ఎటువంటివారు పాములూ బల్లులూ తేళ్లుగా జన్మిస్తారు? భగవద్గీత Bhagavad Gita


మూర్ఖపు ఆత్మల గతి!
ఎటువంటివారు పాములూ, బల్లులూ, తేళ్లుగా జన్మిస్తారు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tbwW27eKeDE ]



దురహంకారము కలిగిన మనుషులు ఏవిధంగా నడుచుకుంటారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః ।
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ।। 17 ।।

ఇటువంటి దురహంకారము, మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, నామమాత్రంగా, ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.

సాధుపురుషులు యజ్ఞములను ఆత్మశుద్ధి కోసం, మరియు భగవంతుని ప్రీతి కోసం చేస్తారు. ఇక్కడ జరిగే అపహాస్యం ఏమిటంటే, ఆసురీ స్వభావము కల జనులు కూడా యజ్ఞములు చేస్తారు. కానీ, అది అపవిత్ర ఉద్దేశ్యంతో ఉంటుంది. వారు చాలా వైభవోపేత యజ్ఞ, కర్మ కాండలు చేస్తారు. కానీ, అదంతా సమాజం దృష్టిలో పుణ్యాత్ములుగా కనిపించటానికే. వారు శాస్త్ర ఉపదేశాలను పాటించరు, మరియు తమ స్వార్థ వ్యక్తిగత గొప్ప కోసం, ఎదో చూపించుకోవటానికే చేస్తారు. కానీ, శాస్త్ర ఉపదేశం ఏమిటంటే: గూహితస్య భవేద్ వృద్ధిః కీర్తితస్య భవేత్ క్షయః. మనం చేసిన ఏదేని మంచి పని గురించి గొప్పలు చెప్పుకుంటే, దాని ఫలం తగ్గిపోతుంది; దానిని గోప్యంగా ఉంచితే, దాని ఫలము ఎన్నో రెట్లు పెరుగుతుంది.’ ఆసురీ స్వభావము కలవారు చేసే యజ్ఞ కర్మకాండలను, అవి తప్పు పద్ధతిలో చేయబడతాయని చెబుతూ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు వాటిని తిరస్కరిస్తున్నాడు.

02:20 - అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ।
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ।। 18 ।।

అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకుపోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహములో, మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను, దుర్భాషలాడుతూ, ద్వేషిస్తూ ఉంటారు.

ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆసురీ స్వభావము కలిగిన వారి యొక్క మరింత స్పష్టమైన గుణములను వివరిస్తున్నాడు. వారు పాపిష్ఠివారు, ద్వేషపూరితమైన వారు, క్రూరమైన వారు, జగడమాడు స్వభావముగలవారు, మరియు పొగరుబోతులు. స్వయముగా వారికి ఏ మంచి గుణములూ లేకపోయినా, ఇతరులలో తప్పులు వెదకటంలో, ఆనందిస్తుంటారు. వారికి వారే, చాలా ప్రాముఖ్యతను ఇచ్చుకుంటారు. ఈ యొక్క సొంత గొప్పలకు పోయే ప్రవృత్తి వలన, వారు ఇతరుల విజయం పట్ల అసూయతో ఉంటారు. ఎప్పుడైనా వారి ప్రణాళికకు అవరోధం కలిగితే, వారికి ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఇతరులకు కూడా యాతన కలుగ చేస్తారు, తమకు కూడా హాని కలుగచేసుకుంటారు. పర్యవసానంగా, వారు తమ హృదయంలో, మరియు ఇతరుల హృదయంలో స్థితమై ఉన్న పరమాత్మను ఉపేక్షించి, తిరస్కరిస్తారు. ఎదుటి వ్యక్తి మంచి కార్యాలకు పూనుకున్నా సహించక, అసురీ స్వభావం కలవారు, వారిని అపహాస్యం చేస్తూ, వారిలో స్థితమైవున్న భగవంతుడిని కూడా దూషిస్తారు.

03:50 - తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ ।
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ।। 19 ।।

04:00 - ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని ।
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ।। 20 ।।

కౄరులూ మరియు ద్వేషపూరిత స్వభావము కలవారినీ, అధములనూ, నీచ నరులనూ, నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే, అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు, మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. ఓ అర్జునా,  ఆ ఆత్మలు నన్ను చేరుకోలేక, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.

శ్రీ కృష్ణుడు మళ్ళీ ఒకసారి, ఆసురీ మనస్తత్వం యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు. వారి యొక్క తదుపరి జన్మలలో, అదే రకం మనస్తత్వం ఉన్న వారి కుటుంబాలలో జన్మనిస్తారు. అక్కడ వారికి సరిపోయే విధంగా, తమ నీచ స్వభావాన్ని స్వేచ్ఛగా ప్రదర్శించుకునేందుకు వీలైన వాతావరణం ఉంటుంది. ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఎక్కడ పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ వాతావరణంలో పుట్టాలి! అనేది, ఆత్మ చేతిలో ఉండదు. వ్యక్తి యొక్క కర్మనూ, స్వభావాన్నీ బట్టి, భగవంతుడే దానిని నిర్ణయిస్తాడు. ఈ విధంగా, ఆసురీ గుణములు కలవారు, నిమ్న స్థాయి, మరియు నీచ గర్భములలోనికి పంపబడతారు. దుష్ట బుద్ధి కలవారికి సరిపోయే పాములూ, బల్లులూ, మరియు తేళ్లుగా కూడా జన్మనెత్తుతారు. అసురీ స్వభావము కలిగిన ఆత్మలు, భగవంతుడిని తెలుసుకోలేక, నీచ స్థాయిలోనే జీవిస్తూ, మళ్ళీ మళ్ళీ జీవన చక్రములో తిరుగుతూ, మరింత దుర్గతులపాలవుతారు.

ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు ఏంటో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home