Effects of bad company | సహవాస దోషం! | MPlanetLeaf


అంతటి మహాభక్తుడిని భోళాశంకరుడు ఎందుకు శపించాడు?
గాయత్రీ మంత్ర సహిత “ఔశన స్మృతి” ని ప్రపంచానికి అందించిన వాడు చెడ్డవాడా?

తెలివితేటలలో దేవగురువు బృహస్పతి ఎంతటివాడో, శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువుగా ఉండమని అడిగినప్పుడు బృహస్పతి, “నా కన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు. ఆయనను అడగండి” అని చెప్పాడు. కానీ, దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకున్నారు. బృహస్పతి మీదా, దేవతల మీదా కోపంతో శుక్రాచార్యుడు, రాక్షసులకు గురువుగా మారాడు. ఆ నాటి నుంచీ దేవ దానవుల సంగ్రామాలలో, దానవులకు అన్ని విధాలుగా సహకరించి, వారి విజయాలకు తోడ్పడే వాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు, రాని యుద్ధ తంత్రం లేదు. మహర్షి కుమారుడైన ఉశనసుడు, శుక్రాచార్యుడిగా ఎలా మారాడు? శివుడు ద్వారా ఎన్నో వరాలు పొందిన శుక్రాచార్యుడు, ఆయన చేతనే శాపానికి ఎందుకు గురయ్యాడు? శుక్రాచార్యుడి తల్లిని విష్ణువు మారు వేషంలో ఎందుకు చంపాల్సి వచ్చింది - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bIZXoSWJ_p8 ]


శుక్రాచార్యుని తండ్రి, బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షి. భృగు మహర్షి నవ బ్రహ్మలలో ఒకడు. అయన కొడుకు ఉశనసుడు. ఉశనసుడు వేద విద్య నేర్చుకోవటానికి, అంగీరస మహర్షి దగ్గరకు వెళ్ళాడు. కానీ, అయన తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాత ధోరణి చూపుతున్నాడని, అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత గౌతమ మహర్షి దగ్గర విద్యనభ్యసించి, శివుని మెప్పు కోసం ఘోర తపస్సు చేసి, చనిపోయిన వారిని బ్రతికించగలిగే మృత సంజీవనీ విద్యను వరంగా పొందాడు. కొంతకాలానికి వర గర్వము తలకెక్కిన ఉశనసుడు, కుబేరునిపై దాడి చేసి, ఆయన ధనమంతా దోచుకున్నాడు. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహించి, త్రిశూలంతో ఉశనుసుడిని చంపటానికి బయలుదేరాడు. ఆగ్రహంతో ఉన్న శివుడు, ఉశనసుడిని మింగేశాడు. కడుపులో ఉన్న ఉశనుసుడు బయటకు రావాలని ప్రయత్నిస్తుంటే శివుడు, ఒక్క మూత్ర ద్వారము తప్ప, నవరంధ్రాలలో మిగిలిన రంధ్రాలన్నీ మూసివేశాడు. అప్పుడు ఉశనుసుడు గత్యంతరం లేక, మూత్ర ద్వారము గుండా బయటికి వచ్చాడు.

అప్పటికీ కోపం తగ్గని శివుడు ఉశనసుడిని చంపాలని చూడగా, పార్వతీ దేవి జాలితో, వదిలి వేయమని కోరింది. ఆవిడ కోరిక మేరకు శివుడు ఉశనుసుడిని వదిలి, వీడు సక్రమ మార్గంలో బయటికి రాలేదు. కాబట్టి, శక్తివంతుడైనప్పటికీ, శుక్రాచార్యుడనే పేరుతో, రాక్షసులకు గురువుగా ఉంటాడని చెప్పి, వదిలివేశాడు. ఆ విధంగా, పరమ శివుని వరంగా మృత సంజవనీ విద్యను పొందిన ఉశనుసుడు, శివుని ఆగ్రహముతో, శుక్రాచార్యునిగా, రాక్షసుల గురువయ్యాడు.

అదే సమయంలో బృహస్పతి, దేవతల గురువయ్యాడు. అప్పటి నుండి శుక్రాచార్యునికి, బృహస్పతి మీద ఈర్ష్య, అసూయలు పెరగడం ఆరంభం అయింది. శుక్రాచార్యుడిని గురువుగా పెట్టుకుని, దానవ రాజైన హిరణ్యకశిపుడు, ఏకచ్ఛత్రాధిపత్యంగా, 72కోట్ల, 61లక్షల, 60వేల సంవత్సరాలు, ముల్లోకాలనూ పాలించాడు. కొంతకాలం తరువాత, రాక్షసులకు వరుస అపజయాలు ఎదురవుతుండగా శుక్రాచార్యుడు, తపస్సు చేసి, శివుని మెప్పించి, కొత్త అస్త్రాలను సాధించుకు వస్తానని, తపస్సు చేయడానికి బయలుదేరాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, దేవతలను గెలవాలంటే, నీవు తల్లక్రిందులుగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలని చెప్పాడు. అందుకు శుక్రాచార్యుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు.

శుక్రాచార్యుడు లేడని తెలిసి, దేవతలు రాక్షసులపై దాడి చేసి చంపడం మొదలుపెట్టారు. అప్పుడు రాక్షసులు శుక్రాచార్యుని తల్లి ఉశనను శరణు కోరారు. కానీ, నిద్రా దేవి ప్రభావం వలన, ఆవిడ ఏమీ చేయలేక పోయింది. విష్ణువు ఇంద్రునిలో ప్రవేశించి, రాక్షసులపై యుద్ధం చేస్తుండగా, ఉశన విష్ణువును శపించాలని ప్రయత్నించింది. ఆ సమయంలో, విష్ణువు ఆమెను సంహరించాడు. ఆది చూసిన భృగు మహర్షి, తన భార్యను చంపిన విష్ణువును, భూమిమీద ఏడుసార్లు జన్మించమని శపించాడు. తపస్సులో నిమగ్నమైన శుక్రాచార్యుడు శక్తి వంతుడై వస్తే, దేవతలకు కష్టాలు ప్రారంభమవుతాయని, ఇంద్రుడు తన కూతురు జయంతిని, అయన సేవలకు వినియోగించాడు. అయితే, శుక్రాచార్యుడి కఠోర తపస్సుకు మెచ్చిన శివుడు, శక్తివంతమైన అస్త్రశస్త్రాలను వరంగా ఇచ్చాడు.

వరాలు పొందిన శుక్రాచార్యుడు తన సేవకురాలైన జయంతిని వివాహమాడాడా? అస్త్రశస్త్రాలతో శుక్రాచార్యుడు యుద్ధాన్ని జయించాడా? అనే విషయాలు, మన గత వీడియోలో పొందుపరచబడి ఉన్నాయి. చూడని వారికోసం, దాని లింక్ ను, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.

తరువాత శుక్రాచార్యుడు, ప్రియవ్రతుని కుమార్తె ఊర్జస్వాతిని వివాహమాడాడు. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కుమారులలో చండ, అమార్కుడు, ఇద్దరూ ప్రహ్లాదునికి గురువులు కాగా, మిగిలిన వారు త్వాష్ట్ర మరియు ధరాత్రులు. కూతురు దేవయాని అంటే, శుక్రాచార్యునికి విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ వల్లే, బృహస్పతి కొడుకైన కచునికి, రాక్షసుల అభీష్టానికి వ్యతిరేకముగా, మృత సంజీవనీ విద్యను నేర్పాడు. కచుడు దేవయాని ప్రేమను నిరాకరించడం, పరస్పర శాపాలను పొందడం జరిగింది. తదుపరి దేవయాని, రాక్షస రాజు కూతురు శర్మిష్ఠను దాసిగా చేసుకోవడం, యయాతిని వివాహమాడడం జరిగింది. దేవయాని జీవితంలో ప్రేమ, పెళ్ళి విషయాలకు సంబంధించిన వీడియో లింక్, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.

శుక్రాచార్యుడు ఎందరో రాక్షస రాజులకు గురువు. బలిచక్రవర్తి చేత యజ్ఞ యాగాదులు చేయిస్తున్న సమయంలో, శ్రీ మహావిష్ణువు, వామనావతారంలో దానం స్వీకరించటానికి వచ్చి, మూడడుగుల చోటు దానమివ్వమన్నాడు. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, ఆ వచ్చినవాడు సాక్షాత్తూ విష్ణువేననీ, అతడి రాజ్యాన్ని అపహరించి, అతడిని పరాభవించడానికే వచ్చాడనీ, కొన్ని సందర్భాలలో అసత్యం చెప్పినా దోషం కాదని చెప్పి, ఆ దాన కార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు. బలి అందుకు అంగీకరించలేదు. వామనుడడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు, దానపాత్ర చేత పుచ్చుకున్నాడు. కనీసం అప్పుడైనా ఆపుదామని, శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలో దానపాత్రలోకి ప్రవేశించి, దానినుంచి నీరు పడకుండా అడ్డుకున్నాడు. అప్పుడైనా అసలు విషయం గ్రహించని బలి అలాగే చూస్తుండిపోవడంతో, వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ, తన చేతనున్న దర్భ పుల్లతో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడి కన్నుపోయి, ఒంటి కంటి వాడయ్యాడు. బలి చక్రవర్తి, పాతాళానికి త్రొక్కివేయబడే వరకూ, శుక్రాచార్యుని ఆధ్వర్యంలో, 20కోట్ల 30లక్షల 64వేల సంవత్సరాలు పాలించాడు.

శుక్రాచార్యుడు “ఔశన సంహిత” అనే గ్రంధాన్ని వ్రాశాడు. ఆ గ్రంధంలో, వివాహల గురించీ, కులాంతర వివాహాల గురించీ, వివరించాడు.  మునులు ధర్మ శాస్త్రాల గురించి వివరించమని అడగగా, శుక్రాచార్యుడు వారికిచ్చిన వివరణే, తొమ్మిది అధ్యాయాలుగా, “ఔశన స్మృతి” అనే గ్రంధంగా రూపొందింది. ఆ గ్రంధంలో, బ్రహ్మచారి విధులూ, గాయత్రీ మంత్రమూ, శ్రాద్ధ విషయాలూ, గృహస్తు చేయవలసిన ప్రేతకర్మా, అసౌచమూ, ప్రయాస చిత్తమూ, మొదలైన అంశాలకు వివరణ ఉంటుంది. ఇంత ప్రతిభా వంతుడూ, జ్ఞానీ అయివుండీ, రాక్షసుల పక్షాన ఉండి, నిరంతరం దానవులకు సహకరిస్తూ ఉండటం వలన, ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త కూడా. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు, శుక్రనీతిగా ప్రస్తుత కాలానికీ ఎంతగానో ఉపయోగపడతాయి.

ఓం నమః శివాయ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home