అత్యున్నత లక్ష్యం! దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను శ్రీ కృష్ణుడు ఏమని వివరించాడు? భగవద్గీత Bhagavadgita

అత్యున్నత లక్ష్యం! దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను శ్రీ కృష్ణుడు ఏమని వివరించాడు?

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 1 నుండి 4 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XiCTrae3dQg ]


మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలైన దైవీ గుణాలు, మరియు ఆసురీ గుణాలను, శ్రీ కృష్ణుడిలా వివరించబోతున్నాడు.

00:50 - శ్రీ భగవానువాచ ।
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ।। 1 ।।

01:01 - అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునమ్ ।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ।। 2 ।।

01:11 - తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ।। 3 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో ధృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంధ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం, అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ, మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట, మరియు దురభిమానం లేకుండుట.

ఇక్కడ శ్రీ కృష్ణుడు దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను వివరిస్తున్నాడు. అత్యున్నత లక్ష్యం దిశగా వెళ్ళటానికి, మన ఆధ్యాత్మిక సాధనలో భాగంగా వీటిని మనం పెంపొందించుకోవాలి. 

నిర్భయత్వం: వర్తమాన కాలంలో మరియు భవిష్యత్తులో ఉండే కష్టాల మీద చింతన నుండి విముక్తి భావమే ఇది. దేనిమీదైనా మితిమీరిన మమకారాసక్తియే, ఈ భయాన్ని కలుగ చేస్తుంది. ధనం మీద వ్యామోహం, డబ్బులు పోతాయేమో అన్న భయాన్ని కలుగచేస్తుంది. సామాజిక కీర్తిప్రతిష్ఠల మీద మక్కువ, అపఖ్యాతి అంటే భయాన్ని కలుగచేస్తుంది. దుర్గుణములపై మక్కువ, పాపభీతిని కలుగచేస్తుంది. శారీరక సుఖాలపై ఆసక్తి, అనారోగ్యం అంటే భయాన్ని కలుగచేస్తుంది. వైరాగ్యము మరియు భగవంతునికి శరణాగతి - మన హృదయములో సర్వ భయాలనూ నిర్మూలిస్తాయి.

అంతఃకరణ శుద్ధి: ఇది ఆంతర పరిశుభ్రత. మనస్సు అనేది ఆలోచనలనూ, ఇష్టాయిష్టాలనూ, రాగద్వేషాలనూ, భావోద్వేగాలనూ పుట్టిస్తుంది, మరియు వాటిపై చింతన చేస్తుంది. ఇవి ఎప్పుడైతే నైతికంగా, మంచి దృక్పథంతో, సకారత్మకంగా మరియు ఉన్నతమైనవిగా ఉంటాయో, అప్పుడు మనస్సు పవిత్రంగా ఉన్నదనుకోవచ్చు; అవి ఎప్పుడైతే అనైతికంగా, తక్కువస్థాయిలో ఉంటాయో, అప్పుడు మనస్సు మలినమైనదిగా భావించాలి. రజో గుణము, మరియు తమోగుణములలో ఉన్న వస్తువిషయముల పట్ల అనుబంధమే, మనస్సును మలినం చేస్తుంది. అదే సమయంలో, భగవంతునితో అనుబంధము, మనస్సును శుద్ధి చేస్తుంది.

ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరత్వం: ఏది మంచో ఏది చెడో మర్చిపోయినప్పుడు, మానవులు పశువుల వలె అయిపోతారు. అందుకే, శాస్త్ర ఉపదేశాల పట్ల దృఢ సంకల్పంతో ఉండటమే, ధర్మ మార్గములో పయనించటానికి మూలాధారము.

దానము: దానము అంటే మన సంపదను ఒక మంచి పనికోసం, లేదా అది అవసరమైన వారికి ఇచ్చివేయటం. నిజమైన దానం ఏమిటంటే, ఎదో ఇస్తున్నామనే గర్వముతో కాకుండా, భగవత్ సేవలో పాలుపంచుకునే అవకాశం లభించిందనే కృతజ్ఞతతో ఇవ్వటం. శారీరక సంక్షేమం కోసం చేసే భౌతికపరమైన దానం, ఇతరులకు తాత్కాలికంగా దోహద పడుతుంది. ఆత్మ స్థాయిలో చేసే ఆధ్యాత్మిక దానము, సమస్త క్లేశముల మూల కారణమైన భగవత్ విముఖత నుండి విముక్తికి దోహదపడుతుంది. అందుకే, ఇది భౌతిక దానం కంటే ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది.

ఇంద్రియ నిగ్రహణ: మనస్సును మరింత ప్రాపంచిక మోహములో పడవేయటానికి, ఇంద్రియములు ఎంత శక్తివంతమైనవో మన అందరికీ తెలుసు. అవి జీవులను తక్షణ సుఖాల కోసం ప్రేరేపిస్తాయి. కానీ, ఆధ్యాత్మిక ధర్మ మార్గంలో పయనిస్తూ, ఉన్నతమైన లక్ష్యమును సాధించటానికి, నిమ్నస్థాయి ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టడం చాలా అవసరం. అందుకే, ఇంద్రియ నిగ్రహణ అనేది, భగవత్ మార్గంలో పయనించటానికి, ఒక ఆవశ్యకమైన సద్గుణము.

యజ్ఞము చేయటం: అంత ఆహ్లాదకరంగా లేకపోయినా, మన యొక్క వైదిక ధర్మాలనూ, సామాజిక విధులనూ నిర్వర్తించుట. నిజమైన యజ్ఞము అంటే, భగవంతుని ప్రీతి కోసము చేయబడినదే.

పవిత్ర గ్రంధ పఠనం: శాస్త్రములలో ఉండే ఉన్నతమైన జ్ఞానమును బుద్ధికి అందించటమనేది, దైవీ గుణము పెంపొందించుకునే ప్రక్రియలో, ఒక ముఖ్యమైన పని. ఎప్పుడైతే బుద్ధి నిజమైన జ్ఞానముచే ప్రకాశితమవుతుందో, ఆ వ్యక్తి యొక్క కార్యములు సహజంగానే పవిత్రమవుతాయి.

తపస్సు: శరీరము-మనస్సు-ఇంద్రియములు ఎటువంటివంటే, వాటిని గారాబం చేస్తే, అవి సుఖాసక్తి కలిగి ఉంటాయి. కానీ, వాటిని నిగ్రహిస్తే, అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. అందుకే, తపస్సు అంటే, శరీర-మనోబుద్ధులను శుద్ధి చేయటానికి, స్వచ్ఛందంగా కష్టాలను స్వీకరించటం.

సరళత్వము / నిష్కపటత: మాటలలో, మరియు నడవడికలో సరళత అనేది, మనసులో అక్కరలేని గజిబిజిని తొలగిస్తుంది, మరియు ఉత్తమమైన ఆలోచనలను జనింపచేస్తుంది.

అహింస: ఇతర ప్రాణుల పురోగతికి, మనసా, వాచా, లేదా కర్మణా, ఇబ్బంది పెట్టకుండా ఉండటం.

సత్యసంధత: మన స్వార్థం కోసం నిజాలను వక్రీకరించకపోవటమే, సత్యసంధత. భగవంతుడే పరమ సత్యము. కాబట్టి, సత్యసంధత అనేది, మనలను ఆయన దిశగా తీసుకువెళుతుంది. అదే సమయంలో, అసత్యము, మనకు అనుకూలంగా ఉన్నా, అది మనలను భగవంతుని నుండి దూరముగా తీసుకు వెళుతుంది.

క్రోధము లేకుండుట: కోపమనేది, ప్రాకృతిక మనస్సు యొక్క వికారము. ఆనందాన్ని అనుభవించాలనే కోరికలకు అవరోధం కలిగినప్పుడూ, లేదా వారు అనుకున్నట్టు జరగనప్పుడూ, ఈ క్రోధము వ్యక్తమవుతుంది. వైరాగ్యం పెంచుకోవటం ద్వారా, మరియు భగవత్ సంకల్పానికి శరణాగతి చేయటం ద్వారా, ఈ క్రోధమును అధిగమించవచ్చు.

త్యాగము: ఈ భౌతిక శక్తి అంతా భగవంతుని సొత్తు, మరియు ఇది ఆయన ప్రీతి కోసమే ఉన్నది. కాబట్టి, ఈ జగత్తు యొక్క వైభవములు మన సుఖానుభూతి కోసం లేవు. అవి భగవంతుని సేవలోనే ఉపయోగించబడాలి. ఈ భావనలో స్థితమై ఉండటమే, త్యాగము.

శాంతి: సద్గుణములు పెంచుకోవాలంటే, మానసిక ప్రశాంతత అవసరం. శాంత స్వభావం అంటే, బాహ్యంగా కల్లోల పరిస్థితులు ఉన్నా, అంతర్గతంగా నిశ్చలముగా ఉండటమే.

తప్పులు వెదకకుండా ఉండటం: ఈ ప్రపంచం, మరియు దానిలో ఉన్నదంతా, మంచి-చెడు గుణముల సమ్మేళనమే. ఇతరుల దోషాల మీద దృష్టిపెడితే, మన మనస్సు మలినమవుతుంది. అదే సమయంలో, వారి మంచిగుణములపై దృష్టి పెట్టడం, శుద్ధి చేస్తుంది. తనలోని లోపాలను చూసుకుంటూ, ఇతరుల లోని మంచి గుణాలను గమనించటం, సాధు జనుల లక్షణం.

సర్వ భూతముల పట్ల దయ: వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదిగిన కొద్దీ, వారు సహజంగానే తమ స్వార్ధం కంటే ఉన్నతంగా ఎదిగి, సమస్త ప్రాణుల పట్లా కరుణా స్వభావమును పెంచుకుంటారు. ఇతరుల కష్టాలు చూసినప్పుడు కలిగే గాఢ సానుభూతినే, దయ అంటారు.
అలోలుప్త్వం - దురాశ లేకుండుట: దురాశ అంటే, న్యాయపరంగా, శారీరక నిర్వహణకు కావలసిన దానికన్నా, పోగుచేసువాలనే వాంఛయే, దురాశ. దీనికి వశమైనవారు, తాము మరణ సమయంలో, అంతా ఇక్కడే వదిలివేయాలని తెలిసి కూడా, భారీ స్థాయిలో ఆస్తులూ, సంపదలూ ప్రోగు చేసుకుంటారు. ఇటువంటి దురాశ నుండి విముక్తి, సంతుష్టికీ మరియు ఆంతరంగిక ప్రశాంతతకూ దారితీస్తుంది.

సౌమ్యత: ఇతరుల మనస్సు కష్టపెడతామనే భావన కలగకపోవడం వలన, కొందరు మొరటుగా ప్రవర్తిస్తారు. కానీ, వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, సహజంగానే వారు ప్రవర్తనలో మొరటుతనాన్ని విడిచిపెడతారు. సౌమ్యత అంటే, మృదుత్వం అనేది ఆధ్యాత్మిక సంస్కారానికి సూచిక.

సిగ్గు - లజ్జ: శాస్త్రములు ఉపదేశించిన దానికి, లేదా సమాజానికి విరుద్ధంగా చేయటానికి, సంకోచము కలగటము. సత్పురుష స్వభావమనేది, పాపపు పనులు చేసేటప్పుడు, అపరాధ భావనను కలిగించే బలమైన అంతర్గత అంతరాత్మను ఇస్తుంది;
చపలత్వం లేకుండుట: మనము మంచి ఉద్దేశంతో ప్రారంభించవచ్చు. కానీ, మనం దురాకర్షణ, మరియు కష్టాల వలన పెడదారి పడితే, మనం ఈ ప్రయాణాన్ని పూర్తిచేయలేము. ధర్మ పథంలో విజయం అనేది, ఎన్ని అవాంతరాలు వచ్చినా, లక్ష్యం దిశగా, అచంచలమైన సంకల్పంతో పరిశ్రమిస్తేనే, సాధ్యము.

దృఢసంకల్పం: స్వచ్ఛమైన మనస్సు నుండి, మనం విలువలూ, మరియు విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తించాలన్న గాఢమైన దృఢ సంకల్పము వస్తుంది. కాబట్టి, సాధు పురుషులు వారు చేయదలుచుకున్న పనుల పట్ల చాలా శక్తినీ, మరియు పట్టుదలనూ కలిగి ఉంటారు.

క్షమాగుణము, లేదా ఓర్పు: ప్రతీకారేచ్ఛ లేకుండా, ఇతరుల తప్పిదాలను సహించే గుణమే, క్షమ. క్షమాగుణము ద్వారా వ్యక్తి, ఇతరుల వలన కలిగిన మానసిక గాయాలను మాన్పివేయగలడు. అలాచేయకపోతే, అవి మనస్సులో చికాకు కలిగించి, అశాంతిని కలుగచేయగలవు.

మనఃస్థైర్యము: మనసేంద్రియములు ప్రతికూల పరిస్థితుల వల్ల అలసిపోయినా, లక్ష్యమును సాధించుటలో ఉన్న మనో బలమూ, మరియు స్థైర్యమే ఇది. సాధిస్తామనే ఆశ ఏమాత్రం లేకపోయినా, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్న వారే, ఈ ప్రపంచంలో గొప్పగొప్ప విజయాలు సాధించారు.

పరిశుభ్రత: ఇది అంతర్గత, మరియు బాహ్యమైన స్వచ్ఛతను సూచిస్తుంది. సాధు పురుషులు, బాహ్యమైన శుభ్రతను కోరుకుంటారు. ఎందుకంటే, అది అంతర్గత స్వచ్ఛతకి అనుకూలంగా ఉంటుంది.

ఎవరిపట్ల కూడా శత్రుత్వం లేకుండుట: ఇతరుల పట్ల శత్రుత్వం కలిగి ఉండటం, మన మనస్సునే విషపూరితం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటుంది. వారు కూడా మనలాంటి వారే, అందరిలోనూ భగవంతుడు ఉంటాడన్న భావనను పెంపొందించు కోవటం ద్వారా, ఇతరుల పట్ల శత్రుత్వ భావన నిర్మూలించబడుతుంది.

దురభిమానం లేకుండుట: ఆత్మ-స్తుతి, గొప్పలు చెప్పుకోవటం, ఆడంబర ప్రదర్శన మొదలైనవన్నీ, గర్వము వలన జనిస్తాయి. సాధు జనులు గర్వ పడటానికి, వారిలో వారికి ఏమీ కనిపించదు. అదే సమయంలో, వారిలో ఉన్న సద్గుణములకు, వారు భగవతునిపట్ల కృతజ్ఞతతో ఉంటారు. ఆ విధంగా వారు సొంత-గొప్పలకు దూరంగా ఉంటారు.

11:51 - దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ।। 4 ।।

ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి, ఆసురీ స్వభావముగల వారి గుణములు.

శ్రీ కృష్ణుడు ఇప్పుడు, ఆసురీ స్వభావము కలవారి ఆరు లక్షణములను వివరిస్తున్నాడు. వారు - కపటులు, అంటే, బాహ్యముగా ఎదో ఇతరుల మెప్పు కోసం సాధువులాగా ప్రవర్తించినా, వారికి అంతర్గతంగా దానికి సరిపోయే సంస్కారం ఉండదు. అది అంతర్గతంగా మలినమైనదే అయినా, బయటకు మాత్రం స్వచ్ఛమైన దానిగా కనిపిస్తుంది. ఆసురీ స్వభావముగల జనుల ప్రవర్తన, ఇతరుల పట్ల గర్వంతో, మరియు అమర్యాదతో ఉంటుంది. తమ యొక్క సంపద, విద్య, అందము, హోదా వంటి శారీరక సంపత్తి, మరియు పదవులను చూసుకుని గర్వ పడతారు. వారికి మనస్సు మీద నియంత్రణ లేక, వారి దురాశ, మరియు వాంఛలు తీరనప్పుడు, వారికి కోపము వస్తుంటుంది. వారు క్రూరముగా, మరియు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు; తమ వ్యవహారములలో ఇతరులకు కలిగే ఇబ్బంది / కష్టాలను పట్టించుకోరు. వారికి ఆధ్యాత్మిక విషయముల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదు. అలాగే, పాపిష్టి పనులను కూడా, ధార్మికమైనవే అని అనుకుంటారు.

13:15 - ఇక మన తదుపరి వీడియోలో, ఆసురీ గణాల పూర్తి వివరణను, శ్రీ కృష్ణుడి మాటలలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home