదు. పుణ్యకర్మమూ, పాప వినాశకరమూ అయిన ఈ కథను విన్నవారు, స్వర్గలోకాన్ని పొందగలరని, తెలియజేశాడు. ఈ కథలో చక్కటి సన్నివేశ వర్ణనా, సహృదయులను ప్రభావితం చేయగల రమణీయమైన సంభాషణలూ, అపూర్వమైన పాత్ర చిత్రణా కనిపిస్తాయి. చక్కటి రంగులతో, అందమైన శరీరాన్ని కలిగి, కుహుకుహూ అనే శబ్దాలతో ఆనందాన్నివ్వగల పావురం, శాంతికి ప్రతీక. అలాంటి పావురాలను పాత్రలుగా తీసుకుని, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్నీ, పరస్పరం ఒకరినొకరు విడిచివుండలేని అపూర్వమైన భార్యాభర్తల ప్రేమాభిమానాలనూ, భీష్ముడు ఈ కథ ద్వారా గొప్పగా తెలియజేశాడు. అలాగే, శరణాగత రక్షణ, అతిథి పూజనం, గొప్ప ధర్మాలనీ, మానవులు ఆ ధర్మాలను తప్పనిసరిగా పాటించాలనీ, అలా పాటించిన వారు, మరణానంతరం స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తారనీ చెప్పిన ఈ కథ, మానవులకు పరోపకారం, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న గొప్ప నీతిని తెలుపుతుంది.
సర్వేజనాః సుఖినోభవంతు!
Comments
Post a Comment