కపట సన్యాసి - మహారాజు! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన కథ! Greed Is The Blindfold That Blocks Your Mind!
కపట సన్యాసి - మహారాజు! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన కథ!
రావణుని జన్మకు కారణం, ఆ లక్ష మంది విప్రుల శాపమా?
సమస్త భూమండలానికీ ఎలిక అయిన కైకయ రాజు ప్రతాపభానుడు, సద్గుణ సంపన్నుడూ, గొప్పయోధుడు. అతని ప్రియ సోదరుడైన అరిమర్దనుడు మహా బలశాలి, వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతిజ్ఞుడు, బుద్ధిమంతుడు. తన దిగ్విజయ యాత్రలో, ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి, సమస్త భూమండలానికీ ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన, ఆ రాజు గురువులనూ, దేవతలనూ, సాధు సజ్జనులనూ, పితరులనూ, భూసురులనూ, భక్తి విశ్వాసాలతో సేవించేవాడు. రాజ ధర్మాలను వేదోక్తంగా పాటిస్తూ, నిత్యం అనేక దాన ధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసాలను భక్తి శ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులూ, చెఱువులూ, ఉద్యానవనాలూ, దేవతా మందిరాలూ కట్టించి, ప్రజా రంజకంగా రాజ్యపాలన చేశాడు. వనాలలో ఆశ్రమాలను నిర్మించుకున్న మహర్షులు, తమ తపశ్శక్తిలో ఆరవ భాగం రాజులకు ధార పోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటారు. అందుకే, లోకహితులైన మహర్షులను క్రూరమృగాలనుండి కాపాడటం, రాజుల విధి. మునుల కార్యార్థం అడవికి వెళ్ళిన మహారాజు, ఒక కపట సన్యాసి వలన ఏ విధంగా శాపగ్రస్థుడయ్యాడో.. తన వంశ నాశనానికి తానే కారకుడెలా అయ్యోడో.. ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jfv49Xw_l8w ]
ఒకసారి ప్రతాపభానుడు, శాస్త్రప్రకారం చంపదగిన మృగాలను వేటాడటానికి, వింధ్యారణ్యానికి వెళ్ళాడు. ఆ సుందరారణ్యంలో ఒక పెద్ద అడవి పందిని చూసి, దాని వెంటబడ్డాడు రాజు. ఎంత ప్రయత్నించినా, ఆ అడవిపంది అతనికి చిక్కలేదు. చాలా దూరం పరుగెత్తి, ప్రవేశించటానికి దుర్గమమైన ఘనారణ్యంలోకి వెళ్ళిపోయింది, ఆ వరాహం. ధీరుడైన ప్రతాపభానుడు తన ప్రయత్నాన్ని మానక, ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళడానికి వీలులేక, నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మరలాడు. కానీ, ఆ ఘోరారణ్యంలో దారితప్పి, తిరిగి తిరిగి బాగా అలసిపోయి, ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమం ఒక కపటసన్యాసిది. ఆ కపట వేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధంలో ఓడిపోయి, పారిపోయిన శత్రురాజు. హృదయంలో ప్రతాపభానునిపై ద్వేషాన్ని నింపుకుని, ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే, అతనిని గుర్తుపట్టాడు. కానీ, అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు, వాడిని గుర్తించలేదు. దాహంతో బాధపడుతున్న రాజుకు, ఒక సరోవరం చూపించాడు. అతడు సరోవరంలో స్నానంచేసి, శుచి అయ్యి, నీరు త్రాగాడు. ప్రతాపభానుని ఆశ్రమంలోకి ఆహ్వానించాడు, ఆ కుహనాసన్యాసి.
“నాయనా! నీవెవరు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరారణ్యంలోకి ఎందుకు వచ్చావు?” అని ఏమీ ఎరుగానివాడిలా అడిగాడు కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడు జాగ్రత్తగా, ఇలా సమాధానమిచ్చాడు.. “ఓ మహాత్మా! మీ సహాయానికి కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి, తప్పిపోయాను. మీ దర్శన భాగ్యం కలగటం, నా అదృష్టము”. అందుకా కపాటసన్యాసి, “ఓ సజ్జనుడా! బాగా చీకటి పడింది. నీ రాజ్యం ఇక్కడికి డెబ్భై యోజనాలుంటుంది. కాబట్టి, నీవు ఈ రాత్రికి నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని, రేపు వెళ్ళు” అని చెప్పాడు. సన్యాసి దయాగుణాన్ని ఎన్నో విధాల పొగడి, ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు. మాయమాటలతో రాజు తనను నమ్మేలాచేసి, ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపటసన్యాసి, నిర్మలుడైన ప్రతాపభానుడు అర్థించటం వలన, తన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. “నేనిక్కడ చాలా కాలంగా ఉంటున్నాను. ఇంతవరకూ నా దగ్గరకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధంచేసే అగ్నివంటిది కదా! అందుకే ప్రపంచానికి దూరంగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప, నాకింకెవ్వరితోనూ పనిలేదు”. వైరాగ్యబుద్ధి కలిగి, శ్రీహరిభక్తుడని తెలియగానే, ప్రతాపభానుడికి ఆ బకధ్యాని మీద గౌరవం పెరిగింది.
ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడయ్యాడని తెలుసుకుని, “పుత్రా! నా పేరు ఏకతనుడు. సృష్టి ప్రారంభంలో నేను జన్మించాను. తరువాత మరొక దేహం దాల్చలేదు. అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యంగా వింటున్న ప్రతాపభానుడికి, కపటసన్యాసి ఎన్నో ప్రాచీనగాథలూ, పురాణేతిహాసాలూ, సృష్టి, స్థితి, లయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు. జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడైన రాజు, “స్వామీ! నేను ప్రతాపభానుడను” అని వాస్తవాన్ని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతిని మెచ్చుకుంటున్నాను. తెలియని వాడికి వివరాలు చెబితే, రాజ్యానికే అపాయమని తెలిసి, నువ్వు ఇందాక నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు, ఆ కపటసన్యాసి. సద్గుణ సంపన్నుడైన ప్రతాపభానుడు, దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతూ, ఇలా కోరాడు.. “ఓ దయాసాగరా! నా శరీరం జరామరణదుఃఖ రహితమవ్వాలి. యుద్ధంలో నన్నెవరూ జయించ కూడదు. భూమిపై నూరుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యం నిలిచి ఉండాలి”.
ధర్మరుచి ప్రభావం వలన, తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి, “సర్వం కృష్ణార్పణమ్” అని భావించే ప్రతాపభానుడు, ఆ సూక్తిలోని ఆంతర్యాన్ని అర్థంచేసుకోలేకపోయాడు. రాజు ఎదుట ఉన్నది నిజమైన సన్యాసి అయితే, ఆ కోరిక విని.. “ఈ శరీరము శాశ్వతము కాదు. ఎందుకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము. శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ, కపటి అవ్వడంచేత ఆ సన్యాసి, “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండీ కాపాడతాను. నా ప్రభావం వల్ల, యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ, ఒక్క విప్రశాపం నుండి మాత్రం నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురోత్తమా! విప్రులను ప్రసన్నము చేసుకునే ఉపాయము, దయతో నాకు సెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే.. కానీ, నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితోనైనా చెపితే, నీకు బహుదుఃఖాలు కలుగుతాయి. నీ మంచి కోరి చెపుతున్నాను. మూడవకంటికి ఈ విషయం తెలిసిందా, నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.
“గురువర్యా! త్రిమూర్తులు కోపగించినా, గురువు రక్షిస్తాడు. కానీ, గురువే కోపగిస్తే, ఇక రక్షించేవారెవరూ ఉండరు. మీ ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ ఇవ్వండి శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. అప్పుడు ఆ బకధ్యాని, “విప్రులను స్వాధీనపరచుకోవటానికి అనేక మార్గాలున్నాయి. నీకు అన్నిటికన్నా సులభమార్గం చెబుతాను విను. ఒక సంవత్సరం పాటు, ప్రతిరోజూ లక్షమంది ఉత్తములైన విప్రులను కుటుంబసహితంగా అహ్వానించు. నేను నా తపశ్శక్తితో మీ పురోహితుని వేషముదాల్చి, వారికి భోజనం వండిపెడతాను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తితో నిన్ను నీ అంతఃపురానికి చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత నీ పురోహితుని రూపంలో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లూ చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి, బాగా అలసిపోయి ఉన్నందువలన, గాఢనిద్ర పోయాడు. ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతుడనే రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము దాల్చి, ప్రతాపభానుని దారిమరల్చాడు. స్త్రీలనూ, సజ్జనులనూ, దేవతలనూ హింసిస్తున్న కాలకేతుడి నూర్గురు కుమారులనూ, పదిమంది సోదరులనూ యుద్ధంలో చంపి, దుష్టసంహారం చేశాడు, ప్రతాపభానుడు. అది మనస్సులో పెట్టుకుని, అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసీ, కాలకేతువూ కలిసి నాటకమాడి, ప్రతాపభానుని నాశనం చేయదలచారు.
కాలకేతుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురానికి చేర్చి, పురోహితుణ్ణి ఒక గుహలో బంధించి, తానే పురోహితునిగా కామరూపం ధరించాడు. తరువాత రోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని, తాను అంతఃపురంలో ఉన్న విషయం గ్రహించి, ఆ కపటసన్యాసి శక్తికి ఆశ్చర్యపోయాడు. మూడు రోజులు క్షణమొక యుగంగా గడిపాడు. శ్రీహరి ధ్యానం వదిలి, ప్రతిక్షణం ఆ కుహనా సన్యాసి పాదాలనే ధ్యానించసాగాడు. అనుకున్న ప్రకారం, లక్షమంది ఉత్తమ విప్రులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనా పురోహితుడు తన మాయచేత, లెక్కలేనన్ని వ్యంజనములూ, నాలుగురకాలైన వంటలనూ, పాకశాస్త్రాన్ని అనుసరించి, షడ్రసోపేతంగా సిద్ధంచేశాడు. కానీ, వాటిలో అనేక జంతువుల మాంసములేకాక, బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించాడు. భోజనానికి విప్రులు సిద్ధమవుతుండగా, కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి, “ఓ విప్రోత్తములారా! ఈ భోజనం హానికరము. దీనిలో జంతు, విప్ర మాంసమున్నది. దీనిని భుజించ వద్దు” అని పలికించాడు. ఆకాశవాణి మాటలు వినగానే, ఆ లక్షమంది విప్రులూ, “ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భ్రష్టులను చేయదలచావు. నీవు కుటుంబ సహితంగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరంలో నీవు నీవంశంతో సహా నశిస్తావు. మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి సఫలమైనదని, కాలకేతుడూ, కపటసన్యాసీ సంతోషించారు. కపటసన్యాసి శత్రురాజులందరినీ కూడబెట్టుకుని, ప్రతాపభానునిపై దండెత్తి వచ్చాడు. వీరుడైన రాజూ, అతని సోదరుడు అరిమర్దనుడూ, చాలా కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత, తన వంశముతో సహా ప్రతాపభానుడు నశించిపోయాడు. కొంత కాలం తరువాత, వారందరూ రాక్షసులై జన్మించారు.
కొన్ని గ్రంథాల ప్రకారం ఈ ప్రతాపభానుడే రావణునిగా, అరిమర్దనుడే కుంభకర్ణునిగా, ధర్మరుచే విభీషణునిగా జన్మించినట్లు, వివరించబడి ఉంది. ప్రతాపభానుని జీవతం మనకు సూచించే విషయం ఏమిటంటే, మానవుడికి ఆశ ఉండవచ్చు కానీ, దురాశ పనికిరాదు. “అతి సర్వత్ర వర్జయేత్” అంటే ఏ విషయంలోనూ అతి ఉండకుడదని అర్ధం. సమస్త భూమండలానికీ ఏకచ్ఛత్రాధిపతి అయికూడా, ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి, చివరకు నాశనమయ్యాడు. మన శాస్త్రాలలో గురువును ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి, ఉత్తముడైన వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు తన దురాశ వలన, ఒక్క రాత్రి పరిచయంతోనే కపటిని గురువుగా స్వీకరించాడు. బహిర్శత్రువులైనా, అంతర్శత్రువులైనా.. కామ క్రోధాదులు హాని చేయకమానవు. కాబట్టి, ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి. ప్రతాపభానుడు, శత్రువులైన కాలకేతు, కపటసన్యాసులను గమనించక, వారిచేత మోసగించబడినాడు. దురాశ రాజు కళ్ళను మూసివేసింది.
దురాశ దు:ఖానికి చేటనే నానుడి, యుగాలు మారినా, ప్రతి మానవుడి జీవితానికీ ముఖ్య ధర్మ సూత్రం.
Comments
Post a Comment