'2023 శ్రావణ మాసం' ప్రారంభమైంది..


2023 శ్రావణ మాసం ప్రారంభమైంది..
ఈ నెలలో నాగ పంచమి, రాఖీతో సహా ఏయే పండుగలొచ్చాయో తెలుసా?

మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మాసానికీ ఒక ప్రత్యేకత ఉంది. అయితే, శ్రావణ మాసానికి ఉన్న విశిష్ఠతే వేరు. ఈ మాసాన్ని, ఉపవాసాలూ, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లూ, ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులూ, వంకలూ, సరస్సులూ, చెరువులూ, నదులూ పొంగి పొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం, ఆగస్టు 17వ తేదీ నుంచి, నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది. ఈ సందర్భంగా, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలూ, వ్రతాలేంటి? అవి ఏయే తేదీలలో వచ్చాయి? వాటి ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాము..

శ్రావణ సోమవారం..

పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి, ఎంతో ప్రాముఖ్యత ఉంది.

శ్రావణ మంగళవారం..

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు, పెళ్లి జరిగిన తొలి ఐదు సంవత్సరాల పాటూ, ఈ వ్రతాన్ని ఆచరించాలి. అదే విధంగా, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలను ఉదయాన్నే ఇంటికి పిలిచి, పూజలు చేసి, ఆ తర్వాత రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు.

శ్రావణ బుధ, గురువారాలలో..

శ్రావణ మాసంలో ప్రతి బుధవారం, గురువారం రోజున, బుధుడినీ గురుడినీ ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు. సంపద, తెలివి తేటలూ, విద్య పెరగాలని కోరుకునేవారు, ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తారు. బుధుడు, గురుడి ఆరాధన, అనేక ఇళ్లలో సంప్రదాయబద్ధంగా జరుగుతుంది.

శ్రావణ శుక్రవారం..

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు, అత్యంత అనుకూల సమయమని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వదినాన అమ్మవారికి పూజలు చేయడం వల్ల, సంతాన, సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతారు.

శ్రావణ శనివారం..

శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడూ, అశ్వత్థ పూజలు చేస్తారు. అదే విధంగా, శ్రీ మహా విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణించి, రావి చెట్టును కూడా పూజిస్తారు. అలాగే, శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో, స్థంభం, లేదా గోడలపై నరసింహ స్వామి అవతారాన్ని ఉంచి, పూజిస్తారు. ప్రహ్లాదుని కోసం పరమాత్ముడు నరసింహావతారం ఎత్తాడు. ఆ సమయంలో ఆయన స్థంభం నుంచి ప్రత్యక్షమయ్యాడుకాబట్టి, దానికి ప్రతీకగా, స్థంభం, లేదా గోడపై స్వామి వారి చిత్రాన్ని ఉంచి పూజిస్తారు.

శ్రావణ ఆదివారం..

శ్రావణ మాసంలో తొలి ఆదివారం నాడు, మహిళలు ఆదిత్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆదివారం నాడు సూర్యు భగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల, ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.

శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు, నాగ పంచమిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున, నాగ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సారి శ్రావణ నాగ పంచమి, ఆగస్టు 21వ తేదీ, సోమవారం నాడు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో నాగ పంచమి రోజున, పుట్టలోని పాములకు పాలూ, గుడ్లూ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల, కాల సర్ప దోషాలు తొలగి పోతాయని అనాదిగా వస్తున్న నమ్మకం.

రాఖీ పౌర్ణమి..

ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, లేదా కొబ్బరి పూర్ణిమగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన రాఖీ పండుగ వచ్చింది. ఆ సమయంలో సోదరులకు సోదరీమణులు రాఖీలను కట్టి, పండుగను ఆప్యాయతానురాగాల మధ్య జరుపుకుంటారు. మహారాష్ట్రలో నార్లీ పూర్ణిమ పేరిట, కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు. మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున, రోహిణీ నక్షత్రం వేళ శ్రీ క్రిష్ణుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ ఏడాది, శ్రీ క్రిష్ణ జయంతిని సెప్టెంబర్ 6న, బుధవారం నాడు జరుపుకుంటారు.

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home