చార్వాక సిద్ధాంతం! Charvaka Philosophy భగవద్గీత Bhagavadgita

చార్వాక సిద్ధాంతం!
మనిషి జీవించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పోగుజేసుకుంటే ఏమవుతుంది?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (09 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 9 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wPNEPowYsWk ]


ఏ విధంగా మోహితులై, తాత్కాలికమైన వాటికి ఆకర్షితులమవుతామో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః ।
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ।। 9 ।।

ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో, మరియు కౄర కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి, దానిని విధ్వంసం చేయ భయపెడతారు.

నిజమైన ఆత్మ-జ్ఞానం లేక, ఆసురీ ప్రవృత్తి కలవారు, వారి యొక్క మలినమైన బుద్ధిచే, యధార్ధసత్యము యొక్క వక్రీకరించబడిన దృక్పథాన్ని పుట్టిస్తారు. చార్వాక సిద్ధాంతము, దీనికి ఒక ఉదాహరణ. ‘బ్రతికినంత కాలం సుఖిస్తూ బ్రతుకు. ఒకవేళ నెయ్యి త్రాగటం ఇష్టమైతే, అప్పుచేసైనా సరే అలాగే చెయ్యి. ఈ శరీరము భస్మమైపోయిన తరువాత, నీవు ఇక ఉండవు, మళ్లీ ఈ లోకం లోకి తిరిగి రావు’ అని చార్వాక సిద్ధాంతం ప్రబోధిస్తుంటుంది. ఈ ప్రకారంగా ఆసురీ-మనస్తత్త్వం కలవారు, ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్థిత్వమునూ, మరియు కర్మ ఫల ప్రతిచర్యనూ తిరస్కరిస్తారు; దీనితో వారు ఏ సంకోచమూ లేకుండా స్వార్థ పనులలో నిమగ్నమై, ఇతరుల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తించటానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ వారికి ఇతరులపై అధికారం ఉంటే, వారిపై కూడా, ఈ తప్పుడు దారి పట్టిన భౌతిక దృక్పథాన్ని రుద్దుతారు. ఇతరులకు బాధ కలిగించయినా, లేదా ప్రపంచాన్ని నాశనం చేసయినా, వారి యొక్క స్వార్థ పూరిత లక్ష్యము సాధించటానికి, సంకోచించరు. చరిత్రలో హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్ వంటి నిరంకుశత్వ ఉన్మాదులూ, మరియు చక్రవర్తులను, మానవజాతి చాలా సార్లు ప్రత్యక్షంగా చూసింది; వారు సత్యం యొక్క తమ స్వంత పాపిష్టి దృక్పథంచే ప్రేరేపితమై, ‘ప్రపంచానికి’ చెప్పలేని దుఃఖాన్నీ, మరియు వినాశనాన్నీ కలుగచేశారు.

02:41 - కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః ।
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః ।। 10 ।।

తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు, తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని వుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై, అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.

తృప్తిపరచలేని కామ కోరికల తుష్టి కోసం ప్రయత్నిస్తూ, ఆసురీ స్వభావము కలవారు, అత్యంత అపవిత్ర హృదయంతో ఉంటారు. కపట బుద్ధితో నిండిపోయి, ఎదో మంచి వారిలాగా నటిస్తుంటారు. వారి మోహపూరితమైన బుద్ధి, తప్పుడు ఆలోచనలను పాటిస్తుంది. వారి గర్వము, తమ కంటే తెలివికలవారు ఎవరూ లేరన్న భావనను కలిగిస్తుంది. తాత్కాలికమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షితులై, వారి బుద్ధి, నీచంగా, స్వార్థ పూరితంగా, మరియు గర్విష్ఠిగా అవుతుంది. ఈ విధంగా వారు శాస్త్ర ఉపదేశాలను పట్టించుకోకుండా, ధర్మబద్ధమైన, సత్యవంతమైన నడవడికకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.

03:53 - చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ।। 11 ।।

వారు అంతులేని చింతలు, లేక ఆందోళనలచే సతమతమై పోతుంటారు. అవి చివరకు మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి, మరియు ఆస్తులు కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని, నిశ్చయముగా ఉంటారు.

భౌతిక దృక్పథంలో ఉన్న జనులు తరచుగా ఆధ్యాత్మిక మార్గాన్ని - అది కష్టతరమైనది, మరియు భారమైనదనీ, మరియు అంతిమ లక్ష్యం చాలా దూరమైనదనీ, తిరస్కరిస్తారు. త్వరగా ఫలితాలను ఇచ్చే ఈ ప్రాపంచిక మార్గాన్నే వారు అనుసరిస్తారు కానీ, ప్రాపంచిక మార్గంలో ఇంకా ఎక్కువ బాధలు పడుతుంటారు. భౌతిక సంపాదనలకై ఉన్న వారి కోరికలు, వారిని క్షోభకు గురిచేస్తుంటాయి. వారి ఆశయాలను పూర్తిచేసుకోవటానికి, ఏవేవో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు. వారు కోరుకున్న వస్తువును పొందగానే కాసేపు ఉపశమనం పొందినా, వెంటనే కొత్త క్షోభ మొదలవుతుంది. వారు సంపాదించిన వస్తువు దెబ్బతింటుందనో, ఇతరులెవరైనా తీస్కుంటారేమో అన్న ఆందోళనతో, దానిని కాపాడుకోవటానికి శ్రమిస్తుంటారు. చిట్టచివరికి, ఆ మమకారాసక్తి ఉన్న వస్తు-విషయంతో, అనివార్యమైన ఎడబాటు సంభవించినప్పుడు, మిగిలేది దుఃఖమే. ఈ ప్రపంచంలోని జనులు, చెప్పలేని బాధలనూ, మరియు ఒత్తిడినీ, పాపంచిక ప్రయాసలో అనుభవిస్తుంటారు – సంతానాన్ని పెంచటం, వ్యాపారం చేయటం, ఆస్తి-పాస్తులను కూడబెట్టడం, మరియు కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకోవడం వంటివి. వారు గనక ఇదే విధమైన అనురాగమూ, శ్రద్ధా, ఆ శ్రీ కృష్ణుడి పాదారవిందముల వద్ద ప్రేమను పెంచుకోవటంలో చూపిస్తే, వారు ఇక ఎన్నటికీ ఆ మృత్యు దేవత, యమరాజు గురించి చింతించవలసిన అవసరం ఉండదు. కానీ, ఆసురీప్రవృత్తి కలవారు, ఈ పచ్చినిజాన్ని ఒప్పుకోవటానికి తిరస్కరిస్తారు. ఎందుకంటే, ఈ ప్రాపంచిక సుఖాలే అత్యున్నత ఆనందమని, వారి బుద్ధులు నిశ్చయంతో ఉంటాయి. వారిని నికృష్ట లోకాలకు తీసుకుపోవటానికీ, మరియు మరింత దుఃఖపూరిత తదుపరి జన్మలలోకి తీసుకువెళ్ళటానికీ, మృత్యువు ఓర్పుతో నిరీక్షిస్తున్నదని కూడా, తెలుసుకోలేరు.

06:13 - ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ।
ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ।। 12 ।।

వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడీ, మరియు కామ క్రోధములచే ఆవరించబడీ, వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.

ఈ ప్రపంచాన్ని భోగించటానికి, డబ్బు ఒక సాధనం. అందుకే అంతులేని కోరికలతో, భౌతిక దృక్పథంలో ఉన్న జనులు, డబ్బు సంపాదించటానికి, అంత ప్రాముఖ్యతను ఇస్తారు. వారు అన్యాయ పద్ధతులలో డబ్బు ప్రోగుచేసుకోవటానికి కూడా, సంకోచించరు. అందుకే వారి అనైతిక ప్రవర్తనకు, రెట్టింపు శిక్ష ఉంటుంది. భాగవతం పేర్కోన్న దాని ప్రకారం, వ్యక్తి జీవన నిర్వహణకు సరిపోయినంత సంపద మాత్రమే, ఆ వ్యక్తికి ఉంచుకునే అర్హత ఉంది. ఒకవేళ ఎవరైనా తన అవసరాని కన్నా ఎక్కువ ప్రోగుచేసుకుంటే, భగవంతుని దృష్టిలో అతను దొంగ. అందుకతను శిక్షింపబడతాడు. ఏమిటి ఆ శిక్ష? అంటే, మొదటగా, మరణ సమయంలో, ప్రోగు చేసుకున్న సంపద మనతో పాటుగా రాదు. అది తీసివేయబడుతుంది. అంతేకాక, కర్మ సిద్ధాంతమును అనుసరించి, ఈ సంపత్తి ప్రోగుచేసిన వ్యవహారాలలో చేసిన పాపములకు, శిక్షింపబడతాడు. అది ఎలాగంటే, ఒక స్మగ్లర్ పట్టుబడితే, అతని సామాను జప్తుచేయబడుతుంది, చట్టాన్ని ఉల్లఘించినందుకు, అతనికి శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా, మనం కూడా శిక్షను అనుభవించవలసి ఉంటుంది.

07:50 - ఇక మన తదుపరి వీడియోలో, ఆసురీ లక్షణాలు కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home