గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam
‘గరుడ పురాణం’ - ఇటువంటి వారిని దూరం పెడితే నరకాన్ని తప్పించుకున్నట్లే!
గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి?
‘మరణం’ మారని సత్యం. దానిని ఎవరూ మార్చలేరు, తప్పించలేరు. భూమిపై జన్మించిన ప్రతి జీవికీ మరణం ఖాయం. కానీ, మరణం తరువాత ఆత్మకు ఎటువంటి గతులు సంభవిస్తాయనేది, మనం జీవించి ఉండగా చేసిన కార్యాలపై ఆధారపడి ఉంటుంది. ఆత్మలు అనుభవించే ఫలాలకు సంబంధించిన విషయాలు, అష్టాదశపురాణాలలోని అతి ప్రముఖమైన గరుడ పురాణంలో వివరించబడి ఉన్నాయి. మనం చేసే తప్పులకు ఎటువంటి శిక్షలు అనుభవిస్తామో, మనం గతంలో చేసిన ‘గరుడ పురాణం ప్రకారం ఏ తప్పుకు ఏ శిక్ష!’ అనే వీడియోలో వివరించాను. చూడని వారి కోసం క్రింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ ను పొందుపరిచాను.
[ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం: https://youtu.be/LfQinWIsacs ]
మహాపురాణం అని పిలిచే గరుడ పురాణంలో, మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో, మన జీవితాలలో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. ఆత్మకు విధించబడే శిక్షలూ, అవి ఏ ఏ నరకాలలో అమలు అవుతాయి? అసలు యమలోకంలో ఎన్ని నరకాలున్నాయి? ఆత్మ నీచపు నరకానికి చేరకుండా ఉండాలంటే, గరుడ పురాణంలో పేర్కోన్న విషయాలేంటి? మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలు ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZRFbkpQQIiQ ]
గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి చెప్పబడింది. అయితే, ఇందులో 16 భయంకరమైన నరకాలను, ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడు పనులు చేసినవారి ఆత్మలు, ఈ నరకాల్లోకి వెళ్తాయి. గరుడ పురాణం ప్రకారం, 16 నరకాలు ఇలా చెప్పబడ్డాయి..
తామిశ్రమ నరకం: ఇతరుల ఆస్తిని ఆక్రమించిన వారి ఆత్మను బంధించి, అతను అపస్మారక స్థితికి వచ్చే వరకూ, తామిశ్రమ నరకంలో శిక్షిస్తారు.
అంధతమిస్త్ర నరకం: ఎదుటి వారిని కేవలం తమ స్వలాభం కోసం, ఒక వస్తువులా వాడుకుని, మోసగించే స్త్రీ లేదా పురుషులకు, ఈ లోకంలో శిక్ష విధింపబడుతుంది.
వైతరణి నరకం: గరుడ పురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి, ఈ నదిని దాటాలి. కానీ, ఇది సాధారణ నది కాదు. గంగా నదికి ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో మల మూత్ర విసర్జనలూ, చనిపోయిన కీటకాలూ, పాములూ, మాంసం మరియు అగ్ని జ్వాలలూ ఉంటాయి. ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు, ఈ నది గుండా వెళ్ళాల్సిందే.
తప్తమూర్తి నరకం: రత్నాలూ, లోహాలూ దొంగిలించేవారిని, తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు.
పుయోదక నరకం: శాస్త్రాల వర్ణన ప్రకారం, ఈ నరకం బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన, మరియు అనేక అసహ్యకరమైన విషయాలున్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లు, దీనిని అనుభవించాలి.
కుంభీపాక నరకం: తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారి ఆత్మ, ఈ నరకానికి వస్తుంది. ఇక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి, ఆత్మను హింసిస్తారు.
విల్పక నరకం: మద్యం సేవించే బ్రాహ్మణులను, ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు.
అవిసి నరకం: అబద్ధాలు చెప్పేవారిని, ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి, కిందకు విసిరి వేయబడుతుంది.
లాలాభక్ష నరకం: ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు, లేదా అత్యాచారం చేసేవారిని, ఈ నరకానికి పంపుతారు.
అసితపత్ర నరకం: బాధ్యతారాహిత్యంగా ఉండి, కర్తవ్యాన్ని విస్మరించేవారు, ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి, జల్లెడ పట్టి హింసిస్తారు.
కాలసూత్ర నరకం: పెద్దలను గౌరవించని వారినీ, చులకనగా చూసే వారినీ, ఈ నరకంలోని వేడి ప్రదేశంలో ఉంచుతారు.
సుకర్ముఖ నరకం: ఎదుటి వారి నమ్మకాన్ని బలహీనతగా తీసుకుని, వారిని మోసం చేసి, మాససిక క్షోభకు గురిచేసే అధములు, మరణం తరువాత ఈ నరకానికి చేరుకుంటారు.
మహావీచి నరకం: ఈ నరకం, రక్తంతో, పదునైన ముళ్లతో నిండి ఉంటుంది. ఆవులను చంపే వారికి, ఈ నరకంలో శిక్ష పడుతుంది.
శాల్మలీ నరకం: అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ, ఈ నరకంలో మండుతున్న ముళ్లను కౌగిలించుకోవలసి వస్తుంది.
వజ్ర కుతార నరకం: చెట్లను నరికిన వారిని, మరణానంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు.
దుర్ధర నరకం: ఈ నరకం తేళ్లతో నిండి ఉంటుంది. వడ్డీ వ్యాపారాలూ, వగైరాలు చేసి, నిస్సహాయుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసే వారిని, ఈ నరకానికి తీసుకెళ్తారు.
ఇప్పటివరకూ మనం ఎటువంటి పాపాలకు, ఏ ఏ నరకాలలో శిక్షలను అనుభవించాలో తెలుసుకున్నాం. పాపాలకు శిక్షలు ఏంటో తెలియజేసి, మనల్ని గగుర్పాటుకు గురిచేసే గరుడ పురాణంలో, ఒక అద్భుతమైన విషయం కూడా దాగి ఉంది. మనం ఎటువంటి వారితో కఠినంగా ఉండాలి? ఎవరితో సన్నిహితంగా ఉండాలి? అనేటటువంటి చక్కటి విషయాలను కూడా, తెలియజేస్తోంది.
1. సోమరితనం, ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని, అన్ని శాస్త్రాలూ బోధిస్తున్నాయి. అలాగే, గరుడ పురాణంలో కూడా, అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనినీ, సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ, ఉదాసీనంగా ప్రవర్తించే వారిపట్లా, అజాగ్రత్తగా ఉండే వారి పట్లా, ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని, గరుడ పురాణం చెబుతోంది.
2. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలా మందిని చూస్తుంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తుంటారు. అయితే, గరుడ పురాణం ప్రకారం, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో, తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా, కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే, మీరు అలాంటి వారికి భయపడితే, మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే, వారు మీ మంచితనాన్ని, చేతకానితనంగా భావించే అవకాశముంది. అందువల్ల, వీలైతే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అయితే, అది సాధ్యం కానప్పుడు మాత్రం, కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి, మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే, మన జీవితం నిజాయితీగా ఉండి, మన ఉద్దేశం సరైనదైతే, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా, దర్పానికి భయపడితే, సమస్యలు ఎదురవుతాయి.
3. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు, ఎవరినీ అవమానించ కూడదు, ఎవరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంధాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంటుంది. ఇతరులను చులకనగా చూసే అలవాటున్న వ్యక్తికి దూరంగా ఉండాలని, గరుడ పురాణం చెబుతోంది.
4. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో, గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా, ఇందులో ఉంది. అంటే, మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే, అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన పక్కన మంచి మాటలు మాట్లాడేవారినీ, ప్రియమైన వారినీ కలిగి ఉండటం, కష్ట సమయాలలో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యం, ప్రేమ.. జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి, మనం స్నేహితులూ, సహోద్యోగులూ, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.
5. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవడం, పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది. అంతేకాకుండా, తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవపడుతూ, అగౌరవపరిచే వారు, తరువాతి కాలంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకోని పిల్లలు, సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ, తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని, గరుడ పురాణం వెల్లడిస్తోంది. మనం తెలియక చేసే తప్పులు ఎన్నో ఉంటాయి. వాటికి తగిన ప్రతిఫలాలను, మరణించిన తరువాత నరకంలో మాత్రమే కాదు, జీవించి ఉండగా కూడా, వాటి పర్యావసానాలను, మనం ఎదుర్కోవలసి వస్తుంది.
అన్ని జన్మలలో కెల్లా అత్యుత్తమైనది, మానవ జన్మ. మంచీ చెడూ తెలుసుకోగల జ్ఞానం, మనకి మాత్రమే ఉంది. కాబట్టి, ఎటువంటి శిక్షలైనా మన ఆత్మకే అని తేలికగా తీసుకోకుండా, మంచి నడవడికను కలిగి ఉండడం, ముఖ్యం. ఏ పురాణాలయినా, ఏ ఇతిహాసాలయినా మనకు బోధించేది మాత్రం ఒకటే, ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనలను కాపాడుతుంది..
ధర్మో రక్షతి రక్షిత:
Comments
Post a Comment