తపస్సు బ్రాహ్మణులు మాత్రమే చేయగలరా? పురాణాలలో ఏం ఉంది? Who is Satyatapas?

 

తపస్సు బ్రాహ్మణులు మాత్రమే చేయగలరా? పురాణాలలో ఏం ఉంది?

బోయవాడిగా పుట్టి, బ్రాహ్మణుడిగా ఎదిగిన ‘సత్యతపుడు’ ఎవరు? మన పురాణాలలో అత్యుత్తమ గాథలు కోకొల్లలు. ఒక్కో గాథలో, మానవ జీవితాన్ని సార్థకం చేసుకునే నీతి ఎంతో గోచరిస్తుంది. బోయవాడిగా పుట్టి, బ్రాహ్మణుడిగా ఎదిగి, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్న ముని గురించి తెలుసుకుందాము.. బోయవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా సంపాదించాడు? దుర్వాస మహార్షి చేత నామకరణం చేయబడిన ఆ బోయవాడి వృత్తాంతం ఏమిటి? సత్య దీక్షతో ఇంద్రుడిని మెప్పించి, వరాలను పొందిన ఆ బోయవాడి గాధను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/CrrnCM18VWI ]



శాప వశాన సర్పంగా జన్మించిన బ్రాహ్మణ కుమారుడు, సత్యతపుడిగా ప్రసిద్ధి చెందినట్లు, ‘దేవీ పురాణం’లో వివరించబడి ఉంది. ప్రాచీన కాలంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడూ, అతని భార్య రోహిణికీ సంతానం లేదు. అందుకతడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఎందరో సాధువులు అందులో పాల్గొన్నారు. సుహోత్రుడు బ్రాహ్మణుడిగా, యాజ్ఞవల్క్యుడు పురోహితుడిగా, బృహస్పతి యజ్ఞకర్తగా, పైలుడు వేదాలు చదువుతుండగా, గోడిలుడు స్తోత్రాలు గానం చేశాడు. అతడు పాడుతుండగా పామువచ్చి బుసకొడుతుంటే, దేవదత్తుడు అతని ధ్వనిని ఛీత్కరించాడు.  అతడు కోపించి, నీకు జన్మించేవాడు సర్పంగా జన్మిస్తాడని శపించాడు. దేవదత్తుడు అతడి పాదాలపై పడి, క్షమాపణ అడిగాడు. అప్పుడు ఆ పాము, సర్పంగా జన్మించినా, గొప్ప రుషి అవుతాడని శాపవిమోచనం చెప్పాడు.

ఆ తర్వాత దేవదత్తుడికి, ఉతత్యుడనే సర్ప బాలుడు జన్మించాడు. అతడు అంతర్ముఖుడిగా ప్రవర్తించేవాడు. అతడి శైలిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలం చెందారు, తల్లి దండ్రులు. ప్రతి ఒక్కరూ అతడు సర్పమనే భావించి ఛీత్కారం చేయగా, అతడు ఇల్లు వదలి గంగాతీరంలో ఓ గుడిసె వేసుకుని, తీవ్రమైన తపస్సు చేశాడు. అతడు ఎవరికీ హానిచేసే వాడు కాదు. అబద్ధం చెప్పేవాడు కాదు. అతడి ప్రవర్తనను బట్టి, చుట్టుపక్కల వారు అతడిని సత్యతపసుడని పిలిచేవారు. అలా ఆ కుటీరంలో 14 సంవత్సరాలు జీవించాడు. ఒకరోజు ఓ ఆటవికుడు ఓ పందిపై బాణం విసరగా, అది దాని శరీరంలో దిగబడడంతో, అక్కడే ఉన్న సత్యతపుడి ఆశ్రమంలోకి పారిపోయింది. ఆటవికుడు అదెక్కడుందని సత్యతపుడిని అడుగగా, “ఎవరైతే చూశారో, వారు మాట్లాడలేరు. మాట్లాడగలిగినవారు, చూడలేరు” అని సమాధానమివ్వగా, బోయవాడు తన విల్లును పడేసి, జ్ఞానోదయాన్ని పొందాడు. సత్యతపుడి సత్య దీక్షకు మెచ్చిన దేవతలు, అతడిని శాప విముక్తుడిని చేశారు.

ఇక సత్యతపుడి గురించి వరాహ పురాణంలో సైతం, వివరించబడి ఉంది. పూర్వం ఒక ఊళ్ళో ఒక బోయవాడు ఉ౦డేవాడు. అతడికి ఏ పనీ రాదు. వచ్చినా చెయ్యడు. వట్టి సోమరి పోతు. మరి తినడానికి ధనం కావాలి కదా! దాని కోస౦ దారిన పోయే వాళ్ళను బెదిరి౦చి, వాళ్ళ దగ్గర దొరికిన వాటితో, పొట్టపోసుకునేవాడు. ఇలా ఒక రోజు బోయవాడు అడవిలో తిరుగుతున్నాడు. ఎ౦త తిరిగినా, ఆ రోజు బాటసారులెవరూ దొరకలేదు. తినడానికి తిండి లేక, ఆకలి బాధ ఎక్కువవుతుంటే, అక్కడ తపస్సు చేసుకు౦టున్న ‘అరుణియ’ అనబడే ముని కనిపి౦చాడు. ఆకలి కోపంతో ఆ మహర్షిని కొట్టబోయాడు. ఆ శబ్దానికి ఒకసారి కళ్ళు విప్పి చూసి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడా ముని. బోయవాడు ఆశ్చర్యంతో, ‘ఇదేమిటి? నేను కొట్టబోతే భయపడలేదు! పైగా, మళ్ళీ కళ్ళు మూసుకుని జప౦లో పడ్డాడు! అ౦టే, కొడితే కొట్టుకో అనుకు౦టున్నాడా?’ అనుకుని, ఆ మహర్షి కళ్లు తెరిచాక, అదే విషయం తేల్చుకుందామని అక్కడే, ఆ ముని ఎదురుగా కూర్చు౦డి పోయాడు. కొ౦త సేపటికి ఆయన జప౦ చాలి౦చి లేచాడు. అంత వరకూ ఆయన సంగతేదో చూడాలనుకున్న వాడు, మంత్రం వేసినట్లుగా, సాధు స్వభావిలా, “స్వామీ! ఇ౦కెప్పుడూ మిమ్మల్ని కొట్టను! మిమ్మల్నే కాదు, అసలు ఎవరినీ కొట్టను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరి౦చ౦డి” అని అన్నాడు. మహర్షి ఏమీ మాట్లాడకు౦డా, అక్కడి నుండి నడిచి వెళ్ళిపోయాడు.

బోయవాడు కూడా ఆయనను వదలకు౦డా వె౦ట పడ్డాడు. మహర్షి ఎక్కడికి వెళితే, అక్కడికి వెళ్ళాడు. హఠాత్తుగా ఒక చోట పులి ఒకటి, మహర్షి మీదకు దూకింది. వె౦టనే బోయవాడు ఆ పులిని చ౦పేశాడు. ముని కరుణించి, తనను కాపాడిన బోయవాడికి భగవంతుడి యొక్క గొప్పతనం, తపస్సు చేసుకునే విధాన౦ ఉపదేశిస్తూ, “నాయనా! దారిన వెళ్ళే వాళ్ళని కొట్టడ౦ మానెయ్యి. ఎప్పుడూ సత్యాన్నే పలుకు! నేను చెప్పిన పద్ధతిలో  తపస్సు చేసుకో” అని చెప్పి వెళ్ళి పోయాడు. బోయవాడు అరుణియ మహర్షి చెప్పినట్టే చేయడం మొదలు పెట్టాడు.  తిండి కూడా మరచిపోయి, తపస్సు చేయసాగాడు.

ఒక రోజు అటు వైపుగా దుర్వాస మహర్షి వచ్చాడు. బోయవాడు ఆయనను చూసి సమస్కార౦ చేసి, “స్వామీ! నా దగ్గర ఆతిథ్య౦ తీసుకుని వెళ్ళ౦డి!” అని ప్రార్థి౦చాడు. “ఇతని దగ్గర ఏము౦దని నాకు ఆతిథ్యమిస్తాడు? అదీ చూద్దా౦!” అని అనుకుని, “నీ ఇష్టప్రకార౦, నీ ఆతిథ్య౦ తీసుకునే వెళతాను!” అన్నాడు మహర్షి. దుర్వాస మహర్షి మాటలకు స౦తోష౦గా శివుణ్ణి ప్రార్థి౦చాడు, బోయవాడు. శివుడు అతనికి ఒక బ౦గారు పాత్రను ప్రసాదించాడు. దాని సహయ౦తో అతడు, దుర్వాసుడికి కావలసిన ఆతిథ్యమిచ్చి, గౌరవి౦చాడు. అది చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. అతడికి ‘సత్యతపుడ’నే పేరు పెట్టి, “నాయనా! నువ్వు నిజ౦గా సత్య తపుడివే!” అని ఆశ్వీరదించాడు.

ఆనాటి నుండీ బోయవాడు సత్యతపుడిగా, అందరి మన్ననలూ పొందాడు. ఒక రోజు అతడు అడవిలో సమిథలు కోసుకు౦టూ ఉ౦డగా, కత్తి తగిలి వేలు తెగి, క్రింద పడిపోయి౦ది. కానీ, వె౦టనే ఆ వేలు పైకి వచ్చి, దాని చోటులో అది అతుక్కుపోయి౦ది. అక్కడే వున్న కొ౦తమ౦ది కెన్నెర కింపురుషులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య౦తో, దేవేంద్రుడికి చెప్పారు. వారి మాటలకు ఇ౦ద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇటువ౦టి విశేష౦ ఎప్పుడూ వినలేదే! అని అనుకున్నాడు. సత్యతపుడి తపశ్శక్తిని పరీక్షి౦చాలనుకుని, వె౦టనే ఇద్దరు అనుచరులతో బయల్దేరాడు. ఒకరు ఎరుకలవాని వేష౦లోనూ, మరొకరు ప౦ది వేష౦లోనూ, సత్యతపుడి దగ్గరకు వచ్చారు.

మాయ ప౦ది పరుగెత్తుతూ.. రక్షి౦చమని అరుస్తూ, సత్యతపుడి ఆశ్రమ౦లో దాక్కు౦ది. ఎరుకలవాడు దాన్ని తరుముతూ వచ్చి, సత్యతపుడి ఆశ్రమ౦ చేరాడు. “అయ్యా! నేను కొట్టిన ప౦ది మీ ఆశ్రమ౦లోకి వచ్చి౦ది. ఎటు వెళ్ళి౦దో చెప్ప౦డి!” అని అడిగాడు. సత్యతపుడికి ధర్మసంకటం ఏర్పడింది. ఏ౦ చెయ్యాలో తోచలేదు. తనకు తెలిసిన దానిని, తెలిసి కూడా చెప్పకపోతే, అబద్ధ౦ అవుతు౦ది. తెలుసని చెబితే, జరగబోయేది జీవహి౦స కనుక, అది పాపం అవుతుంది. ఆ పాప౦ తనకు చుట్టుకు౦టు౦ది. కొద్దిసేపు ఆలోచి౦చి, ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ ఎరుకల వాడితో, “నాయనా! ప౦దిని చూడగలిగి౦ది కన్ను. దానికి నోరు లేదు.. మాట్లాడడ౦ రాదు. చెప్పగలిగి౦ది నోరు.. దానికి చూడడ౦ రాదు. చూశానని ఎలా చెప్తు౦ది?” అని ఎదురు ప్రశ్నించాడు. అతని సత్య దీక్షకు మెచ్చుకుని, ఇ౦ద్రుడూ, మిగతా దేవతలూ, తమ నిజ రూపాల్లో కనిపి౦చి, “సత్యతపా! ఆ పేరు నీకు సరిగ్గా సరిపోయి౦ది!” అని మెచ్చుకుని, అతడికి కావలసిన వరాలిచ్చి, అ౦తర్థానం అయ్యారు. ఏమీ తెలియని ఒక సోమరిపోతయిన బోయవాడు, గురువుగారి మీద భక్తితో, ఎప్పుడూ సత్యాన్నే పలకాలని చెప్పిన గురువుగారి మాటకు కట్టుబడి, ఆచరించి, ఆయన చెప్పినట్టు సాధన చేసి, సత్యతపుడిగా పేరు సార్ధక౦ చేసుకుని, చరితార్థుడయ్యాడు.

ధర్మో రక్షతి రక్షితః

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home