సందిగ్ధావస్థ! భగవద్గీత Bhagavadgita
సందిగ్ధావస్థ! వేర్వేరు యుగాలలో మంచి చెడుల తారతమ్యం!
'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 5 నుండి 8 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/zEORvI6uU9s ]
ఆసురీ గుణాల పూర్తి వివరణను, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..
00:46 - దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా ।
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ।। 5 ।।
దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి. కానీ, ఆసురీ గుణములు, బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా.. నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.
శ్రీ కృష్ణుడు ఈ రెండు స్వభావాల పరిణామాలను వివరిస్తున్నాడు. ఆసురీ గుణములు, వ్యక్తిని జన్మ-మృత్యు-సంసార బంధనాలకు కట్టివేస్తాయని చెబుతున్నాడు. అదే సమయంలో, దైవీ గుణములను పెంపొందించు కోవటం, మాయా బంధనము నుండి విముక్తి పొందటానికి, దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని విజయవంతముగా అనుసరిస్తూ, చివరి వరకూ దానిలోనే ఉండటంలో, సాధకుడు చాలా విషయాల పట్ల జాగరూకతతో ఉండాలి. గర్వము, కపటత్వము వంటి ఒక్క ఆసురీ గుణము వ్యక్తిత్వములో ఉండిపోయినా, అది ఓటమికి కారణం కావచ్చు. అదే సమయంలో, మనము దైవీ గుణములను పెంపొందించుకోవాలి. ఎందుకంటే, పవిత్ర గుణములు లేకుంటే, మన ఆధ్యాత్మిక పురోగతి మళ్లీ కుంటుపడవచ్చు. క్షమా గుణము లేకుంటే, మనస్సు ఎప్పుడూ ద్వేష భావనతోనే ఉండిపోయి, అది భగవంతునిలో నిమగ్నమై ఉండలేదు. కానీ, శ్రీ కృష్ణ పరమాత్మ పేర్కొన్న ఈ దైవీ గుణములను పెంపొందించుకుంటే, వేగంగా పురోగతి సాధించే సామర్ధ్యం, మరియు మార్గంలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కునే శక్తీ పెరుగుతాయి. ఈ విధంగా, మంచి గుణములను పెంపొందించుకోవడం, మరియు చెడు గుణములను నిర్మూలించుకోవటం అనేవి, ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన భాగమే. భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే, సహజంగానే కాలక్రమేణా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న దైవీ గుణములను ఆర్జించుకోవచ్చని, కొందరు వాదిస్తారు. నిజానికి ఇది యదార్ధమే. కానీ, మనం ప్రారంభంలోనే సంపూర్ణ భక్తితో, ఏ చెడు గుణములూ లేకుండా మొదలిడుతామన్నది కష్టమే. వాటిలో ఏ ఒక్కటయినా, మన భక్తి పురోగతిలో తీవ్ర అవరోధం కలిగించవచ్చు. భక్తిని క్రమక్రమంగా, అభ్యాసం ద్వారా పెంపొందించుకోవాలి. దైవీ గుణములను పెంపొందించుకోవటం, మరియు ఆసురీ గుణములను నిర్మూలించుకోవటం ద్వారా, అభ్యాసములో విజయం సాధించవచ్చు.
03:08 - ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ।। 6 ।।
ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగి ఉన్నవారు, మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను. ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెబుతాను, వినుము.
అన్ని జీవాత్మలు, తమతమ పూర్వ జన్మల నుండి వస్తూ ఉన్న స్వభావాలను కలిగి ఉంటాయి. ఆ ప్రకారంగానే, గత జన్మలలో దైవీ గుణములను పెంపొందించుకున్నవారు, మరియు పుణ్య కార్యములను చేసిన వారు, ఈ జన్మలో దైవీ గుణములతో పుడతారు. కానీ, గత జన్మలలో పాపపు పనులు చేసిన వారూ, తమ మనస్సులను అపవిత్రం చేసుకున్నవారూ, ఈ జన్మలో కూడా అవే స్వభావాలను కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో జీవులకు, అందుకే విభిన్న రకములైన స్వభావాలు ఉంటాయి. దైవీ మరియు ఆసురీ గుణములు రెండూ, పూర్తి పరస్పర విరుద్ధ స్వభావములు. స్వర్గాది లోకాలలో ఉన్న జీవులు ప్రధానంగా, దైవీ గుణములను కలిగి ఉంటారు. అలాగే, ఆసురీ గుణములు క్రింది లోకాలలో ఎక్కువగా ఉంటాయి. మానవులు దైవీ, ఆసురీ గుణములను రెంటినీ కలిగి ఉంటారు. ఏంతో క్రూరమైన కాసాయి వాడికి కూడా, వ్యక్తిగత జీవితంలో దయాగుణమున్నట్టు మనము గమనించవచ్చు. అలాగే, ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులలో కూడా, మనకు గుణ దోషములు కనపడతాయి. సత్య యుగములో దేవతలు, రాక్షసులు వేర్వేరు లోకాలలో ఉండేవారని చెబుతారు; త్రేతా-యుగములో, వారు ఒకే లోకంలో ఉండేవారు; ద్వాపర యుగములో, ఒకే కుంటుంబంలో ఉండేవారు; కలి యుగంలో, ఒకే వ్యక్తి హృదయంలో, దైవీ, ఆసురీ గుణములు కలిసే ఉంటాయని చెబుతారు. అదే మానవ జీవితంలో ఉండే సందిగ్ధావస్థ. ఉన్నత అస్థిత్వము మనలను భగవంతుని వైపుకు, పైకి తీసుకువెళితే, నిమ్న స్థాయి అస్థిత్వము మనలను, క్రిందికి గుంజుతుంటుంది.
05:14 - ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః ।
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ।। 7 ।।
ఆసురీ గుణములు కలవారు, ఏది మంచి నడవడిక, ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత, సత్ప్రవర్తన, లేదా కనీసం సత్యసంధత కూడా కలిగి ఉండరు.
ధర్మము అంటే, ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతకూ, మరియు సర్వ భూతముల సాధారణ సంక్షేమానికీ దోహదపడే నియమములు. అధర్మము అంటే, దిగజారిపోవటానికి దారితీసే, మరియు సమాజానికి హాని చేసే, నిషేధింపబడ్డ పనులు. ఆసురీ స్వభావమనేది, జ్ఞానము యందు, మరియు శాస్త్ర విజ్ఞానము పట్లా విశ్వాసరాహిత్యముగా ఉంటుంది. కాబట్టి, దాని ప్రభావంలో ఉన్నవారు, ఏది ఒప్పో, ఏది తప్పో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు. ఉదాహరణకు, ఎవరికైనా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించకపోవడం ఒప్పుగానే అనిపిస్తే, ఆ వ్యక్తి తాను ఒప్పు అనుకున్నది చేయటం వలన, ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పెడతాడు. ఆసురీ స్వభావమనేది, ఏది మంచి, ఏది చెడు, అన్న విషయంపై అయోమయ స్థితిలో ఉంటుంది. అందుకే వారిలో స్వచ్ఛత / పవిత్రత, సత్యము, సరియైన నడవడిక అగుపించవని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.
06:34 - అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ ।
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ ।। 8 ।।
వారు ఇలా అంటారు.. ‘ఈ జగత్తులో పరమ సత్యమనేది ఏదీ లేదు. ఏ రకమైన నైతిక నియమ ఆధారమూ లేదు. అసలు భగవంతుడు అనేవాడే లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వలననే ఉద్భవించినది, మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఇతర ప్రయోజనమేమీ లేదు’ అని అంటారు.
అనైతిక ప్రవర్తన నుండి దూరంగా ఉండటానికి, రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది సంకల్ప బలం ద్వారా అధార్మికత నుండి దూరంగా ఉండటం. రెండవది భగవంతుని భయం వల్ల పాపిష్టి పనులకు దూరంగా ఉండటం. కేవలం సంకల్ప బలం వల్ల మాత్రమే, పాపపు పనులకు దూరంగా ఉండేవారు, చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం మంది, దండన / శిక్ష భయం వలననే, తప్పుడు పనులు చేయటానికి వెనకాడుతారు. ఆసురీ స్వభావములు కలవారు, భగవంతుని మీద విశ్వాసంతో వచ్చే ఈ యొక్క భగవత్ అజమాయిషీనీ, మరియు నియమబద్ధ ప్రవర్తననూ అంగీకరించటానికి ఒప్పుకోరు. బదులుగా, అసలు భగవంతుడు అనేవాడు లేడు, మరియు నైతిక ప్రవర్తనకు ఈ ప్రపంచంలో ఆధారం లేదన్న దృక్పథాన్నే, అవలంభిస్తారు. సంశయము లేకుండా, లేదా పరిణామాల మీద భయం లేకుండా, ఇంద్రియములను తృప్తి పరచటంలో నిమగ్నమవ్వటానికి, కొన్ని సిద్ధాంతాలు వారికి అనుకూలంగా ఉంటాయి. వివిధములైన ఇంద్రియ తృప్తులలో, లైంగిక భోగము తీవ్రమయినది. ఇది ఎందుకంటే, ఈ భౌతిక జగత్తనేది, ఆద్ధ్యాత్మిక జగత్తు యొక్క వక్రీకరించబడిన పరావర్తనం వంటిది. ఆధ్యాత్మిక జగత్తులో, ముక్తి నొందిన జీవుల యొక్క కార్యకలాపాలకూ, మరియు వారు భగవంతునితో చేసే వ్యవహారాలకూ, దివ్య ప్రేమ అనేదే మూలాధారము. భౌతిక జగత్తులో, దానియొక్క వక్ర ప్రతిబింబమైన కామమే, భౌతికంగా బద్ధులైన జీవుల మనస్సులలో ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా, రజో గుణ ప్రభావంలో ఉన్నవారికి. అందుకే, ఆసురీ మనస్సు కలవారు, లైంగిక కార్యకలాపములే మానవ జీవన ప్రయోజనమని అనుకుంటారు.
08:48 - ఇక మన తదుపరి వీడియోలో, ఏ విధంగా మోహితులై, తాత్కాలికమైన వాటికి ఆకర్షితులమవుతామో, శ్రీ కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment