మాంసాహారం! భగవద్గీత Bhagavad Gita Chapter 17

మాంసాహారం!
బాధలనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగజేసే ఆహారములేవి?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (09 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 09 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/xi3aiY2qQeA ]


ఎటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగ చేస్తాయో, శ్రీకృష్ణుడిక్కడ వివరిస్తున్నాడు..

00:50 - కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః ।
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ।। 9 ।।

అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు, రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగచేస్తాయి.

ఎప్పుడైతే శాకాహార పదార్థములను మితిమీరిన కారం, చక్కెర, ఉప్పు వంటివి వేసి వండుతారో, అవి రాజసికమైనవి అవుతాయి. అవి అనారోగ్యమునూ, ఉద్వేగమునూ, మరియు నిస్పృహనూ కలుగచేస్తాయి. రజో గుణములో ఉండేవారు, అటువంటి ఆహారమును ఇష్టపడతారు. కానీ, అటువంటి ఆహారము, సత్త్వ గుణములో ఉన్నవారికి వికారమైనవిగా అనిపిస్తాయి. ఆహారాన్ని భుజించటం అనేది, నాలుకతో ఏదో ఆనందాన్ని అనుభవించటానికి కాదు. అది శరీరమును ఆరోగ్యముగా, మరియు బలముగా ఉంచటానికి ఉపయోగపడాలి. ఈ విధంగా, వివేకవంతులు, చక్కటి ఆరోగ్యమునకు అనుగుణముగా ఉండే, మరియు మనస్సుపై శాంతియుత ప్రభావం కలిగించే ఆహారాన్నే తీసుకుంటారు. అంటే, సాత్త్విక ఆహారమన్నమాట.

02:09 - యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ।। 10 ।।

మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన, మరియు అపరిశుద్ధ ఆహారము, తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి.

వండిన పదార్ధము ఒక జాము, అంటే, మూడు గంటల కంటే ఎక్కువగా నిలువ ఉంటే, అది తామసిక ఆహారము అయిపోతుంది. అపరిశుద్దమైన ఆహారము, చెడురుచి, లేదా చెడువాసన వచ్చే పదార్ధములు, ఇవే కోవకు వస్తాయి. అన్ని రకాల మాంసాహారములూ, ఈ అపరిశుద్ధ ఆహారము కోవకే వస్తాయి. ప్రకృతి ఈ మానవ దేహమును శాకాహారమునకే నిర్మాణం చేసింది. మానవులకు, మాంసాహార జంతువుల లాగా, మాంసం చీల్చటానికి కోరపళ్ళు కానీ, వెడల్పైన దవడ కానీ ఉండవు. మాంసభక్షక జంతువులకు, త్వరగా కుళ్లిపోయే, చనిపోయిన జంతుమాంసం, కొద్ది కాలమే కడుపు లోపల ఉండేవిధంగా, అది త్వరగా బయటకు వెళ్లిపోవటానికి, తక్కువ పొడువు కలిగిన పేగులు ఉంటాయి. దీనికి విరుద్ధంగా, శాకాహార పదార్థములను నెమ్మదిగా, మరియు చక్కగా జీర్ణం చేసుకోవటానికి, మనుష్యులకు పొడవాటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. మాంసాహార జీవుల కడుపులో, ఆమ్ల తీవ్రత, మనుష్యులలో కంటే ఎక్కువగా ఉంటుంది. అది వాటికి పచ్చి మాంసాన్ని జీర్ణం చేసుకోవటానికి దోహదపడుతుంది. ఆసక్తికరంగా, మాంసాహార జంతువులు, చర్మరంధ్రాల నుండి చెమర్చవు. అవి శరీర తాపమును, నాలుక ద్వారా నియంత్రిస్తాయి. అదే సమయంలో, శాకాహారులు, మరియు మనుష్యులు, తమ శరీర తాపమును, చర్మరంధ్రాల ద్వారా వచ్చే చెమట ద్వారా నియంత్రించడం జరుగుతుంది. త్రాగేటపుడు మాంసాహార జీవులు, నీటిని గతుకుతాయి. కానీ, శాకాహార జంతువులు, నీటిని గతకాకుండా, పీల్చుతాయి. మనుష్యులు కూడా నీరు త్రాగేటప్పుడు, నీటిని పీల్చుతారు. ఇవన్నీ మానవ శరీరము యొక్క భౌతిక లక్షణములు. భగవంతుడు మనుష్యులను మాంసభక్షక జంతువులలా తయారుచేయలేదని, మనకు తెలియచేస్తున్నాయి. అందుకే మాంసము మనుష్యులకు అపవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది.

04:28 - అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ।। 11 ।।

ఫలాపేక్ష లేకుండా, శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యమని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము, సత్త్వ గుణముతో చేయబడినట్లు.

యజ్ఞము చేసే ప్రవృత్తి కూడా, త్రిగుణముల ప్రకారముగానే ఉంటుంది. శ్రీ కృష్ణుడు, సత్త్వ గుణములో చేసే యజ్ఞ పద్ధతిని మొదటగా వివరిస్తున్నాడు. ‘అఫల-ఆకాంక్షిభిః’ అంటే, ఎటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా యజ్ఞము చేయబడాలి. ‘విధి దృష్టః’ అంటే, అది వేద శాస్త్రములలో చెప్పబడిన నియమముల ప్రకారంగా, చేయబడాలి. ‘యష్టవ్యమ్ ఏవైతి’ అంటే, శాస్త్రములలో ఆదేశింపబడినట్టు, ఈశ్వర ఆరాధన నిమిత్తమే చేయబడాలి. ఎప్పుడైతే యజ్ఞము ఈ విధముగా చేయబడినదో, అది సత్త్వ గుణముతో చేయబడినట్టు.

05:30 - అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ।। 12 ।।

ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము, లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.

అట్టహాసముగా, ఆడంబరముగా చేసినా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, ‘నాకు ప్రతిఫలముగా ఏమి దక్కుతుంది?’ అన్న స్వార్థ పూరితభావనతో ఉన్నప్పుడు, ఆ యజ్ఞమనేది భగవంతునితో వ్యాపారం చేసినట్టవుతుంది. శుద్ధ భక్తి అంటే, వ్యక్తి తనకు తిరిగి ఏ ప్రతిఫలాన్నీ ఆశించనిది. యజ్ఞమును ఒక గొప్ప క్రతువుగా చేయవచ్చు. కానీ, అది పేరు ప్రతిష్ఠ, లేదా సొంతగొప్ప వంటి వాటి కోసం చేస్తే, అది రాజసిక స్వభావముతో చేసినట్టవుతుందని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.

06:25 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి యజ్ఞము, తమో గుణములోనికి వస్తుందో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home