ఏ ఆహారాన్ని ఎటువంటి వారు ఇష్టపడతారు? భగవద్గీత Bhagavad Gita Chapter 17


ఏ ఆహారాన్ని ఎటువంటి వారు ఇష్టపడతారు? కృష్ణ భాగవానుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 05 నుండి 08 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/vyd-yOxDqbc ]


ఎటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణ సంకల్పంతో ఉంటారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః ।
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ।। 5 ।।

00:58 - కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః ।
మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ।। 6 ।।

కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ కపటత్వం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయవములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము.

ఆధ్యాత్మికత పేరుమీద, జనులు మూర్ఖపు తపస్సులు చేస్తుంటారు. కొందరు, ఈ ఘోరమైన ఆచారాలలో భాగంగా, భౌతిక ఉనికిపై ఆధిపత్యము కోసం, ముళ్ల పరుపుల మీద పడుకుంటారు, లేదా శరీరంలో చువ్వలను గుచ్చుకుంటారు. మరికొందరు, ఏవో గూఢమైన సిద్ధులకోసం, ఒక చేతిని సంవత్సరాల తరబడి పైకిలేపి ఉంచుతారు. కొంతమంది సూర్యుడి వంకే ఆపకుండా చూస్తుంటారు. అది కంటి చూపుకు ఎంత హానికరమో గమనించరు. మరికొందరు, ఏవో భౌతిక ప్రతిఫలాల కోసం, తమ శరీరములను శుష్కింపచేస్తూ, దీర్ఘ కాలం ఉపవాసాలు చేస్తుంటారు.  అటువంటి వారిని గురించి, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘ఓ అర్జునా, నీవు అడిగావు కదా, శాస్త్ర ఉపదేశాలను పాటించకుండా, అయినా, విశ్వాసంతో పూజించేవారి స్థితి ఎలా ఉంటుందని. నేను చెప్పేదేమిటంటే, శ్రద్ధ, నమ్మకము అనేవి, తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించేవారిలో కూడా కనబడతాయి. కానీ, అది సరియైన జ్ఞాన-ఆధారముగా లేనిది. ఇటువంటి జనులు, తమ పద్దతి పట్ల ప్రగాఢ నమ్మకంతో ఉంటారు. కానీ, వారి నమ్మకం, తామసికమైనది. ఎవరైతే తమ భౌతిక శరీరమును దుర్వినియోగం చేస్తూ, చిత్రహింసకు గురి చేస్తారో, వారు తమ దేహములోనే ఉన్న పరమాత్మను అగౌరవ పరిచినట్లే. ఇవన్నీ శాస్త్ర విధివిధానాలకు విరుద్ధంగా ఉన్నట్లని, వివరణ ఇస్తున్నాడు.

03:04 - ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।। 7 ।।

వ్యక్తులు ఇష్టపడే ఆహారము, వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా, వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము.

మనస్సు, మరియు శరీరము, ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి. కాబట్టి, మనుష్యులు తినే ఆహారము, వారి స్వభావమును ప్రభావితం చేస్తుంది, మరియు వారి స్వభావము, వారి ఆహార ఇష్ట-అయిష్టములను ప్రభావితం చేస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు ప్రకారం, మనం తినే వాటిలో, స్థూల పదార్ధం మలముగా బయటకు వచ్చేస్తుంది; మెత్తనిది మాంసముగా అవుతుంది; అలాగే, సూక్ష్మమైనది మనస్సుగా అవుతుంది. స్వచ్ఛమైన ఆహారం తినటం వలన, మనస్సు పవిత్రమవుతుంది. అలాగే, దీనికి విపర్యయం కూడా సత్యమే - పవిత్రమైన మనస్సుతో ఉండేవారు, పవిత్రమైన ఆహారాన్ని ఇష్టపడతారు.

04:11 - ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।।

సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షును పెంచేవీ, మరియు సౌశీల్యమునూ, బలమునూ, ఆరోగ్యమునూ, సుఖమునూ, మరియు తృప్తినీ పెంచేవాటిని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.

సత్త్వ గుణము స్వచ్ఛమైనది, తేజోవంతమయినది, మరియు ప్రశాంతమైనది. అది ఒకలాంటి సంతోషమునూ, మరియు తృప్తినీ కలుగచేస్తుంది. సాత్త్విక ఆహారము కూడా ఇదే విధమైన ప్రభావమును కలిగి ఉంటుంది. ఈ పై శ్లోకములో, ఈ రకమైన ఆహారములు, 'ఆయుః సత్త్' అంటే, ‘ఆయుష్షును పెంచేవి’ అని చెప్పబడ్డాయి. అవి మంచి ఆరోగ్యమునూ, సద్గుణములనూ, ఆనందమునూ, మరియు సంతుష్టినీ కలుగ చేస్తాయి. ఇటువంటి ఆహారములు రసభూరితముగా, సహజంగానే రుచిగా, ఘాటుగా లేకుండా, మరియు మేలుకలిగించేవిగా ఉంటాయి. అవి, ధాన్యములూ, పప్పులూ, బీన్స్, పండ్లు, కూరగాయలు, పాలు, మరియు ఇతర శాకాహార పదార్దముల వంటివి. కాబట్టి, శాకాహార భోజనము ఆధ్యాత్మిక జీవనానికి అనుగుణముగా, సత్త్వ గుణమును పెంపొందించుకోవటానికి వీలుగా ఉంటుంది. ఎంతోమంది సత్త్వ గుణ ప్రధానముగా ఉన్నవారు, మేధావులూ, మరియు తత్త్వవేత్తలూ, ఈ భావాన్నే వ్యక్తీకరించారు. జంతువుల పట్ల హింసలో కూడా, ఆవును సంహరించటం, అత్యంత హేయమైనది. ఆవు మానవుల కోసం పాలను ఇస్తుంది. కాబట్టి, అది మానవులకు తల్లి వంటిది. అది పాలు ఇవ్వలేని పరిస్థితిలో వున్నప్పుడు, అమ్మ లాంటి ఆవును సంహరించటం అనేది, అమానుషము, మొరటుపని, మరియు కృతజ్ఞతలేని పని.

06:07 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగ చేస్తాయో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home