హరినే పరుగెత్తించిన కరి! - అసలు కారణం ఏంటి? Gajendra Moksham
హరినే పరుగెత్తించిన కరి! - అసలు కారణం ఏంటి?
గజేంద్ర మోక్షం – మకరికి ఉన్న శాపం ఏంటి?
భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తయితే, గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరయితే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటారో, వారి పాపాలు హరించబడతాయి. దరిద్రం తొలగిపోయి, ఐశ్వర్యం కలసి వస్తుంది. గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. మరి అంతటి అద్భుతమైన గజేంద్ర మోక్షం కథను గురించీ, శ్రీహరి ద్వారా మోక్షాన్ని పొందిన గజేంద్రుడి గత జన్మ రహస్యం, గంధర్వుడు మకరిగా మారి, శ్రీహరి చేతిలో ఎందుకు మరణించాల్సి వచ్చింది? అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. అందరూ ఈ వీడియోను చివరి వరకూ చూసి లబ్ది పొందాలని కోరుకుంటున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Zs59vTFTOdg ]
క్షీరసాగరం మధ్యలో, త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలున్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం వెండితో, మరొకటి ఇనుముతో అలరారుతూండేవి. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో, అడవి దున్నలూ, ఖడ్గమృగాలూ, ఎలుగు బంట్లూ మెదలైన క్రూర మృగాలతో పాటు, ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే, ఆ ప్రదేశంలో అంధకారం అలముకునేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి, దాహ బాధతో తిరుగుతూ, సరోవరానికి చేరుతూ ఉన్నపుడు, ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి, ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి.
అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం, అతి విశాలమైనది. ఆ సరోవరం నిండా వికసించిన కలువలూ, తామరలూ, ఇంకెన్నో జలచరాలూ నివసిస్తూ ఉన్నాయి. ఆడ ఏనుగులు దాహార్తిని తీర్చుకుని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత, గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి, గగనవీధికి చిమ్ముతూ ఆడుకున్నాడు. అలా నీరు చిమ్మగా, చేపలన్నీ వెళ్లి మీనరాశిలోకీ, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకీ పడిపోయాయి. అలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో, ఆ చెరువులో ఉన్న ఒక మొసలి, గజరాజు కాలును పట్టుకుంది. పట్టు విడిపించుకుని తొండంతో దెబ్బ తీయాలని, ఆ ఏనుగు చూసింది. కానీ, మకరిని వదిలించుకోవడం, కరికి సాధ్యపడలేదు. చాలా సేపు మకరితో పోరాడడంతో, గజరాజు బలం సన్నగిల్లింది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల, మకరి బలం అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో, గజరాజును నీరసం ఆవహించింది.
మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరిని గెలవడం తనవల్ల కాదని నిశ్చయించుకుని, తనను రక్షించమంటూ, సర్వేశ్వరుడైన ఆ నారాయణుడిని వేడుకున్నాడు. ‘నీవు తప్ప నన్ను రక్షించే వారెవరూ లేరు. నా తప్పులన్నీ మన్నించు’ అని శరణు వేడాడు. వైకుంఠం నుండి పరమాత్మ, తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్ధించాడు. ఆ సమయంలో శ్రీ మహా విష్ణువు, వైకుంఠపురంలో లక్ష్మీ దేవితో కలిసి, సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నాడు. త్రికూట పర్వతంలో ఏనుగు ఆర్తితో చేసిన ఘీంకారం వినిపించింది. ఆపదలో ఉన్న ఏనుగు రక్షించమని కోరుతోందని గ్రహించిన విష్ణుమూర్తి, ఒక్కసారిగా అక్కడి నుండి కదిలాడు. ఆ సమయంలో లక్ష్మీ దేవి చీర కొంగు ఆయన చేతిలో ఉండిపోయింది. ఆ విషయం ఆమె చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా, విష్ణుమూర్తి వడివడిగా వెళుతున్నాడు. తమను ధరించవలసిందింగా శంఖ చక్రాలు ముందుకు వచ్చినా, ఆయన పట్టించుకోలేదు. శ్రీ హరి ఎక్కడకు బయలుదేరినా, క్షణాలలో సిద్ధమయ్యే గరుత్మంతుడు కూడా, స్వామి ముందుకు వచ్చి ఆగాడు. గరుడవాహనం వైపు కూడా చూడకుండా స్వామి పరుగు పరుగున వెళుతున్నాడు.
స్వామి చేతిలో తన చీర కొంగు ఉండడంతో, ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా పరుగులాంటి నడకతో, ఆయనను అనుసరించింది. ఆయన భక్తుడెవరో ఆపదలో ఉండి ఉండవచ్చనీ, అందువల్లనే ఆయన అంత తొందర పడుతున్నాడనే విషయం, లక్ష్మీదేవికి అర్థమయ్యింది. శంఖ చక్రాలు రెండూ, ముఖ ముఖాలు చూసుకున్నాయి. ఎప్పుడూ, ఎక్కడికి వెళుతున్నా, తమను ధరించే బయలుదేరే స్వామి, అప్పుడు మాత్రం తమవైపు చూడకుండా వెళ్ళిపోతుండడం, వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విష్ణుమూర్తిని లక్ష్మీ దేవి అనుసరిస్తూ ఉండడం చూసిన శంఖ చక్రాలు, తాము కూడా స్వామి వెనుకనే బయలుదేరాయి. ఇక స్వామి తమ ధ్యాసలో లేడన్న విషయాన్ని, గరుత్మంతుడు గమనించాడు. అందువల్లనే ఆయన తనను పట్టించుకోకుండా వెళుతున్నాడని భావించి, ఆయన కూడా స్వామిని అనుసరించాడు.
విష్ణు మూర్తి తన పట్టు వస్త్రాలను కూడా సరిచేసుకోకుండా, శంఖ చక్రాలు లేకుండా, కంగారుగా వెళుతుండడం చూసిన ఇంద్రాది దేవతలంతా, ఆశ్చర్యపోయారు. తాము భక్తి శ్రద్ధలతో నమస్కరించినా పట్టించుకోకుండా వెళుతున్న స్వామిని, ఆశ్చర్యంగా చూశారు. ఏం జరగబోతోందో అర్థంగాక, వాళ్లంతా అయోమయానికి గురయ్యారు. త్రికూట పర్వతం సమీపంలోని సరోవరంలో, మొసలి కారణంగా ప్రమాదంలో ఉన్న ఏనుగును స్వామి చూశాడు. ఆయన ఆంతర్యం అర్థంకాగానే, సుదర్శునుడు వచ్చి, ఆయన చేతిని అలంకరించాడు. అంతే, సుదర్శన చక్రంతో శ్రీ మహా విష్ణువు, ఆ మొసలి శిరస్సును ఖండించాడు. దాని తల, మొండెం వేరై, సరస్సులో పడిపోయాయి.
అప్పుడు ఆ మొసలిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటకు వచ్చి, గంధర్వుడిగా నిజరూపాన్ని పొందింది. గంధర్వుడు మొసలిగా జన్మించడానికి ఒక బలమైన కారణం ఉంది. ‘హు హు’ అనే ఒక గంధర్వుడు, మహా అందగాడు. ఎప్పుడు చూసినా ఆయన అప్సరసలతో కలసి, శృంగార విలాసాలలో తేలిపోతూ ఉండేవాడు. అలా ఒకసారి ఆయన ఒక నదిలో అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాడు. అదే సమయంలో, దేవళ మహర్షి అక్కడి వచ్చాడు. నదికి ఆయన స్నానానికి రావడం, ఆ గంధర్వుడు చూశాడు. ఆ మహర్షిని ఆటపట్టిస్తూ, అప్సరసలకు వినోదాన్ని కలిగించాలనీ, అలా తన గొప్పతనాన్ని చాటుకోవాలనీ అనుకున్నాడు.
స్నానానికి వచ్చిన దేవళ మహర్షిని అనేక విధాలుగా అవమానిస్తూ, ఆనందాన్ని పొందాడు. ఆయన మాటలూ, ధోరణి చూసి, ఆ అప్సరసలు కూడా సంతోషించారు. వాళ్ళు అదే పనిగా నవ్వుతూ ఉండడంతో, అతడు మరింతగా రెచ్చిపోయాడు. జరుగుతున్నదంతా చూస్తూ, దేవళ మహర్షి తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆయన మౌనం కూడా, గంధర్వుడు మితిమీరడానికి కారణమయ్యింది. ఎన్ని రకాలుగా ఎద్దేవా చేసినా, ఆ మహర్షి మౌనంగా ఉండడంతో, అప్సరసలను మరింత నవ్వించాలనే అత్యుత్సాహానికి పోయాడు. నీటి అడుగు నుంచి వెళ్లి, ఆ మహర్షి రెండు కాళ్ళనూ పట్టుకుని లాగేశాడు. దాంతో ఆ మహర్షి నీళ్ళలో పడిపోయాడు. గంధర్వుడు చేసిన పనికి ఆగ్రహించిన ఆయన, నీటి అడుగు నుంచి వచ్చి తన కాళ్ళు పట్టుకుని లాగిన కారణంగా, మొసలివై జన్మించమని శపించాడు.
దేవళ మహర్షి శాపానికి గంధర్వుడూ, అప్సరసలూ భయపడిపోయారు. తొందరపాటు తనంతో తాను చేసిన పనికి తనను క్షమించమని, ఆ గంధర్వుడు మహర్షిని వేడుకున్నాడు. అత్యుత్సాహంతో అవమానపరిచినందుకు, పెద్ద మనసుతో మన్నించమని ప్రార్ధించాడు. తన శాపాన్ని తాను తిరిగి తీసుకోలేననీ, శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రం చేత, మొసలి రూపం నుంచి విముక్తి కలుగుతుందనీ చెప్పాడు. అలా మొసలి రూపాన్ని పొందిన గంధర్వుడు, శ్రీ హరి చేతిలో మరణించి, శాపవిముక్తుడై, తన లోకానికి వెళ్లిపోయాడు. ఇక గాయపడిన కాలితో ఒడ్డుకు వచ్చిన ఏనుగు, తొండం పైకెత్తి, స్వామి వారికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించింది. స్వామి ఆ ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఏనుగులోని దివ్య జ్యోతి స్వామి వారిలో ఐక్యమయ్యింది.
అయితే, ఒక ఏనుగు తన ఆపదకాలంలో దైవాన్ని స్మరించడం.. ఆ తరువాత మోక్షాన్ని పొందడం వెనుక, ఒక గాథ ఉంది. పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడనే మహారాజే, ఈ ఏనుగు. ఇంద్రద్యుమ్నుడు, శ్రీ మహా విష్ణువు భక్తుడు. ఎల్లప్పుడూ ఆయన ఆ స్వామి నామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఇక పరిపాలనా సంబంధమైన విషయాలను చూసుకున్న తరువాత, మిగతా సమయాన్ని ఆశ్రమ వాతావరణంలో, స్వామి ధ్యానానికి కేటాయించేవాడు. ఆ సమయంలో ఆయనకు ఎవరూ అంతరాయం కలిగించేవారు కాదు. ఒకసారి ఆయన ధ్యానంలో ఉండగా, అక్కడికి అగస్త్య మహర్షి వెళ్ళాడు. ఇంద్రద్యుమ్న మహారాజు కోసం, ఆయన చాలా సేపు నిరీక్షించాడు. ఎంతసేపటికీ ఇంద్రద్యుమ్నుడు రాకపోవడంతో, తాను కావాలనే అహంకారంతో అలా చేస్తున్నాడని, మహర్షి భావించాడు.
ఆగ్రహావేశాలకు లోనైన అగస్త్యుడు, అజ్ఞానంతో తనను అవమాన పరచిన కారణంగా, ఇంద్రద్యుమ్నుడిని ఏనుగై జన్మించమని శపించాడు. అలా మహాభక్తుడై ఇంద్రద్యుమ్ముడు, ఏనుగులా జన్మించాడు. అడవులలో తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి మొసలి చేతికి చిక్కాడు. క్రితం జన్మలో ఆయన శ్రీహరి భక్తుడు కావడంతో, ఆపద సమయంలో భగవంతుడిని స్మరించాలనే జ్ఞానం కలిగింది. ఆ కారణంగానే, శ్రీ మహా విష్ణువును రప్పించగలిగాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పుణ్య విశేషం వలన, ముక్తిని పొందాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ!
Comments
Post a Comment