Invincible King Durjaya and Maharshi Gauramukha


ముల్లోకాలనూ జయించిన రాజుతో యుద్ధానికి దిగిన ముని పుంగవుడెవరు?
తన వరప్రభావంతో జన్మించిన అతనిని విష్ణువు ఎందుకు సంహరించాడు?

మన పురాణాలలో కొందరు అసురులూ, రాక్షసులూ దేవుని భక్తులుగానే కనిపిస్తుంటారు. అనన్యమైన, అమోఘమైన దైవచింతన ఉన్నప్పటికీ, వారి స్వార్థపూరిత ఆలోచనలతో, ఇతరులను హింసించేటటువంటి క్రూరమైన స్వభావంతో, దైత్యులుగా నిందింపబడేవారూ ఉన్నారు. ఇక మునులలో కూడా శాంత స్వభాంతో, తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసిన వారున్నారు, అసురులను సైతం ఎదిరించి, దైవ బలంతో వారిని అంతమొందించిన వారూ ఉన్నారు. అసుర లక్షణాలు కలిగిన రాజుతో, ఒక ముని ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? రాజుతో యుద్ధానికి దారి తీసిన కారణాలేంటి? ముని జరిపిన యుద్ధం ఫలించిందా? వరాహపురాణంలో వివరించబడిన ఈ కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tbv0awTt3E0 ]


కృతయుగంలో సుప్రతీకుడనే రాజు ఉండేవాడు. అతనికి విద్యుత్ప్రభ, కాంతిమతి అనే ఇద్దరు భార్యలున్నారు. సంతానహీనుడైన సుప్రతీకుడు, చిత్రకూట పర్వతంపై ఉన్న ఆత్రేయుడనే మునిని దర్శించి సేవించి, తనకు సంతానం కలిగేలా వరం ప్రసాదించమన్నాడు. పరాక్రమవంతుడైన పుత్రుడు జన్మిస్తాడని, సుప్రతీకుడికి వరం ఇచ్చాడు ఆత్రేయుడు. విద్యుత్ప్రభకు దుర్జయుడు, కాంతిమతికి సుద్నముడూ జన్మించారు. కాలక్రమంలో దుర్జయునికి పట్టాభిషేకం చేసిన సుప్రతీకుడు, తనభార్యలతో కలసి చిత్రకూట పర్వతారణ్యంలో తపమాచరించసాగాడు. ఎక్కువ సైన్యాన్ని సమీకరించుకున్న దుర్జయుడు, ఉత్తరదిక్కున దండయాత్రకు బయలుదేరి,  భరతవర్షం, కింపురుషవర్షం, హరివర్షం, హిరణ్మయవర్షం, కురుభద్రాశ్వమంతో పాటు, ఇంద్రలోకాన్ని కూడా జయించి, గంధమాదన పర్వతంపై విడిదిచేశాడు. అలా విశ్రాంతి పొందుతున్న సమయంలో ఇద్దరు రాక్షసులు వచ్చి, "రాజా నీపేరిట ధర్మం తప్పక, ఈ స్వర్గ లోకపాలన చేస్తాం. దయచేసి మాకు ఆ అవకాశం కలిగించు" అని అన్నారు.

వారిని స్వర్గపాలకులుగా నియమించి, దుర్జయుడు మందరపర్వతం చేరాడు. అక్కడి వనంలో విహరిస్తుండగా, ఒక చెట్టు కింద కొందరు స్త్రీలు కనిపించి, అదృశ్యమయ్యరు. వారిని వెతుకుతూ వెళ్ళిన రాజుకు, ఇద్దరు మునీశ్వరుల రూపంలో ఉన్న అసురులు కనిపించారు. వారు, "మేము విష్ణుమూర్తి చేతిలో ఓడిపోయి, తపోవనంలో జీవిస్తున్నాము. మా దివ్యదృష్టిచే నీవెవరివో తెలిసింది. మా కుమార్తెలైన సుకేసి, మిశ్రకేసిలను వివాహం చేసుకో" అని అన్నారు. వారిని దుర్జయుడు వివాహం చేసుకోగా, సుకేసికి సుప్రభుడు, మిశ్రకేశికి సుదర్మనుడు జన్మించారు. తరువాత కొంతకాలానికి మళ్ళీ దిగ్విజయయాత్రకి పూనుకున్నాడు, దుర్జయుడు. ఈసారి అష్టదిక్పాలకులను కూడా జయించి, విజయ గర్వంతో తన రాజ్యానికి తిరిగి వస్తుండగా, దారిలో అతడికి గౌరముఖుడనే మహర్షి ఆశ్రమం కనిపించింది. తన అపార సైన్యాన్ని వెలుపలే ఉంచి, దుర్జయుడు లోపలికి వెళ్ళి గౌరముఖుడికి నమస్కరించి, ఆశీర్వాదాన్ని కోరాడు.

గౌరముఖుడు రాజును గౌరవించి, అతడికీ, అతడి సైన్యానికీ అతిథ్యమిస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. అన్ని లక్షల మందికి, ఈ ముని ఎలా ఆహారం పెడతాడని ఆలోచించాడు. అంతలో గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించివస్తాని చెప్పి, అక్కడే ఉన్న గంగానది దగ్గరికు వెళ్ళాడు. గంగలో నిలిచి ఎంతో భక్తిగా నారాయణ స్తుతి చేశాడు. గౌరముఖుడి స్తుతి పూర్తికాగానే, శంఖ, చక్ర, గదాధరుడైన శ్రీహరి అక్కడ సాక్షాత్కరించాడు. వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న స్వామిని చూసి ఎంతగానో పులకించిన గౌరముఖుడు, "స్వామీ! దుర్జుయుడనే మహారాజు సైన్యసమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికీ, అతడి సైన్యానికీ సంపూర్ణంగా భోజనం పెట్టే వరాన్నివ్వు" అని ప్రార్థించాడు. గౌరముఖుడి ప్రార్థన విన్న నారాయణుడు కరుణించి, ఆయనకొక దివ్వమణిని ప్రసాదించి, ‘ఇది నీవు కోరినవన్నీ ఇస్తుంద’ని చెప్పి, అదృశ్యమయ్యాడు.

నారాయణుడు తనకు ప్రసాదించిన మణి ప్రభావంతో, గౌరముఖుడు తన ఆశ్రమ ప్రాంగణంలో ఒక పెద్ద మహానగరాన్నీ, అందులో దాసదాసీ జనాన్నీ, కావలసిన భోజన పదార్ధాలనూ, సంకల్పించాడు. ఒక్క క్షణంలోనే అవన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. దుర్జయుడూ, అతడి పరివారం, ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా, ఆ నగరంలోకి ప్రవేశించారు. అక్కడ వారికి కావలసింది తిని, ఆనందంగా విశ్రమించారు. మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకునేసరికి, నగరం, దాసదాసీజనం అంతా అదృశ్యమైపోయారు. దుర్జయుడికీ, అతడి పరివారినికీ, గౌరముఖుడి దివ్య శక్తిని చూసి అశ్చర్యం కలిగింది. అందరూ ఆయన వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొద్ది దూరం వచ్చాక దుర్జయుడికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఆ మహర్షి ఏ విధంగా తమకి ఆతిథ్యం ఇవ్వగలిగాడో తెలుసుకుని రమ్మని, పరివారాన్ని పంపాడు. వారు తిరిగి వచ్చి, శ్రీహరి అనుగ్రహంతో ఆయనొక మణిని సంపాదించాడనీ, దాని ప్రభావంతోనే తామందరికీ ఆతిథ్యం ఇవ్వగలిగాడనీ చెప్పారు.

దుర్జయుడు ఎలాగైనా గౌరముఖుడి దగ్గరున్న మణిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. వెంటనే తన మంత్రిని ఆ ముని దగ్గరికి పంపాడు. దుర్జయుడి మంత్రి వెనక్కి తిరిగివచ్చి, గౌరముఖుడు మణిని ఇవ్వనన్నాడని చెప్పాడు. దుర్జయుడికి ఆగ్రహం కలిగింది. వెంటనే తన సైన్యాన్ని వెనక్కి తిప్పి, గౌరముఖుడి ఆశ్రమం మీదకి వచ్చాడు. అది చూసిన గౌరముఖుడు దివ్యమణిని చేతిలో ధరించి, మనసులో స్మరించాడు. అంతే.. ఒక్కసారిగా ఆ మణినుంచి వేలకొద్ది అస్త్రధారులైన సైన్యం ఆవిర్భంచారు. మణినుండి సుప్రభుడు, దీప్తతేజుడు, సురస్మి, శుభదర్శనుడు, సుకాంతి, సుందరుడు, సుందుడు, ప్రద్యుమ్నుడు, సుమనుడు, శుభుడు, సుశీలుడు, సుఖదుడు, శంభుడు, సుదాంతుడు, సోముడు అనేవీరులు ఉద్బవించి, యుద్ధానికి వచ్చారు. దుర్జయుని సైన్యంలో ప్రఘనుడు, విఘనుడు, సంఘశుడు, అశనిప్రభుడు, విద్యుత్ర్పభుడు, సుఘోషుడు, ఉన్మత్తాక్షుడు, భయంకరుడు, అగ్నిదంతుడు, అగ్నితేజుడు, బాహుశక్రుడు, ప్రతర్ధనుడు, విరాధుడు, భీమకర్ముడు, విప్రచిత్తి వంటి యోధులతో, యుద్ధం ఆరంభం అయింది. దుర్జయుడి సైన్యానికీ, ముని సైన్యానికీ మధ్య ఘోరంగా పోరు సాగింది.

మణి నుంచి ఆవిర్భవించిన సైన్యం చేతిలో, దుర్జయుడి సైన్యం వధించబడ్డారు. కొంత సమయం తరువాత గౌరముఖుడు యుద్ధ రంగానికి వెళ్ళి, అక్కడే కూర్చుని భక్తిగా శ్రీహరిని ధ్యానించాడు. పీతాంబరధారియై, శంఖ, చక్ర, గదాపద్మాలను ధరించిన శ్రీహరి ప్రత్యక్షమై, ఎందుకు స్మరించావని అడుగగా, గౌరముఖుడు నమస్కరించి, దుర్జయుడు చేసిన దుర్మార్గాన్నంతా ఆయనకు వివరించాడు. ఎలాగైనా ఆ దుష్ట దుర్జయుణ్ణి సంహరించమని, శ్రీహరిని కోరాడు. వెంటనే శ్రీహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, దుర్జయుణ్ణీ, అతడి సైన్యాన్ని భస్మీపటలం చేశాడు. ఆ విధంగా గౌరముఖుడు, శ్రీ హరి అనుగ్రహంతో కోరినవన్నీ చేయగలిగిన దివ్యశక్తిని సాధించాడు. సుప్రతీక మహారాజుకు, తనకుమారుడు దుర్జయుడు, అతడి పరివారం మొత్తం శ్రీహరి సుదర్శన చక్రం ద్వారా భస్మం చేయబడ్డారన్న విషయం తెలిసింది. ఆయనెంతో బాధపడ్డాడు. చిత్రకూటమనే పర్వతం మీద శ్రీమహావిష్ణువును దివ్యంగా స్తుతించాడు. సుప్రతీకుడు స్తుతించగానే, దేవాదిదేవుడైన శ్రీహరి దర్శనమిచ్చి, వరాన్ని కోరుకోమన్నాడు. సుప్రతీకుడు ఆనంద తన్మయత్వంతో స్వామికి నమస్కరించి, ‘ప్రభూ, నీ దివ్య దేహంలో లయమయ్యేలా వరాన్నివ్వు’ అని కోరాడు. ‘తథాస్తు’ అని శ్రీహరి అనగానే, సుప్రతీకుడు రాక్షస సంహారి అయిన ఆయనలో, సంపూర్ణంగా లీనమైపోయాడు.

అయితే, ఈ కథకూ, వశిష్ఠుడి వద్దనున్న శబల అనబడే కామధేనువు కథకూ కొంతమేర సారూప్యం ఉంది. కానీ, ఈ కథలో గౌరముఖుడు, దుర్జుయుడిని సంహరించడానికి కొన్ని కారణాలున్నాయి. రాజ్య కాంక్షతో ముల్లోకాలలో యుద్ధానికి పూనుకోవడం, ఇంద్రుడిని ఓడించడం, రాజధర్మం కావచ్చు. కానీ, స్వర్గాన్ని పాలించే హక్కు రాక్షసుల చేతికి ఇవ్వడం తప్పు. మునులను ఆదరించే గుణం ఉన్న దుర్జయుడు, గౌరముఖుడి ఆతిథ్యాన్ని చూసి ఈర్ష్య పొందాడు. అసూయాద్వేషాలనేవి, ఎంతటి వారినైనా నీచానికి దిగజార్చుతాయి. సమస్త లోకాలనూ జయించిన దుర్జయుడు, ఆ ముని దగ్గరున్న మణికోసం ఆశపడ్డాడు. నిజానికి రాజు చూడని పరివారమా, రాజ భోగమా.. కానీ, దుర్జయుడు ఒక అల్పప్రాణి అయిన ముని వద్ద అంత సంపత్తి ఉండడం చూసి, ఈర్ష్య పడ్డాడు. అందుకే దానిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. చివరకు దానిని చేజిక్కించుకోవడం కోసం, మునిపై యుద్ధానికి వెళ్ళాడు. ముని ఆగ్రహం వల్ల, నారాయణుడి వర ప్రభావంతో జన్మించిన దుర్జయుడు, చివరకు నారయుణుడి చేతిలోనే తనువు చాలించాడు..

జీవితంలో దైవభక్తి మాత్రమే కాదు, ప్రతి జీవిలో దైవాన్ని చూడగలగాలి!

సర్వేజనాః సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home