భగవంతుడిని నమ్మనివారు నమ్మేది ఏమిటి? భగవద్గీత Bhagavadgita Chapter 17
నాస్తికులు - భగవంతుడిని నమ్మనివారు నమ్మేది ఏమిటి?
తమ కళ్ళకు కనిపించనిది లేదని అనుకునే వారి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?
'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (01 – 04 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 01 నుండి 04 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/67VRFQrM3jE ]
ప్రకృతి త్రిగుణములలో, యజ్ఞములు వేర్వేరు రకాలుగా ఏ విధంగా ఉంటాయో, ఈ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు.
00:50 - అర్జున ఉవాచ ।
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ।। 1 ।।
అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి, శ్రద్ధా విశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము, సత్త్వ గుణంలో ఉన్నట్లా? లేదా రజో, తమో గుణములలో ఉన్నట్లా?
ఇంతకు క్రితం అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, ఏ ఏ సద్గుణములను పెంపొందించుకోవాలి? మరియు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలను త్యజించాలి అనే విషయాలనూ, దైవీ మరియు ఆసురీ స్వభాముల మధ్య తేడానూ వివరించి ఉన్నాడు. ఎవరైతే శాస్త్ర ఉపదేశాలను విస్మరిస్తూ, శారీరక ఉత్తేజాలనూ, మనస్సు యొక్క వెర్రితలంపులనూ అవివేకంతో అనుసరిస్తారో, వారు పరిపూర్ణత, లేదా సుఖాన్ని, లేదా జనన-మరణ చక్రమునుండి విముక్తినీ పొందలేరు. అందుకే భగవంతుడు, శాస్త్ర ఉపదేశాలను అనుసరిస్తూ, తద్విధంగా ప్రవర్తించమని చెప్పాడు. ఆ ఉపదేశమే, ఈ ప్రస్తుత ప్రశ్నకు దారి తీసింది. వేద శాస్త్రముల ఉపదేశాల పట్ల, విశ్వాసం లేకుండా పూజలు చేసే వారి యొక్క విశ్వాసము ఎలాంటిదో, అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ప్రత్యేకంగా దీనికి సమాధానాన్ని, భౌతిక ప్రకృతి త్రిగుణముల పరంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు.
02:10 - శ్రీ భగవానువాచ ।
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ।। 2 ।।
శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ప్రతి ఒక్క మానవుడూ, తన సహజసిద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు. ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసమనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడిక ఈ విషయాన్ని వివరించెదను వినుము.
ఎవ్వరూ కూడా శ్రద్ధా, విశ్వాసము లేకుండా ఉండరు. ఎందుకంటే, అది మానవ నైజము యొక్క విడదీయలేని భాగము. వేద శాస్త్రముల పట్ల నమ్మకం లేని వారు కూడా, శ్రద్ధ లేకుండా ఉండరు. వారి యొక్క శ్రద్ధ వేరే చోట ఉంటుంది. అది వారి బుద్ధి కుశలత పైన గానీ, వారి ఇంద్రియ అనుభూతి పట్ల గానీ, లేదా వారు నమ్మిన సిద్ధాంతాల పట్ల గానీ ఉంటుంది. ఉదాహరణకి.. ‘నేను భగవంతుడిని నమ్మను. ఎందుకంటే, నేను ఆయనను చూడలేకున్నాను’ అని పలికే వారికి, భగవంతుని పట్ల విశ్వాసం లేదు కానీ, వారి కళ్లపై విశ్వాసం ఉంది. కాబట్టి, వారు తమ కళ్ళకు ఏదైనా కనిపించకపోతే, అది లేదని అనుకుంటారు. ఇది కూడా ఒకలాంటి విశ్వాసమే. భౌతిక శాస్త్రవేత్త అయినా, లేదా సామాజిక శాస్త్రవేత్త అయినా, లేదా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినా, విజ్ఞానాన్ని ఒప్పుకోవటానికి, నమ్మకంతో వేసే అడుగు చాలా ముఖ్యమైనది. శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఎందుకు వేర్వేరు మనుష్యులు, వేర్వేరు ప్రదేశాలలో తమ నమ్మకం ఉంచుతారో, వివరిస్తున్నాడు.
03:58 - సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ।
శ్రద్ధామయోఽయం పురుషో యో యఛ్చ్రద్ధః స ఏవ సః ।। 3 ।।
అందరు మనుష్యులూ, తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా, శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో, అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది.
మన విశ్వాసము ఎక్కడో ఒక చోట తప్పక ఉంటుంది. మనం దేనిమీద నమ్మకం కలిగి ఉంటామో, మరియు దేని పట్ల శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటామో, అదే ఖచ్చితంగా మన జీవన గమనాన్ని నిర్ణయిస్తుంది. ఎవరైతే డబ్బే జగత్తులో అత్యంత ప్రధానమని విశ్వసిస్తారో, వారు తమ పూర్తి జీవితాన్ని, డబ్బును పోగు చేసుకోవటానికే ఉపయోగిస్తారు. ఎవరైతే కీర్తి ప్రతిష్టలే అన్నింటికన్నా ప్రధానమని అనుకుంటారో, వారి సమయాన్నీ మరియు శక్తినీ, రాజకీయ పదవులూ, మరియు సామాజిక హోదాల కోసం వెచ్చిస్తారు. ఎవరైతే ఉత్తమ విలువల పట్ల విశ్వాసంతో ఉంటారో, వారు వాటి కోసం మిగతా అన్నింటినీ త్యజిస్తారు. ఎవరైతే భగవత్ ప్రాప్తి యొక్క అతి ముఖ్యమైన ప్రాధాన్యత పట్ల గాఢమైన శ్రద్ధను పెంపొందించుకుంటారో, వారు భగవదన్వేషణ కోసం, ప్రాపంచిక జీవితాన్ని వదిలివేస్తారు. ఈ విధంగా, మన శ్రద్ధావిశ్వాసపు స్వభావమే, మన జీవిత దిశను నిర్ణయిస్తుంది, మరియు, మన విశ్వాసము, మన మానసిక స్వభావముపై ఆధారపడి ఉంటుంది. అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా, శ్రీ కృష్ణుడు శ్రద్ధావిశ్వాసములు ఏ ఏ రకాలుగా ఉంటాయో, చెప్పటం ప్రారంభిస్తున్నాడు.
05:40 - యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ।। 4 ।।
సత్త్వ గుణములో ఉండేవారు, దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు, యక్షులనూ, రాక్షసులనూ పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు, భూత ప్రేతములను ఆరాధిస్తారు.
మంచివారు మంచి విషయముల పట్లా, మరియు చెడ్డ వారు, చెడు విషయముల పట్లా ఆకర్షింపబడుతారని అంటుంటారు. తమోగుణములో ఉండేవారు, అవి కౄరమైన దుష్ట స్వభావము కలవని తెలిసి కూడా, భూతప్రేతముల పట్ల ఆకర్షితమవుతారు. రజోగుణములో ఉండేవారు, యక్షులు, మరియు రాక్షసుల పట్ల ఆకర్షితమవుతారు. ఈ అధమ జీవులను శాంతింపజేయడానికి, వారు జంతువుల రక్తాన్ని కూడా సమర్పిస్తారు. అటువంటి నిమ్నస్థాయి పూజల యొక్క ఔచిత్యంపై, విశ్వాసం కలిగి ఉంటారు. సత్త్వ గుణ ప్రధానముగా ఉండేవారు, దేవతల ఆరాధన పట్ల ఆకర్షితమవుతారు; దేవతలలో వారికి మంచి గుణములు కనిపిస్తాయి. కానీ, భగవదర్పితముగా చేసే పూజయే, సరియైన దిశలో ఉన్నట్లు.
06:53 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి బుద్ధిహీనులు, ఆసురీ గుణ సంకల్పంతో ఉంటారో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment