Transcendental Meditation - భగవద్గీత Bhagavadgita
Transcendental Meditation?
అనుకూల - ప్రతికూల పరిస్థితులనూ, విమర్శనూ - ప్రశంసనూ ఒక్కలాగే ఎలా చూడాలి?
'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (24 – 27 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 24 నుండి 27 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/UdZlKp1cyro ]
త్రిగుణములకు అతీతులైనవారెవరో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు..
00:45 - సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ।। 24 ।।
00:55 - మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ।। 25 ।।
సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారూ, ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారూ, మట్టిముద్ద, రాయి, మరియు బంగారము, వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారూ, అనుకూల, లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారూ, తెలివైన వారూ, నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారూ, గౌరవమునూ, అవమానమునూ ఒక్క రీతిగానే తీసుకునేవారూ, శత్రువునూ, మిత్రుడినీ ఒక్కలాగే చూసేవారూ, అన్ని యత్నములనూ విడిచిపెట్టినవారూ - వీరు త్రిగుణములకు అతీతులైనవారని చెప్పబడతారు.
భగవంతుని లాగానే, ఆత్మ కూడా త్రిగుణాతీతమయినదే. శారీరక దృక్పథంలో మనము, మనలను శరీరము యొక్క సుఖ-దుఃఖాలతో అనుసంధానం చేసుకుంటాము. అందుకే, హర్షము లేదా శోకము వంటి భావోద్వేగాల మధ్య ఊగిసలాడతాము. కానీ, ఆత్మ భావము యందే స్థితమైనవారు, శరీరము యొక్క సుఖము, లేదా దుఃఖముచే ప్రభావితం కారు. ఇటువంటి ఆత్మజ్ఞానులు జగత్తు యందలి ద్వందములను గమనిస్తారు కానీ, వాటిచే ప్రభావితం కారు. అందుకే వారు నిర్గుణులైపోతారు. అంటే, గుణముల ప్రభావమునకు అతీతమైపోతారు. ఇది వారికి సమత్వ దృష్టిని ఇస్తుంది. దానితో వారు, ఒక రాయిని, లేదా మట్టి ముద్దని, బంగారాన్ని, అనుకూల మరియూ ప్రతికూల ప్రరిస్థితులనూ, విమర్శనూ మరియు ప్రశంసనూ ఒక్కలాగే చూస్తారు.
02:33 - మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ।। 26 ।।
నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు, ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు, మరియు బ్రహ్మము స్థాయికి చేరతారు.
ప్రకృతి త్రి-గుణములకు అతీతులైన వారి యొక్క లక్షణములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ త్రిగుణములకు అతీతమై పోవటానికి ఉన్న ఏకైక పద్ధతిని వివరిస్తున్నాడు. ఆత్మ యొక్క జ్ఞానము, మరియు దానికీ శరీరమునకూ ఉన్న బేధమును, కేవలం తెలుసుకుంటే సరిపోదు. భక్తి యోగము ద్వారా, మనస్సును ఆ పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మపై లగ్నం చేయాలి. అప్పుడు మాత్రమే మన మనస్సు, నిర్గుణుడైన శ్రీకృష్ణుడి వలె, మూడు గుణములకు అతీతమైన స్థాయికి చేరుతుంది. చాలా మంది జనులు, మనస్సును సాకార రూప భగవంతునిపై నిమగ్నం చేస్తే, అది అలౌకిక స్థాయికి చేరుకోలేదని అనుకుంటారు. దానిని నిరాకార బ్రహ్మముపై నిమగ్నం చేస్తేనే, మనస్సు త్రి-గుణములకు అతీతమవుతుందని భావిస్తారు. కానీ, ఈ శ్లోకం ఆ అభిప్రాయాన్ని ఖండిస్తున్నది. సాకార రూప భగవంతుడు అనంతమైన గుణములను కలిగి ఉన్నా, అవి అన్నీ దివ్యమైనవి, మరియు ప్రకృతి గుణముల కన్నా అతీతమైనవి. కాబట్టి, సాకార రూప భగవానుడు నిర్గుణుడు. పద్మ పురాణంలో, మహర్షి వేద వ్యాసుడు, ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నాడు: ‘శాస్త్రములు ఏవైనా భగవానుడు నిర్గుణుడని అంటే, దాని అర్థం, ఆయనకి ప్రాకృతిక గుణములు లేవని. ఐనప్పటికీ, ఆయన యొక్క దివ్య వ్యక్తిత్వము గుణరహితము కాదు. ఆయనకు అనంతమైన దివ్య గుణములు ఉన్నాయి’. ధ్యాన విషయంలో ఏది శ్రేష్ఠమో కూడా, ఈ శ్లోకము తెలియచేస్తున్నది. Transcendental meditation అంటే, ఎదో శూన్యంపై ధ్యానం చేయటం కాదు. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతమైన అస్థిత్వము, భగవంతుడు. కాబట్టి, మన ధ్యాన విషయం భగవంతుడయినప్పుడే, దానిని నిజమైన Transcendental meditation అని అనవచ్చు.
04:45 - బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ।। 27 ।।
అనశ్వరమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకూ, సనాతనమైన ధర్మమునకూ, మరియు అఖండమైన దివ్య ఆనందమునకూ నేనే ఆధారమును.
సర్వశక్తిమంతుడైన భగవానుడు, తన అస్తిత్వంలో నిరాకార తత్వమును, మరియు సాకార రూపమును, రెంటినీ కలిగి ఉన్నాడని, ఇదివరకే చెప్పబడినది. జ్ఞానులు ఉపాసించే బ్రహ్మము అనేది, భగవంతుని యొక్క సాకార రూపము నుండి జనించే ప్రకాశమే అని, ఇక్కడ శ్రీ కృష్ణుడు తెలియపరుస్తున్నాడు. ‘బృందావనేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పాద నఖముల నుండి వెలువడే కాంతియే, జ్ఞానులూ, దేవతలూ ధ్యానించే అలౌకిక బ్రహ్మమ’ని, పద్మ పురాణంలో వివరించబడింది. భగవంతుని యొక్క దివ్య దేహము నుండి వెలువడే తేజస్సే, ఉపనిషత్తులలో బ్రహ్మముగా చెప్పబడినది. పరమేశ్వరుని సాకార రూపము పట్ల నిశ్చలమైన భక్తితో నిమగ్నమవ్వటమే, త్రిగుణముల యొక్క వ్యాధుల సర్వరోగనివారిణి అని, రూఢీగా తెలియజేస్తున్నాడు శ్రీ కృష్ణుడు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోధ్యాయ:
శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్నాలుగవ అధ్యాయం, గుణత్ర విభాగ యోగములోని, 27 శ్లోకాలూ సంపూర్ణం..
06:18 - ఇక మన తదుపరి వీడియోలో, పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment