Why was Kripacharya not punished in Ashwathama's misdeed? అధర్మపరులకు సుఖాలు ఎందుకు కలుగుతాయి? Mahabharatam
అధర్మపరులకు సుఖాలు ఎందుకు కలుగుతాయి?
అశ్వత్థామ ఉప పాండవులను చంపేముందు కృపాచార్యుడు ఏమన్నాడు?
కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, మహా భారత కావ్యంలోని రెండు ముఖ్య పాత్రలు. కౌరవులకూ, పాండవులకూ విద్య నేర్పిన గురువులూ, కురుక్షేత్ర యుద్ధంలో కురు సైన్యాన్ని నడిపించిన అతిరధ మహారధులు. మరి అటువంటి వారిలో ద్రోణాచార్యుడి గురించి అందరికీ తెలిసినా, కృపాచార్యుడి గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసివుంటుంది. కృపాచార్యుడు బ్రహ్మ నాల్గవ అవతారము. ఈయన శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కురు పాండవులకు గురువు. మహాభారత యుద్ధంలో, కౌరవుల తరపున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికి ఉన్న అతికొద్దిమందిలో, ఈయన కూడా ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరిగా, మన పురాణాలలో ప్రస్తావించబడ్డాడు. 8వ మన్వంతరములోని ఋషులలో గొప్పవాడైన కృపాచార్యుడి జీవితంలోని కొన్ని ఘట్టాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cQqicClN840 ]
గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి, సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే, విల్లంబులతో జన్మించాడు కనుక, శరద్వంతుడు అనే పేరుతో ప్రసిద్ధిచెందాడు. ఇతనికి ధనుర్విద్య పుట్టుకతోనే ప్రాప్తించింది. ఇతడు చిన్నతనం నుంచీ వేదాల మీద కన్నా, అస్త్ర విద్యలపైన ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి, అన్ని యుద్ధవిద్యలలో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహా వీరుడయ్యాడు. ఒక మహర్షి తనయుడు, అన్ని యుద్ధవిద్యలలో ప్రావీణ్యం పొందడాన్ని చూసి, ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు.
అతనిని ప్రక్క దారి పట్టించేందుకు, అద్భుత సౌందర్యరాశియైన జలపది అనే దేవకన్యను, శరద్వంతుడి బహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు పంపించాడు, ఇంద్రుడు. ఆమె శరద్వంతుడి వద్దకు వెళ్ళి, వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూసి, శరద్వంతుడి చేతిలోని విల్లంబులు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి, తన కామోద్రేకమును నిగ్రహించుకుని, ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపోయాడతడు. కానీ, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై, అది రెల్లుగడ్డిలో పడింది. అది రెండు భాగములై, అందులోనుంచి ఒక బాలుడూ, ఒక బాలికా జన్మించారు.
కొంతకాలానికి శంతన మహారాజు వేటాడుతుండగా, అక్కడున్న ఆ బిడ్డలను చూసి, వారిపై అనురాగం కలిగి, తన బిడ్డలుగా పెంచుకున్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారాలు గావించి, తన కృపతో పెంచబడ్డారు కాబట్టి, వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. ఈ సంగతి గ్రహించిన శరద్వంతుడు, శంతనునితో తన సంగతి చెప్పి, కృపుడికి చతుర్విధ ధనుర్వేదములనూ, నానా విధ శాస్త్రములనూ నేర్పాడు. అతడే, విలువిద్యలో పరమాచార్యుడై, భీష్ముని కోరిక మేరకు, కురు పాండవులకు గురువయి, వారికి యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చాడు.
ఆ తరువాత, కురుపాండవులకు ద్రోణుడు ఆచార్యుడయ్యాడు. కృపాచార్యుడు తన సోదరి అయిన కృపిని ద్రోణాచార్యునికిచ్చి వివాహం జరిపించాడు. వీరి సంతానమే, అశ్వాత్థామ. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో కలిసి, పాండవులతో పోరాడిన వారిలో, కృపాచార్యుడు కూడా ఒకడు. కౌరవులతో పాటు యుద్ధంలో పాల్గోన్నా, ధర్మాధర్మ నియమాలను పాటించిన వాడు, కృపాచార్యుడు. సౌప్తిక పర్వంలో, తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఉపపాండవులను సంహరించడానికి బయలుదేరబోయిన అశ్వత్థామకు, కృపాచార్యుడు చెప్పిన ధర్మనీతి, అతడి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
యుద్ధరంగంలో రాత్రిపూట కృపాచార్యుడూ, కృతవర్మా నిద్రపోయినా, అశ్వత్థామకు నిద్ర రాక, దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ, ఆ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా, కాకి గూళ్ళను సమీపించి, కొన్ని కాకుల పీకలు కొరికి, వాటిని చంపేసింది. అది చూసిన అశ్వత్థామకు, తళుక్కున ఒక ఆలోచన, మెరుపులా మెరిసింది. “నిద్రపోతున్న శత్రువులను సంహరించమని, ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగానే, నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులనూ, వారి కొడుకులనూ, బంధుమిత్ర సహితంగా వధిస్తానని, సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే, ఎటువంటి సైన్య సహకారం లేకుండా, అత్యంత పరాక్రమ వంతులైన వారందరినీ సంహరించలేను. అది మంచిది కాదు.
ఏమాత్రం సంశయించక, పాండవ శిబిరంలోకి ప్రవేశించి, ఆదమరచి నిద్రపోతున్న పాండవులనూ, వారి పుత్రులనూ, ఈ రోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రురాజుల మీద దండెత్తినపుడూ, శత్రురాజులు విడిది చేసినపుడూ, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయానా, శత్రువులు నిద్రిస్తున్న సమయానా చంపడం తప్పు కాదన్నది శాస్త్రం వచనమని, పెద్దలు చెప్తారు కదా! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక, ఇది నాకు దోషం కాదు. పాడవులు భీష్ముడినీ, కర్ణుడినీ, ద్రోణుడినీ పడగొట్టినప్పుడు, ధర్మాన్ని పాటించారా! వారు అధర్మం పాటించినపుడు, నేను అధర్మంగా నడచుకుంటే ఏ విధంగా దోషమవుతుంది?.. కనుక కల్మషహృదయులైన పాండవులనూ, వారి బంధువులనూ, నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కానీ, నిందార్హం కాదు” అంటూ, తనకుతాను నిశ్చయించుకున్నాడు.
అశ్వత్థామ తన నిశ్చయాన్ని కృపాచార్యుడికి వివరించాడు. “మామా కృపాచార్యా! ఆ పాండవులు సుయోధనుడిని ఒక్కడిని చేసి, అధర్మంగా కూల్చారు. పదకొండు అక్షౌహిణుల సైన్యాలకు అధిపతి అయిన సుయోధనుడు, దీనుడై, నేలపై పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు, సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండీ, సుయోధనుడు దిక్కు లేని వాడయ్యాడు. మనమిప్పుడు ఏం చేయాలో ఆలోచించండి” అని అన్నాడు. అందుకు కృపాచార్యుడు, "అశ్వత్థామా! నీమనసులో మాట చెపితే విని, మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను.
ఏ పనికైనా పురుష ప్రయత్నమూ, దైవసహాయమూ, రెండూ కావాలి. ఏ ఒక్కదానితోనూ, కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా, రైతు విత్తనదే, మొలకెత్తదు కదా! అలాగే, రైతు విత్తినా, దైవం అనుకూలించి వర్షం కురిపించకపోతే, విత్తనం మొలకెత్తి, ఫలితాన్ని ఇవ్వదు. కనుక, పురుష ప్రయత్నం, దైవసహాయం, రెండూ చేరి, కార్యసానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏపనికైనా, దైవసహాయం ఉంటుంది. కనుక కార్యం సానుకూలమౌతుంది. అధర్మంతో చేసే పనులు ప్రారంభంలో సుఖాలు ఇచ్చినా, తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో, ద్రౌపదిని సభకీడ్చి, అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవించాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి.
ముందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి, అతడికీ, గాంధారికీ విషయం చెప్పి, వారేమి చెప్పినా, అది చేద్దాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం ఔతుంది కానీ, ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో” అని అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ కృపాచార్యునితో, "మామా! ధర్మం, దేశ కాల పరిస్థితులను అనుసరించి, మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది, ధనవంతుడిగా అధర్మం ఔతుంది. కనుక, నేను నమ్మినదే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి, నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను. క్షాత్రం అవలంభించాను. ఇంత కాలం తరువాత, మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం, నాకు చేత కాదు.
అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా, నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని, అతని బంధువులతో సహా, ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి, ఆనందంగా, అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి, ఇదే తగిన సమయం. పైగా, మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు. కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి, పీకలు కోసి దారుణంగా చంపి, వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి, భూతాలకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు, ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా, గజాశ్వకళేబరాలతో పడి ఉండటం, నేను కళ్ళారా చూడాలి” అని అన్నాడు అశ్వత్థామ.
అతను చెప్పిందంతా శాంతంగా విన్న కృపాచార్యుడు, "అశ్వత్థామా! నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంభిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి, నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి, రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిద్దాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో, శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిలో నిలిస్తే, నిన్ను గెలువగల వారు ఎవ్వరు! ఇక నా గురించి చెప్పే పని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి, కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని, వారిని చంపటమో, లేక వారి చేతిలో మారణించటమో, ఏదో ఒకటి నిశ్చయం” అని అన్నాడు కృపాచార్యుడు.
అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని, ఇలా ప్రతిస్పందించాడు. "ఈలోకంలో కోపంలో ఉన్న వాడికీ, ధన సంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికీ, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికీ, నిద్ర ఎలా పడుతుంది? నా తండ్రి మరణాన్ని తలచుకుని దహించుకు పోతున్న నా హృదయాన్ని, శత్రుసంహారంతో ఆర్పి, నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకూ నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడూ, కృష్ణుడూ అండగా ఉంటారు కనుక, ఎదిరించ లేము. అందుకే రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను. దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులూ, వారి బంధు మిత్రులూ, సైనికులూ గాఢనిద్రలో ఉండగా, వారి మీద దాడి చేసి, దారుణంగా వధిస్తాను. ఆ తరువాత ఆ విషయం రారాజుకు చెప్పి, సుఖంగా నిద్రిస్తాను” అని అన్నాడు.
అశ్వత్థామ మాటలను విన్న కృపాచార్యుడు, "అశ్వత్థామా! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్థుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు తెలుసుకోలేక పోతున్నావు. కోపం వదిలి, నా మాట విని, ధర్మమార్గాన నడిస్తే, నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడినీ, ఆయుధములు విడిచిన వాడినీ, జుట్టు ముడివిడిపడిన వాడినీ, వాహన వైకల్యమును పొందిన వాడినీ, శరణుజొచ్చిన వాడినీ వధించటం, ధర్మం కాదు. పాండవులూ, వారి సమస్త సైన్యమూ, పాంచాలురూ, గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు, చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి, నరకానికి ఎందుకు పోతావు? మహాస్త్రకోవిదుడవూ, మహారధులలో ప్రధముడవూ అయిన నీవు, ఇలాంటి నీచ కార్యానికి ఒడిగట్టడం భావ్యమా! కనుక రేపు యుద్ధంలో, మనం పాండువీరులతో పోరు సల్పుదాము” అని అన్నాడు.
అందుకు అశ్వత్థామ, "మామా కృపాచార్యా! మీరు పెద్ద వారు. నన్ను శాసించదగిన వారు. మీరు చెప్పింది సత్యమేగానీ, నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా, అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని, పాంచాల రాకుమారుడు దృష్టద్యుమ్నుడు, అది పాపమని ఆలోచించకుండా, జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని, అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రధచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద, అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు, అతడు ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని, సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు.. ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి, భీముని చేత అధర్మయుద్ధంలో కూలత్రోయించారు. ఇన్ని విధాలా యుద్ధధర్మాన్ని మీరి, యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి, నన్ను ధర్మంగా నడవమని చెప్పడం న్యాయమా!” అని అన్నాడు.
మామా! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు, దీనంగా పలికిన పలుకులు విని కూడా, నీకు ఆగ్రహం కలుగ లేదా! అందుకే నేను చేసేది అధర్మమైనా, అధర్మమార్గాన నా తడ్రిని చంపిన దృష్టద్యుమ్నిడిని, నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను” అని అంటూనే, రథం ఎక్కాడు అశ్వత్థామ. వెంటనే కృపాచార్యుడు, "అశ్వత్థామా! నువ్వూ, నేనూ, కృతవర్మా, ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయంలో, నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను” అని బయలుదేరాడు, కృపాచార్యుడు. తన మాటలను పట్టించుకోలేదని, అశ్వత్థామను ఒంటరిగా వదిలి వేయలేదు. ఎటువంటి అవకాశం దొరికినా, శత్రువులను సంహరించాలనే అశ్వత్థామ కోరికకు, మద్ధతూ పలుకలేదు. కురు సైన్య మహారధిగా, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు.
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment